అనువాద కథ

వెన్నెల రేయి

డిసెంబర్ 2017

పాస్టర్ మారిగ్నాన్ అన్న పేరులో మొదటి భాగం మాత్రమే సరిగ్గా సరిపోతుందతనికి. పొడుగ్గా వుంటాడు. మూఢ భక్తి, చిరచిర లాడే గుణం వున్నా నీతి బద్ధంగా వుండే మనిషి. దేవుడి మీద అతని నమ్మకం స్థిరమైనది. దేవుడి ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ తనకి అర్థంమౌతాయని అతని విశ్వాసం

తన ఇంటి దగ్గర తోటలో, అప్పుడప్పుడు వడివడిగా అడుగులేసుకుంటూ నడుస్తూ తనలో తను చర్చించుకుంటాడు – “దేవుడు ఇదంతా ఎందుకు చేసినట్లు?” అని.

అదే విషయం గురించి తీవ్రంగా ఆలోచించి, దేవుడి స్థానంలో తననే వుంచుకోని చివరికెలాగో సమాధానం తెలుసుకుంటాడు. ఏనాడు అతను భక్తితో, వినయంతో “దేవా నీ అద్భుతాలు అర్థం కావు కదా” అనడం జరగలేదు.

“దేవుడి సేవకుణ్ణి నేను. దేవుడు చేసే పనులు నాకు తెలియకుండా ఎలా వుంటాయి. తెలియకపోయినా ఊహించగలను కదా” అని తనకి తాను చెప్పుకుంటాడు.

సృష్టిలో వున్న ప్రతిదీ ఒక నిర్దిష్టమైన అవసరం కోసం ఆలోచించి చేయబడ్డదే అని నమ్ముతాడు. “ఎందుకు” అన్న ప్రశ్నకు “ఎందుకంటే” అన్న సమాధానం వుంటుందని నమ్ముతాడు. సూర్యోదయం ప్రశాంతంగా ఎందుకుంటుంది? మనం మేల్కొనగానే ఆనందించేందుకు. అలాగే పగలు ఎండ కాయల్ని పండ్లుగా పండించడానికీ, వాన వాటిలో తేమ నింపడానికి, సాయంత్రాలు నిద్రకు సిద్ధమవడానికి, చీకటి రాత్రులు నిద్రపోవడానికి సృష్టించబడ్డాయని అంటాడు.

నాలుగు కాలాలు సరిగ్గా వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వుంటాయి అని నమ్ముతాడు. అసలు ప్రకృతి ఒక ఉద్దేశ్యాన్ని అనుసరించి ఎలా పని చేస్తుంది? ప్రపంచంలో ఏదైనా ప్రకృతికి నియమాలకు లోబడి వుండాలి కదా? కానీ అలాంటి అలోచన అతనికి ఎప్పుడూ రాలేదు.

ఆడవాళ్ళంటే పడదతనికి. అసహ్యించుకునే వాడు. వాళ్ళని దూరంగానే వుంచేవాడు. క్రీస్తు చెప్పిన మాటలు – “అమ్మా, నాతో మీకేమి పని?” అంటుంటాడు. పైగా – “బహుశా దేవుడికి అతని సృష్టిలో నచ్చనిది ఆడదేనేమో” అంటాడు. మొగవాణ్ణి తప్పుదోవ పట్టించే మోసగత్తెలు మగువలేననీ, అలా దారి మళ్ళించాక ఎప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తూ వుంటారని అతని నమ్మకం. చూడటానికి సుకుమారంగా కనిపించే అత్యంత ప్రమాదకారులనీ అనుకుంటాడు. పాపానికి దోహదంచేసే వాళ్ళ శరీరాలకన్నా ప్రేమకు కారణమయ్యే వాళ్ళ హృదయాలని ఎక్కువగా ద్వేషించేవాడు.

స్త్రీల మృదుస్వభావం చాలాసార్లు ఆయన అనుభవంలోకి వచ్చేది. అతనెప్పుడూ వాటికి లొంగిపోలేదు. పైగా అలాంటి అనుభవాలు, ప్రకంపనకు గురి చేసే ప్రేమలాంటి అనుభూతులు అతనిలో కోపాన్ని పెంచేవి.

