ప్రత్యేకం

అమృత వర్షిణి

ఆగస్ట్ 2017

క వేసవి సాయంకాలం కురిసిన ఎదురుచూడని వర్షం- అమృత!

అమృతా ప్రీతమ్- ఎప్పుడు ఎలా పరిచయమైందో గాని చదివిన మొదటి సారే మనసుకి చాలా దగ్గరగా అనిపించిన రచయిత్రి. ఆలోచిస్తే గుర్తొచ్చింది, నా యునివర్సిటీ రోజులనుకుంటాను, ఒక వెన్నెల రాత్రి హాస్టల్లో చాలా మంది నిద్రపోతున్న వేళ, కొబ్బరాకు గలగలల మధ్య ఏదో పుస్తకం తిరగేస్తూ నడుస్తున్నాను-తడుస్తుంది, వెన్నెల్లో అనుకున్నాను కానీ… కాదు తన కవిత్వంలో! ఆ తడి నన్ను చాలా రోజులు వెంటాడింది.

కొందరు మన జీవితంలో ఎందుకు తారసపడతారో తెలీదు- వదల్లేం. వ్యక్తిగతంగా పరిచయం లేకపొయినా కొందరు కవులూ, రచయితలు కూడా అంతే.

అమృతప్రీతమ్ బాధని ఆస్వాదించారు. అదే విలువైనదని, తనమటుకు తనకు వాస్తవం ఏదైనా ఉందంటే అది ఒక రచయితగా తన అస్తిత్వమనీ అన్నారు. చాలా తేలికగా బాధని దిగమింగే తన వ్యక్తిత్వం, దాన్ని స్వీకరించిన తీరు, అందులోని ఒక రకమైన తెగింపు, నాకు తనని దగ్గర చేసాయనుకుంటాను.

తన గురించి చెప్తూ, తన ఒంటరితనం లోనించే కవిత్వం మొదలైంది అంటారామె. అమృత ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది –ఆమె తండ్రి రచనావ్యాసంగమంతా రాత్రుళ్ళు సాగేది. అందువలన పగలంతా నిద్రపోయేవారాయన. ధనం, వైరాగ్యం సమపాళ్ళలో కలిసిన జీవితం తన తండ్రిది. “ఆయనకి బాహ్యప్రపంచం లో మిగిలిన ఒకేఒక బంధం నేను, అందులో బందీ అయినట్లు ఫీల్ అయ్యేవారేమో” అంటారు అమృత. కూతురి మీద ప్రేమ, దైనందిక విషయాలమీద వైరాగ్యం– ఈ రెండింటికీ మధ్య నలిగిపోయినట్లనిపించేవారట తన తండ్రి.

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన తనకు సమయమంతా పుస్తకాలమధ్య గడిచేది. అంత చిన్న వయసులో Acceptance మరియు Rejection ల మధ్య కొట్టుమిట్టాడేవారామె. యాభై సంవత్సరాల తరువాత అదే పరిస్థితి లో తనున్నానని చెప్పుకున్నారు. చిన్నప్పుడు తన తండ్రి ఇష్టానికి విరుద్దంగా ఏదీ చేయని అమృత, జీపితంలో ముందుకెళ్ళే కొద్దీ తన ఇష్టానికి మనస్సాక్షికి నచ్చనిదేదీ చేయలేదు. తనకి నచ్చినట్లు తన జీవితాన్ని గడిపారు. ఇటువంటి పరిస్థితి ఎదురయ్యే మనుషులని, జీవితాల్ని బహుశా మనంకూడా దగ్గరగా చూస్తూనే ఉంటాం.

