వ్యాసాలు

యుక్తవాక్యం – మొదటి భాగం

ఫిబ్రవరి 2018

గమనిక: నా ‘భాషాసవ్యతకు బాటలు వేద్దాం’లో లాగానే ఇందులో కూడా కొన్ని విషయాలు వివాదాస్పదంగా కనిపించవచ్చు పాఠకులకు. ఎంతమాత్రం అయోమయానికి తావివ్వకుండా, వాక్యం పూర్తిగా సంతృప్తికరమైన రూపంలో ఉండేలా పదాలను, అక్షరాలను ఎలా రాయాలనే విషయం గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉండే అవకాశముంది. కాబట్టి, ఇందులో చెప్పిందే ఏకైక అంతిమ (Ultimate) రూపమని నిర్ద్వంద్వంగా నొక్కి వక్కాణించడం లేదు. ఏకీభావం కుదరని చోట కొంచెం భిన్నమైన వాక్య, పదరూపాలను అనుసరించవచ్చు.

***

వాక్యాన్ని సరిగ్గా రాయడమనేది చాలా మంది అనుకునేటంత సులభమైన విషయమేం కాదు. ఎందుకంటే, మనం రాసింది నిర్దుష్టంగానే కాక, నిర్దిష్టంగా కూడా ఉండాలి. నిర్దుష్టంగా అంటే భాషాదోషాలు లేకుండా (Flawlessly) అన్నమాట. ఇక నిర్దిష్టమనే పదాన్ని విస్తృతార్థంలో చూడాల్సి ఉంటుంది. భాషాదోషాలు లేకపోవటంతో పాటు, సరైన పదాలు సరైన స్థానాల్లో ఉన్నప్పుడే వాక్యానికి నిర్దిష్టత సిద్ధిస్తుంది. కొన్నిసార్లు వాక్యం వ్యాకరణపరంగా సరిగ్గానే ఉన్నా, అందులోని కొన్ని పదాలను, లేక వాటి క్రమాన్ని మారిస్తే అది మరింత బాగా తయారయ్యే సందర్భాలుంటాయి. అట్లాంటి సందర్భాన్ని నివారిస్తూ ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా రాయగలిగినవాళ్లు వచనరచనలో ఆరితేరిన వారవుతారు. ఈ కాలంలో చాలా మంది కవులు, రచయితలు భాషకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. ఒక వాక్యం బహువచనరూపంలో ఉన్న కర్తతో మొదలై ఏకవచనరూపంలో ఉన్న క్రియతో అంతమవ్వడం, అవ్యయాలు (Prepositions) సరైన స్థానాల్లో ఉండకపోవడం, విరామచిహ్నాలు సరిగ్గా లేకపోవడం, అసలు పదాలనే తప్పుగా రాయడం – ఇటువంటి చిన్నచిన్న అపసవ్యతల నివారణ కోసం సైతం జాగ్రత్త పడకకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భాషలో కచ్చితత్వం (Correctness) అంత అవసరమైన విషయం కాదనే అభిప్రాయం కవుల్లో, రచయితల్లో ఉన్నంత కాలం దోషభూయిష్ఠమైన భాష కనిపించడం కొనసాగుతూనే ఉంటుంది. పెద్దపెద్ద స్ఖాలిత్యాలను (అంటే భాష పరంగా సూక్ష్మమైన భేదాలను పాటించకపోతే ఏర్పడే తప్పులను) చూసీచూడనట్టు పోవచ్చును కాని, ప్రాథమిక దోషాలను పట్టించుకోకుండా ఉండలేం – ముఖ్యంగా అవి పూర్తిగా భిన్నమైన అర్థాన్నిస్తున్నప్పుడు. ఉదాహరణకు ప్రముఖత లేక ప్రాముఖ్యం అని రాసే బదులు ప్రాముఖ్యత అని రాస్తే దాన్ని అంత సీరియస్ గా తీసుకోనవసరం లేదు. కాని, ప్రధానమంత్రికి బదులు ప్రదానమంత్రి అనీ, అర్థంకు బదులు అర్ధం అనీ, షష్టిపూర్తికి బదులు షష్ఠిపూర్తి అనీ, మద్యపానంకు బదులు మధ్యపానం అనీ (?!మధ్యమధ్య సేవించే పానం) రాస్తే అసలు భావమే పూర్తిగా మారిపోతుంది కనుక, ఆక్షేపణ తెలుపకుండా ఉండలేము.

