డైరీ

తుఫాన్

డిసెంబర్ 2017

అందమైన పచ్చిక బయళ్ళు, నెమ్మదిగా వీస్తున్న గాలి, చిరుచిరుగా కదులుతున్న చెట్లు- అంతా ఎప్పటిలానే వుంది. వీధుల్లో జనసంచారం మాత్రం క్రమంగా పలచబడుతోంది. ఆకతాయి పిల్లల్లాంటి పెద్దలు కొందరు ఒడ్డున తచ్చాడుతున్నారు. అమాయకంగా ప్రశాంతంగా అలలు రేపుతున్న ఆ సముద్రాన్ని కెమెరాలలో బంధించప్రయత్నిస్తున్నారు.

వాతావరణ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. వందల మైళ్ళ వేగంతో, ఇరవై అడుగుల ఎత్తులో, ఆపైన విజృంభించిన అలలతో ఆమె వెల్లువై వచ్చి పడితే – మూడు అంతస్తుల ఇళ్ళు కూడా చెల్లాచెదురై పోతాయని మరీ మరీ చెపుతున్నారు. ఎత్తుని, వేగాన్ని, గమ్యాన్ని, అంచనా కట్టి అప్పటికే ఆమె వచ్చే దారిలో ధ్వంసం కాబడిన దీవుల వివరాలు చూపించి మరింత భయపెడుతున్నారు. కాసింత పడమర దిశకే మరులుతుందో, చివరాఖరి క్షణంలో పూర్తి దక్షిణానికే ముప్పో తెలియని అయోమయం వాళ్ళది. వారి అవగాహనకి అందని చంచలత్వం ఆమెది.

“పోగొట్టుకున్న వస్తువులు తీరిగి అమర్చుకోవచ్చు. కూలిన ఇల్లు తిరిగి కట్టుకోవచ్చు. మీ ఆప్తులని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబాన్ని ప్రేమించే  ఓ తండ్రిగా, తాతగా చెపుతున్నాను నా మాట విని సురక్షిత ప్రదేశాలకి వెళ్ళిపోండి”. వారం రోజులకి పైగా రాష్ట్రప్రతినిధి ప్రసారం చేసిన విన్నపాలు ఇంకా గాలిలో తిరుగాడుతూనేవున్నాయి.

ఊరొదిలి రహదారుల పైన బార్లు కట్టి తరలిపోతున్న వాహనాలు ప్రసారమాధ్యమాలలో చూసేవారికి కేవలం దృశ్యాలు. మరి ఆ వెళ్ళేవారికో?  అయినా కదిలి వస్తున్న ఆమె రోషం ముందు, తరలి వెళ్ళే వీరి ఆక్రోశం ఏపాటిది.

గాలి క్రమక్రమంగా వేగం పుంజుకుంటోంది. చిరుజల్లుగా మొదలైన వాన, సమయంతో పోటీపడుతూ ఊపందుకుంది. ఆమె శక్తిని అంచనా వెయ్యలేని, రాకని అంగీకరించలేని, మరో అవకాశం లేని  జనం అమాయకంగానో, మొండిగానో వుండిపోదలుచుకున్నారు. ముంచుకొస్తున్న ప్రమాదం నుండి కాపాడుకునే ప్రయత్నంలో చెక్కలు కొట్టి, టేపులు బిగించి ఇంటిని, షాపులని భద్రపరుస్తున్నారు కొందరు.

విజిటర్స్‌గా వచ్చి, తిరుగు ప్రయాణంలో ఎయిర్‌పోర్ట్‌లో వుండిపోయిన వాళ్ళు రావలసిన ఫ్లైట్ సమయానికి వస్తుందో లేదో అని ఆందోళన పడుతున్నారు. చివరి క్షణాలలో వెళ్దామని నిర్ణయించుకుని పెట్రోలు దొరికే అవకాశం లేదని తెలిసి నిరాశగా వాహనాలను వెనక్కి మళ్ళిస్తున్నారు కొందరు.

చెదురుమదురుగా ఎదురవుతున్న ఒకరిద్దరిని ఆపి టెలివిజన్ ప్రతినిధులు ప్రశ్నలు వేస్తున్నారు. “ఎప్పుడూ ఇంతే. క్యాటగిరి నాలుగు ఉధృతితో ముంచుకొస్తోందని హెచ్చరికలు చేస్తారు. తీరా ల్యాండ్‌ఫాల్ అయ్యేటప్పటికి ఇంటెన్సిటీ లెవెల్ మూడుకో రెండుకో పడిపోతుంది. అయినా నేనుండేది పదో అంతస్తులో. అందుకే ఊరు వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు” చెపుతున్నాడోకతను మొండిగా.

