కరచాలనం

మనుషుల కంటే అక్షరాలే ఎంతో ఇష్టం: కృష్ణుడు

ఏప్రిల్ 2013

ఒక కృష్ణుడు పొద్దున్నే లేచి రాత్రి దాకా వార్తల వేటలో రాజధానిని గాలిస్తూ వుంటాడు. ఇంకో కృష్ణుడు ఆ వార్తల కింద నలిగిపోతున్న పీడితుల గుండె చప్పుళ్లని అక్షరాల్లోకి తర్జుమా చేసి తన గుండె తడిని వాటికి అద్దుతూ వుంటాడు. ఆ మొదటి కృష్ణుడూ ఈ రెండో కృష్ణుడూ ఇద్దరూ ఇద్దరే! రెండు భిన్నమయిన రంగస్థలాల్లో నిలబడి రెండు చేతులా లోకాన్ని ఆవాహన చేసుకొని, నిండు గుండెలు పట్టేటంతగా ఆ లోకాన్ని ప్రేమిస్తూ, అప్పుడప్పుడూ కాస్త కోప్పడ్తూ…! కొప్పడేటప్పుడు ఎంత ప్రేమించామో చెబ్తూ, ప్రేమించేటప్పుడు ఎంత కోప్పడ్డామో చెప్తూ…ఈ లోకం లయ తప్పకూడదని తపన పడుతూ…! కృష్ణుడు కవిత్వంలాగా కబుర్లు చెప్తాడు, కబుర్లలాగా కవిత్వం చెప్తాడు. ఆ రెండీటిలోనూ తన మనసు పొట్లం కట్టి మనకందిస్తాడు…అందుకే ఈ కరచాలనం విలువయింది. వెల లేనిది…మన వాకిట్లో కాసేపు వొక మనసు అలికిడి…కవిత్వంలో ఆలూరి బైరాగి పురస్కారం అందుకున్న సందర్భంగా…

—————————————————

 అక్షరమంటే నా కెంతో ప్రేమో?

మనుషుల కంటే నాకు అక్షరాలే ఎంతో ఇష్టం. ఎందుకంటే మనుషులతో మాట్లాడుతున్నప్పుడు అక్షరాలు కనపడితే వారితో మాటల మధ్యే నా కళ్లు అక్షరాలను హత్తుకుంటాయి.

మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నేను పుట్టానని మా అమ్మ చెప్పింది. మా తాత అప్పరసు లక్ష్మీ నరసింహారావు గోలకొండ కవుల్లో ఒకరు. ఆయన తండ్రి ( మా ముత్తాత) ఒకప్పటి కర్ణాటకలో భాగమైన గద్వాల సంస్థానంలో మంత్రిగా ఉండేవారట. మా ఇంటిపేరులోని అరసు కర్ణాటక మూలాల గురించి నా పరిశోధన ఇంకా సాగుతోంది. అగణిత భోగభాగ్యముల ఆసవహింపగలేదు కాని అని మా తాత తన వీర రాఘవ శతకంలో రాసిన పద్యం ఇప్పటికీ నా చెవుల్లో నిత్యం ప్రకంపిస్తూ ఉంటుంది. అవును.. అక్షరం ముందు భోగభాగ్యాలెంత?

మేము అయిదుగురు అన్నదమ్ములము. అయితే మా తాతకు మా పెద్దన్న అయిన విజయరామారావు, మూడోవాడైన నామీద ఎక్కువ ప్రేమ అని చెప్పేవారు. ఆయన వద్ద ఎక్కువకాలం పెరిగినందువల్ల మా పెద్దన్న సంస్క­ృత పండితుడైనాడు. నాతో చిన్నప్పుడు అమరకోశం, భారత, భాగవతాలు, అన్నిసూక్తాలు చదివించేవారు. యస్యజ్ఞాన దయాసింధో అని చదివి, వెంటనే గోడ దూకితే అదే సందో…అని జోకులు వేసుకుని నవ్వుకునేవారం. రెండేళ్ల వయస్సులో భాగవతంలో భక్తి ఘట్టాలు చదువుతుంటే నా కళ్లలోంచి నీరు కారుతుంటే మా నాన్నమ్న అది భక్తి పారవశ్యమని భావించి నాకు మొక్కిన విషయం ఇంకా గుర్తుంది. బహుశా అది కళ్లు మండి కారిన నీరు కావచ్చు.