పంజాబీలో అధ్భుతంగా రచనలు చేసిన స్త్రీలల్లో అమృతది మొదటి స్థానం. ప్రస్తుతం పాకిస్తాన్ లోని భాగమైన పంజాబులో 1919 ఆగష్టు 31న జన్మించారు అమృత. పదకొండేళ్ళ వయసులో తల్లిని కోల్పోయి, పెద్దరికం వహించాల్సివచ్చిన సందర్భంలోనే వ్రాయడం మొదలు పెట్టారు. తన మొదటి కవితా సంకలనం ప్రచురించినప్పుడు తన వయసు కేవలం పదహారు. ప్రీతమ్ సింగ్ తో తన వివాహం జరిగిన సంవత్సరం కూడా అదే!

“Like a thief came my sixteenth year, stealthily like a prowler in the
night, stealing in through the open window of the head of my bed…”

అమృత దృష్టిలో నైరూప్యత(Abstraction)కి అర్థం లేదు. ప్రతిదానికి రూపం, భావం ఉండాలంటారు. అనుభూతి తన దృష్టిలో చాలా ముఖ్యం. తన నమ్మకాలని ప్రశ్నించుకునే విచక్షణ, మార్పుని మనస్ఫూర్తిగా అంగీకరించే వ్యక్తిత్వం- అమృత ఎదుగుదలకి ఒక పునాది. దేశ విభజన ఆమెలో కలిగించిన బాధ ‘పింజర్’ గా రూపు దిద్దుకుంది.

***

ఒక మనిషి జీవితంలో, అందునా ఒక అమ్మాయి జీవితంలో, ప్రేమని మించిన యుద్దం ఏముంటుంది? మనసులో, మనసు బయటా కూడా యుద్దం! పదహారేళ్ళకే పెళ్ళైపోయిన సున్నితమనస్కురాలైన యువతికి, ప్రేమ ఆనవాలే లేని వివాహ సంబంధంలో కట్టుబడి పోయాక, అనునిత్యం సంఘర్షణే! కానీ ఇదే సంఘర్షణ, మనసుని నింపేసే అలజడి ఒక రచయితకి ఎంతో అవసరమైన లక్షణాలు. ఈ రెండూ కొంతైనా లేకుండా ఎటువంటి రచనా ప్రాణం పోసుకోగలదని నేననుకోను.

ఎవరికోసమైతే నాలుగక్షరాలు రాస్తామో, వాళ్ళ కంట్లో అవి పడనప్పుడూ- ఎన్ని అవార్డులు వచ్చినా ఎందరు ప్రశంసించినా ఏమీ అనిపించదు. 1957 లో ‘సునెహ్రె’ కి సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చినపుడు, అమృత అంతరంగమిదే.

మనసంతా శూన్యం నిండి, మళ్ళీ దాన్నిండా ఒక్క మనిషిని నింపేస్తే- అన్యమనస్కంగా చేసే ప్రతిపని లోనూ ఆపేరే జపమై పోదూ! అవార్డు తీసుకున్న సందర్భంగా ఇంటర్వ్యూ తీసుకునేందుకు వచ్చిన ఒక రిపోర్టర్ ఏదో వ్రాస్తున్నట్లు ఫోజ్ ఇమ్మంటే, ఎదురుగానున్న పేపర్ లో ఆగకుండా, అలోచించకుండా ఏదో లోకంలో ఉన్నట్లు, అమృత నింపిన పేరు – సాహిర్. ఆయన అన్యమనస్కంగా అమృత నింపిన కాగితంలోనే కాదు, ఆవిడ కలంలో కూడా నిండిపోయారు.

ఇంకాచెప్పాలంటే తన కొన్ని రచనలలో, పాత్రల్లోనూ ఇమిడిపోయారు- మచ్చుకు Ashoo, Ik Si Anita, Dilli Diyan Gallian లాంటివి కొన్ని.

బల్గేరియాలో ఒక సముద్రం ఒకవైపు, పర్వతాలు మరో వైపు ఉన్న రమణీయమైన ప్రశాంతతలో కూడా తన ఆలోచనల్లో అల్లుకున్న కవిత్వంలోని మొదటి లైన్లు… “Long have thoughts of you lain in exile..”