ఏ రచనలోనైనా వాక్యాలలోని పదాలు సరిగ్గా ఉండాలని కోరుకునే భాషాప్రేమికులకు ఈ రోజుల్లో సైతం కొదవ లేదని నా విశ్వాసం. కనుక, కొన్ని పొసగని వాక్యాలను ఉదాహరించి (‘ఉదహరించి’ కాదు), చిన్నపాటి వివరణల ద్వారా భాషాపరమైన సూచనలను పాఠకులకు అందించడమే ఈ వ్యాస ప్రధానోద్దేశం. ఈ కింది వాక్యాలలోని పొసగనితనాన్ని పోగొట్టేందుకు నేను సూచిస్తున్న సవరణలను, వివరణలను గమనిస్తే ఔత్సాహికులైన యువ రచయితలకు అది ఉపయుక్తంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను.

***

*అమిత్ షా కు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని వివరించారు.

*ఈ వాక్యం ఏం చెప్తోంది? ఎవరో ఒక పరిస్థితిని అమిత్ షా కు వివరించారు, అని. అది ఏ పరిస్థితో తెలియదు. ఎవరు వివరించారో కూడా తెలియదు. దాన్ని వివరించడమనే పని మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కాని, ఈ వాక్యరచయిత ఇక్కడ చెప్పదల్చుకున్నది, ఆంధ్రప్రదేశ్ లో నెలకొని వున్న పరిస్థితి వివరించబడింది అని. కాబట్టి, మనసులో ఉన్న ఉద్దేశం ఏ తికమకా లేకుండా తేటతెల్లంగా వెల్లడి కావాలంటే ఈ వాక్యాన్ని ‘(ఫలానా వ్యక్తి) ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితిని అమిత్ షా కు వివరించారు’ అని తిరగ రాయాల్సి వుంటుంది. నేనైతే ఈ వాక్యంలో అమిత్ షా తర్వాత స్పేస్ ఇచ్చి ‘కు’ అన్న అక్షరాన్ని రాస్తాను. లేకపోతే ‘షాకు’ (shock) కొట్టే ప్రమాదం కొంత లేకపోలేదు! ఏమంటారు?

*నయీంకు చెందిన ఎన్నో డెన్ లను పోలీసులు గుర్తించారు.

*డెన్ (Den) అనే ఈ ఆంగ్లపదానికి ప్రత్యామ్నాయమైన తెలుగు పదం దొరకడం కష్టమేం కాదు. ఇంగ్లిష్ భాష రానివాళ్లు ఎందరో ఉంటారు. కొందరు విద్యావంతులకు సైతం డెన్ అంటే ఏమిటో తెలియకపోవచ్చు. డెన్ కు బదులు (రహస్య)గృహం లేక (రహస్య)స్థావరం అనొచ్చు. ఈ పదాలు కూడా అందరికీ అర్థం కావనుకుంటే రహస్య అడ్డా అనవచ్చు. అడ్డా స్వచ్ఛమైన తెలుగు పదం కాకపోయినా దాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం ఉండదనుకుంటాను.

*ప్రతి రోజూ ఉపనిషత్తులలో దాగివున్న రహస్యాల గురించి చెప్పుకుంటున్నాం కదా.

*ఈ వాక్యంలో ‘ప్రతి రోజూ’ అన్నది అర్థపరంగా ‘దాగివున్న’తో అనుసంధానమై ఉంది. కాని, అది ‘చెప్పుకుంటున్నాం’తో అనుసంధానం అయివుండాలి. అప్పుడే మన మనసులోని భావం ఎలాంటి గందరగోళం లేకుండా పాఠకులకు/శ్రోతలకు సరిగ్గా చేరుతుంది. రహస్యాలు ప్రతి రోజూ దాగివుండటం లేదు! వాటిని మనం ప్రతి రోజూ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ వాక్యం ఇలా ఉండాలి: ఉపనిషత్తులలో దాగివున్న రహస్యాల గురించి ప్రతి రోజూ చెప్పుకుంటున్నాం కదా. ఏ పదాన్నీ సరిదిద్దే అవసరం లేదు. మొదటి రెండు పదాలను అక్కడినుండి తీసి వేరే చోట పెట్టాలి, అంతే.

*దాశరథి అగ్నిధారను చదివితే మనం ఆ పద్యాలలోని ధారను గమనించ గలుగుతాం.