చదువు పట్ల నా ఆకాంక్ష గమనించి మూడేళ్ల వయస్సులోనే నాకు అయిదేళ్లని రాయించి మహబూబ్‌నగర్‌లోని బేసిక్ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో చదివించారు. ఇక్కడ తెలుగుమాస్టారు ఆచార్య సార్ నాకింకా గుర్తు. చక్కగా, తప్పుల్లేకుండా, గుండ్రంగా రాస్తే సంతకంలో ఒక బొమ్మ గీసేవారు. ఈ బొమ్మ సంతకం కోసం ఎంత కష్టపడేవాడినో.ఈవయస్సులోనే ప్రక్కనే ఉన్న కలెక్టరాఫీసుకు వెళ్లి నేను, నా స్నేహితులు ఎవర్నీ అడక్కుండా టేబుల్‌పై ఉన్న కాగితాలను వెనుకవైపు రాసుకునేందుకు తెచ్చుకునేవాళ్లం. ఒకరోజు మా స్కూలు ముందు జీపు అగి పోలీసులు, అధికారులు దిగారు. మా బ్యాగుల్ని వెతికి వారి ఆఫీసు కాగితాలను తీసుకువెళ్లి హెడ్‌మాస్టర్‌ని తిట్టి వెళ్లారు. మా వీపులపై విమానాలు మోగాయి. ఇదే స్కూలులో ఆరోతరగతి వరకు చదివాక కుటుంబం హైదరాబాద్ పాతబస్తీ తరలి వెళ్లింది. అప్పుడదే సిటీ. ఆరోతరగతిలో కూడా ప్రేమలుంటాయని, ఆడ, మగ దొంగచూపులు చూసుకుంటారని నాకు అప్పుడే తేలిసింది. అప్పటి మా క్లాసులో ఉన్న వకుళ అనే అమ్మాయి నాకింకా గుర్తుంది.

నాకు మొదటి సన్మానం గుడిలో జరిగింది. అయిదారేళ్ల వయస్సులో పాతబస్తీలోని ఫూల్‌బాగ్ లోని వెంకటేశ్వరుడి గుడిలో అయ్యగారు(పూజారి) పురుషసూక్తం చదువుతుంటే నేనుకూడా చదవడం ప్రారంభించాను. ఆయన నన్ను గర్భగుడిలోకి పిలిచి మొత్తం నాతో చదివించి, చివరకు దేవుడి మెడలోంచి పూలదండ తీసి నా మెడలో వేసి సన్మానించారు. గర్వంతో ఉప్పొంగిపోయి ఆ పూలదండ తీయకుండా దోస్తులతో ఊరేగింపుగా అల్యాబాద్‌లో ఉన్న మా యాదగిరి రావు తాత (మా అమ్మ వాళ్ల నాన్న) ఇంటికి వెళ్లాను. అంతా సంతోషించినప్పటికీ ఊరేగింపుగా వచ్చిన వైనం విని నవ్వుకున్నారు.

పెద్దగా వివరించకుండా చెప్పాల్సిన విషయం ఏమంటే నా బాల్యమంతా పేదరికంలోనేగడిచింది. సహకార శాఖలో పనిచేస్తున్న మానాన్నకు రెండు, మూడునెలలకోసారి జీతం వచ్చేది. వచ్చిన పదిరోజుల్లోనే జీతం అయిపోయేది. మిగతా కాలం అప్పులతోనేగడిచేది. అప్పు దొరకని రోజు పస్తులే. కాళ్లకు చెప్పులు లేకుండా పదోతరగతి వరకు స్కూలుకు వెళ్లాను. బీద విద్యార్థులకు ఇచ్చే పూర్ ఫండ్ నుంచి పుస్తకాలు తెచ్చుకునేవాడిని. లాగులు చిరిగితే వెనుక గుడ్డ వేసి కుట్టి మా అమ్మ స్కూలుకు పంపించేది. ఈపరిస్థితుల్లో కూడా మా ఇంటికి ఏదో రకంగా ఆంధ్రప్రభ, చందమామ వచ్చేవి. వాటికోసం అన్నదమ్ములం కొట్లాడుకునేవారం. ఊళ్లో లైబ్రరీని వెతుక్కుంటూ మైళ్లకు మైళ్లు నడవడం మాకు అలవాటు. పుస్తకాలు చదివే అలవాటు, ఏదో ఒకటిరాయాలన్న తపన, సున్నితత్వం, అదే సమయంలో అన్యాయాన్నిసహించలేని ప్రతిఘటనా తత్వం, చేయి చాచి ఎవర్నీ ఏదీ అడగలేని అహం, పిరికితనం బ్రద్దలైన ధైర్యం, విశ్లేషణా శక్తి, మేధావితనం మొదలైన అనేక లక్షణాలు వీటన్నిటి వెనుక కేవలం కుటుంబంలో పెంపకం మాత్రమే కారణం కాకపోవచ్చు. దాని వెనుక పారంపర చరిత్ర కూడా ఉంటుందని నా అనుమానం.

