సమీక్ష

ఎల్లలు దాటిన తెలుగు కవిత్వ పరిమళం

జూలై 2017

నేను ఇన్ఫో్‌సిస్‌లో పని చేస్తున్న రోజుల్లో, వృత్తిరీత్యా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండటంతో సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన కొందరితో, తరచుగా వారి వారి భాషలకు చెందిన ప్రాచీన, సమకాలీన కవిత్వాల గురించి మాట్లాడేదాన్ని. హిందీ, మళయాళం, కన్నడ, తమిళ భాషలకు చెందిన వాళ్ళతో వీలు చిక్కినప్పుడల్లా సాహిత్యచర్చలు సాగేవి. అలా మాటల్లో నాకూ కొంత కవిత్వం రాయడం పట్ల ఆసక్తి ఉందనీ, రాసేందుకు, విరివిగా చదివేందుకు ప్రయత్నిస్తుంటాననీ చెప్పినప్పుడు, మన భాషలోని కొన్ని మంచి కవితలను వాళ్ళకు వినిపించమని కోరేవారు. ‘వస్తువు ఏమిటి’, ‘వర్ణనలు ఏ రకంగా సాగాయి’, ‘ప్రేరణ ఏమై ఉంటుంది?’ అన్న ప్రశ్నలతో మొదలైన మా సంభాషణ, నేను కవిత మొత్తాన్నీ పూర్వాపరాలతో సహా వివరించడంతో ముగిసిపోయేది. అది వ్యక్తిగతంగా నాకెంతో ఉత్సాహాన్నీ, ఆసక్తినీ కలిగించే చర్చ అనడంలో నాకే సందేహమూ లేదు కానీ, చెప్పడం పూర్తయ్యాక ఉత్తమ కవిత్వం సాహితీ ప్రియుల్లో సహజంగా కలిగించే సున్నితమైన సంవేదన, సంతృప్తీ నా శ్రోతల్లో, స్నేహితుల్లో కనపడకపోవడం మాత్రం నన్ను ఆలోచనల్లోకి నెట్టేది. దరిమిలా, ఒకానొక ప్రశ్నోత్తర సభలో జావెద్ అక్తర్ అనువాదం చెయ్యడమంటే, పరిమళద్రవ్యాన్ని ఒక సీసా నుండి మరొక సీసాకి బదిలీ చెయ్యడం లాంటిదని అనడం గుర్తొచ్చేది.

