కథ

సాక్షి

జూలై 2017

ప్రతి నెల రెండో శనివారం సాయంత్రం బ్లూమూన్ బార్‌లో కలుసుకోవడం మా నలుగురి అలవాటు. మత్తు శరీరాన్ని మాయ చేసి, మనసు పైకి తొంగి చూసినప్పుడు ఎవరో ఒకరం “గుర్తుందిరా! చిన్నప్పుడు మన ఊర్లో… ” అంటూ మొదలు పెట్టి హఠాత్తుగా ఆగిపోయేవాళ్ళం. ఎక్కలేని అడ్డేదో ఎదురయితే వెనక్కి గింజుకునే గుర్రంలా బెదిరి పోయేవాళ్ళం.

అలా ఏనాడు తలుచుకున్నా మా నలుగురి మాటలు ఊరి పొలిమేరలని దాటి ముందుకు వెళ్ళడానికి సంశయించేవి. కారణం విశ్వం. అలాంటిది ఈ సాయంత్రం వాడి ఊసే మోసుకుంటూ వచ్చాడు మా ఊరి రత్నం.

గ్లాసులు పైకెత్తి చీర్స్ చెప్పుకుంటుండగా వచ్చి “ఈ రోజు మధ్యాహ్నం విశ్వం పోయాడుట. తెలుసా మీకు” అన్నాడు. మేము నలుగురం ఉలిక్కిపడి రత్నంకేసి చూసాం. “కొడుకు ఇతర బంధువులు వచ్చేవరకూ ఆగి రేపు ఉదయం దహనసంస్కారాలు చేస్తారుట” అని చెప్పి వెళ్లిపోయాడు.

అప్పటికే చిన్నాగాడి మొహం పాలిపోయింది. కళ్ళలో నీళ్ళు పొంగుకొచ్చాయి. “ప్లీజ్! వెళ్దాంరా! ఇప్పటికైనా వెళ్లకపోతే…” అంటూ ఆగిపోయాడు. వేళ్ళతో కణతలు రుద్దుకుంటూ నాథ్ నాకేసి అయోమయంగా చూసాడు. ఒణుకుతో చేతులు పట్టుతప్పుతున్నట్లై నేను తాగుతున్న గ్లాస్ టేబుల్ మీద పెట్టేసాను. బాబ్జీ మా ముగ్గురిని ఓ క్షణం దీక్షగా చూసి “టికెట్ల సంగతి నేను చూసుకుని మెసేజ్ పెడతాను. మీరంతా స్టేషన్‌కి వచ్చేయ్యండి” అంటూ లేచాడు.

***

సిటీ పొలిమేరాలు దాటి ట్రైన్ చీకటిలోకి దూసుకుపోసాగింది. మా జ్ఞాపకాల తేనెతుట్టె కదిలింది. ఆఖరిసారి విశ్వాన్ని చూడడం మా వూరి రైల్వేస్టేషన్‌లోనే. మరునాటి క్యాంపస్ ఇంటర్వ్యూలకోసం మా ప్రయాణం. విశ్వం కోసం కంగారుగా ఎదురుచూస్తున్నాము. మరో ఐదు నిమిషాల్లో ట్రైన్ కదులుతుందనగా వచ్చి తను రావటంలేదన్నాడు. గడ్డం పెరిగి , కళ్ళు గుంతలు పడి ఎన్నో రోజులనుండి తిండి నిద్రా లేనివాడిలావున్నాడు.

“కోచింగ్ తీసుకున్నావు. ఎంట్రన్స్ రాసావు. ఇప్పుడు రానంటున్నావు! అసలేం చేద్దామని?”. చెయ్యి పట్టుకుని కోపంగా అడుగుతున్న బాబ్జీని విడిపించుకుంటూ చెప్పాడు. “మీకు తెలియందేముందిరా! చెప్పకుండా వెళ్లిపోయిందికదరా సాహితి. తను తప్పకుండా కాంటాక్ట్ చేసి తీరుతుంది. అందుకేరా! ఈ ఊరి నుండి కదిలేది లేదు. ఇక్కడే ఏదో ఓ డిగ్రీలో చేరుతాను”.