నిజానికి మనస్ఫూర్తిగా, నిశ్శబ్దంలో కూడా తను ప్రేమించిన వ్యక్తి సాహిర్ లూధియన్వి! చాలా సంవత్సరాలు గాఢంగా సాగిన ప్రేమ వాళ్ళది.అమృతకి సంబంధించినంతవరకూ, ఎవరినీ మధ్యకి రానివ్వనంతగా సాగిన ప్రేమ, సర్వం తానే అయిన ప్రేమ. అమృత జీవితంనిండా ఊహలు నిండిపోయిన కాలంలో- సాహిర్ గురించి చెప్తూ అమృత అంటుంది-

Like divinity aiming at the creation of a wonderful one…
Free from the claims of the flesh…
Free from all that flesh and blood has been heir to
From the dawn of creation…

సాహిర్ ఊహల్లో నిండిపోయిన ఆమెకి, అప్పుడే పుట్టిన తన కొడుకులోను సాహిర్ ముఖమే కనిపించిందట. అతనితో ఉన్న సమయంలో ఆమెకేదీ గుర్తుకురాదు. ఒక్కమాట కూడా లేకుండా ఎన్నో గంటలు నిశ్శబ్దంలో, సాహిర్ కాల్చే సిగరెట్ పొగ మధ్యలో అతనితో గడిపేవారామె.

There was a grief I smoked
In silence, like a cigarette
Only a few poems fell
Out of the ash I flicked from it

అమృత రాసిన ప్రతీ పదం కూడా సాహిర్ తన లోకమవడాన్నీ, తనకి సొంతమవడాన్ని ఇష్టపడ్తుందనుకుంటా. అలాంటిది ఒకసారి, పేపర్ లో సాహిర్ పక్కన ఒకమ్మాయి ఫోటో చూసి పిచ్చెక్కిపోయి చనిపోయినంత పని చేసింది. ప్రేమ ఇవ్వగలిగే ప్రశాంతత ఏ స్థాయిలో ఉంటుందో, అది దూరమవుతూ మిగిల్చే అశాంతి , రగిల్చే తుఫాను రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఇది జరిగిన సంవత్సరం 1960 ని తన జీవితంలో అత్యంత విషాదకరమైనది అంటారామె. అటువంటి తనని మళ్ళీ మామూలు మనిషిని చేసింది తన కవిత్వమే. అంతటి దిగులుని కాసింత తేలిక చేసింది కవిత్వమే.

“When you cannot fill the goblet of night with the nectar of life:
When you cannot taste the honey life offers you,
You cannot call it tragedy…
Tragedy is, when you write your life’s letter to your love and you
Yourself go and lose his address…”

***

అమృత జీవితాన్ని నాలుగు భాగాలుగా చూడాలనిపిస్తుంది నాకు- తన బాల్యం, పెళ్ళి, సాహిర్ ఇంకా ఇమ్రోజ్. నిశ్శబ్దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పంచుకోగల బంధం ఇమ్రోజ్ తో ఆమెకు ఉండింది. తను రాసుకున్న ఆటోబయోగ్రఫీలో మాత్రం ఆవిడ విభజించుకున్న నాలుగు భాగాలు వేరు-

మొదట్లో బోధిసత్వలా జీవితంలో ప్రతి క్షణాన్ని ఒక అద్భుతంలా చూశానంటారు అమృత. రెండో భాగంలో కాస్త తెలివి తెచ్చుకుని సమాజానికి ఎదురు తిరిగే ధైర్యాన్ని దిక్సూచిగా తలచి ముందుకెళ్ళానంటారు. మూడో భాగం వర్తమానాన్ని మర్చిపోయి, అవసరమైతే అంతం చేసుకుని, నచ్చిన భవిష్యత్తుని నిర్మించుకునే తెగింపు, కలల్ని అతి తేలిగ్గ కల్లలు చేసుకున్నా కూడా మళ్ళీ పేకాటలా
కార్డులు పరిచి ఆట మొదలుపెట్టే ధైర్యం, ఓడిపొయిన ప్రతిసారీ సరికొత్త ఆశ, అదృష్టం మీద అమితమైన నమ్మకం. చివరగా మిగిలిన భాగమంతా సెన్సాఫ్ ఐసొలేషన్!