*రచనాప్రక్రియకు మరీ కొత్త కానివారు కూడా కొందరు వాక్యాలను ఈ విధంగా రాస్తున్నారు. మరికొందరైతే ‘దాశరథి అగ్నిధార చదివితే….’ అని కూడా రాస్తున్నారు. ఈ వాక్యాన్ని రాసేవారి మనసులో చదవడమనే క్రియకు సంబంధించిన కర్త ‘మనం’, లేదా పాఠకులు. కాని, మొదటి రెండు విశేష్యాల (నామవాచకాల) నడుమ ప్రత్యయమో అదనపు పదమో లేనప్పుడు కర్త దాశరథి అయి, అర్థ అన్వయంలో గందరగోళం ఏర్పడుతుంది. దాన్ని నివారించడానికి రెండు మార్గాలున్నాయి. వాటిలో మొదటిది ‘దాశరథి గారి’ అని రాయడం. కాని, ఈ రోజుల్లో అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుందని అనిపించవచ్చు. అట్లాంటప్పుడు ‘దాశరథి రాసిన/రచించిన’ అనవచ్చు. ఎందుకండీ, అసలు విషయాన్ని పాఠకులు అంత మాత్రం ఊహించుకోలేరా? అంటే ఊహించుకో గలుగుతారేమో. కాని, భాష ఉన్నది దేనికోసం? వాక్యం సరిగా వుండి, అర్థప్రసరణ సాఫీగా సాగటం కోసమే కదా.

*ప్రైవేటు ఆస్పత్రుల్లో డాక్టర్లు అనవసరంగా స్త్రీల గర్భసంచీలనూ వాటితో పాటు ఉండకాలనూ తొలగించారని వెల్లడైంది.

*ఇక్కడ ఉండకాలు అంటే Ovaries అని ఉద్దేశం కాబోలు. కాని, ఉండకం అనే పదం నాకైతే ఏ ప్రధాన నిఘంటువులోనూ దొరకలేదు! బహుశా ఇంటర్మీడియెట్, డిగ్రీ కోర్సుల జీవశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో అటువంటి పదం ఉందేమో. గర్భకోశము, గర్భాశయము అన్నట్టే అండకోశము, అండాశయము అని రాయొచ్చును కదా. జలమును నిలువగా కలిగి ఉన్నదాన్ని జలాశయము అంటున్నాం. మరి అటువంటప్పుడు అండములను నిలువగా కలిగి ఉన్నదాన్ని అండాశయము అనటంలో ఏ యిబ్బందీ ఉండకూడదని నా అభిప్రాయం. ఒకవేళ ఉండకాలకు అపెండిక్స్ లు అనే అర్థం ఉంటే బ్రాకెట్లో appendixes, లేక appendices అని రాసి, సందేహం తలెత్తకుండా నివారించవచ్చు.

*మా నాన్నగారికి గుండెలో స్టంటు అమర్చారు.

*స్టంటు (స్టంట్ – Stunt ) అంటే సినిమాల్లో హీరోలు చేసే సాహసకార్యం లాంటిది. హృద్రోగులకు డాక్టర్లు అమర్చేదాన్ని స్టెంట్ (Stent) అనాలి. ఇక ‘గుండెలో’ కాకుండా ‘రక్తనాళంలో’ అనాలి. కొందరు ‘నరంలో’ అంటారు. అది కూడా శాస్త్రం ప్రకారం తప్పు పదమే. నరం (Nerve – నాడి) తెల్లగా ఉంటుంది. నిండుగా కూడా ఉంటుంది. అంటే లోపల బోలుతనం ఉండదన్న మాట. నిజమైన నరంలో రక్తం ప్రవహించదు. ఇవి పూర్తిగా భాషాసవ్యతకు సంబంధించిన విషయాలు కాకపోవచ్చును. కాని, రాసేవారికి లోకజ్ఞానం (General Knowledge) అవసరం. రోజువారీ వ్యవహారంలో మనం తప్పుగా వాడే మరికొన్ని ఆంగ్లపదాల గురించి వివరిస్తాను. కోర్టు వారి ఉత్తర్వును ఇంగ్లిష్ లో Injunction అంటారు. కాని, చాలా మంది దీన్ని Injection అని తప్పుగా రాస్తారు/పలుకుతారు. అదే విధంగా కవితా వస్తువును ఆంగ్లంలో Content అంటాం కదా. దీన్ని తెలుగులో రాసేటప్పుడు చాలా మంది కంటెంట్ అంటుంటారు. కాని, కంటెంట్ మెంట్ (Contentment) అంటే సంతృప్తి. కంటెంట్ లేక కంటెంటెడ్(Content, Contented) అంటే సంతృప్తి చెందిన అని అర్థాలు. కవితా వస్తువును కాంటెంట్ (Content) అనాలి. ఆంగ్లంలో స్పెలింగ్ అదే అయినా ఉచ్చారణ మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇక మద్యం తాగినవారి శ్వాసను పరీక్షించే పరికరాన్ని బ్రీత్ అనలైజర్ అని రాస్తారు కొందరు. బ్రెత్ (Breath) అంటే శ్వాస. బ్రీత్ (Breathe) అంటే శ్వాసించడం. మొదటిది నామవాచకం రెండవది క్రియ. కాబట్టి బ్రీత్ అనలైజర్ అనకూడదు. బ్రెత్ అనలైజర్ అనాలి.

