మనందరికీ కేవలం మనవే అనిపించే కొన్ని అభిరుచులూ, అనుభవాలూ, స్థలాలూ ఉంటాయి. అవి అర్థవంతమైనవీ, వ్యక్తిగతమైనవీనూ. ఒకప్పుడు వీటిని రాయొచ్చు, అందరితో పంచుకోవచ్చు అనే అవగాహన బహుతక్కువగా ఉండేది. నాకైతే దేశం విడిచి వచ్చిన తర్వాత కానీ నా అభిరుచులకు నేనివ్వాల్సిన విలువ అర్థం కాలేదు. స్వదేశంలో ఉన్నంతకాలం చదవడం మీద ఉన్న ఆసక్తి రాయడం మీద ఉన్నట్టు అస్సలు గుర్తులేదు. అసలు రాయడం అనేది మానవాతీతశక్తులు ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగేది అని నమ్మిన రోజులవి!
చిన్నప్పటి నించీ నేనూ పుస్తకాలు బానే చదివేదాన్ని… చందమామ, బాలమిత్ర, శరత్ సాహిత్యం, ఆంధ్రజ్యోతి, అంధ్రభూమిలో బొమ్మదేవర నాగకుమారి సీరియల్స్, యండమూరి నవల్సూ… ఇలా… సరిగ్గా ఇదే వరుసలో!!
చదువుతున్న కొద్దీ మనసులో మంచీ చెడ్డా బేరీజులూ, ఆలోచనల అలజడులూ ఎక్కువవుతూ ఉంటాయి. ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే, ఏదైనా గాఢమైన అనుభవంతో ముఖాముఖీ అవ్వగానే ఎవరితో అయినా పంచుకోవడం కోసం కాదు మన కోసం మనమే ఆ అనుభవాన్ని అక్షరాల్లోకి పెట్టాలనిపిస్తుంది.. అలా అనుభవాలూ, ఆలోచనలూ అనేక మలుపులూ తిరుగుతూ, కూడలులు దాటుకుని అక్షరాల రూపంలో బయటకొస్తాయి.. ఇహ అది ఏ స్థాయి కి చెందిన సాహిత్యం అనేది తర్వాత ప్రశ్న!
నా చిన్నప్పటి రోజుల్లో, అంటే వయసు ఖచ్చితంగా ఇదని ఇప్పుడు చెప్పలేను కానీ మనసూ, మమతా, వెన్నెలా, వేదనా లాంటి పదాలు అర్థమవుతున్న రోజుల్లో సినిమా పాటలూ, కవిత్వం కవల పిల్లలు.. మంచి ట్యూన్ వస్తే అది పాటవుతుంది లేదంటే అది పుస్తకాల్లో అచ్చవుతుంది అనేది నా అవగాహన!! అందుకే కవిత్వం అంటే ఖచ్చితంగా ప్రాస ఉండాలీ అనుకునేదాన్ని.. ఉదాహరణకి-
కోరీ.. ఊహల్లో దూరీ.. కళ్ళల్లో చేరీ
వలచి.. ఈ వేళ పిలిచి… దూరాన నిలిచి
అదే ఇన్స్పిరేషన్ తో స్కూల్లో పోటీల్లో అమ్మ, స్నేహం, దేశం ఇలాంటి అంశాల మీద ఎక్కడా ప్రాస చెదరకుండా నాలుగైదు పేజీల కవితలు రాయడం మొదలుపెట్టాను.
బాగా మనసులో నిలిచిపోయిన సందర్భం- ఐదో తరగతిలో అనుకుంటాను ఒకసారి నా బంగారు భవిష్యత్తుని నిర్ణయించే పరీక్షలేవో జరుగుతున్నాయని మా అమ్మానాన్నా నన్ను చదువుకోమని పక్కింట్లో మా అమ్మమ్మ దగ్గర వదిలేసి, తమ్ముడ్ని మాత్రం తీసుకుని సినిమాకి వెళ్ళినప్పుడు అర్థరాత్రి వరకూ మేలుకుని ‘ఒంటరి నక్షత్రం’ అనే కవిత రాసి, ఆ కాగితాన్ని రోజూ పొద్దున్న హోమ్ వర్క్ చెక్ చేసే మా అమ్మకి కనబడేలా పుస్తకంలో పెట్టాను. అది చదివి అమ్మకి సినిమాకి వెళ్ళలేని నా క్షోభ అర్థమై, చాటుగా కళ్ళు తుడుచుకుని, ఇంకెప్పుడూ నన్ను వదిలేసి వెళ్ళననే శపథం చేసుకుంటుందని నా పసి కళాత్మక హృదయం ఆశించింది.