1960 చివరలో సాహిర్ వల్ల కలిగిన బాధకు అమృత కు సైకియాట్రిక్ ట్రీట్ మెంట్ అవసరమైంది. అదే సమయంలో తన మానసిక స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నంలో సైకాలజీకి సంబంధించిన చాలా పుస్తకాలు చదివారామె!అలాంటి స్థితి లోకూడా ఒక కవితా పురస్కారం అందుకోడానికి నేపాల్ వెళ్ళింది. అక్కడి నుండీ, ఇమ్రోజ్ కి రాసిన ఒక కవితలో…

“Way farer! Why did you the first time meet me at an evening hour!
I am approaching the turning point of my life.
If you had to meet me at all why did you not meet me at high noon when
You would have felt its heat”

తరువాతి దశాబ్దం సాహితీపరంగా అమృతకు చాలా ఆక్టివ్ గా నడిచిన రోజులు- వివిధ దేశాలకి చెందిన రచయితలు, కవులతో తన పరిచయాన్ని, తను పాల్గొన్న కవి సమ్మేళనాల్ని ఎంతో ఇష్టంగా వివరిస్తారామె. ఉజ్బెకిస్తాన్ లోని ‘వెర్జాబ్’ అనే నదీతీరంలో తను పాల్గొన్న ఒక కార్యక్రమం గురించి వివరిస్తూ అందులో చదివిన కొన్ని కవితల్ని ప్రస్తావిస్తారు.

Because a drop of your love got mixed in my cup
I could drink the bitters of life…..
But now a great many more drops are mixed….
And life’s cup is a lot sweeter.

తన స్నేహితురాలైన జుల్ఫియా ఖానుమ్ గురించి చెప్తూ…

“When the tears are understood, the relationship deepens, does it not?”
When pen embraces paper, earlier silences are forgotten
Love reveals its secrets;
In Uzbek or in Punjabi, the rhyme is the same.”

తాష్కెంట్ లో అమృత అశువుగా చదివిన కొన్ని లైన్లు.

కొందరు బల్గేరియన్ కవుల కవితల్ని అనువదించారామె అలాంటి ఒక ‘ఇరాన్ వజోవ్’ కవిత-

My faith
That tomorrow
Life will be finer
Life will be wiser

My faith has strong armour
In my sturdy breast
And bullets that could shatter
My faith
Do not exist
Do not exist!

తన ‘రషీదీ టికెట్’ (Revenue Stamp) లో Ho Chi Minh వ్యక్తిత్వం ప్రభావం తన మీద ఎంత ఉందీ అనేదానికి ఉదాహరణ గా- ఆయనన్న మాటలు “మనిద్దరం పోరాడుతున్నాం, చెడ్డ విలువలతో- నువ్వు నీ కలంతో, నేను నా కత్తితో..” ఆయనకోసం Aashma రాశారావిడ.

క్వీన్ ఎలిజబెత్ సినిమానుండీ తను నేర్చుకున్న పాఠం “Your Majesty! Look a bit higher” అనే డైలాగ్ నుండీ అని చదివినప్పుడు, అరె నాక్కూడా ఇలానే అనిపించింది కదా అనుకున్నపుడు.. ఆమృత లాంటి రచయితలు ఇంకా దగ్గరవుతారు-
మనసుకు! ఎంత యాధృచ్ఛికమయినా కూడా!