ఏడో తరగతి నుంచే కొద్దిగా సాహిత్యం పట్ల అభిరుచి ప్రారంభమైంది. పాతబస్తీలోని కాల్వగడ్డ స్కూలుసమీపంలోని చమన్ (పూలతోట)లో ఉన్న ఒక గ్రంథాలయం ఈ అభిరుచికి బీజం వేసింది. పుస్తకాలు ఇంటికి ఇవ్వమంటే లైబ్రరీయన్ నాతో లైబ్రరీ పనిచేయించేవాడు. వంద లేబుల్స్ అంటిస్తే ఒక పుస్తకం ఇంటికి ఇచ్చేవాడు. ఒకసారి ఒక పుస్తకాన్ని కడుపులో పెట్టుకుని తస్కరించా. రాత్రంతా నన్ను పోలీసులు అరెస్టు చేశారని, అంతా నన్ను దొంగాదొంగాఅన్నారని భయపడుతూ నిద్రలో కలవరించానట. పొద్దున్నే వెళ్లి ఆ పుస్తకాన్ని మళ్లీ లైబ్రరీలో ఉంచాను. మా పెద్దన్న మూలంగా సంస్క­ృతం పట్ల అభిరుచి ఏర్పడింది. ఆర్యసమాజ్ నిర్వహించే సంస్క­ృత క్లాసులకువెళ్లాను దండి నరసింహ అనే ఆయన అద్భుతంగా పాఠాలు చెప్పేవాడు. పెద్దన్న ప్రభావం వల్లే ఏకపాత్రాభినయం కూడా చేసేవాడిని. గౌలీపురాలోని మేతర్‌వాడి (పాకీ వాళ్లుండే వాడ)లో ఉన్న సుల్తాన్ షాహీస్కూలులో 8వ తరగతి చదువుతుండగా ఏకపాత్రాభినయం చేస్తే ఒక ముస్లిం సార్ ఇంటికి తీసుకువెళ్లాడు. వాళ్ల భార్యా పిల్లలు బురఖాలు కప్పుకుని కూర్చుని ఉండగా వారి ముందు నాతో దుర్యోధన ఏకపాత్రాభినయం చేయించాడు. నా అనర్గళ వాక్ప్రవాహం వారికి అర్థం కాకపోయినా ఆ ధాటికి ముగ్ఘులై కరతాళ ధ్వనులుచేశారు. ఆ సార్ నాకు చారానా (25 పైసలు) ఇచ్చాడు. ఇది నాకు రెండో సన్మానం. ఇంటికి రాగానే మా అన్నయ్య వేళాకోళంగా వాళ్లు చదవమంటే చదివి చారానా అడుక్కుంటావా అని అపహాస్యం చేశాడు దీనితో చారానా విసిరికొట్టాను. తర్వాత ఎంత వెతికినా దొరక లేదు. పాతబస్తీలో వినాయకచవితి సందర్భంగా నా ఏకపాత్రాభినయం అందరికీ ఆకర్షణ. మా మాతామహుడు యాదగిరిరావు స్నేహితుడైన వేదగిరి రావు నన్ను ఇతర పిల్లలతో కలిసి రేడియో బాలానందం కార్యక్రమాలకు కూడా తీసుకువెళ్లేవారు.

ఆ రోజుల్లో మా పెద్దన్న, గౌతంబాబు లాంటి పాతబస్తీ సాహితీ మిత్రులు నిర్వహించిన అభినవ కళా సాహితి, ఎస్వీరామారావు లాంటి వారు నడిపిన హైపారసం(హైదరాబాద్ పాతబస్తీ రచయితల సంఘం), ప్రబంధ కావ్యాలపై మా పెద్దన్న వరుసగా ఇచ్చిన ఉపన్యాసాలు, దండినరసింహ నిర్వహించిన సంస్క­ృత పాఠాలు, గౌలీపురాలో ఉన్న భారత గుణవర్ధక సంస్థ లో ఉన్న పాత పుస్తకాలు, ఫూల్‌బాగ్ గుడిలో దివాకర్ల వెంకటావధాని ప్రభృతుల సాహిత్యకార్యక్రమాలు, కందికల్ మెట్‌గుడిలో పండితులు చెప్పే ప్రవచనాలు, మేకలబండలోని చిరు గ్రంథాలయంలో ఆర్యసమాజ్ మందిరంలో భగవద్గీత పాఠాలు నా పై ఎంతో ప్రభావాన్ని చూపాయి. మా అన్నదమ్ములం పద్యాలు పోటీపడి చదివేవారం. నాకు వేయి పద్యాలు వచ్చని ఒకరంటే నేను రెండువేలు చదువుతా.. అని మరొకరం అనుకునేవారం. భారత, భాగవత పద్యాలే కాదు, అల్లసాని పెద్దన పూతమెరుంగులుం, అన్న 15 లైన్ల ఉత్పల మాల మాకు కంఠతా వచ్చేవి. వాటితో పాటు శ్రీశ్రీ, గురజాడ కవితలనుకూడా మేము పోటీపడిచదివేవారం. అనుకోకుండానే మేము తెలుగు సాహిత్యాన్ని ఒక సిలబస్‌గా చదివేవారం. కవిత్రయం, ప్రబంధాలు సరేసరి.. వీరేశలింగం, గురజాడ, చిలకమర్తి, శ్రీశ్రీ,ఉన్నవ, దేవులపల్లి, రాయప్రోలు, మొక్కపాటి, విశ్వనాథ, శ్రీపాద, రావిశాస్త్రి, కుటుంబరావు, దిగంబర కవిత్వం.. ఇలా చదవడం అనేది యుక్తవయస్సులోనే అలవాటైంది. వరుసకు మా మేనమామ అయిన కోవూరుగోపాల కిషన్‌రావు రచించిన తెలుగుపై ఉర్దూపారిశీకాల ప్రభావం అన్న పుస్తకం మాకుచిన్నప్పుడు ఆటవస్తువు. అందులో ఛీఛీ ఒరే పాతుకా, ఘాతుకా.. బేకుఫ్, బేమానీ. లుచ్చా.. హరంకోరు బచ్చా.. అన్న తిట్ల దండకం మాకు ఒకరిపై మరొకరు ప్రయోగించడానికి ఉపయోగపడేది. మా నాన్న మేనమామ మడుపు కులశేఖర్ రావు అప్పుడప్పుడూ రావడం, ఆయన రచించిన తెలుగు సాహిత్య చరిత్ర, మరో మేనమాన మడుపు శేషారావు రచించిన భక్తిపద్యాలు చదవడం కూడా ఒక అనుభవం. మా పెద్దన్న, ఆర్వీరామారావు ఇద్దరూ కలిసి సంస్క­ృతంలో ఎంఏ చేస్తూ కలిసి అధ్యయనం చేసేవారు. నిజానికి మా పెద్దన్న లైబ్రరీయే మాకు ప్రథమ పాఠశాల.