“నీకు నిజంగానే మతి పోయింది. ఓ రెండేళ్ల పరిచయం కోసం భవిష్యత్తు పాడుచేసుకుంటావురా!” అంటూ ఎవరికి వాళ్ళం నచ్చచెప్పాలనిచూసాం. నాథ్ వాడి రెండు చేతులు పట్టుకుని బ్రతిమలాడాడు. నేను, చిన్న ఆ తరువాతి ట్రైన్‌లోనయినా రమ్మనమని మరీ మరీ చెప్పాం. అంతలో మేము వెళ్లాల్సిన ట్రైన్ వచ్చేసింది. ఇంకా ఆగి వాడిని ఓదార్చి ఒప్పించే సమయం లేదు మాకు. చెయ్యెత్తి వీడుకోలు చెపుతున్నవాడిని కదులుతున్న ట్రైన్‌లోనుండి అసహనంగా చూస్తుండి పోయాం.

ఇప్పుడిలా ఆలోచిస్తూవుంటే ఆ సంఘటన కళ్ళముందుకు వచ్చి – వాడు బ్రతికుండగానే వెళ్ళాల్సింది కదా అన్న దిగులు మరింత పెరిగింది. “మనం ఎవరిని చూద్దామని వెళ్తున్నాం. ఎవరిని చూడబోతున్నాం” బయట చీకటిలోకి చూస్తూ బాబ్జీ అన్న మాట మా ముగ్గురిని ఉలిక్కిపడేలా చేసింది. ముందు వెనుక ఆలోచించకుండా బయలుదేరామా అనిపించింది నాకు. మనసు సంధించే ప్రశ్నలకి ఎదుటివారి మాటల్లో సమాధానాలు వెతుక్కోటానికి విఫలప్రయత్నం చేసి – అలసి – నిద్రలోకి జారుకున్నాం.

***

ఊరికి చేరేటప్పటికి తెల్లవారు జాము అయిదైంది. హోటల్లో దిగి, గబగబా స్నానపానాదులు కానిచ్చి ఊర్లోకి నడిచాం. వాడి కొడుకు వచ్చి వుంటే ఈపాటికి కార్యక్రమం మొదలు పెట్టి వుంటారు. ఆఖరి చూపు దక్కించుకోవాలన్న ఆందోళనలో వడివడిగా అడుగులేసాం.
తడిసి చిక్కనైన మట్టి, దారి పక్కల కుంటల్లో నిలిచిన నీళ్ళు – వర్షం ఈ ఊరికి మాకన్న ముందుగా వచ్చిన అతిథిలా వుంది. ఇప్పుడూ సన్న తుంపరగా పడుతూనేవుంది. రామాలయం కుడి పక్క వీధిలోనే విశ్వం ఇల్లు. పూర్వం ఊరి నాలుగు వైపుల నుండి ఆలయ ధ్వజస్తంభం కనిపించేది. ఇప్పుడిక షాపులు, అపార్ట్మెంట్లూ, కొత్త కొత్త భవనాలు ఆక్రమించేసుకుని ఊరు రూపు మారింది. ఒకరిద్దరిని అడుగుతూ నడిచాం. పాతికేళ్ళ తరువాత ఇలా ఈ వూరిలో నడుస్తున్న మమ్మల్ని ఎవరో గుర్తు పట్టి పలకరిస్తారని నమ్మకం ఏమిలేదు మాకు.

తీరా అనుకున్న చోటికి వచ్చినా అటూ ఇటూ అపార్ట్మెంట్లు వచ్చి, ఈ వీధి కూడా కొత్తగా వుంది. అప్పుడే సైకిల్ పైన వెళ్తున్నపేపర్ కుర్రాడు ఆగి “ఎవరింటికి?” అంటూ అడిగాడు. మేము వివరాలు చెపుతుండగానే “పెద్ద విశ్వనాథంగారేనా? నిన్న పోయారు? అదిగో అదే” అంటూ వీధి మధ్యలో వున్న ఇల్లు చూపించాడు. విశ్వం ఇల్లు కుడి వైపు వరుసలో ఆఖరిది. ఈ కుర్రాడు మధ్యలో వున్న ఇల్లేదో చూపిస్తున్నాడు. బహుశా ఈ ఇల్లు కూడా కొన్నాడా? అని అనుకుంటుండగానే వెనక నుండి “ఎవరది? ఎవరు కావాలి?” అంటూ వినబడి నలుగురం ఒకేసారి వెనక్కి తిరిగాం. ఎదురుగా విశ్వం.

