వ్యాసాలు

తెలుగు కథలు, స.ప.స.లు

నవంబర్ 2017

తెలుగులో మంచికథలు రావట్లేదని ఈమధ్య తరచుగా వింటున్నాం, చదువుతున్నాం. అయితే, ఈ “మంచి” అన్న విశేషణం గూర్చి పెద్దగా చర్చ జరగలేదు. పైగా, “మంచికథలు రావట్లేదు” అని మొదలయ్యే వ్యాసాలు రెండో వాక్యంలోనే చెహోవ్ ఇలా అన్నాడనో, లేదా గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ అలా అన్నాడనో తరచుగా చూస్తుంటాం కూడా. ఈ వ్యాసకర్తలకు సాటి తెలుగువాళ్లు గానీ లేక భారతీయులు గానీ మంచికథ గూర్చి ఏమన్నారో తెలియదో లేక తెలుసుకోవాలని అనిపించదో అర్థంకాని విషయం. అయితే, తెలుగులో మూసకథలు కొల్లలుగా వస్తున్నాయనేది మాత్రం పత్రికలే ఒప్పుకునే విషయం. ఆ మధ్య ఆంధ్రభూమి కథలపోటీని నిర్వహిస్తూ, “మాకు మూసకథలు వద్దు!” అని స్పష్టంగా చెప్పినా చివరికి బహుమతికి ఎంపిక అయినవి అవే. ఆ పత్రికా సంపాదకులు అందరికీ తెలుసు గదా అనుకుని “మూసకథ”కు నిర్వచనాన్ని ఇవ్వకపోవడం ఇందుకు కారణం కావచ్చు.

“మూసకథ” అంటే స-ప-స కథ అనేది నా నిర్వచనం. సంగీతంతో పరిచయం ఉన్నవాళ్లకు ఆ మూడూ స్వరాలతో ముడిపడి ఉన్నాయని తెలుసు. ప్రస్తుతం అసంఖ్యాకంగా వెలువడుతున్న కథల్లో కనబడేవి, సమస్య-పరిష్కారం-సందేశం కథలు. సంగీతంలో పంచమం లేకుండా రాగాలున్నాయి. అలాగే పై షడ్జమం లేకుండా కూడా రాగాలున్నాయి. కానీ, సమస్యో, లేక సందేశమో లేని కథలు పత్రికల్లో దాదాపు కనిపించట్లేదనే చెప్పచ్చు. కొన్ని కథలు పేర్లల్లోనే చెప్పేసి చదవాల్సిన బాధనుంచీ తప్పిస్తాయి. ఉదాహరణకి, “అమ్మకో బహుమతి,” “అమ్మా నన్ను క్షమించవూ?” ఈ కథల్లో సామాజిక సమస్యలు అగ్రభాగాన్ని ఆక్రమిస్తాయనేది నేను గమనించిన విషయం. అవి బి.టి. వంకాయలు కావచ్చు, సరోగసీ కావచ్చు, ప్రపంచీకరణ కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, అమెరికా వెళ్ళిపోయిన పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోకపోవడం కావచ్చు, సునామీ కావచ్చు, అంతమైపోతున్న కులవృత్తులు కావచ్చు. అది డాలర్ల వెంట పరుగెత్తడం కూడా కావచ్చు. తమాషా ఏమిటంటే, క్రితం శతాబ్దంలో మొదటిసగంలో భారతీయులు రంగూన్ వెళ్లివచ్చారు. అంతకు ముందర ఇంగ్లండ్ వెళ్లివచ్చారు. కానీ, అమెరికాకు వెళ్లడంలో ప్రత్యేకత ఏమిటంటే అది మాత్రం డాలర్ల వెంట పరుగెత్తడం అని రచయితలూ రచయిత్రులూ నిర్ధారించేశారు. ఇంగ్లండ్ వెళ్ళిన వాళ్ల గూర్చి పౌండ్ల వెనక పరుగెత్తుతున్నారని రాయకపోవడానికి పాపం అప్పటికి తెలుగులో కథ అనేది పూర్తిగా రూపాన్ని దిద్దుకోలేదు. దీన్ని గూర్చి రాసిన, రాస్తున్న ఈ నాటి రచయితలు గనుక ఆనాడు ఉండివుంటే తెలుగు కథలు ఎలా ఉండేవోనని తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. రంగూన్ వెళ్లి తిరిగి వచ్చిన పాత్రలు సినిమాల్లో బానే వచ్చాయి కదా! కథల్లో కూడా వచ్చాయేమో నాకు తెలియదు. మీ కెవరికయినా తెలుసా? రాలేదని మీరు అనేటట్లయితే అది ఆ కాలపు రచయితలకు ఎందుకు వస్తువు కాలేదంటారు?

