నల్లూరి రుక్మిణి గారు కథా, నవలా రచయిత్రిగా అందరికీ సుపరిచుతులే. విరసం అధ్యక్షులుగా పనిచేసిన సి.ఎస్.ఆర్.ప్రసాద్ గారి సహచరిగా తానూ విరసం సభ్యురాలిగా వుంటూ తమ నలభై ఏళ్ళ సాహచర్యంలో ఇప్పటికీ గుంటూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలలో జరిగే ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాల కార్యక్రమాలలో మమేకమవుతూ వృత్తి రీత్యా న్యాయవాదిగా ఎంతో మంది పేదలు, మహిళలకు, కార్మికులకు సాయపడుతూ ఉద్యమాచరణతో, సాహిత్య కృషితో సాగుతున్న క్రమాన్ని మనతో ఇలా పంచుకున్నారు.. రుక్మిణి గారు ‘నర్రెంక సెట్టుకింద’ నవల, నెగడు పేరుతో కథా సంకలనం వెలువరించారు.
ఇప్పటి దినచర్య: ప్రాధమికంగా చదువుకోవడం, రాయాలనిపించినప్పుడు రాయడం, వృత్తి రీత్యా లాయర్ నికానీ అది కాలక్షేపానికే.
ఇప్పటి కాలక్షేపం: Physical activities, field acitivites, స్త్రీలపై జరిగే దాడులుపై fact finding teams తో పాలుపంచుకోవడం. ఇటీవల గుంటూరులో ఓ కార్పొరేట్ కాలేజీలో విదార్థిని మరణిస్తే అది ఆత్మహత్యగా మార్చడానికి చూస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులు అది ఆత్మ హత్య కాదని తమ ఆవేదనను చెబితే దానిపై ప్రజా సంఘాలతో నిజ నిర్థారణ కమిటీ వేసి వారికి మధ్ధతుగా నిలిచాం. ఇలా స్త్రీలపై జరిగే దాడులపై నా దృష్టికి వచ్చిన వాటిపై స్పందిస్తుంటా. ప్రజా సంఘాల ధర్నాలులో పాల్గొనడం. ఇలా నలబై ఏళ్ళుగా ఇదే కార్యాచరణలో వున్నాం. యిప్పటికీ ఇలానే వున్నాం.
రచన నేపథ్యం: నెగడు కథ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులపై రాసింది. పోలవరం ప్రాజెక్టు అక్కడి ఆదివాసీ జీవితాలలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుందో చెప్పడానికి ప్రయత్నించా. అలాగే సెజ్ మీద రాసిన కథ సామాన్యుల జీవితాలలో ఎటువంటి మార్పులు, వాటి వలన కలుగుతున్న సామాజిక మార్పులు గురించి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న సామాజిక, సాంస్కృతిక దాడిని కథలలో చెప్పే ప్రయత్నం చేస్తున్న.అభివృద్ధి క్రమాన్ని అర్థం చేసుకుని వచ్చే మార్పు రావాలి. కానీ ఇది పైనుంచి రుద్ద బడుతున్న మార్పు. ఇలా సామాన్యుల జీవితాలలో జరుగుతున్న అవాంచిత మార్పులను పుట్టు కురుపు కథ రాసాను. సివారు బతుకులు చాలా చిన్న కథ. beautification పేరుతో నగరంలోని పేదవారందరినీ స్వర్ణభారతి కాలనీలోకి నెట్టారు. ఇక్కడ రెండు రకాల జీవితాలు. ముందు పొద్దున్న పనికి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి వెళ్ళే వారు. ఇలా కాకుండా నగరానికి దూరంగా వీరంతా ఉండడంతో ఉదయం బయల్దేరి సాయంత్రం వస్తారు. పెద్ద పిల్లలు చదువుకు దూరం కావడం. లంపెన్ వాతావరణం అలముకుంది. పదో తరగతి పిల్లాడు తనకంటే చిన్నదైన అమ్మాయిని రేప్ చేసాడు. ఎందుకంటే తల్లి దండ్రుల సంరక్షణకు దూరం కావడంతో ఇంట్లో ఒంటరిగా టీవీ చూస్తూ పిల్లలు రక రకాల ప్రభావాలకు లోనవుతున్నారు. కానరాని హింస సివారు జీవితాలలో వుంటోంది. ఈ నేపథ్యాలలోంచి కథలు రాసాను. మధ్య తరగతి జీవితాలను గూర్చి చాలా చెప్పవచ్చు. కానీ నిర్వాసితులు, అణగారిన వర్గాల జీవితాలలోని హింసను రాస్తున్నాను. మధ్యతరగతి జీవితాల గురించి కొ.కు. వేల కథలు రాసారు. నేను పల్లెటూరి జీవితం నుంచి రావడం వలన, నలభై ఏళ్ళుగా upper middle class జీవితం అనుభవిస్తున్నా నాకు అణగారిన వర్గాల గురించి, వారి జీవితాలలో అనుభవిస్తున్న హింసను గురించి రాయడమే ఇష్టం.
