ఇంటర్వ్యూ: మూలా సుబ్రహ్మణ్యం
నమ్మిన ఒక్కో విలువా కళ్ళెదుటే కూలిపోతుంటే ఆధునిక జీవితం అట్టడుగున నిరాకారంగా కనిపించే అస్తిత్వం ఎదుట నిస్సహాయంగా నిలబడ్డ మనిషి వేదనని తెలుగు కవిత్వంలో మొదట పటుకున్నది బైరాగి. నవీన జీవితంలోని అత్యంత సూక్ష్మమైన ప్రశ్నలకి ప్రతినిధిగా కనిపించే మహాకవి బైరాగి తన అస్తిత్వ వేదనని గానం చేసేందుకు శబ్ద కవిత్వాన్నే వాహకంగా వాడుకున్నాడు. ఆయన కవిత్వంలో నిశ్శబ్ద పదచిత్రాలు ఎక్కడా కనిపించవు. అయితే పద చిత్రాలతో సైతం ఆ వేదనని అంతే గాఢంగా ఆలపించొచ్చు అని నిరూపించాడు ఇక్బాల్‌చంద్. “లక్ష ఆకలి చావులకు మించి/ఒక్క ప్రేమ రహిత హృదయ హత్యోదంతం/అతి పెద్ద నీచ కావ్యం” అని ప్రకటించిన ఇక్బాల్ చంద్ గారితో ముఖాముఖి.
***
“వేసవి
ఎడారి ఇసకలో తలదూర్చి
తనని వెతుక్కునే ఉష్ట్రపక్షిని చూశావా?
కవీ!
దాహం తెలుసా”
అని అడగ్గలిగిన మీ కవితా దాహం, ఆ దాహం తీర్చుకునేందుకు చేసిన సాధన గురించి చెప్తారా?
మొదటి నుంచీ మా ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది. ఉర్దూ కవి హీరాలాల్ మోర్యా గారు, దాశరథి గారు దరిదాపుగా మా ఇంటివారే. బాల్యంలో నేనూ, అఫ్సర్ మోర్యా గారింట్లోనే ఉండేవాళ్ళం. నాకు తెలిసి నా బాల్యంలో అఫ్సర్ కి పుస్తకం తప్ప మరో ప్రపంచం లేదు (బహుశా ఇప్పటికి కూడా అనుకుంటా). రోజుకి పదహారు గంటలు చదివేవాడు. నాతో మొదట కవిత్వం రాయించింది అఫ్సరే. అలాగే అఫ్సర్ గారి తండ్రి కౌముదిగారు స్వయంగా మంచి అనువాదకుడు, కవి. నాకు పేరు కూడా ఆయనే పెట్టారు. కౌముది గారి ప్రభావం ఆయన పిల్లల మీద కంటే నా మీద ఎక్కువగా ఉంది. కాబట్టి సాహిత్యం వంటబట్టడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. డిగ్రీ పూర్తయిన తర్వాత అఫ్సర్ రికమెండేషనుతో ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ గారింట్లో ఒక సభ్యుణ్ణైపోయాను. భుక్తికోసం నానా పాట్లు పడుతున్న రోజుల్లో సుధాకర్ గారు, హేమలత అమ్మ గారు నాకు అన్నం పెట్టడమే కాకుండా నన్ను ఒక కొడుకుగా చూసుకుంటూ నా బాధ్యత తీసుకుని రాత్రులు రాత్రులు ప్రాచీన తెలుగు ఉర్దూ సాహిత్య రహస్యాలను నాలోకి ఒంపారు. ఎలా రాయకూడదో చెప్పి, ఎలా రాయాలో నన్నే వెతుక్కోమన్నారు. సుధాకర్ గారి ద్వారా బేతవోలు రామబ్రహ్మం గారి పరిచయ భాగ్యం దక్కింది. నా ఉర్దూనోట సంస్కృతం పలుకు పలికించిన ఘనత రామబ్రహ్మం గారిదే. వాస్తవానికి యూనివర్సిటీలో ఆయన మాకు సంస్కృత పాఠాలు చెప్పాలిగానీ, సంస్కృతంతో పాటు ఎన్నో ఆధునిక సాహిత్య మర్మాలని బోధించేవారు. ఒక్కోసారి మాకు తెలీకుండానే మా ప్రశ్నలకి ఆయనలా జవాబులు చెప్తూ ఉంటే గంటలు గంటలు గడిచిపోయేవి . అలా యూనివర్సిటీలో బేతవోలు రామబ్రహ్మం, ఎండ్లూరి సుధాకర్ గార్ల పాఠాలు వినడం, రూంకి వచ్చేసి పుస్తకాలు చదువుకోవడం ఇంతే పని. ఇవాళ లైబ్రరీలో ఐదు పుస్తకాలు తెచ్చుకుంటే రేపటికి పూర్తైపోయేవి. కవిత్వం నాకు ఒక జీవనవిధానంగా మారడానికి వీళ్ళు ముగ్గురూ కారణం. అఫ్సర్ ఎండ్లూరి సుధాకర్ వీళ్ళిద్దరి కవిత్వ నిర్మాణ పద్దతినుండి బయటపడ్డానికి, నాకంటూ ఒక సొంత గొంతు వెతుక్కోడానికి ఎన్నో నిర్నిద్ర రాత్రులు గడపాల్సి వచ్చింది.
