కథ

షికారి

జూలై 2017

ప్పుడు పొద్దుగూకి నాలుగొట్టిండ్రు కావచ్చు. నేను గప్పుడే బడి కాడ్నించి అచ్చిన. బాపు కుక్కి మంచంల కూకోని ఏందొ ఆలోచన జేత్తండు. అమ్మ అంటింట్ల యేదొ సగవెడ్తంది. శాయ్ వెడ్తున్నదో ఏందొ, గిన్నెల సప్పుడు గలగల ఇనవడ్తంది. ఇంట్ల ఎవ్వలు లేరు, మే దప్ప. అన్నలు పట్నంల సదువుకుంటున్నరు. అక్కలు పెండ్లిల్లు చేసుకోని అత్తగారింటి కాడ ఉంటున్నరు. పండ్గకో పబ్బానికో అత్తరు. గప్పుడు ఇల్లంత కలకల లాడ్తది.

నేను అంటింట్లకు అరుగు మీదికీ కోడ్రిగానోలె అటూ ఇటూ తిర్గుతన్న. నా మన్సంత ఇంటి ముందటి బజార్లనె ఉన్నది. ఎప్పుడు నా దోస్తులు రామడు , రవిగాడు, రాయేశడు అత్తరా – ఎప్పుడు ఆల్లతోని శిర్రగోనె, పెండల బుర్రి , గోటీలు, బొంగురాలు ఆడ్దామా అని గడె గడెకు పెద్దర్వాజ కాడికి బొయ్, బజార్లకు తొంగి సూత్తన్న.

గింతట్ల అమ్మ రొండు జేతుల, రొండు కోపులల్ల శాయ్ దీస్కోని అచ్చి, బాపుకోటి నాకోటిచ్చింది. నాకిచ్చిందాంట్ల శాయ్ సగమే వుంది. ‘నాకు నిండ గావాలె! నాకు నిండ గావాలె!’ అని నేను మంకు పట్టు పట్టిన.

అమ్మ ” ఏందిర పోరడ! ఎంతగనం దాగుతవ్ శాయ్ !” అని తిట్టుకుంటనె లోపల్కి బొయ్, కేతిరి దెచ్చి, నా కోపు నిండ శాయ్ నింపింది.

ఇగ మేం శాయ్ దాగుడు షురు జేసినం. మా బాపు శాయ్ సాసర్ల వోస్కొని, ఒకటే జుర్రుతాండు. గా సప్పుడు బజార్ల కినిపిత్తంది.
గింతట్ల బాపు శాయ్ దాగి, అమ్మను పిల్శి, “రాత్రికి కూరేం వండుతున్నవే” అని అడ్గిండు.

” కూర పాడుగాను! ఏం కూర గాలవడ్డది! కూరగాయలు గిన్నెన్ని సూత లేవు.” అని అన్నది.

బాపు మంచంల కెల్లి లేశి, దండెం మీదున్న శెల్ల నందుకోని తల్కాయకు రుమాల్ చుట్టుకుండు. సక్కగ అర్గు మీది అర్రలకు బోయిండు. మూలకు ఆనిచ్చున్న తుపాకి నందుకున్నడు. గిదంత నేన్ జూత్తనే ఉన్న.

” ఇగొ! నేన్ షికారికి బోతన్న. పిట్టలొ శాపలొ కొట్టుకోని అత్త. నేనచ్చెటాల్లకు నువ్ అల్లమెల్లిపాయ రోట్లె దంచి పెట్టుకొ! ” అని అంకుంట తోలు శెప్పులు దొడుక్కున్నడు.

” బాపు! బాపు! నేన్ గూడత్త ” అని నేనంగనె, అమ్మ ” నువ్వెంద్కురా పోరడా! గాడ్కి! పురుగూ బూశీ ఉంటయ్! ” అన్నది.
నేను ” లే ! నేం గూడ బోత ” అని జిద్దు జేశిన.

గప్పుడు బాపు నా దిక్కు ఓపారి జూశి, ” గట్లనే పా! ” అన్నడు. నా శేతికి వో చిన్న సంచిచ్చిండు. అండ్లేముంటయో నాక్ దెల్సు. శెర్రాలు, తుపాకి మందు, గంద్కం పూలు ఉంటయ్. ఇగ నేను ఊశిపోతున్న నెక్కర్ను నడుం మీద్కి అనుకుంట, పెరట్ల వడి బాపెంక ఉర్కుడు వెట్న. గీ తుపాకి మాకెట్లచ్చిందో జరంత జెప్త ఇనుండ్రి . దానెంక ఓ కతుంది.