ఈనాడు కథల్లో కనబడే వివక్షగూర్చి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కథల్లో వివక్ష ఉండవచ్చు గానీ, ఒక్క వివక్షని చూపించడానికి మాత్రమే కథలు రాస్తే అవి కంకాళానికి తోలు కప్పినట్లు తయారవుతాయని నా అభిప్రాయం. వివక్ష అనగానే సందేశాత్మకం అని వెంటనే అర్థమవుతుంది కూడా. వివక్షని భాగంగా మాత్రమే చూపించే కథలు ఈ మధ్య కాలంలో నాకు స.వెం. రమేశ్ గారి “కతల గంప” సంకలనంలో కనిపించాయి. విశాలమయిన వర్ణ చిత్రాలలో సంఘర్షణలని, క్షోభపడే వ్యక్తులని, చిరకాలంగా చిత్రిస్తూనే ఉన్నారు. అవి కళాఖండాలయినవి ఆ వర్ణచిత్రాల నియమాలని పాటించడంవల్లే. అంటే ఆ చిత్రాలు చూసేవాళ్ళకు ఎలా కనిపిస్తాయి అని చిత్రకారులు ఆలోచించడం వల్ల. అలాగే, కథలో కూడా కథనమూ, భాష, పాత్రల ఔచిత్యమూ ముఖ్యం. రమేశ్ గారిలాగా అద్భుతమయిన వర్ణనలనీ, వాడి వాడి వడలిపోయిన వాటిని గాక తనకే స్వంతమయిన ఉపమానాలని రచయిత సృష్టించగలిగితే అది పాఠకునికి అదనపు బోనస్.

మనం సమాజంలో భాగమయి నందువల్ల అందులో కనిపించే సంఘటనలూ, అస్తిత్వమూ రచనకు ప్రేరణ కావచ్చు. ఉదాహరణకి, కేతు విశ్వనాథ రెడ్డి గారి కథ ‘రెక్కలు’. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారని తెలిసిందే. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకి పోలింగ్ బూత్ ల దగ్గర డ్యూటీ పడేదని కూడా వినేవుంటారు. ఈ కథలో అలాంటి డ్యూటీకి ఒక సహోద్యోగితో కలిసి కథకుడు లారీలో వెడుతుంటే అదే చోటికి వెళ్లే వయసులో వున్న ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా దానిలో ఎక్కుతారు. వాళ్ళకి కథకుడు వెడుతున్న పోలింగ్ బూత్ లోనే డ్యూటీ. చేరిన చిన్న ఊళ్లో చిన్న బడిలో వాళ్ల బస. మరునాటి పొద్దున్న ఎన్నికలు. రాత్రిపూట చీకట్లో కథకుడి సహోద్యోగి ఒక కానిస్టేబుల్ మీద మక్కువని ప్రకటించబోతాడు. ఇది కల్పితంకాదని తేలిగ్గా నమ్మవచ్చు. అయితే, ఆ ఉపాధ్యాయ వృత్తిలో లేనివాళ్ళకి ఈ కథ రాసే అవకాశం లేదు.

అలాగే ఇంకో అస్తిత్వం కథ వేంపల్లె షరీఫ్ రాసిన “తలుగు”. ఆయన తప్ప ఇంకెవరూ ఆ అంశాన్ని ముట్టలేరనిపిస్తుంది.

అనిల్ ఎస్. రాయల్ కథ “శిక్ష” కూడా సమాజపు రీతుల్ని వాడుకున్నదే. ఆసక్తికరమయిన కథనంతో పాఠకుణ్ణి ఆసాంతమూ చదివిస్తుంది.

యాభయ్యవ దశకంలో కథలు సమాజాన్ని ఉద్ధరించడానికే రాయాలి, సమాజాన్ని ప్రభావితం చెయ్యాలి, సమాజంలోని కుళ్లుని ఎండగట్టాలి, రచయితలకి బాధ్యత ఉండాలి అనడం మొదలయిందని బుచ్చిబాబుగారి కథలవల్ల తెలుస్తుంది. ఒక కథలో ఆయన దాన్ని స్పష్టంగా పేర్కొంటారు. ఈనాడు కథాంశానికే తప్ప కథనానికి పెద్దగా చోటులేదని అనిపిస్తోంది. కథల పోటీల్లో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన వాటిలోనే కాక గెలుపొందినవాటిల్లో కూడా ఈ తత్త్వం స్పష్టంగా కనిపిస్తుంది. వీటిలో సందేశం ప్రధానం. ఇవి స-స ల కథలు – అంటే, సమస్య-సందేశం కథలన్నమాట. ఈ రెండు స్వరాలే ఉన్న ఒక రాగం గానీ ఒక పాటగానీ మీకేమయినా తెలుసా?

పరిష్కారం చూపించని కథలు లేకపోలేదు.

అయితే, ఈ పరిష్కారం చూపించేది ఎవరికోసం అన్న ప్రశ్న తలెత్తుతుంది. కథకి ముగింపు నివ్వడానికి మాత్రమే చూపే పరిష్కారాలకి ఊతనిచ్చేది సమస్యే. సమస్యతో మొదలయిన కథ పరిష్కారంకోసం దేవుళ్ళాడుతూనే వుంటుంది. అలాగని కథల్లో ఇచ్చిన సలహాలని పాటించిన వాళ్లెవరూ నాకు తెలియదు.