ప్రతి కవీ తనకంటూ ఒక కవిత్వ భాష (డిక్షన్) సృష్టించుకుంటాడంటారు. మీ కవిత్వం చదివితే మీకంటూ ఒక డిక్షన్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా సాధించుకున్నారు?
దానికి నా సంచార మనస్తత్వం తద్వారా రకరకాల పలుకుబళ్ళని ఆకళింపు చేసుకోవడం ఒక కారణమైతే , నా ఉర్దూ సంస్కృత సాహిత్యాల అధ్యయనం మరొ కారణం. బహుశా సంస్కృతం, ఉర్దూ కవిత్వం అధ్యయనం లోనుంచి ఈ నేర్పరితనాన్ని నేను దొంగిలించి ఉంటానేమో (నవ్వులు). ఏమైనా నా ఈ టెక్నిక్ ని చాలా మంది ప్రేమించారు. చాసో, మో, కాశీభట్ల వంటి వాళ్ళతో సహా.
ఒక భావం మీలో ఉద్భవించడానికీ, అది కవితగా బయటకి రావడానికీ మధ్య మీలో జరిగే సంఘర్షణ గురించి చెప్తారా?
ఒక భావం నాలో కలిగాక , కాగితం మీద పెట్టడానికి ముందు కొన్ని గంటలు, కొన్ని నెలలు ఒక్కోసారి కొన్ని సంవత్సరాల పాటు నేను ఆ స్థితిలోనే ఉండిపోతాను. ఆ భావానికి ఒక రూపం వచ్చిందని అనుకున్నప్పుడు మాత్రమే కాగితం మీద పెడతాను. కాగితం మీద పెట్టాక కూడా నిర్దాక్షిణ్యంగా ఎడిట్ చేసుకుంటాను. అందుకే నావి మేక్సీ కవితలు కావు. (నవ్వులు). కవిత్వంలో క్లుప్తత లేకపోతే అది అకవిత్వమౌతుంది. ఈ రహస్యం మన చాలామంది కవులకి తెలీదు. తెలిసిన కొద్ది మందీ కూడా పాఠకులకి అర్ధం కావాలనే ఒక బలహీనతలో పడి కవిత్వాన్ని పల్చన చేస్తారు.
ఎడిటింగ్ ఆర్ట్ ఎలా నేర్చుకున్నారు?
కవిత్వంలోనైనా , జీవితంలోనైనా నచ్చనిదాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాను. కాబట్టి నన్ను నేను ఎడిట్ చేసుకోవడమనేది నా జీవితంలో ఒక భాగం. అలాగే నా కవిత్వం కూడా. శిలలో అనవసరమైన భాగాలు తొలగించకపోతే శిల్పం కానేరదు కదా! (నవ్వులు)
కవిత్వ పరంగా మీకు సలహాలిచ్చిన వాళ్ళున్నారా?
(పెద్ద నవ్వు).. ఆ సలహాలని తృణీకరించడమే ఇవాళ్టి వరకు నేను చేస్తున్న పని. కవిత్వంలోనైనా, జీవితంలోనైనా ఎవరి దారి వాళ్ళు వెతుక్కోవాలని నేను నమ్ముతాను.
దేన్నైనా కవితగా మలచగల గొప్ప ప్రజ్ఞ ఉన్న మీరు ఈ మధ్య ఏమీ రాస్తున్నట్టు లేరు. కారణం?