బాపు వైద్గుడు. అలొపతి ఆర్వేదం అన్ని గల్పి కొడ్తడు. ఎంతొ మందికి వైద్గం జేశిండు. ఇంక జేత్తండు. నేను పుట్టక ముందు అనుకుంట – రజాకార్ల లొల్లుల్ల, బాపు తను మందు జేశిన తాసిల్దారు నడిగి వో తుపాకి సంపాయించిండట ఎందుకైనా మంచిదని! గదే గిది. దీనికి లైసెన్సు సూత ఉంది.
రజాకార్ల లొల్లి అయిపోయినంక మా బాపు షికార్కి బొయ్, పిట్టలను, కుందేల్లను, యేదులను కొట్క తెచ్చుడు మొదలు వెట్టిండు. ఇంతకు ముందు నేను బాపుతోటి మూన్నాల్గు సార్లు షికారికి బోయిన.

బాపు తుపాకి బుజం మీద వెట్కొని, పెద్ద పెద్ద అడ్గులేస్కుంట పోతుండు. నేను యెంక సంచి వట్కోని ఉర్కుతున్న. తొవ్వల ఎవలెవలొ బాపుని మందలిత్తండ్రు. కొండ పోశడు గనవడి, ” ఏం పంతులు ! షికారికి వోతుండ్రా ? ” అని అడిగిండు.
“అవ్ర పోశిగ ! అవ్ను గని శెర్ల శాపలేమన్న వున్నాయిర ?” అని బాపు వాడ్ని అడ్గిండు.

” ఆ! శెర్లున్నయ్ ! గా లక్కోల్ల బాయిల సూత గింత గింత మొట్టలు వున్నయ్. పొయ్ రండ్రి ” అనుకుంట కొండ పోశడు ఎల్లిపోయిండు.

మే మడ్లల్ల వడి, యీదులల్ల వడి పోతున్నం.

గింతట్ల బాపు, నడ్శేటోడల్ల ఒక్క మల్క ఆగి, ” అరేయ్ ! నువ్వెప్పుడన్న రొండు తల్కాయల పామును జూశినవారా ? ” అని అడ్గిండు.
” లే! సూల్లేదు ” అన్న
” అయ్తె సూడు . గదె రొండు తల్కాయల పాము ” అన్నడు బాపు.

శాంతాడు పెట్టు దూరంల నల్లగ, దొడ్డుగ పండ్కోని వుంది పాము గెట్టు మీన. దాని తల్కాయెదొ! తోకేదొ! తెల్తలేదు. రొండేపుల ఒక్క తీర్గనే ఉన్నది. దాంకి ఇసముండది. కర్సినా మనిసి సావడు. దగ్గర్కి వొయ్ సూశిన. ” ఇగ వా! ” అనంగనె మల్ల నడ్సుడు వెట్టిన.

నేన్ తల్కాయ లేపి ఒక్కపారి మొగుల్దిక్కుకు జూశిన. గువ్వలు, గోరెంకలు, కొంగలు, పాయిరాలు గూల్లల్లకు తిర్గి అత్తన్నయ్. శెట్ల నిండ ఆల్తన్నయ్. ” కీ! కీ! ” అని ఒక్కటె సప్పుడు.

బాపు నడ్శేటోడల్ల మల్ల ఒక్క మల్క ఆగిండు. నేం సూత టక్కున ఆగిన. బాపు సప్పుడు జెయ్యకుంట, యీదులను సాటు జేసుకుంట, సాటు జేసుకుంట ఒక యీత మట్ట మీన తుపాకిని ఆనిచ్చి, కొమ్మల్ల గూసున్న గువ్వలకు సూటి వెట్టిండు. నేను దమ్మాప్కోని, బాపుని, తుపాకిని, గువ్వల్ను రెప్ప కొట్టకుండ సూత్తన్న.