మర్నాడు పొద్దున్నే మా అమ్మ అయితే ఆపకుండా చదివింది.. కాకపోతే అంతే ఏకాగ్రతతో మజ్జిగ కవ్వం తిరగేసి కొట్టింది కూడాను! అంతకు ముందు సంవత్సరం స్కూల్లో నేను రాసిన నాలుగు పేజీల ‘అమ్మ ‘ కవితకి నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఏమన్లేదు ఎందుకో!? పైగా ‘మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసినట్టు కనబడితే బడి మాన్పించి నాలుగిళ్లల్లో పాచిపనికి కుదురుస్తాను, జాగ్రత్త!’ అని బెదిరింపులు!
ఈ సంఘటన తల్చుకుంటే ఇప్పుడనిపిస్తుంది, నేను మిలినియల్ కిడ్ అయితే ఎంత బావుండేది అని. ఎందుకంటే అమ్మ ఫేస్‌బుక్ లో ఉండేది, నా కవితని ఆనందంగా ‘A philosophical poem by my 10yr old daughter’ అని షేర్ చేసుకునేది, వందలకొద్దీ లైక్‌లు తెచ్చుకునేది. ఆ ఆనందంతో నన్ను poetry workshop classes లో జాయిన్ చేసేది!!
ఇక ఊహ నించి బయటకొస్తే, నాకు సాహిత్యమంటే నాన్నే! చందమామ, బాలమిత్రలను ఏడో తరగతిలోనే శరత్ నీ, జిడ్డు కృష్ణమూర్తినీ చేతిలో పెట్టి ఏది నచ్చితే అది చదువుకో అన్నారు. పేరుకి అర్థం కూడా తెలీకుండా ‘బడదీదీ’ చదివాను అప్పుడు. ఆ తర్వాత ‘సంస్కరణ ‘ (ఎవరు రాశారో అస్సలు గుర్తు లేదు!) అనే నవల ఇచ్చారు.. అలా అని కావ్యాలూ, క్లాసిక్సూ లాంటివేవీ చదవలేదు! కానీ చదవడం అనే అనుభవాన్ని పరిచయం చేశారు.
కవిత్వం మీద ఆసక్తి, ఇష్టం మొదలైంది మాత్రం నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ, ఆకులో ఆకునై, మేరా కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై, లాంటి పద ప్రయోగాలు సినిమా పాటల్లో వినడం, ఆయా రచయితల ఇతర రచనలు అని వెదుక్కుంటూ పద్యాలూ, కావ్యాలూ కాకుండా కవిత్వం అనే ఒక ప్రక్రియ, దాని తీరుతెన్నులూ అనుకుంటూ అన్వేషించడం మొదలు పెట్టిన రోజుల్లోనే! శేషేంద్రశర్మ, రవీద్రుడూ, కృష్ణశాస్త్రీ, గాలి దుమారంలా అలజడి సృష్టించిన శ్రీ శ్రీ.. వీళ్ళే తొలినాళ్ళలో ఆరాధ్యదైవాలు. ఇవ్వాళ్టి రోజున, కొన్ని వందలసార్లు వినేసిన తర్వాత, తిలక్ ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు ‘ అన్న భావం మామూలై పోయి ఉండొచ్చుగానీ అది మొట్టమొదటిసారి విన్న క్షణంలో నా మనసు లోనైన భావావేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేను!
స్వదేశంలో ఎక్కువగా రాయలేదు. రాసే అవకాశం కూడా ఉండేది కాదు. ఎందుకంటే తొంభైల్లో ఆంధ్రదేశం లో ఒక పెద్ద ఉద్యమం జరుగుతున్న రోజులవి. ఇంటింటికో ఇంజనీరూ, డాక్టర్‌ని తయారుచేసే ఉద్యమం. అందులో అమ్మానాన్నలు చాలా చురుకుగా పాల్గొనడం వల్ల చదువు తప్ప ఇతరత్రా వేటినీ దగ్గరికి రానీయలేదు!