ఇదంతా ఒక ఎత్తు. మా నాన్న నా పై చూపిన ప్రభావం మరో ఎత్తు. నా ఊహ తెలిసిన తర్వాత ఆయన తన విద్యార్థి కాలంలో కమ్యూనిస్టు ఉద్యమకారుడని అర్థమైంది. ఖమ్మంలో ఉద్యమకారుల సమావేశంపై పోలీసులు దాడి చేసినప్పుడు తాను ఇళ్ల కప్పులపైనుంచి పరిగెత్తి ఎలా పారిపోయారో ఆయన చెప్పేవారు. ఆయన ప్రముఖ విప్లవకారుడు, కవి మఖ్దూం మొహియుద్దీన్ సహచరుడుగా పనిచేసేవారు. మఖ్దూం నిర్వహించిన సాహిత్య పాఠశాలలు, తమకు ఇచ్చే మొట్టికాయల గురించి చెప్పేవారు. మఖ్దూం ఇళ్లలో పాలమ్ముతూ రహస్య ప్రచారం చేసేవారని, తాను ఆయనకు కొరియర్‌గా పనిచేసేవారని చెప్పారు. చాలా రోజుల తర్వాత ఎంటిఖాన్ అనే ప్రముఖ విప్లవ రచయిత మా ఇంటికి వచ్చి మా నాన్నను చూసి ఆశ్చర్యపోయారు. మా నాన్న పరిస్థితీ అంతే . ఇరువురూ గట్టిగా కౌగలించుకున్నారు. వారిద్దరూ కొరియర్లుగా పనిచేసేవారని చెప్పారు. మా నాన్న ఒక లైటు స్తంభం వద్ద చీటీ ఉంచితే కొద్దిసేపు తర్వాత ఖాన్ వచ్చి దాన్ని తీసుకువెళ్లేవారు. ఇరువురూ ఎదురుపడినా మాట్లాడుకోకుండా తప్పుకునేవారట. మా ఇంటికి ఎవరెవరో వచ్చేవారు. వారిలో ఎక్కువగా ముస్లింలు. మా నాన్న సహచరుడైన రహీం సాబ్ ,హమీద్ అలీ నాకింకా గుర్తున్నారు. యాకుత్‌పురాలో వాళ్ల ఇళ్లకు వెళ్లాను. మానాన్న తన స్నేహితులతో మాట్లాడే మాటల్లో కమ్యూనిస్టు, కాంగ్రెస్ రాజకీయాలు, సాహిత్యం దొర్లేవి. అవన్నీ నాకు అర్థమయ్యేవి కావు. మా నాన్న ఉర్దూలో కవితలు రాసేవారని, సియాసత్ అన్న ఉర్దూ దినపత్రికలో కొంతకాలం పనిచేశారని కూడా నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. మా నాన్న కాలక్షేపంగా జాసూసీదునియా లాంటి ఉర్దూ పత్రికలేకాదు, వేయిపడగలు, పురాణ వైర గ్రంథమాల మొదలైన విశ్వనాథ రచనలు కూడా చదివేవారు. మా పెదనాన్న శ్యామసుందర్ రావు (తర్వాతి కాలంలో ఎమ్మెల్సీ) వేరే స్కూలలో హెడ్‌మాస్టర్‌గా ఉండేవారు. ఆయన కూడా కమ్యూనిస్టు పార్టీసభ్యుడే. ఇంగ్లీషు పై ఆయనకు పట్టు ఉండేది. మా నాన్న, పెదనాన్న ఇద్దరూ పిల్లలతో దోస్తుల్లా ఉండేవారు. మా నాన్న అయితే నేను ఏదైనా వాదిస్తే దానికి వ్యతిరేకంగా వాదించి నా నోరు మూయించేవారు. ఈపద్దతి వల్ల నాకు తార్కిక శక్తితో పాటు రెండుకోణాలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని నాకు అర్థమైంది.