విన్న వార్తకి, ఎదురుగుండా కనిపిస్తున్న సత్యానికి పొంతన కుదరక – ఎలా స్పందించాలో తెలియక – అచేతనంగా నిలబడిపోయాం. మమ్మల్ని గుర్తుపట్టడానికి ఓ రెండు క్షణాలు పట్టినట్లుంది. పట్టగానే “అరెరెరే! ఇదేమిటిలా, మీ నలుగురూ… ఇక్కడ. నా కోసమేనా అడుగుతున్నారు” అంటూ సంబరపడిపోయాడు. పేరు పేరునా పలకరిస్తూ ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. “ఏంట్రా ఇది? ఆనందబాష్పాలా!?” అంటూ తడి ఊరుతున్న చిన్నాగాడి కళ్ళు తుడిచాడు.

మాటల్లో తెలిసింది. పోయిన వ్యక్తి విశ్వంకి పెద్దనాన్న కొడుకని, అతడి పేరూ విశ్వమేనని. ఐదేళ్ల క్రితం ఆర్మీనుండి రిటైర్ అయి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడుట. విశ్వం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడే మమ్మల్ని వాళ్ళింటికి తీసుకు వెళ్ళలేక పోయినందుకు చాలా నొచ్చుకున్నాడు. రాత్రి డిన్నర్‌కి రమ్మని మరీ మరీ పిలిచాడు. ఆరింటికల్లా ఎదురు చూస్తుంటానని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చి మరీ వెళ్ళాడు.

ఇక లేడనుకున్న వ్యక్తి ఇలా ఎదురొచ్చాడు. నిన్నటినుండి మా మనస్సులో అణచి పెట్టి వున్న అవ్యక్త దుఃఖాన్ని తన స్పర్శతో ఆవిరయ్యేలా చేసాడు. వెళ్తున్న వాడిని కనిపించేవరకూ చూస్తుండిపోయాం. తొలగిపోయిన మా సందేహాలని, భయాలని గుర్తించినట్లు అప్పుడే వాన వెలిసి మబ్బుల్లోంచి సూర్యుడు బయటపడ్డాడు. చిరు ఎండ తేలి, గాలి తిరిగి ఒక్కసారిగా మారిన వాతావరణంతో పాటు మేము తేరుకున్నాం.

“మన కాలేజ్ మీదుగా తిరిగి వెళ్దామా?”. నాథ్ మాటకి సరేనంటూ మేము ముందుకు నడిచాం.

***

ఆదివారం ఉదయం కలిసొచ్చి చుట్టూ ప్రశాంతంగా వుంది. ఇళ్ళు, భవనాలు ఆక్రమించుకోకుండా మా కాలేజ్ కి వెళ్ళే దారి ఇదివరకులానే వుంది. కాలేజ్ మాత్రం కుడి ఎడమలకు విస్తరించింది. ఎడమ వైపునుడి వెనుకకి విస్తరించి వుండే ప్లేగ్రవుండ్ ఇప్పుడు కనిపించడం లేదు.

కుడివైపు అర్ధ చంద్రాకారంలో ముందుకు వచ్చిన ఆ గోడ వెనుకాల పెద్ద హాలులో అరుంధతి మేడమ్ ఇంగ్లీష్ క్లాస్ తీసుకునేది. నిన్నటి నుండి విశ్వం తాలూకు జ్నాపకాలలో మునిగి వున్న మాకు ఆవిడ చెప్పే పాఠాలు గుర్తురావడం యాదృచ్ఛికమేమి కాదు. కవుల పట్ల కవితల పట్ల ఆమెకున్న గొప్ప ఆరాధన వలన – ప్రోస్ కన్నా పోయిట్రీ క్లాస్ ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా నడిచేది. ఆ రోజున మిల్టన్ కవితలోని ప్రముఖ కొటేషన్స్ కి మేడమ్ వినిపించే వర్ణన దృశ్యమై కళ్ళముందు నిలుస్తుంటే క్లాసంతా నిశ్శబ్దంగా కూర్చుని వింటున్నాం.

