సంపాదకీయం

ఆమె: ఆకాశంలో కాదు, ఈ నేలలో సగం!

మార్చి 2013

“Every writer needs another set of eyes.”

అన్నాడట The Atlantic పత్రిక సంపాదకుడు విలియం విట్ వర్త్ ఒక సందర్భంలో! ఇప్పుడు అదే మాటని తెలుగులో స్త్రీల సాహిత్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు గుర్తు చేసుకోక తప్పడం లేదు. తెలుగు సాహిత్యానికి కొత్త చూపునిచ్చి, కొత్త దిగంతాన్ని చూపించిన  స్త్రీల సాహిత్యం నిజానికి 1980ల తరవాతనే మొదలయింది. అప్పటి వరకూ పురుష నేత్రాలతో మాత్రమే అక్షరాల్ని చూడడం అలవాటయిన లోకానికి ఇంకో జత కొత్త కళ్ళు తప్పనిసరయ్యాయి. అయితే, ఇప్పటికీ ఈ కొత్త వాస్తవికతని చూడలేకపోవడమూ, చూసినా చూడనట్టు వుండడమూ అలవాటయిన అంధత్వం లేకపోలేదు. ‘అబ్బే…సాహిత్య వాక్యానికి లింగబేధం ఆపాదించలేమని’ కుటిల వచనాలు పలికే మగదొరలదే ఇంకా ఈ సగలోకం!

భాష అనేది దానికదే స్వతంత్ర వ్యవస్థ కాదు. అది దాన్ని పుట్టించిన సామాజిక  వ్యవస్థకి కట్టుబడి వుంటుంది. ఆ సమాజానికి పడీ పడీ చాకిరీ చేస్తుంది. దానికి సంబంధించిన ప్రతీకల్నీ అర్థచ్ఛాయల్నీ అనివార్యంగా మోసుకు తిరుగుతుంది. ఈ క్రమంలో భాష తన అర్థనారీశ్వరత్వాన్ని కోల్పోయింది. పురుషుడి తిరుగులేని ఆయుధంగా మారింది. మా రాత్రుల్ని మాకివ్వండి అన్నట్టుగా…  మా భాషని మాకివ్వండి…అంటూ స్త్రీలు మొదట్లో కొంత బతిమిలాడుకోవాల్సి వచ్చింది. కానీ, అలా బతిమిలాడుకుంటే దక్కిన భాష పరాధీన. ఈ పరాధీన అక్షరాలు అక్కరలేదు అని ప్రకటించి మాకంటూ ఒక కొత్త నిఘంటువు రాసుకుంటాం అని తెలుగు మహిళ 1980ల తరవాతనే సాహంకారంగా నిలబడింది తన అక్షరాల మీద తాను! తెలుగు భాషకి తన భావాల వ్యక్తీకరణకి అనువయిన చట్రం లేదనీ,  తగిన పదజాలం లేదనీ తెలుగు కవయిత్రులు ధిక్కార స్వరంతో పలికారు. ఈ స్త్రీ చైతన్య మలుపు లేకపోతే తెలుగు సాహిత్యం ఎలా వుండేదా అని ఆలోచించినప్పుడు అది పాతాళం కింద ఎక్కడో వుండేదని సమాధానం చెప్పడం కష్టమేమీ కాదు.

ఒక స్త్రీ తానే గొంతు విప్పి తనదయిన వాక్యం రాయనంత కాలం ఎంత మంది చలాలు వచ్చినా లాభం లేదు. ఒక స్త్రీ తానే పరిగెత్తుకు వచ్చి వూరేగింపులో మొదటి వరసలో నిలబడనంత కాలం ఎన్ని సంస్కరణలొచ్చినా వాటికి ఇసుమంత ప్రయోజనమే వుండదు. సామాజిక బహిరంగ ఆవరణలన్నీ పురుష స్వరాలతో క్రిక్కిరిసి వున్నప్పుడు పీలగా అయినా సరే స్త్రీ గొంతు వినిపించనంత కాలం ఆ సామాజికతలో న్యాయమూ ధర్మమూ అవిటివే అవుతాయి. స్త్రీ తన వేదనని తానే చెప్పుకోగలగాలి. తనపై పీడనని తానే ప్రతిఘటించాలి. నిర్హేతుక పరదాల చాటున తనని దాచేస్తున్న అహంకారాన్ని తానే చీల్చి చెండాడాలి. ఈ పదజాలం పరుషంగా వినిపించవచ్చు. ఇందులో సాహిత్య సున్నితత్వం లేదని భావుకులకు రవంత బాధ కలగవచ్చు. కానీ, సమాజంలో ఒక సగం చిమ్మ చీకటిలాంటి నిశ్శబ్దంలోకీ, రాయలేని తనంలోకీ నెట్టివేయబడ్డప్పుడు ఇంతకంటే పదునయిన భాష వాడలేకపోతున్నందుకు, నిజానికి ఈ భాష అసమర్థతకు, సిగ్గులేని తనానికి  సిగ్గేస్తోంది. ఈ భాషని పిరికి భాషగా మార్చిన పురుషాహంకారం మీద కోపం కట్టలు తెంచుకుంటోంది.