జావెద్ మాటలకేమో గానీ, కవితల గురించి నేను మాట్లాడినప్పుడు, నా మిత్రుల్లో నేనూహించిన స్పందన రాకపోవడానికి, ప్రథానంగా కొన్ని కారణాలు కనపడతాయి. మన కవిత్వంలో, ప్రత్యేకించి సమకాలీన కవిత్వంలో, కథన రీతులు తక్కువ. మనం ఎక్కువ శాతం ఒక అనుభవాన్ని కవిత్వంలా మార్చడమే చూస్తున్నాం. లేదా ఒక సమస్యను బలమైన ప్రతీకలతో పది మంది ముందూ నిలిపే ప్రయత్నాలు చూస్తున్నాం (అంటే కవిత్వాన్ని మించి, ఒక సమస్యనో దాని పరిష్కారాన్నో ప్రజలకు బలంగానూ, సులభంగానూ చేరవేయడానికి కవిత్వాన్ని మాధ్యమంగా వాడుకుంటున్నాం, కాబట్టి, ఇక్కడ కేంద్రీకరణ వీటి మీదే ఉంటే అవకాశాలు ఎక్కువ). అలాగే, మన వర్ణనల్లో కొత్త చూపు కంటే కొత్త మాటకు ప్రాథాన్యత ఎక్కువ. కాబట్టి, కవిత్వాన్ని కవిత్వంలా కాకుండా, మామూలు పదాల్లో విప్పి చెప్పినప్పుడు, అందులో మనకు ఆసక్తినీ, ఆశ్చర్యాన్నీ కలిగించే ప్రాథమిక లక్షణాన్ని కోల్పోతున్నాం, రసజ్ఞతను మేల్కొల్పలేకపోతున్నాం. వీటన్నింటితో పాటు, అనువాదకురాలిగా నా ప్రతిభ, పాఠశాల పరీక్షల నెపం మీద నేను పొందిన ఆంగ్ల పరిజ్ఞానం మీదే అధిక శాతం ఆధారపడి ఉండటం కూడా ఒక ముఖ్యమైన కారణం. నేను నేర్చుకున్న ఇంగ్లీషు చదువు, నా నిత్యావసరాలకు సరిపోతుంది; ఉద్యోగరీత్యా చూసినా, సంభాషణాసందర్భాలన్నీ ముందుగానే తెలుస్తాయి కనుక, ప్రపంచం నలుమూలల్లోని మనుషులతోనూ ఏ ఇబ్బందీ లేకుండా మాట్లాడేందుకూ సరిపోతుంది; చర్చల ఉద్దేశ్యం, పరిమితి, పరిథి అన్నీ రెండు వైపుల వారికీ అవగాహన ఉన్న కొన్ని సాంకేతికసమస్యలతోనే ముడిపడి ఉంటాయి కనుక, భాషకు సంబంధించిన ఏ ఇబ్బందీ ఎదురవ్వదు. కానీ, సాహిత్యపరంగా చూస్తే నా ఆంగ్లజ్ఞానం పరిమితమైనది. కవిత్వాన్ని అనువాదం చేసేందుకు మాటలకు అర్థాలు మాత్రమే తెలిస్తే చాలని నేను అనుకోను. ప్రథానంగా పదాల మీద, ఆ పదాలు వెలువరించే శబ్ద సౌందర్యం మీద నడిచే ఈ కథన రహిత కవిత్వాన్ని అనువాదం చెయ్యడానికి, మాటల అల్లికలో పొందికనూ, పొదుపునూ పాటిస్తూనే, చమత్కారాన్ని, కవిత్వాన్ని భద్రంగా మోస్తూ, మూలంలోని సంగీతం బట్వాడా అయ్యేలా చేసేందుకు, సాహిత్యపరంగా ఆ భాష తీరుతెన్నుల పట్ల అవగాహన కలిగిన అనువాదకులు కావాలి.