ఇప్పటి కథల గురించి: కళ కళ కోసమే అన్నట్టు రాస్తున్న వాళ్ళు నేడు ఎక్కువగా కనిపిస్తున్నారు. వస్తు వైవిధ్యంతో వున్నాయనిపిస్తున్న కథలు కూడా చాలా వరకు పాత కథలే. బ్రహ్మాండంగా వున్నట్టు అనిపిస్తున్నా అవన్నీ వ్యవస్థతో రాజీపడుతూ వున్న వ్యవస్థను కాపాడడానికి రాస్తున్న కథలేనని నా అభిప్రాయం. ఈ వ్యవస్థ మారాలని కోరుకుంటున్న. దండకారణ్యంలో నేడు జనతన సర్కార్ ద్వారా వారి జీవితాలలో వస్తున్న సాంస్కృతిక సామాజిక మార్పులను నేడు అజ్నాతంలో వున్న రచయితలు చాలా వైవిధ్యంతో రాస్తున్నారు. ఇటీవల అరుణతారలో వచ్చిన ‘టీ గ్లాసు’ కథ ఉదాహరణ. బయటి వాళ్ళు మన కథలను అంగీకరించక పోవడానికి కారణం ఇప్పుడున్న వ్యవస్థను మార్చాలన్న దానికి అంగీకరించకపోవడమే. సామాన్య కథలు చదవడానికి బాగున్నట్టనిపించినా ముగింపు ఏ మార్పును ఆశించదు. కథ చదివితే మనలో ఒక urgeని create చేయాలి. చదివాక కథ మనల్ని వెంటాడాలి. ఇటీవల ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఉమామహేశ్వర రావు కథ Technology ని గురించి రాసింది. అది మనబోటి వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. కానీ సామాన్యులకు కాదు. గోర్కీ అమ్మ చదివితే అమ్మలా పనిచేయాలనిపిస్తుంది. అలా కథ కానీ నవల కానీ మనల్ని కార్యాచరణ వైపు పురికొల్పాలి. రచన పరమార్థం ఇది కావాలి.
స్త్రీవాదం గురించి: స్త్రీ వాదానికి పరిమితులున్నాయి. పురుషాధిపత్యం ఈ సమాజంలో అంతర్భాగం. ఇది వర్గ సంబంధాలలో కలిసే వుండే భాగం. దీనిని స్త్రీవాదులు accept చేయాలి. స్త్రీవాదం స్త్రీల దృక్కోణాన్ని ప్రపంచానికి తెలియ చేయడానికి ఉపకరించింది. కమ్యూనిస్టు పార్టీలు సమాజ మార్పును కోరుకున్నా మనల్ని మనం మార్చుకుంటూ సమాజాన్ని మార్చాలన్న క్రమాన్ని చాలా ఏళ్ళు తమ ఆచరణలో లేకపోవడాన్ని స్త్రీ దళిత వాదాలు బయటికి తీసుకు వచ్చి ప్రశ్నించాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ చాలా వరకు స్త్రీ వాద గ్రూపులు తమను తాము మార్చుకుంటూ సమాజాన్ని మార్చాలన్న ఉద్దేశ్యంతో వచ్చినవి కావు. పురుషాధిపత్య nature స్తీ వాద గ్రూపులలో వ్యక్తులలో egoistic గా వుండడం శోచనీయం. వీళ్ళలో anti Maoist approach తో పనిచేస్తు వున్న గ్రూపులున్నాయి. సమాజంతో రాజీ పడి బతుకుతూ బతకడం కోసమే మేము బయటికి వచ్చాం అన్నవి. సమాజంలో వస్తున్న మార్పును కనీసం చూడకుండా దాడే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. గ్లోబలైజేషన్ నేపధ్యం కమ్యూనిస్ట్ నేపధ్యం నుండి వస్తున్న వాళ్ళమీద కూడా వుంటోంది.