నేను కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడానికి ఎక్కువ ఇష్టపడతాను. అందుకే నా శరీరంలో ఎక్కడైనా ఒక కత్తిగాటు తగిలితే రక్తానికి బదులుగా కవిత్వం కారుతుందని నమ్ముతాను. అయితే ఇప్పటికీ నన్ను నేను ప్రొఫెషనల్ కవిగా అనుకోడం లేదు. సహజంగా నేను స్లో రైటర్ని. నా సహచర కవి మిత్రులతో పోల్చుకుంటే గత పాతిక సంవత్సరాల్లో నేను రాసింది చాలా తక్కువ. అయితే కొండంత చెత్త రాయడంకన్నా గోరంత మంచి కవిత్వం రాసుకోవడం మేలు కదా! రోజూ ఏదో ఒకటి రాయాలని పనికట్టుకుని చెత్త రాసే బదులు రాయకుండా ఉండడంలో సాహిత్యానికి ఒక మేలు ఉంది. ప్రతీ పుట్టినరోజుకీ ఒక పుస్తకం అచ్చువెయ్యాలని నాకేమీ ఆతృత లేదు. ఒక ఉర్దూ కవి ఇలా అంటాడు
“షాయరీ క్యా మజాక్ సంజే లోగ్
హం తో తీస్ బరస్ సే లహూ బహాకే కహెనేకీ తెహజీబ్ సీకీ హై”
కవిత్వం అంటే ఒక పరిహాసమనుకుంటారు ప్రజలు
నేనేమో ముప్పై సంవత్సరాలు రక్తం ధారపోసి
పలికే మర్యాదని నేర్చుకున్నాను
మీకు నచ్చిన కవులెవరు?
శిష్ట్లా ఉమామహేశ్వరరావు, శ్రీరంగం నారాయణ బాబు, బైరాగి, వజీర్ రెహ్మాన్ , మో, నగ్నముని. ఇతర భాషా కవుల్లో బహుదూర్ షా జఫర్ , మీర్ తాకీ మీర్ , అక్తర్ షీరాణీ, బుల్లే షా, రూమీ, మహ్మద్ ఇక్బాల్ , ఫైజ్ , మజాజ్. ఇప్పుడు రాస్తున్న వాళ్ళలో రెంటాల కల్పన రచనలు నాకు చాలా ఇష్టం. ఆమె రచనల్లో ఒక తపన ఒక వెతుకులాట ఒక ఫైర్ మనల్ని ఒక అలౌకిక స్థితికి తీసుకువెళ్తాయి. అఫ్సర్ ముమ్మాటికీ ప్రొఫెషనల్ పోయెట్. అతని స్పాంటెనిటీ నాకు చాలా ఇష్టం. ఎండ్లూరి సుధాకర్ కవిత్వంలో ఆర్ధ్రత నాకు ఇష్టం. సీతారాం ఒకప్పుడు బాగా రాసేవాడు. నామాడి శ్రీధర్, సిద్దార్థ, అనంతు, గాలినాసర రెడ్డి, ఎమ్మెస్ నాయుడు సాయికిరణ్ కుమార్, ఇంద్రాణి, ప్రసూన, సుబ్రహ్మణ్యం, ఫిక్షన్లో బహుశా రఘోత్తమ కొత్త ద్వారాలు తెరుస్తారు. ఇంకా చాలా మందే ఉన్నారు గానీ పేర్లు గుర్తుకు రావడం లేదు.
వీళ్ళందరిలో బాగా ఇష్టమైన కవి గురించి చెప్తారా?
మజాజ్ అసలు పేరు అసరుల్లా ఖాన్. గొప్ప అందగాడు. ఉర్దూ మజాజ్ , తెలుగు బైరాగి ఒక్కరే. మజాజ్ కవిత్వం ఇచ్చిన మత్తు ఈ జన్మకు వదలదేమో! అలీఘడ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో అమ్మాయిలు అతని ఫొటోని పుస్తకాల్లో దాచుకుని ఆనందించేవారు. తర్వాత్తర్వాత మందుకు బానిస అయ్యాడు. మధుశాలలో మధువు తాగుతూ చిత్తుకాగితాలపై కవిత్వం రాసి ఉండలు చుట్టి విసిరేసేవాడు. అట్లా విసిరేసిన ఘజల్ పంక్తుల్ని నౌషాద్, తలత్ మహుమూద్ వంటి వాళ్ళు ఏరుకొచ్చి బాణీలు కట్టి సినిమాల్లో పాటలుగా వాడుకున్నారు. ప్రముఖ కవి జా ఇసార్ అఖ్తర్ కు స్వయానా బావ. నేటి ప్రముఖ కవి జావేద్ అఖ్తర్ కు స్వయానా మేనమామ. ఒకరోజు రాత్రి మిత్రులు బలవంతంగా తీసుకెళ్ళి ఒక మేడపైన మధు కవితా గోష్ఠి జరిపించుకున్నాకా ఎటు వాళ్ళు అటు అంతా వెళ్ళిపోయారు. మజాజ్ ఒక్కడే అక్కడే నిద్రపోయాడు. మళ్ళీ లేవలేదు.
కవులు మన ప్రాచీన సాహిత్యం చదవడం ఎంత వరకు అవసరం?
