కవిత్వం

వెయ్యి మొకాల ‘దేవుడు’

01-మార్చి-2013

అనుకున్నదంత అయింది.

1
వెయ్యి మొకాల దేవుడు మనకు వరమిచ్చెతందుకు యెప్పటి లెక్కనే కొత్త గడువు పెడుతడు. మనమేమొ ఏదో చెప్తడని, ఏదో ఇస్తడని నరాలు తెగెటట్టు, గుండెలు పొర్లె దుక్కం తో దీనంగ పక్షులోలె యెదిరి చూస్తం. చానా మంచోడని , ఇప్పటి దాంక మనకు దక్కాల్సినయన్నీ నాయంగా సవ్యంగా దక్కెటట్టు చేసిండని, వాని మీద వెడ్డి భ్రమతో గుడ్డి నమ్మకం పెంచుకుంటం. వాడు గడువు పెట్టినప్పుడల్ల మన శత్రువులంతా యేకమౌతరు – మన గుండెలు చీల్చిన నెత్తురు పచ్చితో గట్టిపడ్డ తమ ఐక్యతను చాటింపేస్తరు.

వాళ్ళు (కూడా మన వెయ్యి మొకాల దేవుడి వేర్వేరు మొకాలే) మనని యెక్కిరిచ్చుకుంట కారుకూతలు కూస్తరు – కమిరిన ఆకలి పేగులు తప్ప కప్పుకునెటందుకు బట్ట లేనోళ్లం, యాభై యేండ్ల సంది వేయి మొకాల దేవుని మొండి కాళ్ళను మొస పోసినా, యెదురు చెప్పకుండ మోసినోళ్ళం, మర్ల వడదామనుకోని, మన ‘మొరటు” భాష వాళ్ళని కష్ట పెడుతదేమోనని చేతులు నలుపుకుంటుంటం – గడువు దగ్గరైతున్నకొద్ది మన వయసు పోరగాండ్లకు చెప్పరాని ఉత్కంఠతోని ఆత్మహత్యల జ్వరమొస్తది –

2
గడువెల్లెటాల్లకు, వెయ్యి మొకాల దేవుని ఇంకో మొకం గడువుకు కొత్త భాష్యం చెప్తది – మళ్ళ మన జ్ఞానానికి కొత్త సవాలు విసుర్తది – మన అమాయకత్వానికి తర్జన భర్జనల పరీక్ష పెడుతది –– వాడు యింకో కొత్త మొకం తొడుక్కొని (యింతకు ముందు చూసిందా చూడనిదా మనకి యాదికి లేనంత కొత్తది) మల్ల ముంగటికొస్తడు – గడువు సాలలేదంటడు – ఇప్పటిదాకా వెయ్యి దాటిన శవాలు చాల్లేదంటడు – కొత్త శవాలు కావాలంటడు – ఇంకా సంప్రదించాలంటాడు – కొత్త నెత్తురు కోసం వేల మొకాల చీలిన నాలుకలు తోటి చాచి బుసకొడతడు –

గుడ్లల్లనే నీళ్ళు గుక్కుకోని గుక్కుకోని యెండిన కళ్ళగుంటలని, బలిసిన డెల్టా కొబ్బరాకుపచ్చ వెటకారంతో యెక్కిరిస్తది – ఇంకెంత మంది లేలేత వైసు పోరగాండ్లు చావాల్నో మళ్ళ సంప్రదింపులు జరపాలంటడు – మన ‘చిన్న’ దేవుండ్లు, వొక తునకనైన దొరకక పోతద అనుకుంట భక్తి గుంటలల్ల మునిగి తేలుతుంటరు. యేండ్ల తరబడి యెదిరిచూపులు, మోయలేని ఓర్పు బరువు వశపడక మనం కోపంతోటి భగ్గుమంటం – యేమ్మిగిలిందని మన దగ్గర మన ‘మొరటు’ భాష గాసునూనె తప్ప – మళ్ళా దాడి మన భాషమీద – మన మాటల మంటల మీద – మనలనే నేరగాండ్లను చేసుకుంట – మనమీదనే చట్టాల బండరాళ్ళు యిసురుకుంట – మనల్నే బోన్లెక్కించుకుంట –– కౌశ్కెడు నీల్లకోసం తండ్లాడిన మన పల్లెపల్లెన, యెండిన ఆన్గపుకాయ బుర్రల తంబూరాలు విలవిలా విలపిస్తయి – రాగం కోసం గుంజి కడుతున్న తీగ, కడుపుల కడలిని పాడలేక పుటుక్కున తెగిపోతది – గొంతు బొంగురువోయిన శోకం పిల్లికూనోలె తొక్కులాడుతున్నది

3
వెయ్యి మొకాల దేవుడు దొరికిన కొత్త నైవేద్యంతోటి నాలుక తడుపుకుంట సంప్రదింపులని చప్పరించుకుంట అసలు గడువే లేదంటడు

పొక్కిలైన వాకిట్ల, యెండిన చెట్టు చుట్టు,బక్క కాకి కావు కావు అనుకుంట గోసగా, గోలు గోలుగ చక్కర్లు కొడుతుంటది.