***
చదువులు ముగిసి జీవితం తిప్పిన మలుపులో భాగంగా దేశాన్ని వదిలి రావాల్సి వచ్చింది! అమెరికా జీవితంలో, ఇంటర్నెట్ జీవితంలొ ప్రధాన పాత్ర వహించడం మొదలుపెట్టాక, మూలాల కోసం వెదుక్కోవడంలో భాగంగా తెలుగు గ్రూపుల్లో చురుకుగా పాల్గొనడం ఎక్కువయింది. అలా ఆ గ్రూపుల్లో లైక్ మైండెడ్ వ్యక్తులు తారసపడటంతో కవిత్వం మీద మళ్ళీ ఆసక్తి మొదలైంది. ఎంతోమంది వర్ధమాన కవులూ, కవయిత్రుల పరిచయాలూ.. కవిత్వంమీద చర్చలతో తెలీకుండానే కవిత్వం జీవితంలో ఎప్పుడు ముఖ్యభాగం అయిందో గమనించనే లేదు! అలా తెలీకుండానే ఒకటీ రెండూ అంటూ మొదలిపెట్టి తెలుగుజ్యోతి, పొద్దు, కౌముది, వాకిలి, సారంగ వంటి అంతర్జాల పత్రికలకు కవితలు పంపడమూ, అప్పుడప్పుడు పోటీలలో బహుమతులు తెచ్చుకోవడంతో కవిత్వం అస్తిత్వమై నాలో నిండిపోయింది. నా అక్షరాలు నన్ను దాటి నలుగురినీ చేరుకుని అమోదం పొందడంతో పాటు విలువైన సలహాలు నిరంతరం పొందడం కూడా ఒక ముఖ్య విషయం!
అమోదమూ, సలహాలూ అంటే ఇక్కడ ముఖ్యంగా ఇద్దరి గురించి చెప్పాలి.
అంతర్జాలంలో కవిత్వం చదవడం, రాయడం మొదలుపెట్టిన కొత్తల్లో పరిచయమైన కొత్త కవిత్వ తత్వం, ఇస్మాయిల్ గారి నిశ్శబ్ద కవిత్వం! ఆ తత్వాన్ని ఆస్వాదించడం మొదలుపెడుతూనే తారసపడిన వర్ధమాన కవి యదుకుల భూషణ్ గారు. ఇస్మాయిల్ గారి శిష్యులు, అభిమాని! భావాన్ని వ్యక్తపరచడంలో ఎటువంటి దీర్ఘాన్నీ, ఆడంబరాన్నీ ఇష్టపడని కవి. ఆయన కవిత ఒకటి నన్ను ఎంతో ఆకట్టుకుంది.
గతం
నల్లని రాతిమెట్లు
అల్లుకున్నవి లతలు పూలు
చతికిలబడటానికే తప్ప నిన్నెటూ తీసికెళ్ళలేవు!
గతాన్ని రాతిమెట్లుతో పోల్చడం, అది కాసేపు సేద తీరడానికే తప్ప ముందుకి తీసుకెళ్ళడానికి పనికిరాదని చెప్పడం అద్భుతం! అలా భూషణ్ గారి కవిత్వాన్ని, ఆయన ఇతర వర్ధమాన కవుల కవిత్వాన్ని విశ్లేషించే విధానాన్ని పరిశీలించడం మొదలుపెట్టాను. అప్పుడు అర్థం ఏంటంటే మాలాంటి ఒకటీ అరా రాస్తున్న వారికి ఆయన ఏదైనా కవితని మెచ్చుకోవడం అంటే ఐఐటీ ఎంట్రెన్స్‌లో మొదటి ప్రయత్నంలోనే కోరుకున్న బ్రాంచ్‌లో సీటు రావడం వంటిది!
