కిటికీలో ఆకాశం

సంస్కారం మరిచిపోతున్న లోకం కోసం రాజేసిన అగ్గి- దర్భశయనం ‘అగ్ని సంస్కారం కోసం’

ఫిబ్రవరి 2018

ఉదయం నిద్ర లేచి బయటికి వెళ్ళినపుడు, మన వీధి అవతలి వీధిలో రాత్రి ఒక ఆడపిల్ల మీద జరిగిన యాసిడ్ దాడి గురించి ఎవరో మనకొక వార్త చేరవేస్తారు. ఒక్క క్షణం నిట్టూర్చి, మనం తిరిగి మన రోజువారీ నడకలో ముందుకు వెళ్లి పోతాం.

ఇంటికి వచ్చి కాఫీ తాగుతూ వార్తా పేపరు తెరిస్తే, వరకట్నం తేలేదన్న కోపంతో భార్యను కాల్చి చంపిన ఒక కిరాతక భర్త గురించిన వార్త కనిపిస్తుంది. మరొక నిట్టూర్పు విడిచి, పేజీ తిరిగేసి సినిమా పేజీ లోకి వెళ్లి పోతాం.

ఎందుకంటే, మనం చల్లబడిన వాళ్ళం. ఒంట్లోని వేడి చల్లారిపోయిన వాళ్ళం.

కానీ, సున్నిత మనస్కుడైన కవి అట్లా నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళ లేడు. చుట్టూ మానవత్వాన్ని, మానవ సంస్కారాన్ని మరచిన సంఘటనలు జరుగుతున్నపుడు, ఆ నిశ్శబ్దాన్ని చేదిస్తూ ఆగ్రహ ప్రకటన చేస్తాడు. కేవలం ఆ అమానవీయ సంఘటన పట్ల నిరసనని ప్రకటించడం దగ్గరే ఆగిపోకుండా, ఆ అమానవీయ సంఘటన జరిగేంత వరకూ పరిస్థితిని దిగజార్చిన సమాజాన్ని కూడా నిలదీస్తాడు.

“Poets have the toughest job in the universe- of turning silence into eloquence.” ― Sanober Khan

దర్భశయనం నిశబ్దంగా వుండలేని కవి. నిశ్శబ్దంలో గడ్డ కట్టుకు పోయిన లోకాన్ని తన కవితా వాక్యాలతో తట్టి లేపే ప్రయత్నం చేసే కవి.

అందుకే, అతని కవిత్వం మసక మసక నైరూప్య పదాల వెనుక దాక్కుని మంద్రంగా పలకకుండా, ఆరుబయట గద్దె మీద నిలుచుని ఆగ్రహ ప్రకటన చేస్తుంది. అటుగా వెళ్ళే మన పైకి కూడా ఆగ్రహ జ్వాలల్ని విసురుతుంది.

ఉదాహరణకు, ఒక పసిపిల్ల ఒక కిరాతకుని చేతిలో అత్యాచారానికి గురయిన వార్త తెలిసినపుడు పెద్దగా పట్టనట్టుగా ఎంత యాంత్రికంగా లోకం కదిలి ముందుకు వెళ్లి పోయిందో చెప్పడానికి దర్భశయనం ‘అగ్ని సంస్కారం కోసం’ అన్న కవితను మొదలు పెట్టిన తీరు చూడండి…