మొగవాణ్ణి మభ్యపెట్టి, పరీక్షలకు లోను చేసేందుకే దేవుడు ఆడదాన్ని సృష్టించాడని అతని నమ్మకం. మగవాడు తనని తాను సంరక్షించుకోడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోకుండా, ఆడవారిని బంధించే ఉచ్చు లాంటిదేదీ లేకుండా వాళ్ళ దగ్గరకు వెళ్ళనేకూడదంటాడు. అసలు ఆడదంటేనే ఒక ఉచ్చు. చేతులు చాపి, పెదవులను ఎరగా వేసి బంధించే ఉచ్చు. ఇదీ అతని అభిప్రాయం.

ఆయనతో పాటు వుండే సన్యాసినులైన నన్స్ తో తప్ప వేరే ఏ స్త్రీలతోనూ ఆయనకు చనువు లేదు. వాళ్ళంతా చేసిన ప్రతిజ్ఞల కారణంగా నిరపాయకరంగా వుండే వాళ్ళు. అయినా కూడా వాళ్ళతో చాలా తీవ్రంగా ప్రవర్తించేవాడు. ఎందుకంటే నిర్బంధంగా బ్రతికే వాళ్ళ జాలి గుండెల్లో కూడా ఏదో ఒక మాయ చేసే మృదుత్వం వుంటుందని. అది ఫాదర్ గా వున్న తన మీద కూడా ప్రదర్శిస్తారేమో అన్న అనుమానం ఆయనకి వుంది.

అలాంటి మాయ చేసే మృదుత్వాన్ని ఆయన తరచుగా గుర్తించేవాడు. వాళ్ళ విధేయతలోనూ, ఆయనతో మాట్లాడేటప్పుడు మంద్రంగా పలికే వాళ్ళ గొంతులోనూ, కిందకు దించిన కళ్ళలోనూ, ఆయన చీవాట్లు పెట్టినప్పుడు వాళ్ళు పెట్టే కన్నీళ్లలోనూ ఆ మాయ చేసే మృదుత్వాన్ని చూడగలడాయన. అలాంటి సందర్భంలో ఆయన తన నల్లటి గౌనుని విదిలించుకుంటూ, పెద్ద పెద్ద అంగలువేసుకుంటూ ఆ మఠం బయటికి ఏదో ప్రమాదం నుంచి పారిపోతున్నట్లు పరిగెత్తేవాడు.

ఆయనకి ఒక మేనకోడలు వుంది. ఆమె వాళ్ళమ్మతో కలిసి దగ్గర్లోనే వుంటుంది. ఆమెను ఎలాగైనా సిస్టర్స్ ఆఫ్ ఛారిటీలో సన్యాసినిగా చెయ్యాలని ఆయన ప్రయత్నం.

ఆ అమ్మాయి చక్కగానే వుంటుంది కానీ ఆమెకు కాస్త తిక్క వుంది. పాస్టర్ ప్రసంగాలలో ఆమె నవ్వుతుంటుంది. ఆయన కోప్పడితే గట్టిగా హత్తుకుంటుంది. అలాంటప్పుడు వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అతనిలో ఎక్కడో దాగి వున్న వాత్సల్యం ఆ అమ్మాయి పట్ల పొంగుకొచ్చేది.

ఎప్పుడైనా ఆ ఊరి వీధుల్లో ఆమెతో కలిసి నడిచేటప్పుడు ఆమెతో దేవుడి గురించి మాట్లాడేవాడు. తన దేవుడి గురించి. ఆమె ఎప్పుడూ అతను చెప్పేది వినేది కాదు. ఆకాశం వైపు చూసేది, గడ్డి వంక, పూల వంక చూసేది. గమనిస్తే ఆమె కళ్ళ మెరుపులో జీవితపు ఆనందం అంతా కనిపించించేది. ఒకోసారి గాల్లో ఎగురుతున్న ఏ కీటకాన్నో అందుకోవాలని ముందుకి ఉరికేది. దాన్ని పట్టుకోని తిరిగి వచ్చేటప్పుడు – “చూడు మామయ్యా ఎంత ముద్దుగా వుందో ఇది. చూస్తే గట్టిగా కౌగిలించుకోవాలనిపిస్తోంది” అనేది.

ఇలా పురుగుల్ని ముద్దు పెట్టుకోవడం, విరబూసిన పూలని హత్తుకోవడం అతనికి చికాకుని, కోపాన్ని తెప్పించేవి. అలాంటి చర్యలలో కూడా ఒక ఆడపిల్ల మనసులో వుండే ఆ మృదుత్వాన్ని గుర్తించేవాడు.