గాలివాన విజృంభించింది. ఆఖరి  నిమిషం వరకు బర్గర్లు , సలాడ్లు అమ్మిన వ్యక్తి తలుపులు భద్రంగా వేసి చెక్కలతో కిటికీలనీ, ద్వారాలనీ మేకులు కొట్టి బిగించాడు. పది అడుగులు వేసి షాపుకేసి వీడుకొలుగా ఓ సారి తిరిగి చూసి కదిలాడు.

ఎనిమిదో అంతస్తులోని ఆ హాలులో కూర్చున్న వాళ్ళంతా అరవైనుండి ఎనబై దాటిని వాళ్ళే. కొంతమంది టీవి చూస్తుంటే మరి కొంతమంది పేకాట, చెస్సులాంటి  ఆటలలో మునిగివున్నారు.  ఓకరిద్దరు నిట్టింగ్ చేస్తున్నారు. “ఈ వయసు వాళ్ళని ఇక్కడినుండి కదపడం ప్రాణాంతకం. పోయినసారి చేసిన ప్రయత్నాలలో హార్ట్ఎటాక్‌కి గురి అయినవాళ్ళు, కాళ్ళు చేతులు విరుచుకున్నవాళ్ళు అనేకం. పై అంతస్తులో వున్నాం. అన్ని వైద్య సదుపాయాలతో పాటు జెనరేటర్లు కూడా వున్నాయి…” చెపుతున్నాడో డాక్టర్ ప్రశ్నిస్తున్న విలేఖరికి. “ఎక్కడికిక వెళ్ళేది? వెళ్ళడం, వెళ్ళడం మరింక అక్కడికే” అంటూ నిట్టింగ్ చేస్తున్న ఓ వనిత నవ్వుతూ చేతిలో నీడిల్ ని పైకి చూపించింది.  నిస్సహాయతనుండి వచ్చిన తెగువ వీళ్ళది. ఎవరినీ లెక్కచేయని ధాష్టికం ఆమెది.

పందెం వేసుకుని నేనంటే నేనంటూ గాలి, వాన పోటీపడుతున్నాయి. ల్యాండ్ ఫాల్ జరిగిన వెంటనే పోలీస్ శాఖ నుండి కానీ మరో రకంగా కానీ ఎటువంటి సహాయం దొరకదని – సహాయం అందించే స్థితిలో పరిస్థితులు వుండవని వానలో తడుస్తూ, గాలివాటుకి కదిలిపోతూ చెపుతున్నాడో టీవి ప్రతినిధి. ఆఖరి క్షణాలలో మనసు మార్చుకున్నవాళ్ళు  ఇల్లు వదిలి దగ్గరలో వున్న షల్టర్లకేసి ప్రయాణమయ్యారు.

చిక్కని ధూపం వేసినట్లు పగలే చీకట్లు కమ్ముకున్నాయి. హోరున కురుస్తున్న వానకి వీధులన్నీ జలమయమయ్యాయి. రహదారులపైన  దారి తెలియజేసే సైన్ బోర్డులు కొన్ని ఊడి పెనుగాలికి టకటకా కొట్టుకుంటున్నాయి. వెలుగుతూ ఆరుతూ దీపాలు అప్పటికే సమ్మె ప్రారంభించాయి. వ్యతిరేకదిశలో హోరున కదిలిపోతూ – ఆకులని  కొమ్మలని  రాల్చేస్తూ – చెట్లన్నీ ఆమె రాకకి  తమ తీవ్ర అసమ్మతిని తెలియజేస్తున్నాయి. జరగనున్న విధ్వంసానికి సాక్షిగా ఒడ్డున ఒంటరిగా మిగిలిపోయింది ఒంటిస్తంభం లైట్‌హవుస్.

ఉష్ణంతో ఊపిరి పోసుకొని – గాలివాన తోడుగా నింగికి ఎగిసి – నేలను ముద్దాడేందుకు గొప్ప మొహంతో కదలివస్తోంది ప్రకృతికాంత.

**** (*) ****