ఆ రోజుల్లోనే, అంతర్జాల పత్రికల్లో ప్రచురింపబడిన ఒకానొక తెలుగు కవితకు, శ్రీనౌడూరి మూర్తి గారు చేసిన ఆంగ్లఅనువాదం మిత్రులకు చూపించడమూ, చదివిన వెంటనే నా మళయాళం మిత్రులు కొందరు ఆ కవిత మాధవి కుట్టీ (కమలాదాస్)కవిత్వాన్ని గుర్తు చేస్తోందని అనడమూ జరిగాయి. అప్పటికి ఆ పేరైనా విని ఉండని నా ఆశ్చర్యాన్ని గమనించి, వాళ్ళు మాధవికుట్టీ కవితలనే కాక, అద్భుతమైన మళయాళం కవితలెన్నింటికో ఆంగ్ల అనువాదాలను క్రమం తప్పకుండా పొందుపరుస్తోన్న మరొక సైట్ లింక్ కూడా నాకు అందజేశారు. ఆ అనువాదాల ద్వారా నేను తెలుసుకున్న ఆమె స్త్రీవాదం, సాంప్రదాయానికి ఎదురీదగల ఆమె శక్తీ, ఆ ప్రాంతపు సాంప్రదాయాలు, ఈ కాలపు మళయాళం పిల్లలు ఇంత హేలగా అద్భుతమైన కవిత్వాన్ని రాయడమూ – అన్నీ, వింతగానూ కొత్తగానూ తోచేవి. నచ్చేవి. ఒక భాషలోని సాహిత్యమంతా అంత అలవోకగా నాదాకా చేరినందుకు సంభ్రమంగా కూడా ఉండేది. అనువాదం దానికదే ఒక కళ అన్న స్పృహ నాలో మొదలైందప్పుడే. ఒక భాషను కొత్త జ్ఞానరాశులతో సుసంపన్నం చేయడానికి, అనువాదకులు కవులతో సరిసమానమైన(ఒక్కోసారి ఎక్కువగా కూడా) శ్రమను, వేదనను, మథనాన్ని అనుభవిస్తూనే రచన వెలువరిస్తారు అన్న ఎరుక కలిగి, వారి పట్ల గౌరవమూ రెట్టింపైంది. మూర్తి గారి “అనువాదలహరి” బ్లాగు ప్రతి రోజూ చదవడం అలవాటుగా మారడమూ అప్పటి సంగతే. ఈ బ్లాగులో, గత కొన్నేళ్ళుగా మన తెలుగు భాషకు చెందిన కవితలెన్నింటినో ఆంగ్లంలోకి అనువాదం చేసి, ఇప్పుడు వాటిలో నుండి ఎంపిక చేసిన కవితలతో, మూర్తి గారు Wakes On The Horizon అన్న సంకలనం ప్రచురించడమే, ఆ అనుభవాలను గుర్తు చేసుకుంటూ, ఈ పుస్తకం మీద నా ఆలోచనలను ఇలా ఈ వ్యాస రూపంలో పంచుకునేందుకు అవకాశమిచ్చింది.

“ఇదుగో, సాయంత్రం చేసి వచ్చింది వాన
పెంకి పిల్లడికి అల్లరి వెధవ తోడయినట్లు,
గాలిని వెంటబెట్టుకుని మరీ.
చీకటి నీరుగారిపోయి చేతులకి చెమ్మగా తగులుతోంది.
కిటికీ “Fadeout” లోంచి చూస్తుంటే, గోదావరి
కాన్వాసుమీద ఒలికిపోయిన జేగురు రంగులా ఉంది.
కాళ్ళమీద ఏదో ప్రాకుతున్న స్పర్శలా,
వంతెన మీద నుండి గూడ్సు రైలు పోతోంది.
నెయ్యివేస్తే భగ్గుమన్న నిప్పులా- తెరచాపలు ఎగురుతున్నాయి.
లంకలనుండి ఇసుక ఒడ్డుకు తెస్తున్న పడవలు,
మరుగుతున్న ఉక్కుమీది తెట్టులా, ఒడ్డుకుచేరుకుంటున్నాయి.”

ఇది మూర్తి గారి తొలి కవితా సంపుటి, సౌభాగ్య గారితో కలిసి 99 లోనే వినూత్నంగా ప్రచురించిన “నువ్వూ -నేనూ, గానమూ-గళమూ” లోనిది. దాదాపు 43 ఆంగ్ల కవితలతో, “Incidental Muses ” అన్న కవితా సంపుటినీ మూర్తి గారు ప్రచురించారు. 2006 మొదలుకుని, ఈనాటి దాకా, ఒక వైపు దేశదేశాల కవితలను తెలుగులోకి అనువాదం చేస్తూనే, మరో వంక మన తెలుగు కవితలను ఆంగ్లంలోకి కూడా అందుబాటులోకి తెస్తూ వచ్చారు.