ఒకరోజు చర్చిలో శవాల పనిచేసే అతని భార్య వచ్చి ఫాదర్ తో, భయపడుతూనే ఒక విషయం చెప్పింది. ఆయన మేనకోడలు ఎవర్నో ప్రేమిస్తోందని.

ఆ వార్త అతనిలో రగిల్చిన ఒత్తిడి, భయం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అతనప్పుడు షేవింగ్ చేసుకునేందుకు ముఖానికి సోప్ రాసుకున్నాడు. అది అలా వదిలేసి శిలలా నిలబడిపోయాడు.

కాస్సేపటికి తేరుకున్నాక ఆలోచన, మాట రెండూ వచ్చాయి. “పచ్చి అబద్ధం చెప్తున్నావు నువ్వు మెలైన్” అంటూ అరిచాడు.

కానీ ఆమె మాత్రం తన చేతిని గుండె మీద వేసుకోని చెప్పింది – “అయ్యగారూ, నేను గానీ అబద్దం చెప్తే ఆ ప్రభువే నన్ను దండిస్తాడు. చెప్తున్నా వినండి. రోజూ రాత్రిపూట మీ చెల్లెలు పడుకోగానే ఈమె గారు వెళ్తున్నారు. నది ఒడ్డున కలుస్తారు ఇద్దరూ. మధ్యరాత్రి పదిపన్నెండు గంటలకు వెళ్ళి చూడండి కావాలంటే”.

గడ్డం చేసుకోవడం సంగతి మర్చిపోయాడతను. మెట్లపైకీ కిందకీ వడివడిగా తిరిగాడు. బాగా ఆలోచించేటప్పుడు అలాగే చేస్తాడతను. తిరిగివచ్చి గడ్డం చేసుకుంటూ ముక్కు నుంచి చెవి దాకా మొత్తం మూడుసార్లు గాట్లు పెట్టుకున్నాడు.

రోజంతా మౌనంగా వుండిపోయాడు. కోపం. అపనమ్మకం. ఆయనకు మొదటి నుంచి ప్రేమలంటే వున్న కోపం కారణంగా తన పెంపకం విఫలమైందన్న భావన మరింత తీవ్రమైంది. తండ్రి లాంటి వాడిగా, పెంచిన వాడిగా, ఒక చర్చి ఫాదర్ గా ఆ పిల్ల చేత మోసగించబడ్డాడన్న భావన కలిగింది. ఎవరైన తల్లిదండ్రులకు తమ కూతురు తమ ప్రమేయం లేకుండానే భర్తని ఎంచుకుంటే కలిగే భావనే అతనికి కూడా కలిగింది.

రాత్రి భోజనం అయిపోయిన తరువాత ఏదైనా చదువుదామని అనుకున్నాడు కానీ కోపం అంతకంతకూ పెరుగుతుండటంతో ఏమీ చదవలేకపోయాడు. రాత్రి పది గంటలు అవుతూనే తనకి బాగా అలవాటైన చేతికర్రని అందుకున్నాడు. రోగగ్రస్థులు వుండే ఇంట్లో ప్రార్థనలు చెయ్యడానికి రాత్రిళ్లు వెళ్ళాల్సివస్తే ఆ టేకు కర్ర తీసుకెళ్ళడం ఆయనకు అలవాటు. దృఢంగా వున్న ఆ కర్ర వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి, తన పిడికిలితో బలంగా పట్టుకున్నాడు. ఉన్నట్టుండి దాన్ని పైకెత్తి పళ్లు కొరుకుతూ కుర్చీని కొట్టాడు. ఆ దెబ్బకి ఆ పాత కుర్చీ వెనుక భాగం విరిగి నేల మీద పడింది.

వాకిలి తలుపులు తెరిచి బయటికి అడుగుపెట్టాడు. గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అద్భుతమైన వెన్నెల. అతనికి ఎప్పుడో అరుదుగా తప్ప ఆ సౌందర్యాన్ని చూసే అవకాశం రాదు కదా!

కవులకు వున్నట్లే ఆయనకి కూడా అలాంటివి చూసి స్పందించే గుణం వుంది. అందుకే ఆ చర్చి ఫాదర్ మనసు అద్భుతమైన, ప్రశాంతమైన ఆ దృశ్యం వైపు కాస్సేపు మళ్ళింది.