“So hand in hand they passed, the loveliest pair that ever since in love’s embraces met
– Adam, the goodliest man of men since born his sons; the fairest of her daughters Eve.”

ఆ కోట్ చదివి ఇక వర్ణించాల్సిసిన పని లేదన్నట్లు ఆగి ఆమె ముందు వరసలో పక్కపక్కన కూర్చుని వున్న విశ్వం, సాహితీలని చూస్తూ చిన్నగా నవ్వింది.

మేమంతకు ముందు రోజే విశ్వాన్ని హెచ్చరించాం. కాలేజ్ లో అందరూ నవ్వుతున్నారని , ప్రేమ, దోమా అని చదువు పాడు చేసుకోవద్దని వాడికి నచ్చచెప్పాం. వాడు నవ్వి ఊరుకున్నాడు. ఆ తరువాతి రోజే వాడిని సాహితి ఆమె కజిన్ నందూలతో కలిసి సినిమా థియేటర్ దగ్గర చూసాం. ఊహ తెలిసినప్పటినుండి ఒకటిగా మసలిన మా ఐదుగురిని అలా నలుగురిని చేసింది సాహితి.

***

ఆ సాయంత్రం మా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నాడు. గేటు తీస్తుండగానే నవ్వుతూ ఎదురొచ్చాడు. అదే డాబా ఇల్లు. “ఇదిగో చూడు ఎవరొచ్చారో” అన్న వాడి పిలుపుకి లోపలి నుండి బయటకి వచ్చింది సాహితి. వాడు పేరు పేరునా మమ్మల్ని తిరిగి పరిచయం చేసాడు. గుర్తుపట్టిందో లేదో తెలియదు “చాలా ఏళ్ళయింది చూసి” అంది ఇబ్బందిగా నవ్వుతూ.

“రండి! మీకు మా అఖిల్ ఫోటోలు చూపిస్తాను. బెంగుళూరులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు” అంటూ లోపలికి నడిచాడు విశ్వం. కొత్తగా గోడలకి వేసిన రంగులు తప్ప ఇంట్లో పెద్ద మార్పులేమీ లేవు. హాలులో నుండి వేసిన మేడ మెట్లని ఆనుకుని వున్న గోడలకి వరుసగా కొన్ని ఫోటోలు అమర్చి వున్నాయి.

“మీది రిజిస్టర్ మ్యారేజ్‌లా వుందే?”. మొదటి పోటోని చూడాగానే అడగకుండా వుండలేకపోయాడు నాథ్. “అవును. సాహితికి వాళ్ళ వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం లేదు అప్పుడు. అందుకే మొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తరువాత పెద్దల అంగీకారంతో పీటల మీద పెళ్ళి జరిగిందనుకో” అంటూ నవ్వాడు వాడు.

ఫోటోలో సంతకం చేస్తున్న సాహితి పక్కన వున్న ఆమె చిన్నాన్న కొడుకు నందూని గుర్తు పట్టాం మేము. ఆ పక్కనే పెళ్లి దుస్తుల్లో విశ్వం, సాహితీలు, ఇరువైపులా వాళ్ళ తల్లితండ్రులతో వున్న ఫోటోలు వున్నాయి. విశ్వం కొడుకు ఫోటోలు తల్లితండ్రులతో కలిసి కొన్ని, విడివిడిగా కొన్ని వున్నాయి. చిన్నతనంలో విశ్వంని చూసినట్లే వుంది ఆ ఫోటోల్లో అఖిల్ ని చూస్తుంటే మాకు. ఆ విషయమే చెప్పాం వాడికి.

విశ్వం మా నలుగురిని కూర్చోమని చెప్తుండగానే కరెంట్ పోయింది. ఆ చిరు చీకట్లోనే చిన్ననాటి విషయాలు, స్నేహితులు, ఎవరెవరు ఎక్కడెక్కడ వున్నారో – అలా మా మధ్య ఎడతెరిపిలేని కబుర్లు పొగుపోసుకున్నాయి. ఎప్పుడో తెగిపోయిన బంధం అలా మాటల మంత్రంతో తిరిగి ముడిపడిపోయింది.