*సి. సి. కెమెరాలతో దాడి చేసిన దుండగులను పోలీసులు గుర్తించారు.

*దుండగులు సి. సి. కెమెరాలతో దాడి చేశారా? ‘సి. సి. కెమెరాలతో’ను ‘గుర్తించారు’కు వర్తింపజేయాలి. కాని, ఇక్కడ ‘దాడి’కి వర్తింప జేశారు. కాబట్టి, అర్థ అన్వయం కుదరాలంటే ఈ వాక్యాన్ని ‘దాడి చేసినవారిని పోలీసులు కెమెరాలతో గుర్తించారు’ అని మార్చాలి.

*పోలీసులు ముప్పేట దాడి చేశారు. అతని ప్రతిభ ముప్పేటగా అల్లుకుంది.

*ముప్పేట అంటే మూడు పేటలు (వరుసలు) అని అర్థం. కాబట్టి, ముప్పేట పదాన్ని రచనలో ఎక్కడ వాడినా మూడు అంశాలను ప్రస్తావిస్తూ దాన్ని రాయాలి. ఉదాహరణకు, ‘భాష మీద పట్టు, శిల్పవైభవం, వస్తువిస్తృతి – వీటన్నిటినీ కలుపుకుని అతని ప్రతిభ ముప్పేటగా విలసిల్లింది’ అనాలి. ఊరికే ముప్పేటగా విలసిల్లింది అనకూడదు.

*“ఉదయం తొమ్మిది గంటలకు టిఫిన్ చేశాను” అన్నది ఆమె.

*భోజనం చేశావా?, భోంచేశాను – మొదలైన వాక్యాలను వ్యావహారిక భాషలో వాడినప్పుడు, వాటిలో అపసవ్యత అంతగా కనిపించదు. కాని, చెయ్యడమంటే తయారు చేయడం అనే అర్థం కూడా వచ్చే అవకాశముంది కనుక, టిఫిన్ తిన్నాను అని రాస్తేనే సవ్యంగా ఉంటుంది.

*విమానాశ్రయాలు పేదలు ఎక్కే స్థోమత కావాలి.

*ఈ వాక్యం చాలా గందరగోళంగా ఉంది. మొదట స్థోమత తప్పు, స్తోమత సరైన పదం. ‘పేదలకు విమానాలను ఎక్కే ఆర్థిక స్తోమత కలగాలి’ లేక ‘విమానాశ్రయాలు పేదలకు అందుబాటులోకి రావాలి’ అని రాస్తే కరెక్టుగా ఉంటుంది.

*ఆమె వస్తుంది. ఆమె వస్తున్నది. ఆమె వస్తోంది.

*ఈ మూడు వాక్యాలు ఒకే అర్థాన్నివ్వవు. మొదటి వాక్యం ఇచ్చే అర్థం తర్వాతి రెండు వాక్యాల అర్థాలకు భిన్నం. ఆమె వస్తుంది అంటే She comes. ఆమె వస్తున్నది లేక ఆమె వస్తోంది అంటే She is coming.

*ఇష్టమొచ్చినంత తాగండి. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి.