In Silence Passion Smote అనే భాగంలో అంటారు- ఒక రచయిత జీవితంలోని చిన్న చిన్నముక్కలన్నీ కధల్లో కవితల్లో చేరిపోతాయని. ఆమె జీవితం అంతే. ఎన్నో మానవ సంబంధాల సమ్మేళనం. స్నేహానికి ప్రాణమిచ్చే మనిషి ఆమె.

సజ్జాద్ హైదర్ ఒక పాకిస్తాన్ రచయిత. అమృత సాహిర్ కోసమ్ వ్రాసిన ‘Seven Years’ చదివి, సజ్జాద్ ఆమెను కలవాలనుకుంటున్నట్లు తన ఉత్తరంలో రాసాడు.. అలా వారి స్నేహం మొదలైంది. దేశవిభజన సమయంలో, ఆయన అమృత కోసం కర్ఫ్యూ ఎత్తివేసినపుడల్లా ఢిల్లీ వచ్చెళ్ళేవారు.

ఒక రోజు అమృత కొడుకుకి జ్వరంగా ఉన్నపుడు, సజ్జాద్ తనకోసం ప్రార్థించి, ఒక ఉత్తరంలో రాస్తాడు- “రాత్రంతా నీ కొడుక్కి నయమైపోవాలని ప్రార్థిస్తూనే ఉన్నాను, అరబిక్ వాళ్ళ నమ్మకంలా, మనకోసం మన శత్రువు ప్రార్థిస్తే, ఆ ప్రార్థనను దేవుడు వెంటనే వింటాడట.”  అంతటి సామీప్యత ఉండేది వారిద్దరి స్నేహంలో.

“Buy me a pair of wings, stranger or come and live with me”

ప్రేమ మాత్రమే కాదు ఒక మంచి స్నేహం కూడా కవిత్వాన్ని సృష్టించగలదని అమృత రాసిన కొన్ని లైన్లు చదివితే అనిపిస్తుంది.

“When pen embraces page, earlier silence are forgotten
Love reveals its secrets”

ప్రేమ ఒక వాస్తవమా?వాస్తవమైన కల్పనా? లేక కల్పన అయిన వాస్తవమా? ఒక జీవిత కాలం సరిపోదేమో ఈ అన్వేషణకి! వెతికినంత మాత్రాన దొరకనిదీ, దొరికిన తరువాత మళ్ళీ వెతికే ప్రయత్నం చేయకుండా నిలిపేదీ ప్రేమ.

“Yeh mein hoon yeh tu hai, aur beech mein hai sapana” (This is me and that’s you and in the chasm is the dream)

ఒక జీవిత కాలమంత సాగిన తన ప్రేమాన్వేషణకి….ఇమ్రోజ్ ముగింపు. ఒక నిజమైన స్నేహితుడు, ఒక మనసుకి చేరువైన బంధం, స్వఛ్ఛమైన ప్రేమకి ప్రతిరూపం. ప్రతి మనిషి కోరుకునేది ఈ ప్రపంచంలో కనీసం ఒక్కరి దగ్గరైనా నేను నేనుగా ఎటువంటి ముసుగులు వేసుకోకుండా ఉండాలని, ఒక్కరైనా నన్ను నన్నుగా అంగీకరించాలని, నాకోసం ఒక అద్దంలా మిగలాలనీ.. ప్రతి మనిషికీ ఏదో ఒక సందర్భంలో ఇలా అనిపించినా చాలా కొద్దిమందికే ఆ అదృష్టం దక్కుతుంది. అమృతా ప్రీతమ్ కి ఇవన్నీ లభించింది ఇమ్రోజ్ వల్ల! అతను నీడలా ఆమెని అంటి పెట్టుకున్న వ్యక్తి. ఆమెని సంపూర్తిగా అంగీకరించి ప్రక్కన నిలబడిన వ్యక్తి.