గింతట్ల బాపు ‘ ధన్ ‘ మన్నడు. గువ్వల్రొండు తపతప గొట్టుకుంట న్యాల మీన వడ్డై. నేనటు దిక్కు ఉర్కిన. నాకన్న మొదలె బాపు గువ్వల్ని దొర్కవట్టి , సంచిల ఏశిండు. వో ఈతాకు దెంపి సంచి మూతికి గట్టిక కట్టు గట్టిండు. సంచి నాకిచ్చిండు “పట్టుకోర” అని . నేన్ గట్లనె జేశిన.

బాపు తుపాకిని మల్ల లోడు జేశిండు. ఇగ మేం మెల్లెమెల్లెగ లక్కోల్ల బాయి కాడ్కి బోయినం. అది పెద్ద మోట బాయి. అండ్ల సగం వడ లీల్లున్నయ్. ఇగ బాయి గడ్డ మీన కూసోని బాపు, లీల్ల దిక్కు సూసుడు వెట్టిండు. గింతట్ల వో బొమ్మె శాప లీల్ల మీన కచ్చి, గాలి దీస్కోని మల్ల లీల్లల్ల మునిగింది. ఒక్కొక్క శాప కిలో బరువు ఉంటది గావచ్చు.

” సూత్తున్నావుర! ” అని అన్నడు బాపు.

” సూత్తన్న బాపు! సూత్తన్న ! ” అని నేనన్న.

బాపు దోతి, అంగి ఇడ్శి పారేశి, చిన్నపంచను గట్టుకున్నడు. తుపాకి లీల్లల్లకు సూటి వెట్టి కూసున్నడు.

గింతట్ల ఇంకో బొమ్మె శాప మెల్లెగ లీల్ల మీన కచ్చింది. బాపు ‘ధన్ ‘ మన్నడు. శాప ఉడ్కు లీల్లు మింగి , క్యాల్ దప్పి తెల్ల బొత్తేస్కోని లీల్ల మీన ఎల్లెల్కల వడ్డది. బాపు తుపాకి ఆడ వారేశి, బాయిల దునికిండు. యీత కొట్టుకుంట బొయ్ శాపను దొర్కిచ్చుకున్నడు. మెల్లగ గడ్డపొంట, గడ్డపొంట దరి వట్టుకోని ఎక్కుకుంట మల్ల గడ్డ మీన కచ్చి శాపను సంచి లేశి బట్టలు దొడుక్కున్నడు.

ఇగ మేం ఆడ్నుండి శింతామని శెర్వు కాడ్కి బోయినం. శెర్ల జిల్మలు మస్తుగున్నయ్. లీల్లల సగం మునిగిన తుమ్మ శెట్ల మీన కీ!కీ! అనుకుంట ఎక్కడ్నుంచో అచ్చి ఆల్తన్నయ్. శెట్టు కొమ్మలల్ల ఆటి గూల్లు గనవడ్తున్నయ్. గూల్లల్ల ఆటి పిల్లలు కీసు కీసు మని ఒకటే ఒర్రుతున్నయ్. బాపు మల్ల ఓ జిల్మకు సూటి వెట్టి ‘ ధన్ ‘ మన్నడు. అది కీ!కీ! అని రెక్కలు కొట్టుకుంట లీల్లల్ల వడ్డది. మిగిల్న జిల్మలన్ని ‘కెకెకె!’ అనుకుంట గాల్లెకు లేశినయ్.

“దాన్ని తెత్తావుర !” అని బాపు నాతోని అనంగనె, నేను గట్లనె! అని అంగిడ్శి ఆడ వారేశి, నెక్కరు తోటె లీల్లల్ల దునికిన. యీత గొట్టుకుంట జిల్మ కాడ్కి వోతున్న. గింతట్ల ఒక్కపాలి నా కాల్లకేదొ సుట్టుకున్నట్టు అయింది. పానం గజ్జు మన్నది. ” నీరు గట్టెలా!? ఇంకేమన్న పాములా!?” లీల్లల్ల కాల్లు గట్టిగ కొట్టినాకొద్ది ఇంక కాల్లకు సుట్టుకుంటంది. కాల్లు గొట్టకుంటెనేమొ మునిగిపోతనాయె! ముంగల వోదమన్న యెంకకు అద్దామన్న నా వల్లైతలేదు. ఇగెట్ల! “అరె! గిది నాసు గావచ్చు ” అని గప్పుడు నాకనిపిచ్చింది. బాపు శెర్వు ఒడ్డు కాడ నిలవడి నన్నే సూత్తండు ,గని లీల్లల్ల నా కాల్లకేమైతందో గాయినకు సమజైతలేదు. ఇగ నేను ” ఓ బాపు! నా కాల్లకు నాసు సుట్టుకున్నదే ! ” అని లగాయించి ఒర్రిన. బాపు పరేశాన్ అయిపోయిండు. కొంచెం సోంచాయించి, ” అరెయ్! నీ ముంగల గడ్డున్నది సూడు! ఎట్లన్న ఆడ్కి బొయ్ గడ్డ మీన ఎక్కి కూకో!” అన్నడు.