ఆ తర్వాత నన్ను ప్రభావితం చేసినవారు అఫ్సర్ గారు, నా గురువుగారు! ఆయన వర్ధమాన కవులందరికీ డొక్కా సీతమ్మ లాంటి వారు. అంటే, ఆవిడ ఏ సమయంలో వచ్చినా అతిథులకి అన్నం పెట్టేవారు. ఈయన ఎవరికైనా రెండు మూడు ముక్కలు రాయడం వచ్చు అని తెలిస్తే చాలు ఆయన బడిలో చేర్చేసుకుని నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటారు! ఆయన నాకు ఇచ్చిన అమూల్యమైన సలహా, “కొన్ని పదాలూ చిత్రాలూ కలిస్తేనే కవిత్వమైపోదు. వాటి మధ్య ఇంకేదో వినిపించాలి కనీసం వొక కూనిరాగం లాంటి గుండెచప్పుడు. వినిపించాక, అది నిస్సహాయపు మూలుగు కావచ్చు, చీకటి చివరి వెలుగు అయినా కావచ్చు. ఎదో వొకటి మాత్రం నువ్వే వినిపించగలిగిన శబ్దాలు కొన్ని వున్నాయి. అవి వినిపించకుండా వెళ్ళిపోకు.”
***
స్వతహాగా హిందీ భాష మీద ఇష్టం ఉండటంతో పాటలూ, కవిత్వమూ చదువుతూనే ఉన్నా కానీ అనువాదాలు చేయడానికి ముఖ్య కారణం ఒకరోజు రేడియోలో విన్న ఒక కథ!
ఒక రోజు మధ్యాహ్నం డాక్టర్స్ ఆఫీస్‌కి ఆగమేఘాల మీద వెళ్తూ, కార్లో రేడియో చానెల్స్ మారుస్తుంటే ఉన్నట్టుండి ఒకమ్మాయి గొంతు వినిపించింది, ఏదో చదువుతున్నట్టు. ఖచ్చితంగా న్యూస్ మాత్రం కాదని రెండు సెకన్లకే అర్థమైపోయింది. తన గొంతు తప్ప ఇంకేమీ వినబడని స్వచ్ఛమైన వైట్ నాయిస్ అది!
“…I don’t watch telenovelas. I hate drama. That’s why I live in Doral. (In Doral, the most dramatic thing that happens is golf.) But. When my mother calls to tell me about the filming, I say, “I’m coming!”
అది ఒకమ్మాయి — తన పేరెంట్స్ ఉండే నెయిబర్‌హుడ్‌లో జరుగుతున్న ఒక టివిసీరియల్ షూటింగ్ గురించీ, అక్కడ నివసించే మనుషుల గురించీ, ఆ సమయంలోనే కొడుకుని ఆల్మోస్ట్ నీళ్ళల్లో ముంచేసి చంపేయబోయిన ఒక అబ్యూసివ్ తండ్రి గురించీ, దాని గురించి పెద్దగా పట్టించుకోని పోలీసుల గురించీ… చెప్తున్న కథ!
“… I know the camera only sees what it wants. But, I keep trying to look outside the frame, to catch sight of the crowd watching from across the street. I want to see myself, living outside the drama.
But I can’t…”
ఇలా ముగిసేవరకూ నేను రియలైజ్ అవనే లేదు, నేను డాక్టర్స్ ఆఫీస్‌కి వచ్చేసి, పార్క్ కూడా చేసేసి, కదలకుండా ఆ కథ వింటున్నానని, అందులో పూర్తిగా మునిగిపోయానని! ఆ కథల్లో వాళ్ళ హృదయం ఉంది, నిజాయితీ ఉంది! ఒక భాషలోని భావాల్నీ ఆ వ్యక్తుల అనుభవాల్నీ యథాతథంగా వేరే భాషలో చెప్పగలగడం వల్ల ఎంతమంది భిన్న వ్యక్తులని ఏకం చేస్తుందో కదా అనిపించింది!
అప్పుడే అనిపించింది, నాకు తెలిసిన హిందీ భాషలోని మంచి కవితలని తెలుగులోకి ఎందుకు అనువాదం చేయకూడదని. మెల్లగా బ్లాగులో గుల్జార్ కవితలు రెండు మూడూ అనువాదం చేశాను.. అఫ్సర్ గారి ప్రోత్సాహం వల్ల సారంగలో గుల్జార్ అనువాదాల మీద ఒక సిరీస్ లాంటిది రాయగలిగాను.
చిన్న ఉదాహరణ-
Sketch
Yaad Hai Ik Din?
