ఉగాది పండక్కి ఊర్లో ఉన్న కుటుంబరాళ్లు అందరూ ఇండ్లు, వాకిండ్లు సున్నం పూసుకొని ఇల్లంతా అలికి ముగ్గులేస్తారు. ఇంగ పండగ నా పొద్దు నాలుగు గంట్ల రేతిరిలోనే లేసి ఎవురి మొగమూ సూడకుండా పూసిన ఇండ్లకు ‘పొలి’ కడతారు. ఇండ్లలోకి ఆ సంవత్సరమంతా గాళ్ళు దూళ్ళు రాకుండా ఆవు పేడతో ఇంటి సుట్టూ గీత మాదిరి పూస్తారు. దాన్నే పొలి కట్టడం అంటారు.
ఈ పండగని ‘పెద్దలపండగ’ అంటాము. వాళ్ళ వాళ్ళ ఇండ్లల్లో ముందుగా పెద్దోళ్ళు కానీ చిన్నోళ్లు కానీ సచ్చిపోయింటే వాళ్లకు కొత్త గుడ్డలు తెచ్చి పెడ్తారు . ఆ రోజు సచ్చినోళ్ళకి ఇష్టమైన వంట వార్పు చేసి పెడ్తాము. కుమ్మరింటికి పొయ్యి కొత్త కడవ కొత్త చాట తెస్తాము. ఆ రోజు కొత్త కడవ నిండా నీళ్లు తెచ్చి నట్టింట పెట్టి ఆ కడవకు నామాలు పెడతాము, మర్రాకు తో కుట్టిన అయిదు ఇస్తరాకులు నట్టింట వేసి, చేసిన వంటా వార్పులు అన్నీ అయిదు పల్లేలు గా పెడతాము. తెచ్చిన కొత్త గుడ్లు పెట్టి ఆ నిలుపు పైన చచ్చిన వారి ఫోటోలు ఉంటే పెట్టి మొక్కుతాము.
కొత్త చాటలో పచ్చని ఇస్తరాకు వేసి ఉగాది పండగప్పడే కాసే యాపాకు, యాప్పూత అంతా తీడి చాటకు పోసి దాంట్లో ముద్ద బెల్లం నున్నగా కొట్టి బాగా కలిపి దేవుని ముందర పెడతాము. అన్నం పొద్దుకు అంటే తెల్లారి తొమ్మిది గంటల లోపే దేవునికి టంకాయ కొట్టాల. అందుకే పెద్దోల్లు ఈ పండగను ‘అన్నంపొద్దు పండగ’ అని కూడా అంటారు. నట్టింట పెట్టిన అయుదు పల్లేలులో దేవునికి ఒకటి, నిలుపుకొకటి, ఇంటికప్పుపైన ఒకటి, గోగికొకటి, అందరూ తినే దానికొకటి పెట్టి, చాట లోని యాపాకు బెల్లం ని ఊర్లో ఒకిల్లు వదలకుండా ఇంటింటికీ పంచుతాము. మగం నిష్ఠురాలు ఉండకూడదని,గడపతొక్కని ఇరోదస్తుల ఇంటికి కూడా పోయి ఆ రోజు యాపాకు బెల్లం పంచుతారు. పెద్దోళ్లకు పట్టింపులుంటాయని పిల్లోళ్లను పంపిస్తారు పంచేదానికి. అది కూడా మధ్యాహ్నం 12 గంట్ల లోనే పంచల్ల. అందుకే ఆ పొద్దు ఆడోళ్ళ ఉసురు పోతుంది. ఎవరన్న ముందుగా పంచిరంటే ఇగ ఊపిరాడదు. వాళ్ళు పంచేసిరే మేము ఎబుడు పంచేది అని షరత్తు పుడుతుంది. ఇండ్లల్లో మగోళ్ళు అరస్తా ఉంటారు ఇంకా కాలేదా అని. మాకు భయమేసేది ఎవరు ముందుగా యాపాకు తెస్తారా అని. ఈ పండుగ వచ్చిందంటే ఊరు సేరు పొందదు.
పండుగ రోజు మా తమ్ముని కూతురు పన్నెండు గంటలకు యాపాకు ఎత్తుకొని వచ్చి మా ఇంట్లో ఏసేసి పాయె! ఊర్లో అందరూ చేసినవన్నీ తిని వీధుల్లోకి వచ్చినారు. అమ్మలక్కలు ముందు ఎవరు యాపాకు పంచింది,యనకాల ఎవరు యాపాకు పంచింది అని మాట్లాడుకుంటుండ్రి. ఆ యాలకు నేను పోతి. ఈ సారి మారక్క కూతురు అందరి కంటే ఎనకాల యాపాకు ఎత్తుకొచ్చింది అంత పొద్దు దాకా ఆ యమ్మ ఏంచేస్తా ఉన్నింది అంటా ఉండారు అమ్మలక్కలు. ఎందుకు అంత ఆలస్యం చేసినారు మా తమ్ముడోల్లు వాడి పెళ్ళాన్ని నాలుగు తిట్టాల అని వాళ్ళింటికి పోతి.