ఇంట్లో నుండి కమ్మని వంటల వాసనలు తేలి తేలి వస్తున్నాయి. ఆ వాసనలని ఘాడంగా పీలుస్తూ “తెగ ఆకలి వేస్తోందిరా” అంటూ చిన్నాగాడు చనువుగా అంటూవుండగానే “ఇవాల్టికి క్యాండిల్ లైట్ డిన్నర్ ఓకేనా మీకు?” అడిగింది సాహితి గుమ్మంలోనుండి తొంగి చూస్తూ. “అంతకన్నా భాగ్యమా?! మీరు వచ్చిన వేళావిశేషం బావుందోయ్! రండి” అంటూ లోపలికి దారితీసాడు విశ్వం.

ఆమె తరువాత తింటాను అనడంతో డైనింగ్ టేబుల్‌కి ఒక వైపు మేము నలుగురం – మాకు అభిముఖంగా విశ్వం కూర్చున్నాడు. మరో రెండు వైపులా నాలుగు నాలుగు చొప్పున కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో గోడల పైన అమర్చిన పెయింటింగ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలూ కనిపించి కనిపించకుండా వున్నాయి. మా వెనుకగా వున్న కిటికీ నుండి వుండుండి చల్లగాలి లోపలికి వచ్చి శరీరాలని పలకరించి వెళ్తోంది. గాలి వీచినప్పుడల్లా దీపాలు రెపరెపలాడుతున్నాయి. ఆమె సమక్షం కొద్దిసేపు మొహమాటపెట్టినా తిరిగి మా మాటలు పుంజుకున్నాయి.

ఎప్పుడు ఏం తిన్నారో అని వాడు, మరి కొంచం వేసుకోండి అని ఆమె కొసరి కొసరి వడ్డించారు. వున్నట్లుండి విశ్వం గొంతులో ఏదో అడ్డుపడ్డట్లు ఓ రెండు క్షణాలపాటు దగ్గాడు. వెంటనే సాహితి నీళ్ళగ్లాసుని అందించి వాడి తల పైన నెమ్మదిగా తడుతూ “నిన్నెవరో బాగా తలుచుకుంటున్నట్లున్నారు” అంది.

వాడు పెద్దగా నవ్వి “ఇంకెవరు? వీళ్ళే అయివుంటారు. నిన్నటి నుండి తలుచుకుంటూ వుండి వుంటారు. ఏరా? మీరేనా? ” అంటూ అడిగాడు.

ఉలికిపాటుగా చూసి చిన్నగా తల ఊపాము. నిన్న విన్న ఆ వార్తా మమ్మల్ని ఎంత కలవరపెట్టిందో, ఎంత కృంగతీసిందో తిరిగి గుర్తుకి వచ్చింది. అయినా నిన్నటికి ఈ వేళకి ఎంత తేడా! ఇలా… ఈ రాత్రి… ఈ సమయానా… ఎదురుగా… అపురూపంగా ఈ జంట. కలలోని దృశ్యమో… క్యాన్వాస్ పైన రంగుల చిత్రమో… అన్నట్లు కళ్ళ ముందు నిలిచి – అసలూహించామా మేము?
“మ్యాంగో లస్సీ చేసి ఫ్రిజ్జులో పెట్టాను, తీసుకొస్తాను” అంది ఆమె అక్కడి నుండి కదలబోతూ. వెళ్తున్న ఆమె చేతిని పట్టి ఆపి “నాదయిపోయింది. నువ్వు వీళ్ళకేం కావాలో చూస్తుండు. నేను తెస్తాను” అంటూ విశ్వం లేచి లోపలికి వెళ్ళాడు.

ఒక్కసారిగా క్షణం తాలూకు నిడివి పెరిగినట్లనిపించింది. కిటికీ అవతల పుంజుకున్న గాలి చెట్ల కొమ్మలని ఊపుతున్న శబ్ధం లోపలికి తెలుస్తోంది. కొద్ది నిమిషాలపాటు కొనసాగిన నిశ్శబ్దాన్ని తుంచుతూ ఆమె అడిగింది “మీలో ఎవరో బొమ్మలు బాగా వేస్తారనుకుంటాను?”. నెమ్మదిగా… స్పష్టంగా… గురిచూసి తాకింది ప్రశ్న.