*ఇక్కడ భాషాదోషమేమీ లేకపోయినా, ఎక్కడో ఏదో పదం లోపించినట్టు అనిపించటం లేదా? ఈ వాక్యలోని అసలు ఉద్దేశం ‘మీరు ఎంతైనా తాగండి. అది మీ ఇష్టం. అయితే, తాగింతర్వాత మీ ఇంట్లోనే ఉండండి. రోడ్డుమీదికి వచ్చి ప్రమాదానికి గురి కాకండి, ప్రమాదానికి కారణం కాకండి’ అని కదా. ఈ అంతరార్థాన్ని పూర్తిగా, సంతృప్తికరంగా వ్యక్తం చేయాలంటే ‘ఇష్టమొచ్చినంత తాగండి. కాని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి’ అని రాయాలి. రెండు వాక్యాల మధ్య ‘కాని’ ఉంటేనే సంపూర్ణత సిద్ధిస్తుందిక్కడ. ఇంగ్లిష్ లో అయితే రెండు వాక్యాల మధ్య ‘but’ పెట్టకుంటే మరీ అపసవ్యంగా ఉంటుంది.

*వెలుగొండ ప్రాజెక్టు వల్ల నీటి కొరత వుండదు.

*ఈ వాక్యం అన్యాపదేశంగా ఏం చెప్తున్నది? సాధారణంగా ప్రాజెక్టుల వల్ల నీటికొరత ఉంటుంది కానీ, వెలుగొండ ప్రాజెక్టు వలన మాత్రం ఉండదని కదా! అయితే ఇక్కడ వ్యక్తం చేయదల్చుకున్న భావం మాత్రం వెలుగొండ ప్రాజెక్టు మూలంగా మున్ముందు నీటికొరత ఉండబోదని. కాబట్టి, ‘వెలుగొండ ప్రాజెక్టు వల్ల మున్ముందు/ఇకముందు/భవిష్యత్తులో నీటికొరత ఉండబోదు/తీరిపోతుంది/తీరిపోనుంది’ అని వాక్యాన్ని మార్చాలి.

*దాదాపు కొత్త సచివాలయం నిర్మాణం పూర్తయింది.

*దాదాపు అన్న పదాన్ని సరైన స్థానంలో పెట్టకపోవడం ఈ రోజుల్లో అతి తరచుగా కనిపిస్తున్న విషయం. దాదాపు నేను మృత్యుముఖంలోకి వెళ్లాను. దాదాపు మా అక్క రెండేళ్ల తర్వాత మా ఇంటికి వచ్చింది – ఇట్లాంటి వాక్యాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. దాదాపును వాక్యంలోని ఏ పదానికి వర్తింప జేయదల్చుకున్నామో జాగ్రత్తగా చూసి, ఆలోచించి వాక్యాన్ని రాయాలి. అట్లా చూసినట్టైతే, ఈ రెండు వాక్యాలు ఇలా ఉండాలి: నేను దాదాపు మృత్యుముఖంలోకి వెళ్లాను. మా అక్క దాదాపు రెండేళ్ల తర్వాత మా ఇంటికి వచ్చింది. అదే విధంగా ‘కొత్త సచివాలయ నిర్మాణం దాదాపు పూర్తయింది’ అన్నది సరైన వాక్యమవుతుంది. మరో విషయమేమంటే, సచివాలయం నిర్మాణం అని కాక, సచివాలయ నిర్మాణం అని రాస్తేనే కరెక్టు. సమాసాలను రాయడం వదులుకోవాలనే అపోహ ఈ రోజుల్లో ఎక్కువగా రాజ్యమేలుతోంది. కాని, అర్థ అన్వయం కుదరడం లేదనిపించిన చోట సమాసాలను రాయక తప్పదు.

*రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ఒక్క హామీ పూర్తవలేదు.

*ఈ వాక్యాన్ని చదివినప్పుడు మొట్టమొదట మెదడుకు తట్టే భావం, ఒక్కటి తప్ప కేంద్రం ఇచ్చిన హామీలన్నీ పూర్తయ్యాయని! కాని, చెప్పదల్చుకున్నది మాత్రం, ఒక్క హామీ కూడా పూర్తవలేదు అని. ఒక్క లోని ‘క్క’ను ఒత్తి పలుకుతూ ఒక్కటి కూడా పూర్తవలేదు అనే భావాన్ని స్ఫురింజేయవచ్చు. దీన్నే కాకువు అంటారు. కాని, ఉచ్చారణ ద్వారా మాత్రమే అది సాధ్యం. రాయటం ద్వారా దాన్ని తెలుపలేము. ఇక ఈ వాక్యంలోని అర్థాన్ని స్పష్టంగా చెప్పాలంటే, ‘కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర లేదు’ అనో, లేదా ‘కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర లేదు’ అనో రాయాలి.

[ఇంకా ఉంది...]