అగ్ని సంస్కారం కోసం

పసిపిల్ల కిరాతకుడి చేతిలో
ఛిద్రమై ధ్వంసమైనపుడు
మార్కెట్‌ చెదర్లేదు కూల్లేదుగానీ
ఆకాశం మాత్రం తప్పక ఆగ్రహించే వుంటుంది
దుఃఖిస్తూ-
అపుడు భూమి విచలించిందన్న నిజాన్ని
అటు డాలరూ ఇటు రూపాయీ
పట్టించుకోలేదు కానీ
పసిపిల్లల్లాంటి పూలు గుర్తెరిగి తెగి
రాలిపడి వుంటాయి తడిగా-
అపుడు పలు ఛానెల్స్‌ పోటీపడి
అమానుష ఘటనను పదేపదే ఫోకస్‌ చేశాయి కానీ
మర్నాడే కుతంత్రాల చాంతాళ్ల సీరియళ్లతో
రాత్రి క్రైమ్‌ కథనాల్తో వెర్రి విన్యాసాల్తో
టీఆర్‌పీ రేటింగ్‌ పరుగులో మునిగిపోయాయి
అపుడు దారుణం దారుణం అని
ఉత్తి గొంతుకల్తో నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని
ఊగిపోతూ ప్రకటించారు కానీ
ఆ తెల్లవారే సింహాసనాల కోసం
యాత్రల్నీ, సరికొత్త డెడ్‌లైన్లను
రూపొందించే నాటకీయతలోకి
వడివడిగా మళ్లిపోయారు
అపుడు మాల్సూ పబ్బులూ మల్టీప్లెక్సులూ
మౌనపడలేదు మూతపడలేదు కానీ
ఇంటా బయటా ఆడపిల్లలకు
కత్తులదారులే మిగిలినందుకు
ఇళ్లల్లో తల్లులు భయచిత్తులై
‘ఇందుకా కొడుకుల్ని కనేది’ అని
కడుపు తరుక్కుపోయేట్టు రోదిస్తూ
కుప్పకూలారు శోకగర్భాల్తో`
ఐనా ఏమనుకుని ఏం లాభం
అగ్ని చల్లారిన కాలం ఇట్లా కాక
ఇంకెట్లా వుంటుంది
పెంపకాల్లో అగ్ని లేదు
పరిసరాల్లో అగ్ని లేదు
దూరతీరాలకూ భారీ ప్యాకేజీలకు
ఎగరడమొక్కటే నేర్పే
చదువుల వాకిళ్లలో అగ్ని అసలే లేదు
చేతులు కీబోర్డులకే అంకితమైనాక
పిడికిళ్లెందుకుంటాయి
సంపాదనలే సర్వస్వాలైన
జీవన ప్రణాళికల్లో అగ్నికి చోటేది
జెండాల ఎజెండాల్లో జీవితాలు కాక
సింహాసనాలే చేరిపోయాక
అగ్ని ఎలా వీస్తుంది విస్తరిస్తుంది
అంతటా సర్దుబాట్ల శీతల ఒడంబడికలు
కుదిరిపోతున్నపుడు
అగ్ని ఎలా బతుకుతుంది
అగ్ని చల్లారిన కాలం
మృతశిశువులాగా కాక ఇంకెలా వుంటుంది
కిరాతకుల్ని క్షణాల్లో బూడిద చేసే
కణకణమండే అగ్నిని తెచ్చేవారి కోసం
ఈ నేల ఎదురు చూస్తున్నది
ఒక్క నేలేనా!
ఆడపిల్లను కన్న ప్రతి తల్లీ
ఎదురుచూస్తున్నది మోదుగుపూల కళ్లతో!

మార్కెట్ కూలలేదు గానీ / ఆకాశం తప్పక ఆగ్రహించే వుంటుంది’ అంటున్నాడు.

‘business as usual’ అని ఇంగ్లీష్ లో ఒక మాట వుంటుంది. ఇక్కడ మానవత్వం మంట గలిసి పోతున్నా వర్తమాన తరం రోజువారీ వ్యాపార లావాదేవీలు క్షణ మాత్రం కూడా స్తంభించకుండా సాగిపోతుంటాయి. కానీ, సంస్కారాన్ని నేర్పిన గత తరాలు మాత్రం తప్పక ఆగ్రహిస్తాయి. అందుకే అంటున్నాడు – ‘ఆకాశం ఆగ్రహించే వుంటుంది’ అని!

పసిపిల్లల్ని కూడా వదలని కిరాతకం నిర్భయంగా, నిర్లజ్జగా తిరుగుతున్నదంటే నమ్ముకున్న కాళ్ళ కింది నేల కూడా కొండచరియలలా విరిగి కిందకు పడిపోతున్నదని కదా! ఆ ఉత్పాతాన్ని గ్రహించే సున్నితత్వం నేల మీది పూలకు కాక, నింగికీ, నేలకూ నడుమ విహరించే గరుకు డాలర్లకూ, రూపాయలకూ ఎక్కడిది?

‘పూల వంటి పసిపిల్లలు’ అని కాకుండా ‘పసిపిల్లల వంటి పూలు’ అంటున్నాడు కవి. సౌకుమార్యానికీ, సౌందర్యానికీ ప్రతీకలు కదా పూలు – పిల్లలూ.