Mere Maze Par Baithe Baithe
Cigartte Ki Dibiya Par Tumne
Chhote Se Ek Paudhe Ka
Ek Sketch Banaya ThaAakar Dekho,
Us Paudhe Par Phool Aaya Hai!చిత్రం
గుర్తుందా ఒకరోజు?
నా బల్ల మీద కూర్చున్నప్పుడు
సిగరెట్ డబ్బా మీద నువ్వు
చిన్న మొక్కలాంటి
ఒక చిత్రాన్ని గీశావువచ్చి చూడు,
ఆ మొక్కకి ఇప్పుడు పూలు పూస్తున్నాయి!
గుల్జార్ కవితలతో పాటు ఇప్పుడు అమృతా ప్రీతం (ఈమె ఇప్పటి పాకిస్తాన్ లో పుట్టిన పంజాబీ కవయిత్రి) కవితలని అనువాదం చేయాలని ఆలోచన. వీలైనంత వరకూ వీలు చేసుకుని కవిత్వంతో సమయం గడపాలని ఉంది.
వచనం చదవడం ఇష్టం. కవిత్వం రాయడం ఇష్టం. కవిత్వంతో అయితే చాలా చెప్తూనే ఏవీ చెప్పలేదన్న లేక అసలేం చెప్తున్నామోననే సందేహావస్థ కలిగే భావన తెప్పించవచ్చు. నాకు అది చాలా ఇష్టం! వచనంతో అలా కుదరదు. మనసులో కార్నర్స్ ని ఫ్లడ్‌లైట్ వెలుతురులో పెట్టి చూపిస్తున్నట్టనిపిస్తుంది.కానీ ఏ బద్దకపు మధ్యాహ్నమో, ముసురుపట్టి కాలు బయటపెట్టనివ్వని ఉదయాలలో ఏమన్నా చదవాలనిపిస్తే ఖచ్చితంగా అది వచనమే అయి ఉంటుంది.
అనుభూతీ, ఆలోచనల మిశ్రమమా కవిత్వమంటే? సరిగ్గా తెలీదు కానీ, ఏం చెప్తున్నానో తెలీకుండానే అంతా చెప్పేసుకుని, బరువు దించేసుకున్న ఒక పక్షీక లాంటి తేలికతనం కవిత్వం ఇస్తుంది నాకు.. సమూహంలో అప్పుడప్పుడg అత్యంత అవసరమయ్యే ఏకాకితనం కూడా కవిత్వం వల్లనే దొరుకుతుంది!
ఎంతకాలం ఎన్ని రాయగలనో తెలీదు కానీ రాసిన, రాయబోయే నా నాలుగక్షరాలు మాత్రం తిలక్ తాలూకు వెన్నెల్లో ఆడుకుంటున్న ఆడపిల్లల కాలి మువ్వలుగానో, జడలో తురుముకున్న జాజులుగానో మిగిలిపోవాలని నా ఆకాంక్ష!!
**** (*) ****
(’10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’లో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం.)
చక్కగా చెప్పారు madam
======
Reddy
కవిత్వం రాయడానికి గల కారణాలు బహుశా అందరిలోనూ ఇలాగే వుంటాయి కాబోలు..మీరన్నట్లుగానే..కొంత వరకు చదివిన వాటి మీద, లేదా చూసిన వాటి మీద “మనదైన” స్పందన..కవిత్వం గా రాసుకున్నప్పుడు కలిగే వొక తృప్తికి మించినది మరేదీ లేదన్న భావన .వలన దాని మీద ప్రేమ(ప్యాషన్) పెరుగుతుందని.
చాలా బాగా చెప్పారు కిరణ్ గారు..
Mee Akansha neravyralini korukontuna friend Bestwishes keepit kiranji Guljar & Amruthapritham Anuvadhallu koraku Eduruchustuna!
విషయాలు కవిత్వికరించి, చెప్పిన విధానం బాగుంది,ప్రపంచ మొక పద్మవ్యూహం ,కవిత్వ మొక తీరని దాహం అన్న శ్రీశ్రీ వాక్యాలెంతో సహజాకర్షణకు ,తగ్గని వన్నె కు కవిత్వం పట్ల కొనసాగింపుగా అనుకోవచ్చు