వీటన్నిటి ప్రభావం నా పై పడిందని చెప్పక తప్పదు. చుట్టుప్రక్క ఇళ్లనుంచి పాత పుస్తకాలు తీసుకువచ్చి మేకల్‌బండలోని మా ఇంటి డాబాపై సాయంకాల గ్రంథాలయం నడిపాను. రిపబ్లిక్ డే, స్వాతంత్య్రదినోత్సవం రోజు స్నేహితులతో జెండా ఎగురేసేవాళ్లం. ఆ రోజుల్లో ఒక హైలైట్- బాలభాను పేరిట ఒక పిల్లల లిఖిత పత్రికను ప్రారంభించి పాతబస్తీలోని చమన్ లైబ్రరీలో ప్రతినెలా ఉంచేవాడిని. అప్పుడు నాకు పన్నెండేళ్లు కావచ్చు. నేనుసంపాదకుడినికాగా, మా తమ్ముడు శ్రీనివాసరావు(ఇప్పుడు హైదరాబాద్‌లో ఇండియాటుడే గ్రూప్‌లో పొలిటికల్ ఎడిటర్), మా చిన్నాన్న వాళ్ల అబ్బాయి ఉపేందర్ రావు (కొంతకాలం సినిమాలతోచేయి కాల్చుకుని సాక్షిలో చిరుద్యోగం చేస్తున్న మేధావి),ఒకరిద్దరు మిత్రులం ఈ లిఖిత పత్రికను నిర్వహించేవాళ్లం. లైబ్రరీలో వేరే పుస్తకంచదువుతున్నా, మా పత్రిక ఎవరైనా చదువుతుంటే మా ఆనందమే వేరు.

నా తొలికవిత కలువ పూవుపై. సుల్తాన్‌షాహి స్కూల్‌లో ఎనిమిదో తరగతిలో మా తెలుగుసార్ కవితల ప్రత్యేకత గురించి చెబుతున్నప్పుడు ప్రేరేపితుడినై కలువపూవుపై కవిత రాశాను. కటికచీకటిలోన కలువమా,కాంతి చెందెందవేలచెపుమా, నిశీథిలో అసురుడివలె ఎసరేక ఎల పెరిగెదవో.. అన్న కవిత రాశాను. చీకటిలో ప్రవర్ధమానమయ్యే కలువ పూవు జీవితం నన్ను ఆశ్చర్యపరిచింది. అదేసమయంలో ఘంటసాలచనిపోవడం నాకు బాధ కలిగించింది. గానశేఖరా,ఘంటసాలా,ఘన గాయక వెంకటేశ్వరా..నీ ప్రాణ దీపం ఆరినా, ఆరలేదు నీ గాన కాంతి.. అంటూ ఏదోదో రాసినా పిల్లవాడిని కాబట్టి అందరూ మెచ్చుకుని ప్రోత్సహించారు.

పదోతరగతి పూర్తయ్యాక మా నాన్న ఉద్యోగ రీత్యా వరంగల్‌రావడం నా జీవితంలో జరిగిన కీలక మార్పు. వరంగల్‌లో ఇంటర్ లాల్‌బహదూర్ కళాశాల, డిగ్రీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో చదివాను. ఎల్‌బికాలేజీలో అనుమాండ్లభూమయ్య,కిషన్ రావుతెలుగు చెప్పేవారు. సాహిత్యం పట్ల ప్రేమతో సుప్రసన్నాచార్య, సంపత్‌కుమార్ ఇళ్లకు కూడా వెళ్లేవాడిని. వాళ్లు నేనెవరన్నది ప్రశ్నించకుండా ఆదరంగా పిలిచి సాహిత్యం గురించి మాట్లాడేవాళ్లు. ఆధునిక, ప్రగతిశీల భావాలు ఒకవైపు, ప్రాచీన సాహిత్యం ముద్ర మరో వైపు నన్ను అప్పటికీ ఇప్పటికీ అటూ ఇటూ లాగుతూనేఉంటాయి. రామాయణ కల్పవృక్షాన్ని ఎంత అభిమానించేవాడినో, రామాయణ విషవృక్షం చదివి కూడా అంతే ఆనందించేవాడిని. అలనన్నయ్యకు లేదు అన్న పద్యం ఎంత అలరించేదో, శ్రీశ్రీ పదవిన్యాసం అంత నచ్చేది. . మనుచరిత్రను ప్రవరాఖ్యోపాఖ్యానం పేరిట పద్యాల్లో రాశాను. ఇంటర్ మొదటి సంవత్సరం కాలేజీ మ్యాగజైన్‌లో వాణివి, వీణాపాణివి, సకల కళా రాణివి.. అని సరస్వతీదేవిపై కవిత రాశాను. అప్పుడు వరంగల్ నుంచి వెలువడుతున్న జన ధర్మలో ప్రాచీన సంప్రదాయం ప్రాముఖ్యతను తెలిపే ధర్మవస్త్రం.. అనే కవిత రాశాను. అనుమాండ్ల భూమయ్య నాయనిసుబ్బారావు పై ఎంఫిల్ చేస్తున్నప్పుడు ఆయనకు తోడుగా ఉండేవాడిని. ఈ ఎంఫిల్ పరిశోధన పుస్తకంగావచ్చినప్పుడు ఆయన నా పేరును కూడా ముందుమాటలో ప్రస్తావించారు. భూమయ్య పుణ్యమా అని నేను అనేక సాహితీ గ్రంథాలు, నవలలు చదివాను. ఇంటర్‌లో ఉండగా కూడా నేను దుర్యోధన ఏకపాత్రాభినయం, పలు నాటకాల్లో నటించడం, వక్త­ృత్వ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవడం చేశాను. ఫస్టియర్‌లో పన్నెండు,సెకండియర్‌లో పన్నెండు ప్రైజులువచ్చాయి.చదరంగం కూడా అప్పుడే ఆడడం ప్రారంభించాను. క్రమంగా ఈ ఆటలో కూడా పట్టువచ్చి బహుమతులు గెలుచుకున్నాను. శ్రీపాద రాసిన వడ్లగింజలు చదవడం నేను చెస్ నేర్చుకోవడానికి ప్రోద్బలం కలిగించింది. నేను కూడా తంగిరాల శంకరప్ప కావాలనుకున్నాను. వరంగల్‌లోకిషన్ పురలో ఉన్న మా ఇంటికి సమీపంలో ఒక ఇస్త్రీ షాపులో కొందరు చెస్ ఆడేవారు. నేను వారితో చేరేవాడిని. చాలా కాలం పాటు అదొక ఉన్మాదంలా సాగింది.