ఇటువంటి అమానవీయ సంఘటన జరుగగానే, బాధ్యతగా వ్యవహరించవలసిన ఎలక్ట్రానిక్ మీడియా ఏం చేస్తున్నది? పగలు ఈ సంఘటనను పదే పదే చూపి, రాత్రయే సరికి తమ టి ఆర్ పి మెరుగు కోసం  ‘కుతంత్రాల చాంతాడు సీరియళ్ళ, క్రైం కథనాల ప్రసారాల పరుగులో మునిగిపోతాయి’ అంటున్నాడు.

ప్రసారం చేసే ప్రతీ కార్యక్రమాన్ని ‘పెరిగే వీక్షకుల సంఖ్య – మెరుగు పడే వ్యాపార అవకాశాలు’ గా మాత్రమె చూసే ఎలక్ట్రానిక్ మీడియా నుండి ఇంతకన్నా ఏమి ఆశించగలం?

బాధ్యతగా వ్యవహరించవలసిన మీడియా ఇట్లా వుంటే, ప్రజలకు జవాబుదారీగా వుండవలసిన నాయకులు ఎట్లా వున్నారట?
తీవ్ర దిగ్భ్రాంతిని ఊగిపోతూ ప్రకటించారు కానీ ఆ తెల్లవారే సింహాసనాల కోసం
నాటకీయతలోకి వడివడిగా మళ్లిపోయారు’  అని బాధతో వెక్కిరిస్తున్నాడు. దేనినైనా తుడిచేసుకుని వెళ్ళిపోయే ఈ అరుదైన జాతికి ఈ కవుల వెక్కిరింతలు మాత్రం ఒక లెక్కా?

మరి, ‘ ఇంటా బయటా ఆడ పిల్లలకు కత్తుల దారులే మిగిలాయని’ భయకంపితులై ఇళ్ళల్లో రోదించే తల్లులకు సమాధానం ఇచ్చే వాళ్ళెవరు? వాళ్ళను సముదాయించే వాళ్ళెవరు? ఆ తల్లులు, ‘కిరాతకుల్ని క్షణాల్లో బూడిద చేసే’ అగ్నిని తెచ్చే వారి కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నాడు కవి చివరలో.

సరేగానీ, ఇంతకూ మనుషులలో ఇంత కిరాతకత్వం ఒక మాయదారి రోగంలా ఎప్పుడు ప్రబలింది?

పెంపకాల్లో అగ్ని లేదు / పరిసరాల్లో అగ్ని లేదు / దూరతీరాలకూ భారీ ప్యాకేజీలకు / ఎగరడమొక్కటే నేర్పే / చదువుల వాకిళ్లలో అగ్ని అసలే లేదు’ అని ఈ మాయదారి రోగం మూల కారణాల లోలోకి మనల్ని తీసుకు వెళ్తున్నాడు కవి.

అంతేనా?

చేతులు కీబోర్డులకే అంకితమైనాక / పిడికిళ్లెందుకుంటాయి / సంపాదనలే సర్వస్వాలైన / జీవన ప్రణాళికల్లో అగ్నికి చోటేది’ అని వాపోతున్నాడు కవి.

ఈ ఎత్తిన పిడికిళ్ళు దేనికి సంకేతం?

‘సమాజంలో ఒక వెచ్చని మానవీయ స్పర్శని నిరంతరం రక్షించవలసిన రాజకీయాల జెండాల ఎజెండాలలో అమూల్యమైన ప్రజల జీవితాలు కాక సింహాసనాలే చేరడం వల్ల కదా ఇప్పటి ఈ దిక్కుమాలిన పరిస్థితి’ అని నిలదీస్తున్నాడు కవి.

కవిత చివరకు వచ్చేసరికి, మృత శిశువుగా మారిన ఈ వర్తమాన కాలస్థితికి అసలైన కారణం ఏమిటో చెప్పకనే చెప్పాడు కవి.

నిజానికి, ఈ వేదన, ఈ ఆగ్రహం ఈ కవి ఒక్కడిదేనా?

కాదు కదా … ఇవి మన వేదనలు, మన ఆగ్రహ ప్రకటనలు కూడా కదా!

మరి, ఈ కవిత ద్వారా ఈ కవి చేసిందేమిటి?

Jane Kenyon చెప్పినట్టు -

The poet’s job is to put into words those feelings we all have that are so deep, so important, and yet so difficult to name, to tell the truth in such a beautiful way, that people cannot live without it

**** (*) ****