ఆ రోజు పొగ మబ్బులు ఆవరించిన తొలివేకువ ఝామున
పచ్చిక బయళ్ల పైన గడ్డి చామంతులు, లిల్లీ పూలు దిగులుగా తలలూపుతున్న ఆ క్షణాన్నే
ఏనాటిదో కాలం తెలియని ఆ పురాతన రావిచెట్టు పక్కన మట్టి దిబ్బ పైన
నిలిచిన మేం పుట్టిన ఆ ఒంటరి ఇంటిని వదిలి బయలుదేరాం
తల్లులం, పిల్లలం ఒక్కొక్కరుగా ఒకరి తరువాత ఒకరుగా
మా పాదాల చప్పుడుకి, ఉగ్గపట్టిన సన్నటి దుఃఖ రాగానికీ
చూరులో చలికి ముడుచుకు పడుకున్న ఉడుత ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగెత్తింది
అందరికన్నా చిన్న దాన్నేమో అమ్మమ్మ పక్కనుండి నక్కినక్కి చూసాను వెనక్కి
పలుచటి తెలుపు, లేత బూడిద వర్ణ మేఘాల మధ్య వెలసిన నీటి రంగు చిత్రంలా
మసక మసకగా కనపడుతోంది వదిలేయాల్సి వచ్చిన ఇల్లు
నాలాగే అమ్మా, అమ్మమ్మా, వాళ్ల అమ్మా రహస్యంగా చూస్తూనే ఉన్నారు
కలత చెందినప్పుడు వచ్చే కలల్లో వాళ్ళు పుట్టిన ఇంటి కేసి దిగులుగా
వదిలి వెడుతున్న ప్రియమైన దాన్ని దేనినైన
మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లగలమా?
మరెక్కడికో ప్రవాసం వెళ్ళడమంటే నిన్ను నువ్వు కాస్త అక్కడే కోల్పోయి పోవడం
ఇంటి ముందు వసారా పైకి పాకిన జూకామల్లెల వాసన గాలితో కబురంపింది
తానట్లా ప్రియమైన మనుష్యుల అలికిడి లేని ఇంటిని అల్లుకోవడం
మాట్లాడని సమాధుల్ని కౌగలించుకుని పూయడం లాంటిదని
కొండ దిగువన సెలఏటి పక్కన పచ్చిక బయళ్ళ మధ్య సన్నటి ఆ కాలిబాటపై నిలబడి
వెనక్కి తిరిగితే కనబడుతుంది రెక్కలు ముడుచుకున్న గువ్వలా మా ఇల్లు
ఆ కొండ పైనుండే పరుగెత్తుకు వచ్చింది నా అంతప్పుడు మా అమ్మ
తూనీగల రెక్కలకి దారాల్ని కట్టి ఎగరేస్తూ.
మా అమ్మమ్మ, ఆమె చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా
బహుశా ఆ సెలఏటి నీటిపై పడి తళతళా మెరిసే సూర్యుడిని
పట్టుకునేందుకు నీళ్ళలోకి ఆత్రంగా దిగినవారే
ఏముంటుంది చెప్పండి, ఒక సారి చేతుల మధ్యకు తీసుకున్నాక
మన అరచేతి గీతల ఆనవాళ్ళుతప్పా
నీళ్ళకి ఇక రంగులు, మెరుపులు ఏవీ అంటవు కదా!
నాకు మల్లే, వాళ్ళెవరికీ సూర్యుడు దొరకలేదు జీవితపర్యంతం
ఎన్నో యుగాలు గడిచిపోయాక ఇక ఇప్పుడన్నా
పొగమబ్బులు కమ్ముకుని ఆకాశము, నేలా తేడానే తెలియని వేళలల్లో
నా దోసిటలో రాలే కన్నీళ్ళలోనైనా
సూర్యుడు కనబడతాడేమోనని వెతుక్కుంటాను
చలికి,బూడిదలో ముడుచుకు పడుకున్న పిల్లి పిల్లలా
సూర్యుడు ఎక్కడో వెచ్చగా నిద్ర పోయాడు
తూనీగల రెక్కలు విరిగిన చప్పుడు వినపడుతుంది ఒక్క క్షణం
పచ్చటి గడ్డిలో తళుకులీనే ఎర్రటి మొఖ్మల్ పురుగులను, గొంగడి పురుగులను
పట్టుకుని అగ్గిపెట్టెలో మెత్తటి గడ్డి పరిచి దాచినప్పుడు,
విరిగిన పాలపన్నును, రూపాయ బిళ్లను ఆ దేవదారు చెట్టు మొదట్లో నాటినప్పుడు
దాచుకున్నవన్నీ రెట్టింపు అవుతాయన్న పసితనపు అమాయకపు ఆశ
సరిగ్గా అలాంటివే కాకున్న అట్లా అనేక ఆశల్ని మోసుకుంటూ
చివరికి ఏవేవో కూడబెట్టుకునే పరుగు పందెంలో తప్పిపోయిన జీవితాన్ని
మునిమాపు వేళ ముదిమిలో ఎక్కడెక్కడో వెతుక్కునేప్పుడు
సరిగ్గా మొదటి సారి వలస వెళ్లినప్పటిలాంటి నొప్పి గుండెల్లో మెలితిరుగుతుంది
మా అమ్మా ఆమె అమ్మమ్మా ఇంకా అలాంటి అనేకులు
అసంపూర్ణ ఆశలతో మరణించిన ఆడవాళ్ల సమాధుల మీద పడుకుని
సరిగ్గా వాళ్ళలానే ఒక పారదర్శకపు కలని కంటూ నిదురించారు
వాళ్ల కలల్లో ఇంద్రధనుస్సు రంగులన్నింటితో వెలిగే నీటి బుడగ వంటి అసలు కల
హఠాత్తుగా పగిలిపోతున్న చప్పుడును వింటూ భయంతో ఉలిక్కిపడి మేల్కొన్నారు
అనేక మార్లు అచ్చం అలాంటి కలే నాక్కూడా వస్తుందెందుకో
వదిలేయాల్సి వచ్చిన వాళ్ళం మనం పుట్టిన ఆ ఇంటికి మరింకెన్నడూ వెళ్ళలేం
ఆ తరువాత నుదుటిపై నల్లటి మచ్చ వున్న
రాగిరంగు విశ్వాసపాత్రపు కుక్కపిల్లలా తోక ఊపుతూ
మన మెడలకు వేలాడే ఇనుప గొలుసును పట్టుకున్న ఇతరుల ఇళ్ళలోకి వెడతాం
మనది కాని చోటులో, మనదైన కాస్త జాగాకోసం వెతుకుతాం
వికారంగా పుట్టినా, మెల్లి, మెల్లిగా రంగు రంగుల రెక్కలు విచ్చుకుని ఎగిరే
పంచవన్నెల రామచిలుకల లాంటి సముద్రపు అలల్ని పట్టుకునేందుకు వలలు పరుస్తాం
అలల కలల పక్షులన్నీ వలల నుండి నీటిలా జారిపోతాయి
ఇదిగో ఇప్పుడు నా వలె నా పిల్లా వెనక్కి వెనక్కి చూస్తూ
తను పుట్టిన ఏటి చివరి ఒంటరి ఇంటిని వదిలి
ఉక్కపోసే మిట్ట మధ్యాన్నపు వేసవి దినాన వెళ్లిపోయింది.
నీటి రంగుచిత్రంలా ఇల్లు వెంటాడుతూనే ఉంటది , విమల కవిత్వంలా .