ఇవన్నీ చెప్పడమెందుకంటే, ఈ అనువాదకులు స్వయంగా కవి. విస్తృతంగా చదివిన పాఠకులు. ఏ పదం పరసువేది మాదిరి వచనాన్ని కవిత్వంలా మార్చి వెలుగులీనేలా చెయ్యగలదో తెలిసిన వ్యక్తి. ఏ కవిత సామాన్యమైన ప్రతీకలతో, ముతక వాసన కొడుతోందో అనాయాసంగా పసిగట్టగల మనిషి. ఈ సునిశితమైన గమనింపులతో పాటు, వారికి స్వతఃసిద్ధంగా ఉన్న కథనశక్తీ, కవితాత్మకత, అనువాదాలు చెయ్యడంలో సహజదక్షతగా పరిణమించాయని నా అనుకోలు. బహుశా ఈ కారణానికే ఈ సంకలనంలో ఎంచుకున్న కవితల్లో విస్తృతమైన వైవిధ్యం కనపడుతుంది. సామాన్యంగా, కవితా సంకలనాలకు ఉండేట్టు, ఈ సంకలనానికి ప్రత్యేకమైన లక్ష్యమంటూ ఏమీ లేదు. సామాజిక సమస్యలనో, ఉద్యమాలనో, లేదా ప్రత్యేకించి ఒక వస్తువనో – ఏ విధమైన పరిమితులనూ ఇది విధించుకోలేదు. మంచి కవిత్వమవ్వడమొక్కటే ఇక్కడ ఎంపికకు ప్రామాణికంగా తీసుకోబడింది. అలా ఒకటీ, రెండూ కావు, 89 విభిన్నమైన గళాల నుండి వెలువడ్డ 199 కవితా స్వరాలను ఒక్కచోట కూర్చి పరిచయం చేసిన పుస్తకమిది. ఇందులో తెలుగులో ప్రస్తుతం విరివిగా రాస్తోన్న కవులున్నారు. ఈ పుస్తకంలో ప్రచురింపబడ్డదొక్కటే కవితగా రాసిన వారూ ఉన్నారు. ఆయా కవుల నేపథ్యాలు వేరు, వారి వయసులు వేరు, కవితా వస్తువుల పట్లా, కవిత్వం పట్లా వాళ్ళ వైఖరులు వేరు, కనుకే శైలిపరమైన మార్పులు కూడా మనకు ఈ అనువాదాల్లో తెలుస్తూ ఉంటాయి. సామాజిక మధ్యమాలూ , పత్రికల్లో ప్రచురణలూ, ప్రచారాలూ ఇప్పటి స్థాయిలో లేనందువల్ల కవులుగా రావలసినంత పేరు రాని ముందు తరం కవులూ కొందరున్నారు. ఈ పుస్తకంలో వదిలిన జాడల ననుసరించి, ఆ కవుల ప్రస్థానాన్ని గమనించేందుకు ఆఖరు పేజీల్లో అవకాశమిచ్చారు మూర్తిగారు.

మనం ఎందరెందరివో అనువాదాలు చదువుతూ ఉంటాం. కానీ, ఆలోచించి చూడండి, కవిత ఎప్పుడూ మూలకవి పేరు మీదుగానే గుర్తుంచుకోబడుతుంది. (చలం గీతాంజలి లాంటి అరుదైన మినహాయింపులను పక్కన పెడితే). మనం ఏ భాషలో చదివినా, ఫ్రాస్ట్ కవితలనే అంటాం, కీట్స్ కవితలంటాం, రిల్కే కవితలంటాం, సుబ్రహ్మణ భారతి కవితలంటాం, వాల్మీకి రామాయణమంటాం ..ఇలా, మూలం వ్రాసిన కవి ముద్ర అంత తేలిగ్గా చెరపగలిగినది కాదు. ఇది అనువాదకులు ఎదుర్కొనే మొదటి సవాలు. ఇది గాక, రెండు భాషలు క్షుణ్ణంగా తెలిసి, పదాలనూ, అవి వాచ్యంగానో సూచ్యంగానో చెప్పే వివరాలనూ, అన్నింటికీ మించి కవి అంతరంగాన్నీ పట్టుకుంటూ, మూలంలోని వేగాన్నీ, లయనూ జారనీయకుండా కవితను పూర్తి చేసి మెప్పించడం రెండవ సవాలు. బహుళ ప్రాచుర్యం పొందిన కవితలను, అదే స్థాయిలో, అనువదించబడ్డ భాషలోని పాఠకులకు చేరవేయలేకపోవడం, కవిత్వంలోని మార్మికత వల్ల సైద్ధాంతికంగా కవితను అర్థం చేసుకోవడంలో పొరబాటు పడి మరొకలా అనువదించడమూ, తదితర చిన్నాచితకా సమస్యలూ మామూలే.