కానీ, ఈ పాతిక ముప్పయేళ్లలో అస్తిత్వ వాదాల వ్యక్తీకరణ పదును వల్ల తెలుగు సాహిత్యం వొక్కసారిగా వందేళ్లు ముందుకు దూసుకుపోయింది. స్త్రీలూ, దళితులూ, ముస్లింలూ తీసుకువచ్చిన కొత్త ఆయుధాలు తెలుగు సాహిత్య భాషకి నిస్సందేహంగా కొత్త చూపునీ, శక్తినీ ఇచ్చాయి. ఇందులోనూ స్త్రీలకి సింహ వాటా దక్కి తీరాల్సిందే. సరయిన సమయంలో సందర్భంలో అంటే- 1980లలో-  స్త్రీ వాదమే వచ్చి వుండకపోతే తెలుగు సాహిత్యం చీమూ నెత్తురూ లేకుండా పడి వుండేది. తెలుగు భాష పురుషాహంకారంతో లేని ఛాతీని విరగచాచుకుని బేషరంగా తిరిగేది.

ఈ సారి ‘వాకిలి’లో మీరు వినబోతున్న ఈ  స్త్రీ స్వరాలు కేవలం ప్రేమగీతాలు కాదు, లాలి పాటలు కాదు, జోల పాటలూ కాదు. కాకమ్మ కబుర్లు కావు, కాకరకాయ కథలూ కావు. అల్లిబిల్లి వూహల నవలా మల్లికలూ కావు.

రేవతీ దేవి ఒక కవితలో జాలిగా  పాడుకున్నట్టు స్త్రీ అంటే “ఒకానొక బలహీనతకి లొంగిపోయిన ఆశాగ్ని రేణువు” కాదు. నిజమే, మన దగ్గిర ఈ కాసిని అక్షరాలు తప్ప ఇంకేమీ లేవు. ఏం చెప్పుకున్నా అక్షరాలకే కదా చెప్పుకోవాలి! కానీ, ఒక నమ్మకంతో చెప్పుకోవాలి చెప్పుకునేది ఏదయినా, ఒక నిబ్బరంతో రాసుకోవాలి రాసుకునేది ఏదయినా! రేవతీదేవి మాటల్లో చెప్పాలంటే:

ఒక్క ఉదుటున చిచ్చుబుడ్డిలా ఎగిసిన ఈ చైతన్యం

నన్ను నేను తొలిసారిగా చూసుకున్న ఈ క్షణం

నేను బతికున్నట్టు తెలిసిన ఈ క్షణం నుంచి

నేనేం చేసినా చెయ్యకపోయినా

అందుకు బాధ్యత నాదే…

అనుకుని ముందుకు వెళ్ళాలి. ఆ బాధ్యత వొక జ్వాలగా రగులుతున్నంత కాలం -నిజం చెప్పాలంటే, తెలుగు సాహిత్యంలో పోయిన పాతికేళ్లే కాదు, వచ్చే పాతికేళ్లు కూడా స్త్రీలవే!

* * *

ఇక కొన్ని ‘వాకిలి’ కబుర్లు: ఈ ‘వాకిలి’ బృందం ఎవరెవరా అని రెండు నెలలుగా సాగుతున్న మీ ఎదురుచూపులకు ఇక తెరపడినట్టే. ‘వాకిలి’ కథలూ వచన విభాగానికి ఇక నించి సుజాత బెడదకోట, కొల్లి ప్రవీణ సంపాదకులుగా వ్యవహరిస్తారు. కవిత్వ విభాగానికి నారాయణస్వామి వెంకటయోగి, కాసుల లింగా రెడ్డి సంపాదకులుగా వుంటారు.

గమనిక:

అనివార్య కారణాల వల్ల ఈ నెల అఫ్సర్ గారి శీర్షిక ‘ఆనవాలు’ అందించలేకపోతున్నాం.

ముఖచిత్రం: Mandira Bhadhuri