ఇంటర్‌లో ఉండగాసాంస్క­ృతీ సమాఖ్య నిర్వహించిన మినీకవితల పోటీలో పాల్గొన్నాను.వాళ్లురాష్ట్రస్థాయిలో బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి తీసుకునేందుకు కష్టపడి విజయవాడ వెళ్లాను. అక్కడినుంచి వచ్చాక నాకు శిరీష్ కుమార్ (నున్న) నుంచి లేఖవచ్చింది. వరంగల్‌లో తాము నిర్వహిస్తున్న సాహితీ సమావేశంలో తెలుగుసాహిత్యంపై మార్క్సిజం ప్రభావంపై నేను మాట్లాడాలని ఆ లే ఖ సారాంశం. గతుక్కుమని అనుమాండ్ల భూమయ్య వద్దకు వెళ్లాను. ఆయన వెరీగుడ్ అని కుమారపల్లిలో వరవరరావు అనే సార్ ఉంటారు. ఆయన వద్దకు వెళితే చెబుతారు.. అని అన్నారు. ఒకరోజు పొద్దున్నే వరవరావు ఇంటికి వెళ్లాను.ఆయన అప్పుడు సికెఎం కాలేజీలో పాఠాలు చెప్పేవారు. ఆయన క్లాసుల్లో విద్యార్థులు కిక్కిరిసిపోయేవారని అనేవారు. నేను వెళ్లేసరికి నీటుగాతెల్లదుస్తుల్లో ఆయన కాలేజీకి వెళుతున్నారు. రేపు రండి.. అని చెప్పారు. పట్టువదలకుండా మర్నాడు వెళ్లాను. ఆ తర్వాత ఆయన రమ్మన్నప్పుడల్లా వెళ్లాను. ఆయన ఇచ్చిన పుస్తకాలన్నీ చదివాను. లైబ్రరీకి వెళ్లి ఇంకా అధ్యయనంచేశాను. చివరకు సాంస్క­ృతీ సమాఖ్య వేదికపై సుప్రసన్న అధ్యక్షతన జరిగినసభలో నేను చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. సభకు వరవరరావు హాజరయ్యారని నాకుతెలియదు. ఆయన దగ్గరికి వచ్చి అభినందించేసరికి నేను ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఆ తర్వాత నేను ఆయన ఇంటికి తరుచూ వెళ్లడం, ఆయన నన్ను సృజనలో రచనలు నిర్ణయించే సాహితీ మిత్రుల్లో చేర్చడం, నాకు తెలియకుండానే నేను విప్లవరచయితలసంఘంలో చేరిపోవడం యాదృచ్చికంగా జరిగింది. వర వరరావు ఇంట్లోనే రాత్రింబగళ్లు జరిగిన సాహితీ సమావేశాల్లో పాల్గొనేవాడిని. ఒక ప్రజాస్వామిక వాతావరణం అంటే ఎలా ఉంటుందో, చిన్నా, పెద్దా, కులమత భేదాలు ఎలా చెరిపివేయవచ్చో అక్కడే నాకు అర్థం అయింది. ఎన్‌కె, రామ్మోహన రాజు, గంగాధర్, జగన్మోహనాచారి, అల్లం రాజయ్య, ఎన్. వే ణుగోపాల్, సి.వి. సుబ్బారావు (సురా)మొదలైన వాళ్లంతా నాకు అక్కడే సన్నిహితులయ్యారు. రామ్మోహనరాజు వసంత మేఘం, ఎన్‌కె లాల్‌బనో గులామీ చోఢో గొంతెత్తి చదవడం నా జ్ఞాపకాలపొరల్నిఇంకా ప్రకంపింప చేస్తున్నాయి. సురా ఢిల్లీ నుంచి వచ్చారంటే అదో సందడి. ఆయన ఈశాన్యం, ఢిల్లీ రాజకీయాలు, పోరాటాల గురించి వివరించేవారు. సాహితీ మిత్రులతో బాలగోపాల్ పరిచయం నా సమక్షంలోనే జరిగింది. ఆయన అప్పుడే ఢిల్లీనుంచి కాకతీయ యూనివర్సిటీలో పనిచేసేందుకు వచ్చారు. శేషేంద్ర శర్మ కవిత్వంపై ఆయన సృజనలో తొలివ్యాసం రాశారు. బాలగోపాల్‌తో పరిచయం అనుబంధంగా మారింది. ఆయన డిపార్ట్‌మెంట్‌కు వెళ్లి రకరకాల పుస్తకాలపై చర్చించేవాడిని. జగన్మోహనాచారి(జేసి) మూలంగా నాకు జార్జిథామ్సన్, క్రిస్టఫర్ కాడ్వెల్ పరిచయం . ఆయన కాలేజీలో మాకు ఇంగ్లీషు లెక్చెరర్ అయినప్పటికీ బస్‌స్టాప్‌లో నన్ను చూడగానే రిక్షా ఎక్కించుకుని సాహిత్యం గురించి మాట్లాడుతూ కాలేజీకి తీసుకువెళ్లేవారు. మిగతా విద్యార్థులను చూసి నేను గర్వంగా పోజుకొట్టేవాడిని. వచనకవిత్వంపై నా తొలి సాహితీ వ్యాసం 80లోనే సృజనలో వచ్చింది. ఆ తర్వాత వరంగల్ నిర్బంధాన్ని చిత్రిస్తూ రాసిన నగరం కవిత కూడా సృజనలోనే వచ్చింది. మరెన్నో కవితలు ఆ తర్వాత వివిధ సాహితీ పత్రికల్లో వచ్చాయి. పురాణం సుబ్రహ్మణ్య శర్మ సంపాదకత్వంలో వెలువడే ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఇస్మాయిల్ కవిత సీతాకోక చిలుకకు పోటీగా మరోకవిత రాశాను.