అయ్యో! ఇప్పుడెలా? వెలతెలబోతున్న ఈ మొహాలని దీపాల రెపరెపల నీడల్లో దాచగలం కానీ – శరీరం లోలోపల నుండి తన్నుకొస్తున్న ఈ ప్రకంపనల తాలుకు వణుకుని ఆపడం ఎలా?

సమాధానం ఆశించకుండా తిరిగి ఆమె అడిగింది “మా కజిన్ తెలుసుకదా మీకు? అదే మా బాబాయి కొడుకు నందు. వాడు చెప్పినట్లు గుర్తు. పగలు రాత్రి కాలేజ్ ప్లేగ్రవుండులోనే వుండేవాడు. గుర్తున్నాడా మీకు?”.

విశ్వం లోపలి నుండి పళ్ళెంలో లస్సీ గ్లాసులతో వస్తూ “ఎవరూ? నందూనా? ఇప్పటికీ అదే ఇంట్రెస్ట్ వాడికి. అందుకే స్పొర్ట్స్ టీచర్ అయ్యాడు” అంటూ నవ్వాడు. ఆమె కూడా నవ్వింది.

అయితే ఆ రోజు రాత్రి ప్లేగ్రవుండ్‌లో వున్నది నందూ ఏనా? ఆ మర్నాడు ఉదయం వార్త కాలేజ్ నాలుగు వైపులకి పాకి కుతూహలం పట్టలేని జనమంతా ఆ ప్రహారీ గోడ దగ్గరికి చేరినప్పుడు. భయాందోళనలని గుండెల్లో అదిమి పెట్టి మేము నలుగురం కూడా అందరితో కలిసి చూస్తున్నప్పుడు. ఎవరు వెళ్ళి చెప్పారో కానీ చెదిరిన తలతో, నలిగిన దుస్తులతో, నిద్ర నుండి లేచిన వాడు లేచినట్లే పరిగెత్తుకొచ్చాడు. అదే వేగంతో కాలేజీలోకి పరిగెత్తుకు వెళ్ళి బకెట్లతో నీళ్ళు తెచ్చి చల్లి గోడల పైన వున్న ఆ జుగుప్సాకరమైన బొమ్మలని, ఆ అసభ్యకరమైన రాతలని చేతులతో రుద్ది రుద్ది తుడిచాడు.

వేసుకున్న చొక్కా చటుక్కున విప్పి – నీళ్ళలో ముంచి – దాంతో రుద్దుతూ మరీ కడిగాడు. తుడుస్తూ, తప్పనిసరి అయి చూస్తూ – తుడుస్తూ, అవమానంతో ఎర్రబడ్డ మొహం దాచుకుంటూ – తుడుస్తూ, పొంగుకొస్తున్న కన్నీటిని మోచేతి ఒంపులో ఒత్తుకుంటూ – ఆ పదహారేళ్ళ కుర్రవాడు… గుర్తులేకేమి? అతడి చర్యతో తేరుకున్న మరికొంత మంది స్టూడెంట్స్ పరిగెత్తుకెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి నందూకితోడొచ్చారు.

లస్సీ రుచి తెలియలేదు. వణికే చేతులతో గబగబా తాగి లేచాం. గుమ్మం దగ్గర మాలో ఒకొక్కరిని చేతులతో చుట్టి గుండెలకి హత్తుకుని ఆప్యాయంగా వీడుకోలు చెప్పాడు విశ్వం. “వీలు చూసుకుని అప్పుడప్పుడూ వస్తూ వుండండిరా ప్లీజ్!” అన్నాడు. ఆమె లోపలి నుండే “తప్పకుండా రావాలి” అంది.

అప్పటికే ఆకాశానంతా ఆవారించుకున్న కారుమబ్బులు ఆ రాత్రిని మరింత నల్లబరిచాయి. చిక్కనైన ఆ చీకట్లో ఈదురుగాలిని జత చేసుకుని సన్నగా వర్షం ప్రారంభం అయింది. వున్నపలానా మాయమైపోవాలన్న తీవ్రతతో మనసు చిక్కబట్టుకుని మేము వేగంగా అక్కడినుండి కదిలాం.

**** (*) ****