ఇటీవల రచనలు: 2011లో ఒక చేయి 2012లో ఒక చేయి ఆర్నెల్లపాటు విరిగి బాధపడ్డా. అందుకే 2012లో రెండే కథలు రాసాను. చర్ల నిజనిర్థారణ తరువాత ప్రవాహం తిరోగమించదు అన్న కథ రాసాను. కిషన్జీ చనిపోయిన నేపథ్యంలో ముంజేతులు ఖండించినా అన్న కథ రాసాను. 2012 డిసెంబరులో ‘కంపెనీ తిరునాళ్ళు’ అన్న కథ రాసాను. ఇది ప్రపంచ తెలుగు మహాసభల ముందు వచ్చి వుంటే బాగుణ్ణు. ఆంధ్రజ్యోతికి పంపించా. కానీ వారికి ఇలాంటి కథ వేసే ఉద్దేశ్యం లేదన్నది అర్థమయింది. అరుణతారకు పంపా. కార్పొరేట్ సెక్షన్ చేస్తున్న సాహిత్య సమావేశాలుపై రాసింది. ఆటా, తానా వంటి NRI సంస్థలు, రాంకీ వంటి కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారో అన్నది సబ్జెక్టు. మునుపు నాలుగైదు గ్రామాలు కలిసి జాతరలానో తిరునాళ్ళలోనో నిర్వహించి అనేక సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించేవి. అవి చాణ్ణాళ్ళపాటు నెమరు వేసుకునేవిగా వుండేవి. ఇప్పుడు వీళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఈ కళారూపాలను మొక్కుబడిగ నిర్వహిస్తూ తామేదో తెలుగు సాంస్కృతిక రంగానికి సేవ చేస్తున్నట్టు నటిస్తున్నాయి. సంస్కృతిని ఆకళింపు చేసుకోకపోతే culture ఎలా వుంటుందన్నది ఈ కథ, అరుణతారలో త్వరలో రావచ్చు.
ఇంటర్వ్యూ: కెక్యూబ్ వర్మ
నల్లూరి రుక్మిణిగారు నెగడు కథాసంకలనం కన్నా ముందు ‘గీతలకావల’ , ‘జీవనస్పర్శ’ కథాసంకలనాలు, ‘ప్రశ్నే ప్రశ్నార్థకమైన వేళ’ కవితా సంకలనం, ‘జ్ఞానం అందరిదీ’ వ్యాస సంకలనం, ఇటీవల ‘పరామర్శ’ -సాహిత్య విమర్శవ్యాసాల సంకలనం కూడా వేసారు.
రుక్మిణిగారూ,
మీ అభిప్రాయాలని చాలా స్పష్టంగా, ముసుగులూ, మొహమాటాలూ లేకుండా చెప్పారు. నేటి కథా సాహిత్యం గురించి మీరు చెప్పినదానితో నేను ఏకీభవిస్తున్నాను. స్త్రీవాదానికి అటువైపు మీరు చేసిన విమర్శలన్నీ, ప్రతి అస్తిత్వవాదానికీ ప్రారంభంలో వచ్చే సమస్యే అని అనుకుంటున్నాను. ఆ వాదం బలంగా నిలబడగలిగితే, కాలక్రమంలో అవి ఆ ఉద్యమస్ఫూర్తిని పూర్తిగా ఆకళింపు చేసుకోగలుగుతాయి. లేకపోతే వేసవి వానలా ఒక్కసారి వచ్చి వర్షించి పోతాయి.
మీ గురించి ఈ పత్రిక ద్వారానూ, వరలక్ష్మిగారిచ్చిన ఇతర వివరాలద్వారానూ పరిచయమవడం ఎంతో ముదావహం.
వర్మగారూ, మంచి పరిచయాన్ని అందించిన మీకు నా కృతజ్ఞతలూ, అభినందనలూ.