నిజానికి నాకు తెలిసిన చాలా మంది కవులకి ప్రాచీన సాహిత్య జ్ఞానం శూన్యం. ఒక పాఠకుడికి అవసరం లేకపోవచ్చేమోగానీ ఒక కవికి తప్పనిసరిగా అధ్యయనం అవసరం. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము ఈ మూడూ కావాలని మన పూర్వీకులే అన్నారు. నేను కవిత్వం మొదలు పెట్టిన తొలినాళ్ళలో వేగుంట మోహన ప్రసాద్ గారికీ, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గార్లతో గడిపిన సందర్భంలో ఒక అర్ధరాత్రి నన్ను కూర్చోబెట్టి నేను చదవాల్సిన యాభైరెండు పుస్తకాలని ప్రిస్క్రైబ్ చేసారు. అన్నీ ప్రాచీన సాహిత్య గ్రంధాలే. ప్రబంధాలతో సహా. వాటిలో చాలావాటిని ఎండ్లూరి సుధాకర్ గారితో చెప్పించుకున్నాను. కొన్ని మేమిద్దరం కలిసి చదువుకున్నాం. మన పూర్వీకులు ఏమి రాసారో తెలియకపోతే మనం ఏమి రాసామో , ఏమి రాస్తున్నామో తెలియని గందరగోళంలో కొట్టుమిట్టాడుతుంటాం. ఈమధ్య వస్తున్న కొందరి రాతలు చూస్తే ఈ విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది.
మీ దృష్టిలో కవిత్వం ఎలా ఉండాలి?
కవిత్వం ఎలా ఉండాలో కంటే ఎలా ఉండకూడదో చెప్తాను. రాజకీయ కార్యకర్తలు గోడల మీద రాయాల్సిన నినాదాల్ని కవిత్వం పేరుపెట్టి కవిత్వాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాజకీయాలు రసహీనమైనవి. కవిత్వం హృదయ సంబంధమైనది.
గతంలో మరి మీరు కూడా రాజకీయాల మీద కవిత్వం రాసారంటారు కదా.
అవును. సైకిల్ నేర్చుకునే క్రమంలో ఒక రెండు సార్లు కింద పడ్డాను. (నవ్వులు)
తెలుగులో ప్రస్తుత కవిత్వ పరిస్థితి ఎలా ఉంది?
నిజం చెప్పాలంటే చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. కవిత్వాన్ని పొట్టులో గింజల్ని వెతుక్కున్నట్టుగా వెతకాల్సి వస్తోంది. నిజానికి ఈ తప్పు కవులది అని చెప్పడానికి కూడా లేదు. మనకి ఈస్థటిక్స్ తెలిసిన పాఠకులు లేరు. మనవాళ్ళకి ఈస్థటిక్ సెన్స్ పూర్తిగా నశించింది. ఒక కవిత్వ విషయంలోనే కాదు, మనకి మంచి సినిమాల్లేవు, సంగీతం లేదు, ఆర్ట్ లేదు. అందుకే చాలా డ్రై గా అనిపిస్తోంది నేటి తెలుగు వాతావరణం. దానికి తోడు వాద వివాదాల రాజకీయాలు. ఎంతటి దౌర్భాగ్యమంటే కవిత్వం రాసిన కవే సాటి కవులతో ముందుమాటల ప్రశంసాపత్రాలు రాయించుకుని, తనే అచ్చేయించుకుని , తనే పంచిపెట్టుకునే ఒక దుర్మార్గ వాతావరణంలో తెలుగు సాహిత్యం కొట్టుమిట్టాడుతోంది. మిగిలిన భాషల కవిత్వాల్లో ఇంత దయనీయమైన పరిస్థితి లేదు. ఉదాహరణ చెప్తాను. కేరళలో ఒక హోటల్లో ఒక మిత్రుడితో బస చేసినప్పుడు కమలాదాస్ కవిత్వం గురించి మాట్లాడుకుంటుంటే మాకు టీ తీసుకొచ్చి ఇచ్చిన ఒక పది పన్నెండేళ్ళ కుర్రవాడు మా సంభాషణల్లో పాల్గొనడమే కాకుండా కమలాదాస్ గురించి మాకు తెలియని అనేక విషయాలు చెప్పాడు. అంతేకాక తనకు కమలాదాస్ తో పరిచయం కూడా ఉంది అని చెప్పాడు. ఇలాంటి స్థితి ఆంధ్రదేశంలో ఊహించగలమా?
దీన్నుంచి బయట పడే మార్గాలున్నాయా? తెలుగు కవిత్వానికి మంచిరోజులొస్తాయా?
మన తరం ఎలాగో రసహీనమైంది. కనీసం మన పిల్లలనైనా సౌందర్యత్మకంగా పెంచుదాం. కవిత్వాన్నీ తద్వారా వాళ్ళ తరాన్నీ వాళ్ళే రక్షించుకుంటారని ఆశిద్దాం.
అసలు మంచి కవిత్వమే రావట్లేదంటారా?
అలా అని కాదు. కానీ బహుళ ప్రచారపు అకవిత్వపు పొరల్లో దాగిన అచ్చమైన కవిత్వాన్ని వెతికి పట్టుకోవడం కష్టమౌతోంది.