డిగ్రీలో నా సాహిత్య వ్యాపకం మరింత పదునెక్కింది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కాత్యాయనీ విద్మహే మా లెక్చెరర్. అయితే ఆమె తండ్రి అయిన కేతవరపు రామకోటి శాస్త్రి, వరవరరావు దగ్గర నన్ను చూసినందువల్ల ఆమె ఎంతో గౌరవంగా ఉండేవారు. కాలేజీలో ఒకఏడాది సాహిత్య పత్రికకు సంపాదకుడిని నేనే. విరసం ప్రభావంలో ఉన్నప్పటికీ నేను కేవలం విప్లవసాహిత్యం మాత్రమే కాకుండా అన్ని రకాల కవితలను, రచనలను ప్రచురించాను.. త్రిపురనేని మధుసూధనరావు, గతితార్కిక భౌతిక వాదంపై విశ్లేషణను ప్రచురించాను. నేను బికామ్‌లో ఉంటే ఎన్‌వేణుగోపాల్ బిఏలో ఉండేవారు. త్రిపురనేని, అద్దేపల్లి, మందలపర్తి కిషోర్ మొదలైన అనేకమందితో నిరంతరం ఉత్తరాలతో సాహిత్య, సైద్దాంతిక చ ర్చ చేసేవాడిని.

ఆర్థిక పరిస్థితుల రీత్యా డిగ్రీతర్వాత ఉద్యోగంచేయక తప్పలేదు. లాకాలేజీలోను, ఎంకామ్‌లోనూ సీట్లు వచ్చినా చదివే స్థితిలో లేను. ఆ తర్వాతి కాలంలోనే ఉద్యోగంలో చేరాక ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్‌గా పూర్తిచేశాను. కొద్ది కాలం సిర్పూర్ పేపర్‌మిల్లులో పనిచేశాక. 83లో మా చిన్నాన్న పిలుపుపై ఆయన ప్రారంభించిన బ్రిస్టల్ ఫార్మస్యుటికల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసేందుకు హైదరాబాద్‌కు చేరుకున్నాను. వరవరరావు కుమార్తెలే నా అవస్త గమనించి వరంగల్‌లో ఇన్‌స్టాల్ మెంట్ పద్దతిపై సైకిల్ ఇప్పించారు. దాన్ని వరంగల్‌లో బస్ ఎక్కించి హైదరాబాద్ తీసుకువచ్చాను. రోజూ మాదన్నపేట నుంచి హిమాయత్‌నగర్‌లోని మా చిన్నాన్న ఆఫీసుకు సైకిల్‌పై వెళ్లేవాడిని. విరసం సిటీయూనిట్ సమావేశాల్లో పాల్గొనేవాడిని. సిటీయూనిట్‌లో ఆర్‌కె, హెచ్చార్కె, జయ,అమర్, సుధ, విమల,సివి సుబ్బారావు, వేణు, నారాయణ స్వామి, సుధాకర్ ఇలా ఎందరో ప్రతిభావంతులైన సాహితీ మిత్రులతో పరిచయం. సారస్వత పరిషత్ హాలులో సమావేశాలు జరిగినప్పుడల్లా సాహిత్య పుస్తకాలు అమ్మేవాడిని. సాహితీ సమావేశాల్లో ప్రసంగించడం కూడా మొదలైంది. ఒక సమావేశంలో త్రిపురనేని శ్రీశ్రీ మీద మాట్లాడాల్సి ఉండగా, నేను ఆ సభకు అధ్యక్షత వహించి నేనే చాలా సేపు శ్రీశ్రీమీద ప్రసంగించాను. మాట్లాడడానికి నాకింకేం మిగిల్చావు.. అని త్రిపురనేని అన్నారు. బహిరంగ సభల్లో, మేడే మీటింగ్‌లలో, విద్యార్థి సమావేశాల్లో కూడా క్రమంగా మాట్లాడేందుకు నన్ను ప్రోత్సహించేవారు. గద్దర్‌తో కలిసి కూడా సభల్లో మాట్లాడాను. త్రిపురనేని శ్రీనివాస్, సౌదా కవిత్వం పరంగా నాకు సన్నిహితులయ్యారు. పౌరహక్కుల సంఘం సమావేశాలకు కూడా వెళ్లేవాడిని. 83లో ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో సాహితీ చౌరస్తా అనే కాలమ్ రాసేవాడిని. వీధుల్లోకవిత్వంపేరిట ఫాబ్లో నెరుడా గురించితొలుత విస్త­ృతంగా రాసింది నేనే. జర్నలిజంకు సంబంధించి రోడ్డుప్రక్కన పనికోసం నిలుచునే రోడ్డుకూలీల పై ఆంధ్రభూమిలో రాసిన వార్తావ్యాసమే తొలి రచన.