ఒక ఇద్దరు పిల్లల తల్లి అయిన అమృతను, తనకంటే వయసులో చాలా పెద్దదైనా కూడా- మనస్పూర్తిగా ప్రేమించి జీవితమంతా తోడై నిలిచిన ప్రేమ అతడిది.ఇమ్రోజ్ ఒక ఆర్టిస్టు. అక్షరాలకి రంగులకీ మధ్య అల్లుకున్న అపురూపమైన బంధం అది.వారిమధ్య సాగిన ఉత్తరాలన్నీ సున్నితమైన భావాల బరువుతో నిండిపోయేవి. అంతే కాదు చాలా భిన్నమైన విషయాలమీద చర్చలు అభిప్రాయాలు కూడా మధ్యమధ్య చొరబడేవి.

ఇమ్రోజ్ కి సంబంధించినంత వరకూ అమృత చనిపోలేదు. ఒక ఇంటర్వ్యూ లో అతనంటాడు- “నేను బ్రతికి ఉండగా అమృత ఎలా చనిపోతుంది? ఎన్నో అందమైన క్షణాల్ని పంచుకున్నాం మేమిద్దరమూ, ఇంకా పంచుకుంటూనే ఉంటాం! నా ఉనికిలోనే అమృత జీవించి ఉంది”

***

అమృత- సాహిర్
కొంతమంది ఒక్క స్పర్శతో స్త్రీలోని పరిపూర్ణత్వానికి కారణమవుతారు.
అమృత- ఇమ్రోజ్
ఇంకొంతమంది స్పర్శించకనే, స్త్రీ తనలోని నిజమైన స్త్రీత్వాన్ని పునరావిష్కరించుకునేందుకు పునాది అవుతారు.
అమృత-
తన మరణం తరువాత- మిగిలిపోయిన యే అక్షరాల్లోనో, గుల్జార్ గొంతులోనో, స్పందించిన హృదయాల్లోనో మిగిలిపోయిన అమృత! అవును. మరికొంతమంది ఆమెని గుండెలో దాచుకుంటారు. తన పేరుకి అర్ధం తెలుసుకుంటారు.

ఈ మధ్య గుల్జార్ రిలీజ్ చేసిన ఒక ఆల్బమ్ లో, తన గొంతుతో అమృత కవితల్ని చదివారు. ఆయన మాటల్లో- “అమృతాజీ ఇరవయ్యో శతాబ్దమంతా, పంజాబీ కవిత్వపు పేజీలపైన ప్రయాణించారు, శతాబ్దాంతంలో మాత్రం, శరీరం క్షీణించిపోయినా, ఆత్మఒకప్పటికంటే ఉల్లాసంగా నడక ఆరంభించింది. జీవిత ప్రయాణం లో తన సహచరుడైన ఇమ్రొజ్ చేయి పట్టుకుని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, నడుస్తున్న ఆమె వెనక్కి తిరిగి “మళ్ళీ నిన్ను కలుస్తానన్నారట” (I will meet you again).

Mein tainu pher Milan gi (I will meet you yet again)

“ఎక్కడో ఎలాగో తెలీదు
నిన్నుమాత్రం కలుస్తాను

ఊహలోనో
కాన్వాసుమీదనుండి
నిన్నే చూసే
వివర్ణరేఖలోనో

నిల్చునో
విస్తరిస్తూనో

ఎలాగో తెలీదు
పొడ ఎండలా నీ వేళ్ళని తాకి
రంగుల్తో నన్ను నేను చిత్రించుకుంటూనో
స్నానమాడిన తుంపర ఒంటిని
చల్లటి వసంతమై తుడుచుకుంటూనో
వెచ్చటి నీ ఛాతిపై వాలిపోతూనో

ఈ దేహం ఉన్నంతసేపే
జీవితం నాతో నడుస్తుందని తెలుసు
ఉన్నంతలో జ్ఞాపకాల్ని
అల్లుతూపోవడమూ తెల్సు

గుర్తుల్ని యేరుకుంటూ,కుదురుగా అల్లుకుంటూ
ఎక్కడో ఎలాగో తెలీదు
నిన్నుమాత్రం కలుస్తాను
మళ్ళీ తప్పకుండా నిన్ను కలుసుకుంటాను

…. నదీవనంలో, సువిశాల మైదానంలో కురిసే పున్నమి వెన్నెల్ని, దోసిట్లో పట్టి చూపెట్టామంటే ఎలా సాధ్యం? అమృత గురించి ఎంత వ్రాయాలన్నా నా మటుకు నాకు అదే పరిస్థితి!.

