వచ్చేయకూడదా
చెప్పా పెట్టకుండా అయినా
అమావాస్య నాడైతే ఏం?
నా కన్నుల వెలుతురు చాలదూ నీకూ నాకూ
నువ్వొస్తే ఇప్పుడు వింటున్న ఈ పాట మళ్ళీ నీతో వినాలి
వింటున్నప్పుడు నిన్ను చూడాలి
ఎప్పటిలాగా ఉత్తినే నిను చూస్తూ
మరచిపోతానో మైమరచిపోతానో తెలీదుకానీ
ఆ ఊహ ఒకటి బావుంది
ఈ గోధుమరంగు అట్ట పుస్తకం ఇప్పుడే ఎదురుగా పెట్టేసుకోవాలి
నువ్వొచ్చే వేళకి మరచిపోతానేమో, పోయినసారిలాగా
కళ్ళెదురుగా ఉండికూడా కంటబడకపోతే ఆ నేరం నాదికాదురా
గంటలని గుప్పెట్లోకి తీసుకొని క్షణాలుగా మార్చి విసిరేస్తావే
నీది ఆ నేరం, ముమ్మాటికీ నీదే
నిన్న కాఫీ కప్పు పట్టుకొని ఈ పెరట్లో తిరిగేటప్పుడు
ఎంతలా అనుకున్నానో తెలుసా
ఏమిటో తను వచ్చినట్టే ఉండదు, ఉన్నట్టే ఉండదు
ఈ ముదురాకుపచ్చటి తీగలు,
లేత ఆకుపచ్చటి నైట్ క్వీన్ పూలు
ఎంత చిన్నబుచ్చుకున్నాయో కదా
‘ఎప్పుడూ చెప్తూ ఉంటావే కానీ చూపించవు’ అని
ఈసారైనా గుర్తుగా ఒక్క అడుగు ఇటు వెయ్యాలి, సరేనా
నీకోసం కాచుకున్నంతసేపూ నా లోపల
ఒక పియానో బీజియం సాగుతూనే ఉంటుందిరా
దాన్ని నీకెలా వినిపించాలో తెలియదు.,
ఒక్కోసారి ఎంత గింజుకుంటుందో
అనుపల్లవిలో హెచ్చుస్వరం అందనట్టు
నువ్వంటావు కదా
‘ఏ పూల రంగులు అద్దుకున్నావ్
కనురెప్పలకీ, కనుబొమ్మలకీ మధ్యన ?’ అని,
అద్దం దగ్గరకి వెళ్ళినప్పుడు గుర్తొచ్చి వెదుకున్నాను
అలాంటిదేం లేదు, నిజంగానే
బహుశా నీతోపాటు మోసుకొచ్చిన ఆశల ఇంద్రధనస్సు
నా ముఖాన ప్రతిబింబిస్తోందేమో, నాకేం తెలుసు?
మళ్ళీ కన్నులకి పున్నమి ఎప్పుడో తెలీదు కానీ,
అల్లుకోనీ కాసిన్ని నీ తలపులని!
Namasthe andi rekha gaaru, e roju maro konam lo aaswaadinchaamu mee kavithvaanni. Amaavaasya ane kaadu ye thidhi kyna mee aahvaanam o adrustame kadaa…
ధన్యవాదాలు లక్ష్మి గారూ
బావుంది ఈ శృంగారగీతం. డ్రీం సాంగులా వుంది. అయినా ఈరోజుల్లో కూడా గోధుమరంగు అట్ట బుక్సెందుకండీ సెల్లులుండగా.
అజిత్ గారూ, సెల్ ఫోన్ కి side effects చాలా ఉన్నాయి కదండీ, కానీ ఏ రోజులకైనా పుస్తకాలే కదా మంచి నేస్తాలు
కాఫీ కప్ పట్టుకొని తోటలో విహరించటం చాల బాగుంది, ఈ కాంక్రీట్ JUNGLE లో ఆ తియ్యటి తలపులు ఎంతయినా మిస్ అవుతున్నాం. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మీ కవిత చాలా బాగుంది.
ధన్యవాదాలు sharma గారూ!!
దగ్గరి స్నేహితులెవరైనా ఇంటికి వచ్చి వెళ్ళాక కాల్ చేసి చెప్పే మొదటి మాట మీ పోయెమ్ టైటిల్ అండీ ‘ ఈసారి నువ్వొస్తే’ , ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ మరచిపోతాం కాబట్టి. చాలా బాగుందండి. – సంధ్య
అవునా, థాంక్యూ సంధ్య గారూ!!
బాగుంది రేఖ….
Thank you Lalli…
రేఖాజ్యోతి గారూ! మీ కవితను చదివి, మెచ్చుఁకుంటూ మిమ్మల్ని అభినందించాలనుకున్నారు
కాకినాడ అక్కయ్య వాడ్రేవు వీరలక్ష్మిదేవి గారు.
ఈ సారి కాకినాడ వెళ్లినప్పుడు ఆ శేఫాలిక కు వెళ్లి వాడ్రేవు వీరలక్ష్మిదేవి గారిని తప్పకుండా
.పలకరించాలని ఉందని చెప్పిన రేఖాజ్యోతి గారికి నెనర్లు.
_/\_