ప్రతి భాషలోనూ ఆ భాషకు మాత్రమే సొంతమైన విరుపులు, పిలుపులూ కొన్ని ఉంటాయి. అవి ఆ ప్రాంతీయుల మాటల్లో, ఆ ప్రాంతీయ భాషలో, యాసలో వెలిగినట్టు, అనువాదంలో మెరవవు. ఉదాహరణకి ఈ పుస్తకంలో పొందుపరచిన ఒకానొక నందకిశోర్ కవితకి మూలం చూడండి.

“ఇగ ముసుర్లు పడ్తుంటె సూడాలె…
నీ యవ్వ!
నిలుసున్న పండుకున్న
ఉరుస్తుంటే తడుసుడేనాయె”.

దానికి మూర్తి గారి అనువాదం ఇదీ:

“One should only witness skies emptying!
Tut!
No matter whether you stand or sleep,
You cannot avoid getting wet.”

అచ్చమైన తెలగాణా మాండలీకంలో రాయబడ్డ ఈ కవిత అనువాదంలో, భావం చేరుతోంది కానీ, కవి గొంతులోని విసురు, కేవలం ఆ ధ్వని ద్వారా మాత్రమే సాధించగల ఉద్వేగం, మాయమైపోతోంది. ఇదే యాసతో అనువాదంలో ఉన్న ఇబ్బంది. అలాగే, కొన్ని జాతీయాలను మనం అనువాదం చేసినా మూలంలో ఉన్న సొంపు అనువాదంలో కనపడదు. అనువాదంలో ఆ జాతీయాల తాలూకు క్లుప్తతను సాధించడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు. ఏ పదం వాడినా కొన్ని సార్లు మూలంలో కొట్టొచ్చినట్టు కనపడే సౌందర్యం అనువాదంలో అంది రాదు. ఒక పదానికి నాలుగు పదాలు వాడాల్సి రావడమూ తప్పకపోవచ్చు కొన్నిసార్లు, అలా, భావం కోసం లయను త్యాగం చెయ్యడం సైతం తప్పనిసరి కావచ్చు. ఇవన్నీ సర్వసాధారణమైన సమస్యలు, ఈ పుస్తకంలో కూడా ఉన్న సమస్యలు. ఈ కారణాలకు సంబంధించిన విమర్శలను ఏ అనువాద పుస్తకమూ బహుశా దాటలేకపోవచ్చు. తమ కవితలను తామే అనువాదం చేసుకున్న బెంగాలీ కవులైన జీబనానంద దాస్ (బనలతాసేన్ కవిత), టాగోర్ (గీతాంజలి, ద గార్డెనెర్) కూడా ఈ విమర్శలకు అతీతులు కారు. ఈ పరిమితుల పట్ల సమగ్రావగాహన ఉన్నది కనుకే, టాగోర్ లాంటి కవి, The Gardener అన్న తన అనువాద కవిత్వ సంపుటికి రాసుకున్న ముందు మాటలో, ఆ అనువాదాలు అన్ని చోట్లా మూలానికి యథాతథానువాదాలు కావనీ, కొన్ని చోట్ల సంక్షిప్తపరచాననీ, కొన్ని సార్లు సవివరంగా రాసాననీ ఒప్పుకుంటారు. ఇది అనివార్యమైన పరిస్థితి.