భారతీయ భాషల కథలన్నింటిలో ఈ స-ప-స ల స్వైరవిహారం వున్నదా లేక ఇది తెలుగు భాషకే ప్రత్యేకమా? తెలుగులోకి తర్జుమా చేసిన కొన్ని కథలని చదివాను గానీ వాటిలో నాకు ఇవి కనిపించలేదు. అయితే, ప్రచురింపబడ్డ వాటిలో చాలా తక్కువ శాతం వేరే భాషల్లోకి అనువదింపబడతాయి గనుక ఆ ప్రశ్నకి జవాబు చెప్పడానికి నా శాంపిల్ సైజు సరిపోదు. అందుకని అడుగుతున్నాను.

అసలు కథలెందుకు సమస్యలని తలకెత్తుకోవాలి? వాటికి పరిష్కారాల నెందుకు చూపాలి? వాటిలో సందేశాన్ని ఎందుకు ఇమడ్చాలి? ఉత్త స-స తోనే కాదు రాగాన్ని సృష్టించలేమనీ, మెలోడీని తయారుచెయ్యలేమని తెలిసేది. స-ప-స తో కూడా అవి సాధ్యం కాదు. ఆ మూడు స్వరాలలోనే ఎంత కొట్టుకున్నా మెలోడీని తయారు చెయ్యలేం. కనీసం ఐదు స్వరాలు కావాలి. స్వర్గీయ బాలమురళి గారు నాలుగు స్వరాలతోనే సృష్టించిన రాగాలని ఒప్పుకున్నా గానీ, నాలుగు స్వరాలు కావాలి. వాటిల్లో పై షడ్జమం ఉండదు.

ఆ మూడూ లేకుండా రాసిన ఎంతోమంది పాత కాలపు మేటి రచయితలని పక్కన పెడితే, ఈ మధ్య నాకు కొన్ని కథలు దొరికాయి. తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారివి. జై, నలుపెరుపు, గారడీ, ఆర్వీ చారి కరెంటు బిల్లు. ఇంకొక కథ నెమలీకలో సందేశ మున్నది గానీ అది ఆనందపరచేది. ఇంటి కెదురుగా ఉన్న చెట్టుని పట్టించుకోకుండా దాని పక్క నుంచే వెడుతుంటే ఎదురింటి వాళ్లు మనకు దాన్ని గూర్చి చెప్పడం లాంటిది. పొత్తూరి విజయలక్ష్మి గారి ఏలినవారి దివ్య సముఖమునకు అన్న కథ సామాజికమూ, తప్పక చదవవలసినది కూడా. హాస్యాన్ని కలిపిన వ్యంగ్యం నషాళాని కంటుతుంది. అలాగే, కె.ఎన్. మల్లీశ్వరి గారి కథ శతపత్ర సుందరి కథ చదివినప్పుడు నాకు అది సార్వజనీనమూ, సార్వకాలీనమూ అనిపించింది.

పత్రికలు నిర్వహించే కథల పోటీల్లో ఈ స-ప-స కథలకే అగ్ర తాంబూలం దొరుకుతున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి కథల నుంచి విముక్తి కలిగే అవకాశాలున్నాయా అని అనుమానం వస్తూంటుంది. అలాంటి కథలకే బహుమతులు వస్తాయి అని రచయితలు నిర్ణయించుకోవడం వల్ల అది జరుగుతోందా లేకపోతే సందేశమే ముఖ్యం అని పత్రికలు నిర్ణయించుకోవడం వల్లనా?

దాదాపు అరవయ్యేళ్లకు పైగా “కథలకు సామాజిక ప్రయోజనం ముఖ్యం” అనే నేపథ్యంలో ఈ స.ప.స.ల నుండి తెలుగు కథకి విముక్తి సాధ్యమా? ప్రపంచంలో ఏ సమాజమూ ఒక కథవల్లో ఒక నవలవల్లో మారిన దాఖలాలే లేనప్పుడు తెలుగు రచయితలు ఇంకా స.ప.స.లని పట్టుకుని వేళ్ళాడడం సమంజసమా? సంగీతంలో షడ్జమం లేని రాగాలే లేకపోవచ్చు. కానీ, స.ప.స.లు లేని కథలు పాత తరాల రచయితలవి కోకొల్లలు. ఈ తరంలో అలాంటి వాటిని దుర్భిణీ వేసి పట్టుకోవలసి వస్తోంది. లేకపోతే, అమ్మకు పుట్టిన ఆరుగురూ సంగీత పాఠకులు కారన్నట్టు, అరవై, డెభ్భై దశకాలు గొప్పవి, అప్పటిలాగా ఎప్పుడూ కథలు ఎలా వుంటాయి అని సర్దుకుపోవాలా?

**** (*) ****

(’10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’లో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం.)