మరి ముందు తరాలకి ఈ కొద్దిపాటి మంచి కవిత్వం ఎలా చేరుతుంది?
నన్నయ కాలంలో కూడా నానా రకాల చెత్త కవులు ఉండే ఉంటారు. వాళ్ళందరూ తెరమరుగయ్యారు కదా. అలాగే ఇప్పటి అకవులక్కూడా కాలం అదే గతి పట్టిస్తుంది. కవిత్వానికి నిజమైన గీటు రాయి ఎప్పుడూ కూడా కాలమే!
కవుల్లో సహజంగా ఉండే కీర్తి కాంక్ష మీద మీ అభిప్రాయమేమిటి?
కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు.
ముందు ప్రశ్న ఎందుకడిగానంటే మీరు ఒక కవితలో రాస్తారు “పఠితకు ఎదురుగా ఉన్న కవి కవిత్వానికి మొదటి శత్రువు” అని
నేనిప్పటికీ దాన్ని బలంగా నమ్ముతున్నాను. పాఠకుడికి కవి ఎవరో, కవి నేపథ్యమేమిటో తెలియాల్సిన అవసరం లేదు. కవిత్వం వలనే కవి తప్ప, కవి వల్ల కవిత్వం కాదు. పాఠకుడికి చేరాల్సింది కవిత్వం. కవి బయోడేటా కాదు.
మీ కవితల్లో మీకు నచ్చిన కవిత ఒకటి వినిపిస్తారా?
బైరాగి పాట
కొన్ని చెప్పుకోలేని చిక్కులు వుంటాయి
కనబడుతూ ఎవరూ తరమరు
కానీ ఈ దారంటే వెళిపోవాలి
చివరికి చేరాక అసలు రావల్సింది ఇక్కడకి కాదు
లోకపురుషులు
ఏమి ఆశించి మెట్లు పైకి ఎక్కుతారో
నేను దాన్ని వొదుల్చుకోడానికే
కిందకి దిగుతున్నాను
అవును- మీరు చక్కంటి సొంతదారులు
ఇహాన్నీ పరాన్నీ పొందారు -
ఆ రెండిట్నీ పోగొట్టుకున్న నేను
కనకూడని ఓ వింత స్వప్నం -
చీకట్లో రంగులతో పనేమిటి?
ఇప్పుడు చెప్పు
నేనేమైన ఆశించానా?
కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు.
ఈ వాక్యాలు నాకు బాగా నచ్చాయి.
అలాగే ఇక్బాల్ గారితో విభేదించిన విషయం జీవితంలో ప్రతి అంశమూ రాజకీయంతో ముడిపడి వున్న నేటి కాలంలో దానిని ఖండించకుండా కవిత్వం కోసం వైయక్తిక అనుభూతినే చెప్పమనడం. కవిత్వం కథ పాట నాటిక ఇలా ప్రతి కళారూపం ప్రజలను చైతన్యపరిచే సాధనం కావాలని నమ్ముతాను. లేక పోతే ఆ కళా రూపం మన గుండె కొకూన్ లో మాత్రమే మిగిలి పోతుంది.
” కవిత్వాన్ని పొట్టులో గింజల్ని వెతుక్కున్నట్టుగా వెతకాల్సి వస్తోంది.”కాదనలేని సత్యం. కాని ప్రామాణికతకు కొలబద్దలేవీ .పోట్టేదో గింజ ఏదో వెతకడానికి.అంతా పొట్టే అయినప్పుడు గింజను వింతగా చూసే స్థితి.అందుకే నేటి కవిత్వం కేవలం అర్ధం పర్ధం లేని సంభా ష ణ రూపాంతరం చెందకముందే ప్రాజ్ఞులు వివిధ ప్రక్రియల ప్రామాణికాల నిర్ధారణ జరిపితే బాగుంటుంది. అంతర్జాలం లో మన తెలుగు కవిత్వం, సౌకర్యం … యువకుల ఆసక్తిని కవిత్వం వైపు మళ్ళించడానికి మాత్రమె. నెట్ ప్రాక్టిస్ లాటిది.కవి ఇక్బాల్ చంద్ చక్కని అభిప్రాయాలు చెప్పారు.
చాలా రోజుల తర్వాత
ఇలా మరోసారి ఇక్బాల్ చంద్ గారితో మాట్లాడించటం చాలా బావుంది.
వాకిలి టీమ్ కు అభినందనలు.
కవిగా నన్ను ఇలా నిలబెట్టిన వారిలో ముఖ్యమైన వ్యక్తి ఇక్బాల్ చంద్.
