తలపోత

పిచ్చుకలొచ్చేశాయ్… యాహూ..

ఏప్రిల్ 2013

సంవత్సరం క్రితం వరకు.. సెల్ ఫోన్లూ, సెల్ఫోన్ టవర్ల దెబ్బకి మన హైద్రాబాద్ నుంచి పిచుకలు శాశ్వతంగా నిష్క్రమించాయన్న బాధలోనే వుండేదాన్ని. నా చిన్నప్పటి హైద్రాబాద్ లో పిచ్చుకల కువకువలతో తెల్లారేది.

పిచ్చుకల గూళ్ళు ఇంట్లో పెట్టకూడదని వాటి గూళ్ళని తీస్తూ అమ్మ మాట కాదనలేక అందులో గుడ్లు వుంటే చిన్నక్క మళ్ళీ వాటిని యధాస్థానం లో పెట్టేయడం, ఒక మంచి ఉదయాన.. పిల్లల కువకువలు వినిపించడం, అది వంటింట్లో వున్న వెంటిలేటర్ లో కావడంతో.. అవెక్కడ కింద పడతాయో అని ఊపిరి బిగపట్టి చూడటం,

నాన్నగారు మురిపెంగా వేసుకున్న ధనియాల మళ్ళల్లో కొత్తిమీర మొక్కలొస్తే.. వాటికి నాలుగు వైపులా చిన్న కర్రలు పాతి ఆ మొక్కల్ని పిచ్చుకలు తినకుండా, న్యూస్ పేపర్ కప్పి పెట్టడం (నాన్నగారి ఐడియా అది :) , సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వచ్చి చూసేసరికి మన పిచ్చుకలు అంతకంటే తెలివితో.. పేపర్ని ముక్కుల్తో తోసేసి, మొక్క మిగలకుండా తినేయడం, రాత్రి ఆఫీస్ నుంచి తిరిగొచ్చిన నాన్నగారు అమ్మ మీద చిందులు… ఇలా పిచుకలతో ముడిపడిన జ్ఞాపకాలెన్నో..

అయితే… పోయిన సంవత్సరం హఠాత్తుగా ఇంటి ప్రహరీ మీద రెండు ఆడా, మగా పిచ్చుకల్ని చూసి, ఆనందంతో షాకయినంత పనయ్యింది. అవి పిచ్చుకలేనా, నేనేమీ పొరబడటం లేదు కదా అని, మళ్ళీ మళ్ళీ చూసి కంఫర్మ్ చేసుకుని, బోల్డు ఆనంద పడ్డాను. ఇది లాస్ట్ ఇయర్ తీసిన ఫొటో.. మా పిచ్చికకి సిగ్గెక్కువలా వుంది.. ఫొటో షై అనుకుని సర్దుకుపోయాడు మా పెద్దవాడు. మళ్ళీ గూగుల్ లో సర్చ్ లో పిచ్చుక ఫొటోలు చూసుకుని హమ్మయ్య ఇది పిచ్చుకే నువ్వు కరెక్టే చెప్పావు మమ్మీ అని నాకో సర్టిఫికేట్ పడేశాడు.

ఇంట్లో వున్న విరజాజి పందిరి, సెంటుమల్లె పందిళ్ళూ వాటికి లివింగ్ కం స్లీపింగ్ రూంస్ అయ్యాయి. రోజూ వాటిని గమనించడం నాకూ పిల్లలకీ అలవాటయ్యింది. ప్రక్కనే వున్న పెద్ద వేపచెట్టు మీదకు ఇంకొన్ని పిచ్చుకలు వచ్చి చేరాయి. వాటి గూడు కట్టుకునేందుకు, యీ మొక్కల ఎండుపుల్లలూ, గడ్డి పరకలూ అవి సెలెక్ట్ చేసుకునే తీరు చూస్తే బహు ముచ్చటగా వుండేది. మగ పిచ్చుక ముక్కుతో ఎండు పుల్ల పట్టుకుని, ఆడపిచ్చుక ముందు సెలెక్షన్ ఓకే చెయ్యి అన్నట్టు నిలబడితే, ఆడపిచ్చుక ఎగిరి ఎక్కడ గూడు కట్టాలో సెలెక్ట్ చేసిన ప్లేస్ చూపించడం, అది మగ పిచ్చుకకి నచ్చకపోతే అది వేరే వైపు ఎగిరి పోవడం, అబ్బా… పిచ్చుకలకున్న ప్లానింగ్ మనకి లేదే అనిపించేది. ఇలా మా మొక్కల పందిళ్ళు రెండూ సాయంత్రమైతే చాలు పక్షుల కువకువల్తో మోగి పోయేవి.

విరజాజి పందిరి నిండా పిచ్చుకలు, ఇంకా వేరే పిట్టల కువకువలే.. ఎంత ఆనందమేసేదో! ఈ సమ్మర్ టైం కి సడన్ గా కొత్త బాచ్ పిచ్చుకలు కనిపించాయి. గోడ ఎత్తు కూడా ఎగర లేకపోతుంటే అర్థం అయ్యింది, మా సీనియర్ పిట్టల జూనియర్ పిల్ల పిచ్చుకలని. రెండు రోజుల క్రితం నుంచీ ప్రొద్దున్నే కాంపౌండ్ వాల్ మీద బియ్యం నూక, జొన్న గింజలు వేసి, చిన్న చిన్న ప్లాస్టిక్ మూతల్లో నీళ్ళు పెట్టి కాలేజీకి బయల్దేరుతున్నాను. మళ్ళీ సాయంత్రం అందరం ఇంటికి చేరే వరకూ పెరడు మొత్తం వాటి సొంతం. ఇవాళ ఆదివారం కావడంతో యధా ప్రకారం గింజలు వేసి, నీళ్ళు పెట్టి, చాటుగా నిలబడి చూస్తున్నాను. ఎవరో పిలిచినట్లు చప్పున వాలేసి, పడిన గింజల్ని చకచక తినేశాయి. నీళ్ళ సంగతే ఇంకా అర్థం అయినట్లు లేదు వాటికి. కింద చిన్న పగుళ్ళల్లో పడి నిలవున్న నీళ్ళూ తాగేసాయి. హ్మ్..ముందు ముందు అదీ నేర్చుకుంటాయి. మొత్తానికి పిచ్చుకలొచ్చేశాయ్… యాహూ..