**** (*) ****


అమృతా ప్రీతమ్ Imroz కి రాసిన ఉత్తరాలు:1.

ఇప్పుడెందుకు కలిసావు నన్ను?
ఇంత ఆలస్యంగా, ఈ సుర్యాస్తమయ వేళ
ఈ ప్రయాణం ముగిసిపోయే తరుణంలో!
నేను పయనమై వెళ్ళే సమయం దగ్గర పడినప్పుడు!
ఒకవేళ మన కలయిక విధి నిర్ణయమైతే,
అపరాహ్ణపు వేళలో నువ్వు తారసపడి ఉండాల్సింది.
వెచ్చని కిరణాల కింద జీవితాన్ని పరిచేందుకు…
(ఖాట్మండులో ఎవరో ఈ కవితని హిందీలో చదివారు).

మనసుకి కలిగే బాధని, దుఃఖాన్నీ మనుషులంతా ఒకేరకంగా అనుభవిస్తారుగా.భూమ్మీద ఎక్కడైనా ఎడబాటు రేపేబాధ ఒకటేగా! చల్లదనం నిండిపోయిన నా ఈ జీవనసంధ్యలో ఇక పెద్దగా ఎదురుచూడాల్సినవి ఏవీ లేవు- సూర్యకిరణాల్లాంటి నీ అక్షరాలు..నన్ను వెచ్చబెట్టుకునే ఆ పదాలు తప్ప!

ఎంతో క్రూరమైనవి కదూ బాంబే సిటీ కైవారాలు? నా సున్నితమైన భావాలన్నీ వాటికి తగిలి గాయపడినట్లు ఏదో భావన.
ఇప్పటికే పధ్నాలుగు సంవత్సరాలు ప్రవాసంలో గడిపాను, నా ప్రేమకి.. ప్రాణానికి… దూరంగా! వనవాసం అయిపోయినట్టు లేదు.మిగిలిన యేళ్ళు కూడా ఇలానే, ఇదే విరహంతోనే గడుస్తాయంటావా?

ఇన్నాళ్ళలో నీనుండి ఒకే ఒక్క ఉత్తరం వచ్చింది. నా ఖాట్మండు అడ్రెస్ మర్చిపోయావా? ప్రతిరోజూ నీ నుండి కనీసం ఒక్క పదమైనా వస్తుందేమో అని ఎదురుచూపులు! ఇక్కడి జనమంతా ఏవేవో చాలా చెప్తారు నా గురించి,నా రచనల గురించి, మనసుని తాకేలా…కానీ అదేంటో ఆ పొగడ్తలన్నీ నీ మీద నా విరహాన్నిఎక్కువచేసాయేగానీ తగ్గించలేదు.

నాకు నేను మిగుల్తానా? ఈ భావోద్వేగంలో, మోహంలో కాలిపోతూ , ఎంత కాలమని ఉండగలను? గత మూడు రోజుల్నించీ ఆత్రంగాఎదురు చూపులు….ఈ రోజేమో నిండా జ్వరం.నిన్నే ఖాట్మండు నుండి వచ్చాను, రాత్రి తొమ్మిది తరువాత! డైరెక్టు ఫ్లైటు దొరక్క, మధ్యలో ఇంకో విమానం మారాల్సి వచ్చింది. విపరీతమైన దాహంతో ఉన్నపుడు, ఒక్క నీటి చుక్కకోసం ఎలానో ఎదురుచూస్తాం కదా? చెప్పాలంటే నా పరిస్థితీ అదే! ఒకేఒక్క పదమైనా నీ నుండి వస్తుందని! ఇంత పొదుపు ఎప్పటినుండమ్మా…..నీ అక్షరాల్లో కూడా!