వాని పెళ్ళాము గోడకి ఒరుక్కోని ఉంది, నా తమ్ముడే బిడ్లకు నీళ్లు పోసి దేవునికి అన్నీ సరి చేసి టెంకాయ కొట్టినాడు . వానికి ఇద్దరు కూతుర్లు. చిన్నది నాకు కొత్త గౌను ఎయ్యి అని ఉట్టి పైయి తోనే ఏడస్తా ఉంది . పెద్దది యాపాకు పంచి వచ్చి అన్నం తింటా ఉంది. వాళ్ళమ్మ మూతి మూరడు పొడవు పెట్టుకుని కూసోనుంది . నేను పొయ్యి యాలండ్రా పండగ పూట అట్లుండారు అంటి . మా తమ్ముడుండి “చూడక్కా ,నాయనకు గుడ్డలు తెచ్చినా , వాళ్ళమ్మకు గుడ్డలు తేలేదని అలిగింది” అనే. నాయన బతికిన్నబుడు ఎర్ర సెరాయి ఒకటి తేరా తేరా అని మా తమ్ముణ్ణి అడిగి అడిగి సచ్చిపోయే ,సచ్చినంక బలే అక్కరగా తెచ్చి పెడతా ఉండాడు, సచ్చినోళ్ళు వచ్చి కడతారా వాల్ల పేరుబెట్టి వీళ్ళు కట్టుకునే దానికే కదా అని లోపల అనుకోని బయటికి వాళ్ళని మందలించి వస్తిని.
ఇంతలో మా ఆడబిడ్డ ఊరినుంచి వచ్చే! వాళ్ళమ్మ వొలిక్కాడికి(పూడ్చిపెట్టిన స్థలం) పొయ్యి చీరపెట్టి టెంకాయ కొట్టి వాట్ని ఎత్తుకోని వచ్చింది. “వొదినా చూడు మా యమ్మకు ఎయ్యి రూపాయలు పెట్టి చీర తెచ్చినా బాగుందా ” అనే ! “బాగానే ఉంది కాని పాపా అమ్మ బతికినబుడు కూలీ నాలీ చేసి రూకార్డుగా (అంతో ఇంతో)ఎత్తి పెట్టుకున్న డబ్బులతో కొత్త చీర తెచ్చుకుంటే ఆ యమ్మను ముడ్డి మింద కూడా పెట్టనిచ్చే దానివి కాదు . మొండికేసి నువ్వే కట్టుకునే దానివి. బతికినబడు రైగ్గుడ్డ అట్లాడిది కూడా పెట్లే ,ఇపుడు ఎయ్యి రూపాయల చీర తెస్తివే ” అంటి .దాని మొగం చిన్నదైపోయె ! నేను అంతే ,మొగాన్నే అడిగేస్తా !అట్లాంటిది కాక పోతే వాళ్ళమ్మ కాయిలాకు (జబ్బు) వొంగింది . కూతురు కదా అని ఆ యమ్మకు ఇష్టమయిన పోలీలు చేసి పెట్టమ్మ అని అడిగింది . అది గాన చేసింటే.. మనిషి కాదు .ఇబుడు పోలీలు ,అత్తరసాలు ,వక్కాకు , సారాయి అన్నీ తీసుకొచ్చి వొలిక్కాడ పెడితే ఆ యమ్మ తింటుందా తాగుతుందా. ఈ బాద బతికినపుడు పడేది . అబుడు పెడితే ఇంకా రొన్నాళ్ళు బతికితే ఎట్లా అనుకుంటారు.
ఉగాది పండగ నా పొద్దే అందరికీ చచ్చినోళ్ళు గ్యాపానికి వచ్చేది . అంతకుముందు వాళ్ళని ఏసిన తావన అడవై పోయుంటుంది .పండగనాపొద్దు పొయ్యి వొలికలను తారాడుకొని కాళ్ళు ఏపక్క తల ఏపక్క అని ఉరువు కూడా తెలియక అట్లే కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని ఇంటికొస్తారు. ఆ పొద్దు పొగిడే వాళ్ళు ఇండ్ల ముందరకు వస్తే ధాన్యం, డబ్బులు ఇచ్చి వాళ్ళతో సచ్చినోల్లను పొగిడిస్తారు.
ఆలుమగలు ఇద్దరు పొగిడేవాళ్లు మా ఇంటి ముందరకు వస్తే నేను కూడా చాటెడు బియ్యం పోసి మా యమ్మను పొగిడిస్తి. వాళ్ళు గుమ్మటి కొడతా మాయమ్మ గురించి పాడతా ఉంటే నా కంట్లో నీళ్లొచ్చే!
“నీ కూతురుండబట్టి ఏ మిచ్చి పగడిచ్చే! ఎండి రూకాలిచ్చి ఎచ్చుగా పగడిచ్చే!
రాగి రూకాలిచ్చి రచ్చాన పగడిచ్చే! వస్త్రా దాన మిచ్చి వయికుంటమే పంపే!
ఏ దేవుడు నిను కోరినమ్మ మా రాజు ఎల్లమ్మ! దేవలోకం చేరినావా, దేవుడే నిను కాపాడునమ్మా!
ఇల్లలికి ముగ్గు బెట్టి ఇంటా మల్లెలు జల్లి పిలిసినా రావంట!
తలిసినా రావంట , పండగన రావంట , పబ్బాన రావంటా!
ఏమీ రాత రాసెనమ్మా దేవుడు అర్దా రాత రాసెనమ్మా!
ఇల్లూ వాకిలి ఇడిసి, పిల్లా పెద్దల నిడిసి దేవలోకం చేరినావా మా రాజు ఎల్లమ్మ! దేవుడే నిను కాపాడునమ్మా!
**** (*) ****
ఈ రచన చాలా బాగుంది.అభినందనలు