నాకు కడ్పులకెల్లి సలి వెట్టుడు మొదలైంది. పండ్లు టక టక కొట్టుకుంటున్నయ్. ఇగ ఎట్లనో ఉగ్గబట్టుకోని మెల్లమెల్లగ కాల్జేతులాడిచ్చుకుంట శెత్తోని నాసును తీశేసుకుంట, గడ్డకాడికి బోయి, గడ్డ మీనకు ఎక్కి కూకున్న. బాపు మల్ల ” గట్ల గట్ల గడ్డెంబడి లీల్లు తక్కువున్న జాగలకెల్లి యీడ్కి రా!రా! ” అని కీక వెట్టిండు.
నేను బయపడుకుంట బయపడుకుంట గట్లనే మెల్లగ ఒడ్డు మీద్కి అచ్చి పడ్డ. బాపిచ్చిన శిన్నపంచెతోటి పెయ్ దుడ్సుకోని అంగి దొడ్కున్న. ఇగ మేం జిల్మను మర్శిపోయి ఇంటి మొకం బట్టినం. తొవ్వల బాపు ఒక్క మాట మాట్లాడలె! ఇంటి కచ్చినం. గప్పట్కే మా యమ్మ పెరట్ల నిలవడి పొయ్యినోల్లు ఇంకత్తలేరేంది” అని ఎదురు సూత్తంది.

నేను లోపల్కి బొయ్, సంచి కింద దులిపిన. రొండు గువ్వలు,శాప తపుక్కున న్యాల మీన వడ్డయ్. ఇంక వాటి పానం పూర బోలె – గుడ్డి దీపం ఎల్గుల అటీటు మెసుల్తున్నయ్.
అమ్మ ” ఆ! షికారి బాగనె చేస్కచ్చిండ్రు!” అనుకుంట నాదగ్గరి కచ్చి ” ఏందిర పోరడ ! నీ నెత్తి లాగు తడ్శినయ్ ! ” అన్నది.నేను జర్గిన కతంత జెప్పిన.

ఇగ మా యమ్మ అందుకున్నది ” నీ షికారి పాడుగాను! ఎన్ని మల్కల జెప్పిన! పిట్టల్ని కొట్టద్దయ్యా! వాటి పిల్లలు అగాదం అయిపోతయ్ – గా పాపం మనకు సుట్టుకుంటది! అని. నువ్వింటవా! నీ శెటం నువ్వేనాయె! అట్టిగ పోరడు సచ్చిపోతుండె గద! ” అని బాపును తిట్టుకుంట , నన్ను మండుతున్న పొయ్ కాడ్కి దీస్కపొయ్ దాని ముంగల ఎచ్చగ కూకోవెట్టింది. తువ్వాలు దీస్కచ్చి నెత్తి దుడ్శింది. ” పొలగాడు బయపడ్డట్టున్నడు !” అని అనుకుంట జీడి గింజ తోటి జిష్టి దీసి దాన్ని పొయ్యి లేశింది.
మా బాపు సప్పుడు జేత్తలేడు. ఊ! అంటలేడు, ఆ! అంటలేడు. మంచంల కూకోని ఎటో సూత్తండు.

***

గీ కతయ్యి నాల్గు నెల్లయింది. బాపు మల్ల ఇగ షికారికి బోలె. ఏమనుకున్నడొ ఏమొ! వోనాడు తుపాకిని దీస్కోని కర్నారం బోయి, దాన్ని సర్కారుకు దఖల్ జేశి అచ్చిండు. నేను బడి కాడ్నుంచి గప్పుడే అచ్చిన. బజార్ల పోరగాండ్లు ఆడుకుంటున్న సప్పుడు ఇనవడ్తంది. గిర్న ఉర్కిపొయ్ ఇగ ఆల్లతోటి గల్సిన.

**** (*) ****