మిస్ యు ఇక్బాల్ జీ…
ఇక్బాల్ చంద్ గారూ,
చాలా రోజుల తర్వాత మీ అభిప్రాయాలను వాకిలి ద్వారా చదవడం ఆనందంగా ఉంది. కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బ్రతకడం కష్టం అన్న మీ మాటలు అక్షర సత్యాలు. ఎంతకష్టమో మనకి చరిత్రే కాదు, కవులుగా ముద్రపడిన కొందరు సమకాలీన వ్యక్తుల జీవితాలు ఋజువుచేస్తున్నాయి. జీవితాన్ని తాత్త్వికతకి(వేదాంతం కాదు)దూరంగా, Water-tight Compartment గా వేరుచేసి బ్రతకడంవల్ల కావొచ్చు ఈ పరిణామం. మీకూ, వాకిలికీ అభినందనలు.
హాయ్ యిక్బాల్. ఏమైపోయావు/రు. ఈ వాకిలిలో/తో కనీసం యిపుడైనా కనిపించినందుకు ముచ్చటగా వుంది.
its really a great and useful interview for me ..
like a note to learn as an aspirant .
thank you iqbal jee for your great words which are
really like lamp to search for good literature and poems
చాలా సంతోషకరమైన సందర్భం ఇన్నాల్లకు ఇక్బాల్ గారి మాటలు వినటం చాలాఆనందంగా ఉంది
ఇలాఇక్బాల్ గారిని మాముందుంచిన వాకిలి పత్రికకు ధన్యవాదాలు.ఇక్బాల్ మా ఖమ్మం కవి అయినందుకు
నేనూ ఖమ్మం వాడినే అని ఛెప్పుకోవటానికి గర్వపడుతున్నాను.ఇక్బాల్ గారు మాకు అందుబాటులోఉంటే నాలాంటి చిన్నకవులు ఇంకా
బాగా రాయగలిగేవారు
‘ఇక్బాల్ చంద్’ ని ఇలా ‘వాకిలి’ లో కలవడం సంతోషంగా వుంది….
‘అఫ్సర్’ ని ప్రొఫెషనల్ పోయేట్ అనడం అంత బాగా లేదు…He is one of the best original poet in Modern Telugu Poetry, I feel..
కవిత్వం హృదయగతమైనది అన్న మాటతో ఎవరికైనా పేచీ ఉంటుందనుకోను….
కాకపోతే, హృదయాన్నీ, దేహాన్నీ, దేశాన్నీ ధ్వసించే రాజకీయాల నడుమ ఉక్కిరిబిక్కిరి అవుతున్నపుడు అవి కవిత్వం లోకి మాత్రం రాకుండా వుండడం సాధ్యపడుతుందా?…అసలు ఏ రాజకీయాలూ పట్టనట్టు వుండడం కూడా ఒక రాజకీయం కాదా?
అయితే, దేని గురించి రాస్తున్నామనే దానికన్నా రాసింది హృదయాన్ని తాకిందా, లేదా అన్నదే ఏ కవిత్వానికైనా లిట్మస్ పరీక్ష అని అనుకుంటున్నాను….ఈ మేరకు ఇక్బాల్ చంద్ చెప్పినదానితో వర్మ గారితో సహా ఎవరికీ అభిప్రాయ భేదం ఉండనవసరం లేదనుకుంటా!
కోడూరి గారికి ప్రొఫెషనల్ , ప్రొఫెషనల్ పొయెట్ అంటే అర్థం తెలవదు అని నేను అనుకోను, కాని నాకు తెలిసి అర్థం ఇది…
A person who is very skilled in a particular activity…
The main criteria for professionals include the following:
1.Expert and specialized knowledge in field which one is practising professionally.
2.Excellent manual/practical and literary skills in relation to profession.[8]
3.High quality work in (examples): creations, products, services, presentations, consultancy, primary/other research, administrative, marketing, photography or other work endeavours.
4.A high standard of professional ethics, behaviour and work activities while carrying out one’s profession .The professional owes a higher duty to a client, often a privilege of confidentiality, as well as a duty not to abandon the client just because he or she may not be able to pay or remunerate the professional. Often the professional is required to put the interest of the client ahead of his own interests.
5.Reasonable work morale and motivation. Having interest and desire to do a job well as holding positive attitude towards the profession are important elements in attaining a high level of professionalism.
6.Appropriate treatment of relationships with colleagues. Consideration should be shown to elderly, junior or inexperienced colleagues, as well as those with special needs. An example must be set to perpetuate the attitude of one’s business without doing it harm.
7.A professional is an expert who is a master in a specific field.
టిఎల్ ఆన్సరి అనే సూఫి కవయిత్రి తనను తానే ప్రొఫెషనల్ పొయెట్ గా చెప్పుకొంటూ రాసిన మాటల్ని కూడా గమనించండి..
Given that those are the working conditions of most poets, how exactly does one define “professional”? Or, since I can really only speak for myself, how can I claim that I’m a professional?