ఆయన తోట మొత్తం సన్నని వెన్నెల వెలుగులో స్నానం చేస్తున్నట్లు వుంది. పండ్లచెట్లు తమ పొడుగాటి నీడలని నేల పైన పరుస్తున్నాయి. వాటికి వున్న కొమ్మలు, ఆ కొమ్మలకు పల్చగా వున్న ఆకులు కలిసి వెలుగు నీడల బొమ్మలు గీస్తున్నాయి. గోడమీదకి పాకిన పూల తీగ తీయటి వాసనలని వెదజల్లుతూ ఆ వెన్నెల వెలుగుకి అత్తరు సొబగులు అద్దుతోంది.

ఆయన గట్టిగా గాలి పీల్చడం మొదలుపెట్టాడు. ఒక తాగుబోతు వైన్ తాగినట్లు ఆ గాలిని ఆయన తాగడం మొదలుపెట్టాడు. నడక సాగించాడు. నెమ్మదిగా, ఆశ్చర్యపోతూ, ఆహ్లాదాన్ని అనుభవిస్తూ – దాదాపుగా తన మేనకోడలిని మర్చిపోయినట్లుగా నడవసాగాడు.

తోట బయటకు వచ్చి చూస్తే నిర్మలమైన రాత్రిలో వెన్నెలతో అభిషిక్తమౌతున్న నేల కనిపించింది. కనుచూపుమేరలో వున్న భూమంతా వెలుగుతో సరసాలాడుతూ, రమణీయమైన ఆ కాంతిలో లీనమైనట్లు కనిపించింది. కీచురాళ్ళ శబ్దం ఒక నిర్దుష్టమైన నాదంతో పలికినట్లు ఆగి ఆగి వినిపిస్తోంది. దూరంగా ఎక్కడో చకోర పక్షి తన సంగీత జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటోంది. అదంతా కలిసి ఒక మధురమైన కచేరిలా వుంది. కలల్లోకి జార్చగలిగిన సంగీతం. చంద్రుడి వెన్నెలనే మరులుగొల్పగలిగిన సుమధుర గానం.

పాస్టర్ ముందుకే నడిచాడు. అతని హృదయంలో అలజడి ఎందుకు కలుగుతోందో అతనికే తెలియలేదు. ఉన్నట్టుండి నీరసించిపోయాడు. శరీరంలో శక్తి మొత్తం ఆవిరైపోయినట్లు అనిపించింది. ఎక్కడైనా కూర్చోని, కాస్త సేదతీరి భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచం గురించి ఆలోచించాలని అనిపించింది.

అక్కడికి కాస్త దూరంలో నది వెంబడే నిలబడి వున్నాయి బూరుగు చెట్లు. సన్నటి మంచు తెల్లటి పరదా కప్పుతుంటే అందులో నుంచి ప్రసరిస్తున్న చంద్ర కాంతి ఆ మంచుని వెండి రెంగులోకి వెలిగిస్తోంది. దూరంగా వున్న పర్వతాలను, వాటి పైనెక్కడో మొదలైన నది కిందకి జారే కఠినమైన మార్గాన్ని, పల్చటి పత్తి కప్పినట్లుగా, తెల్లటి కాంతి కమ్మేసింది.

పాస్టరు మళ్ళీ ఆగిపోయాడు. అతని అంతరాంతరాలలో క్రమంగా ఒకలాంటి మృదుత్వం అనివార్యంగా విస్తరిస్తోంది.

ఒక అనుమానం, అర్థం కాని కలవరం అతనిని ఆక్రమించింది. అతను తరచుగా ప్రశ్నించుకునే విషయం మళ్ళీ జ్ఞప్తికి వచ్చింది.

“దేవుడు ఇదంతా ఎందుకు సృష్టించాడు? రాత్రి వున్నది నిద్రకోసమే కదా? స్పృహ లేకుండా, ప్రపంచాన్ని విస్మరించి విశ్రమించడానికే కదా? మరి రాత్రిని పగటికన్నా మనోహరంగా ఎందుకు చేశాడు? సంధ్యాసమయాల కన్నా ఆహ్లాదకరంగా ఎందుకు కూర్చాడు? సొగసుగా వుంటూనే నిగూఢమైన ఈ ప్రపంచాన్ని వెలుగులతో నింపడానికే కదా సూర్యుడు వున్నాడు? ఎంత టక్కరిదీ భూమి? వెలుగుని కాదని పారదర్శకంగా వున్న ఈ నిశీథిసుందరిని ఎందుకు ప్రేమించింది?