వీటన్నింటినీ సాధ్యమైనంతగా దాటుకుంటూ వచ్చిన ఈ “Wakes on the Horizon” పుస్తకంలో నేను పైన చెప్పినట్టు, ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని ఆదూరి సత్యవతీదేవి వారి వంటి కవితలు ఉన్నాయి.చాలా కవితల్లో గురితప్పని బాణాల్లా వాక్యాల్లో వచ్చి కుదురుకున్న పదాలు అనువాదకులు మూలకవిత్వంతో మమేకమైన తీరుకి నిరూపణగా నిలుస్తాయి. ముఖ్యంగా, “Your Chariot (Viswanatha Satyanarayana; page:15)”, “One Midnight at SanFrancisco (Afsar; page-15)”, “The Liberated Lymph (Manasa Chamarti, page:252) ” వంటి కవితలని గమనించినప్పుడు, శిల్పాన్ని అన్ని కవితల్లోనూ మూలానికి నిబద్ధంగా ఉండేలా మలచడమూ తెలుస్తుంది.

ఎలనాగ గారు “పొరుగు వెన్నెల” పేరుతో మన దేశంలోని వివిధ రాష్ట్రాల కవిత్వాలను తెలుగులోకి అనువాదం చేశారు. ముకుంద రామారావు గారు దేశదేశాల కవిత్వాన్నీ మనముందుంచారు. ‘పొరుగు నుండి తెలుగులోకి’ అంటూ ఒక ఉదాత్తమైన లక్ష్యంతో ఎమెస్కో వారు వాడ్రేవు చినవీరభదుడితో మత్సువో బషో హైకూలను అనువాదం చేయించి మన దోసిట పెట్టారు. ఇవన్నీ ఏ రకమైన సాహిత్య ప్రయోజనాలతో మన ముందుకొచ్చాయో, ఈ Wakes on the Horizon అదే సదుద్దేశ్యంతో మన ముందుకొచ్చింది. మన జాతీయాలు, సామెతలు, విరుపులు,పిలుపులు, బాంధవ్యాలు, వ్యవస్థా వ్యాకరణమూ – ఇవన్నీ కవిత్వంలో ఒదిగే చిత్రమైన తీరుని, మన పొరుగు వారికీ, మన స్నేహితులకీ, ప్రపంచవ్యాప్తంగా తెలుగు కవిత్వం మీద ఆసక్తి ఉన్న మన సాహితీ మిత్రులందరికీ, “మా గొంతు ఇదీ” అని చెప్పుకు చూపించుకునేందుకు అవకాశమిచ్చిన పుస్తకమిది. నానాటికీ కుంచించుకుపోతున్న ప్రపంచపటం మీద, ఈ తూరుపు వాకిట చేతులెత్తి ఎత్తుకు చూపించి మరీ, ఇతర భాషలతో స్నేహపూరితమైన స్పర్ధకీ, చర్చకీ సిద్ధమని చాటేందుకు తావిచ్చిన పుస్తకం. ఇతర భాషలను చదవడానికి మనకుండే కారణాలూ, ఇతరులు మన భాషను గుర్తించి చదివి చర్చించాలనుకోవడానికి మనకున్న కారణాలూ – ఎన్ని రకాలుగా భిన్నమో, ఎన్ని ఆసక్తికరమైన కారణాలకు భిన్నమో మనం పునరాలోచించుకునేలా చేసిన ఈ పుస్తకం, సాహిత్య అనువాదాల అవసరం గురించీ, వాటి అధ్యయనం గురించి, ఆ దిశగా మనకున్న అవకాశాల గురించీ ఎన్నో ప్రశ్నలను మన ముందుంచుతుంది.

***

పుస్తకం వివరాలు:

Wakes on the Horizon: A Selection of Poems Translated from Telugu by N. S. Murty

Publisher: Vaakili

For Copies:
1. Vanguri Foundation. (vangurifoundationATgmail.com)
2. Amazon

**** (*) ****