These would be some of my answers:
I claim I’m a professional because I take my art seriously.
I claim I’m a professional because I take my craft seriously. I work hard at it. I revise poems that I think are worthwhile. I work at improving my poetry skills and seeking out new challenges.
I claim I’m a professional because I seek professional advancement.
I claim I’m a professional because I support the community of my fellow practitioners
I claim I’m a professional because I accept the calling. I accept the responsibility of hearing a voice from elsewhere. I will do my best to be true to that voice; when it calls, I will listen hard and do my best to speak what it tells me. I will not betray it through laziness, self-absorption, or prejudice. I will make myself a radio, a trumpet, a megaphone, a hollow flute, a seashell full of whispers. I will be the best poet it’s given to me to be. So help me God.
@lathasharma….’నిజంగానే’ నాకు ‘ఇదంతా’ తెలీదు….మీరు యిచ్చిన సమగ్ర సమాచారానికి కృతజ్ఞతలు
Hello Iqbal Sir,
really good intervew..kotha poetry book eppudu vastundi?
Thanks to Vaakili team….
చక్కటి ప్రశ్నలు అడిగిన మూలా సుబ్రహ్మణ్యంకు అభినందనలు. సునిశితమైన సమాధానాలను శషభిషలు లేకుండా చెప్పిన ఇక్బాల్ గారికి అభినందనలు. వీటి కంటే కూడా రసవంతమైన ప్రశ్నలు సుబ్బూ వేయడాన్ని నేను చూశాను. ఇంతకంటే సంచలనాత్మకంగా ఇక్బాల్జీ సమాధానాలివ్వడం చూశాను.
రాజకీయాలు కవిత్వంలోకి రావాలనుకోవడం కంటే వ్రాయడం మానేసి రాజకీయాల్లోకే దిగడం మేలు. ఫలితముంటుంది. వ్రతం చెడ్డా ఫలం దక్కాలన్నారు పెద్దలు!
ఐనా ఎవరా అన్నది “కవిత్వాలతో విప్లవాలొచ్చేస్తాయని భ్రమపడకు!” అని? ఆ అన్నవారెవరో కవిత్వపు లోతుల్ని తెలిసినవారే ఐవుంటారు!
కవిత్వం వలనే కవి తప్ప, కవి వల్ల కవిత్వం కాదు. పాఠకుడికి చేరాల్సింది కవిత్వం. కవి బయోడేటా కాదు.మంచి మాటలు చెప్పారు,..ఇక్భాల్ చంద్ గారు, వీరి గురించి తెలుసుకోవడం,.కవిత్వంలోకి ప్రవహించడమే,..వాకిలి టీంకి అభినందనలు,.
౧.’పఠితకు ఎదురుగా ఉన్న కవి కవిత్వానికి మొదటి శత్రువు” అని
నేనిప్పటికీ దాన్ని బలంగా నమ్ముతున్నాను. పాఠకుడికి కవి ఎవరో, కవి నేపథ్యమేమిటో తెలియాల్సిన అవసరం లేదు. కవిత్వం వలనే కవి తప్ప, కవి వల్ల కవిత్వం కాదు. పాఠకుడికి చేరాల్సింది కవిత్వం. కవి బయోడేటా కాదు’-నాకు లాంటి అభిప్రాయం గల కవి ఇన్నాళ్ళకు దొరికినందుకు పుర్తి వంటరితనంలో ఉన్నానన్న భాధ కొంత తగ్గింది.
౨.రాజకీయ కవిత్వం రాయటం తప్పు కాదు.ఆ మాటకొస్తె రామాయణం, భారతం రెండూ రాజకీయ ప్రేరితాలె కదా! రసవిహీనం కావడం కవి ప్రతిభాలోపం వల్ల కావచ్చు.
౩.తెలుగులో కవిత్వం పరిస్థితి మరీ అంత దారుణంగా ఉందన్న వాదనతో నేనుఏకీభవించ లేను.కాకపోతే పాఠకుల్లో మునపటంత గ్లామర్ లేదు.ఒక రకమైన వ్యాపారదృక్పథంతో ఈతరం అవసరానికిమించి ప్రభావితమవుతున్న దుష్ఫలితాల్లో ఇదీ ఒకటేమో!
౪.ప్రాచీన సాహిత్యం చదవాల్సిన ఆవశ్యకతను గురించి మీరు చెప్పిన మంచి ముక్కలు ఇప్పటి కవుల చెవులకు ఎక్కితే బాగుణ్ణు.ఎదో చెప్పాలన్న తపన తప్ప..చెప్పే తీరులో ఎంత చిక్కతనం ఉందో చూసుకోవాలంటే..మీరన్నట్లు..ముందటి తరం కవులు ఎలా చెప్పారో అధ్యయనం చేయడం ముమ్మాటికి అవసరమే.
