వినగలిగితే
నిశ్శబ్దం చీకటి గదిలోనలుపు పాటగా మారి
తనను డాల్బీ సౌండులో పాడుకుంటుంటుంది
చెవులు రిక్కించి ఆ సాహిత్యం పోల్చుకోలేక
మెత్తటి అడుగులు వేస్తూ లోపలకు భయపడుతూ వెడతామా?
మన కన్నా అక్కడ ఒక నీడ ఎక్కువగా కంగారు పడుతుంటుంది
ఆ నీడ గదిలో దీపానిది
గది గోడ మీద వణికిపోతూ కనిపిస్తుంది
దీపం కూడా పాపం తన వెలుతురు చూడలేదు
నీడకు భయం నిశ్శబం పాట వినపడకో అడుగుల శబ్దం వల్లనో తెలియదు
తనతో సెల్ఫీ దిగుదామన్నా దొరకనంతగా రెపరెపలాడుతుంటుంది
నిశ్శబ్దంగా ఉండే చోట వర్తమానం గతం తాలూకు గుసగుస లాంటిది
దీపమూ దాని నీడా అదే గుసగుసలాడతాయా
దీపమూ నీడా కాకుండా ఇంకెవరు గుసగుసలాడతారు?
ఏం తెలుసుకుంటారు
రెండో మూడో మాటలు లోతు గుండె గర్భం వీడి
పెదవుల మీద పుట్టడానికి పట్టే సమయమే నిశ్శబ్దమనీ కచ్చితంగా తెలుసుకుంటారు
వాన భళ్ళుముంటున్నపుడు కూడా
ఆకాశం నిర్మలంగా కనిపించడం లాంటిదేనని కనుగొంటారు
మాట
గోడ మీద దీపం నీడలా కాదు
ఓ వాల్ పేపర్ మీద అప్పటి జీవితాన్ని ద్రశ్యకావ్యంలా మార్చుతుంది
పెదవులమీది నిశ్శబ్దాన్ని దృశ్యకావ్యంలా మలచిన తీరు లాలస గారి కవిత్వం.