అదిగో…పోష్టుమాన్ వచ్చినట్టుంది. అడుగులు దగ్గరవుతున్నాయి..ఊహు! వెళ్ళిపోయాడు. నా తలుపు దగ్గర ఆగిన దాఖలాలేం లేవు. .ఒకసారి నాతో అన్నావు గుర్తుందా? నా ప్రశ్నలన్నింటికీ ‘నువ్వే’ జవాబు అని; మరి అలాంటి నాకు ‘జవాబు’గా మౌనం….?

01.02.1960

***

2.

ఏం చేస్తావ్ నువ్వు? నా పాటల్లో ప్రాణాన్ని నింపుతావు.

ఈరోజే నీ నుండి ఉత్తరం వచ్చింది. నా ఉత్తరాలకి జవాబులు వచ్చినందుకు, ఈ జీవితం అంటే
చాలా కృతజ్ణతగా ఉంది. కానీ ఇన్నాళ్ళు నా ఉత్తరాలన్నీ నీకు ఎందుకు చేరలేదు?
మనసంతా విషాదాన్ని నింపుకుని రాసిన అక్షరాలవన్నీ..

“నా జీవితపు
ఉత్తరం గాలికి కొట్టుకు పోతున్నప్పుడు, అది చేరాల్సిన మనిషి పేరుని, నా ప్రాణాధికమైన
పేరుని, నా రక్తంతో రాసి ఉన్న నీ పేరుని చదవడం విధికి చేతకాలేదు,

ఇప్పుడు ఆ పేరేదో తెలిసిపోయింది కానీ, పరిస్థితులన్నీ
విధితోనే చేతులు కలిపాయేమో, ఆ పేరుని వేరెవరూ చదవలేకపోతున్నారు.”

నేపాల్ లో టాగూర్ వ్రాసిన ఒక పాటని చదివానుః

“నువ్వే నా సాగరానివి , నా నావికుడవు కూడా నువ్వే.
నేనో పడవనైతే తీరం వైపు చూడటమెందుకట?
మునిగినా, అది నీలోనే !
నా సాగరంలోనే కదా!”

5.02.1960

***

These two letters are from the book ‘ In the times of Love and Longing – Amrita and Imroz’
A collection of letters exchanged between the most prominent Punjabi poet, essayist and novelist, Amrita
Pritam and Imroz – painter and artist.

**** (*) ***4 Responses to అమృత వర్షిణి

 1. అవినేని భాస్కర్
  August 2, 2017 at 4:27 pm

  అమృతా ప్రీతమ్ బయోగ్రఫీ అబ్రిడ్జ్‌డ్ వెర్షన్‌ని కవితగా రాస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది చదువుతుంటే!

 2. కె.కె. రామయ్య
  August 7, 2017 at 5:19 pm

  సంగీత సాహిత్య పరిజ్ఞానం లేకున్నా తన గానామృతంల్

 3. bhasker koorapati
  August 9, 2017 at 9:49 am

  సమీక్ష చాలా కవితాత్మకంగా ఉంది. ఒక గుక్కలో చదివింపజేశారు. అభినందనలు.
  సమీక్ష చదివిన మైకం నుండి ఇంకా తేరుకోలేకుండా ఉన్నాను. అమృత కవిత్వంలానే మీ సమీక్ష కూడా కట్టిపడేసింది.
  -భాస్కర్ కూరపాటి.

 4. chandra naga srinivasa rao desu
  August 26, 2017 at 5:37 pm

  అమృతప్రీతమ్ గారి జీవితం మరియు రచనల గురించి చక్కగా వివరించారు. అభినందనలు.

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)