౫.సెల్ఫ్-ఎడిటింగ్ మీద మీరు వెలిబుచ్చిన అభిప్రాయం గొప్పది.
౭.మజాజ్ ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
మంచికవితో మాట్లాడిమ్చినందుకు వాకిలి టీమ్ కూ ధన్యవాదాలు
ఇక్బాల్ చంద్ గారి అభిప్రాయాలు పదునుగా, ఆలోచింపజేసేలా ఉన్నాయి.
‘కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు’ అనటం సాహసోపేతం. ‘పఠితకు ఎదురుగా ఉన్న కవి కవిత్వానికి మొదటి శత్రువు’ అనే కవితాపాదం ఎంత గొప్పగా ఉందో!
చాలా కాలం తరువాత ఇక్బాల్ గరి ముఖా ముఖి చదవడం సంతోషంగా ఉంది. నేను చదివిన కవిత్వంలో ఇక్బాల్ గారి ఆరోవర్ణం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సంకలనం లో అండర్లైన్ చేసిపెట్టుకున్న స్పందింపజేసే వాక్యాలు ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. 2006 లో మొదటిసారిగా ఆరోవర్ణాన్ని చూసాను. ఇక అప్పటినుంచీ జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఆ వాక్యాలు గుర్తుకొచ్చేవి. ఎన్నో సందర్భాల్లో దిగుల్ని పోగొట్టేవి. శక్తినిచ్చేవంటే అతిశయోక్తి కాదు. అటువంటి ఆణిముత్యాలు మచ్చుకు కొన్ని
“అనాగరికపు అబధ్ధపు గదుల్లోంచి మనిషి వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే”
“ఇక్కడ పాషాణ కత్తులైనా విత్తులై పాతుకుని మొక్కలై ఎదగాల్సిందే ”
“తడారిన గొంతులో
ఎండ మావుల వెంట పరుగులు తీస్తున్న
నన్నొక్కణ్ణే వదిలేసి
ఈ దగా మేఘాలు
అందరిపై వర్షిస్తాయెందుకో ”
అందమైన ప్రకృతిని ఎప్పుడు చూసినా మొదటివాక్యం తటాలున గుర్తొస్తుంది.
hattsoff Iqbal jI.
కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు._____________ అద్భుతంగా ఉన్నాయి ఈ వాక్యాలు! కవిత్వం కోసమే కవి రాస్తాడు. కీర్తి కోసం కాదు..
చక్కని ప్రశ్నల అల్లిక తో ఇంతమంచి ఇంటర్వ్యూ చదివి చాలా రోజులైంది
ఈ ‘వాకిట్లో ‘ ఇక్బాల్ ని చూడటం చాలా ఆనందంగా ఉంది . ఇక్బాల్ మనిషితనం వున్న కవి. ఇక్బాల్ లాంటి కొడుకుని మాకు ఇచ్చినందుకు నేను ముందుగా ‘అఫ్సర్’ కే థాంక్స్ చెప్పాలి .
Anna chala kaalamaindi nee palukulu vinee . Ee roju chaala annandamgaa undi intervew chuci. అచ్చమైన కవిత్వాన్ని వెతికి పట్టుకోవడం కష్టమౌతోంది nijame. Anna Untaa. RAM
ikbalki nachina kavitha chaala bagundhi…
Iqbal nu chusi chala rojulayyindi. Vaakilloki vachhaka sodarudi kavithvam, sodarudu kanpincharu. Santhosham. Vaakiliki Dhanyavadalu.
కవిత్వమంటే.. ఒక తపస్సు.. ఒక ఉషస్సు..
ఇలాంటి మంచి వాకిలిలో.. ఇన్ని అక్షరాల వెలుగుల్ని.. ఇక్బాల్ చాంద్ గారి ఇంటర్వ్యూ లా చదవడం.. వెన్నెల్లో సితార్ గీతం విన్నట్టే వుంది..
చాలా మంచి విషయాలు చదివిన, నేర్చుకున్న త్రుప్తి కలిగింది.
ఇక్బాల్ గారి వ్యక్తిత్వం, కవిత్వం పట్ల అయనకున్న ప్రేమ కదిలించింది.
interview బాగున్నది. ఆలోచనల్లోని,అభిప్రయాలలోని స్పష్టత నాకు నచ్చింది. ఇక్బాల్ చంద్ గారి భావజాలం స్పష్టమైంది. వారి చాల అభిప్రాయాలతో నాకు ఎకీభావమున్నది.శుభాకాంక్షలు,ధన్యవాదాలు.
మంచి విషయాలను చర్చించిన ఇంటర్వ్యూ
చాలారోజు ల త ర్వాత .
కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు.
మంచి ఇంటర్వ్యూ సార్