రెక్కలున్న అద్భుత గాయకుడు అందరిలా ఎందుకు నిద్రపోవటంలేదు? ఎందుకు తన కుహుకుహు రవాల గళాన్ని నిగూఢ నిశీధిలోకి వొంపుతున్నాడు?

“ప్రపంచం పైన ఈ మేలి ముసుగు ఎందుకు? హృదయం ఇలా కంపించడం ఎందుకు? ఆత్మకు భావుకత ఎక్కడిది? శరీరానికి ఎందుకు ఈ దౌర్భల్యం కలుగుతోంది? అందరూ నిద్రలో జోగుతూ కనీసం వీటి వైపు చూడనైనా చూడలేని సమయంలో ఇంత ఇంద్రజాలం ఎందుకు జరుగుతోంది? ఈ మనోహరమైన అద్భుతం, ఈ అద్వితీయమైన కవితాఝరి ఎవరికోసం దివి నుంచి ఇలకు జాలువారుతోంది?”

ఆయన అర్థం చేసుకోలేకపోయాడు.

అదిగో, అక్కడ చూడు. ఆ పచ్చిక నేల చివర, చెట్లు చిత్రంగా కల్పించిన పైకప్పు కింద, మెరుస్తున్న మంచులో తడుస్తూ ఎవరో ఇద్దరు పక్కపక్కనే నడుస్తున్నారు.

అతను ఆమె కన్నా పొడగరి. తన ప్రియురాలి మెడ చుట్టూ చేతిని వేసి పదే పదే ఆమె కనుబొమ్మల మధ్య ముద్దు పెడుతున్నాడు. ఐహికమైన జీవితంలో నుంచి వారిద్దరినీ మాయం చేసి కళాకృతిలా కనిపిస్తున్న ఆ దృశ్యంలోకి ఏ దైవ హస్తమో చేర్చినట్లుగా అనిపిస్తోంది. వారిద్దరూ ఇద్దరిలా కాక ఒకే ఆత్మలా కనిపిస్తున్నారు. ఆ ఆత్మ కోసమే ఈ ప్రశాంతమైన, నిశబ్దమైన రాత్రి సృష్టించబడిందా అన్న భావన కలుగుతోంది. ఇద్దరూ పాస్టరు వైపుగా వస్తుంటే, ఆయన ప్రశ్నలకు భగవంతుడు పంపిన సమాధానంలా వున్నారు.

ఆయన స్థాణువులా వుండిపోయాడు. గుండె వేగం హెచ్చింది. కంగారుగా అనిపించింది. కళ్ళ ముందు బైబిల్ నుంచి బోయజు రూతులు వచ్చి నిలబడ్డట్లు అనిపించింది. పవిత్ర గ్రంథాలలో భగవంతుడి ఇచ్ఛ ప్రకారం జరిగే అద్భుతకథలన్నీ గుర్తుకువచ్చాయి. సాల్మన్ గీతం అతని చెవులలో ప్రతిధ్వనించింది. ఆ గీతంలో వున్న సౌకుమార్యమంతా అతని గుండెల్లో మృదువుగా వ్యాపించింది.

“బహుశా ఇలాంటి ప్రేమికుల ప్రేమను అజరామరం చేసేందుకే దేవుడు ఇలాంటి రాత్రులను సృష్టించాడేమో” అనుకున్నాడాయన.

ఆ జంట జత కలిసిన చేతులతో ముందుకు వస్తుంటే తనకు తానుగా వైదొలిగాడు. ఆమె అతని మేనకోడలే. కానీ భగవంతుడి ఆజ్ఞను తిరస్కరించాలా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. దేవుడి అంగీకారమే లేకపోతే ఈ ప్రేమ చుట్టూ ఇంతటి అద్భుతాన్ని ఎందుకు వ్యాపింపచేస్తాడు?

తనకు అనుమతిలేని ఒక మందిరంలోకి చొరబడినందుకు అపరాధ భావన కలుగుతుండగా వెనక్కి మళ్ళాడాయన.

**** (*) ****

మూలం: ‘Moonlight, or In the Moonlight’, by ‘Guy de Maupassant’, French

అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్