కవిత్వం

గడిచిపోని ఈ క్షణం

ఫిబ్రవరి 2018

ఏమీ చెప్పకుండానే వదిలి వెళ్ళిపోతుంది
చేయిపట్టుకు నడుస్తున్న స్నేహం
కోల్పోయిన ప్రతిసారి కనిపిస్తుంది
చీలిపోయి వెళ్తున్న ఆ నీడ
ఆ లోపలి శత్రువు వెంటే

సంయమనపు మొహమాటం!
ఒక్క అడుగునీ అదిలించలేక
కురిసిన నిప్పులకు సమధానం
పారడాక్సికల్ పెదవుల పైన
మెరిసిన ఓ చిరునవ్వు

తెలియదు అపరాధము!
వెలివేతలో వెక్కుతూ
తేల్చని క్షణాలను బతిమాలుకుంటూ
ఆశలేని చోట ముగియని నిరీక్షణ
ముసురుకునే గుబులు దుఃఖమై

గుండె సంకోచంలో నిద్రపోతోంది ఈ క్షణం
గూటి చీకటిలో గుంజాటనలో…