మా చిన్నాన్న కంపెనీలో నేను పడే ఇబ్బందులు గమనించిన వసంత లక్ష్మి, అమర్ ఉదయంలో చేరమని సలహాఇచ్చి ఎబికె, వాసుదేవరావులకు పరిచయంచేశారు. వాళ్లు పెట్టిన పరీక్షలో సులభంగానే నెగ్గాను. ఉదయంలో సబ్ఎడిటర్‌గాచేరాక నా సాహిత్య గాఢతమరింత పెరిగింది. పతంజలి, దాట్ల, శివాజీ, సురేందర్ రాజు, కె. శ్రీనివాస్, హెచ్చార్కె, నామిని, దేవీప్రియ లాంటి వారితో కలిసి ఉంటే ఏం జరుగుతుందో అదే జరిగింది. మరో వైపు ద్వారకలో శివారెడ్డి, నందినీ సిద్దారెడ్డి బృందంతో ముషాయిరాలు. నిజానికి ఏ కవితా నా స్వంత పేరుతో రాయలేదు. జిజ్ఞాసి, కృష్ణ,,కృష్ణుడు ఇలారకరకాల పేర్లు పెట్టుకున్నాను. కవితలు రాస్తూనే సాహిత్య విమర్శపై దృష్టి పెట్టాను. అప్పటివరకూ సాహిత్య విమర్శ ఒక సాంప్రదాయ పద్దతిలో సాగేది. సినారె ఆధునాకాంధ్ర కవిత్వంపై రాసిన పిహెచ్‌డి గ్రంథమే చాలామందికి ప్రమాణం. అప్పుడప్పుడే వెల్చేరు తెలుగులో కవితా విప్లవాల స్వరూపం ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. నేను కవిత్వాన్ని, ఇతర రచనలను అప్పటి సామాజిక వాతావరణంతో బేరీజు వేసి సమాజం, వ్యక్తిలోనిసంక్షోభాన్ని, ఒకోసారి రచయిత నిజస్వరూపాన్ని కూడా అంచనా వేసేప్రయత్నం చేసేవాడిని. దీని వల్ల నా వ్యాసాల్లో విమర్శ తీవ్రత, కొత్త విశ్లేషణలు కనిపించేవి. మంచి పుస్తకం పరిచయం కావాలంటే కృష్ణుడితో సమీక్షింప చేయాలి.. అన్న అభిప్రాయం వచ్చేది. పతంజలి నాతో ఖాకీవనం, అప్పన్న సర్దార్, పెంపుడు జంతువులు, వీరబొబ్బిలి పుస్తకాలు సమీక్షింపచేశారు. అంతేకాదు, రావిశాస్త్రి, గుంటూరుశేషేంద్ర శర్మ, వరవరరావు, వెల్చేరు, శివారెడ్డి, సిధారెడ్డి, అఫ్సర్,సీతారామారావు, ప్రసేన్ మొదలైన హేమాహేమీలపుస్తకాలు సమీక్షించాను. వీరేశలింగం తో ప్రారంభమైన సాహితీ ప్రక్రియలను విశ్లేషించాను. పఠాభి లాంటి వారిని ఇంటర్య్యూచేశాను. తెలుగుసాహితీ విమర్శకు ఒక అయిదారేళ్లు ఒరవడిగా నిలిచాను.

తెలుగు కవితా రంగంలో అఫ్సర్ ప్రవేశాన్ని ,ఆయన బృందంలో ఆయన ప్రత్యేకతను కనిపెట్టి ఎత్తి చూపింది నేనే. అఫ్సర్ బృందానికి అఫ్సరీకులు అని పేరు పెట్టాను. నిజానికి ఉదయం దినపత్రికలో కొత్తకవుల గురించి నేను రాసిన చాలా రోజులకు చేకూరి రామారావు ఆంధ్రజ్యోతిలో చేరాతలు ప్రారంభించి కొత్త గొంతుకల ప్రత్యేకతను తెలిపారు. అయితే ఆయనది కేవలం కవిత్వ పరామర్శ. గ ణ విభజనల స్పర్శ. అయితే నేను కవిత్వం గాఢతను ఎత్తి చూపుతూనే సామాజిక దృక్కోణాన్ని వివరించే ప్రయత్నం చేశాను. మరల ఇదేల చేరాతలన్నచో.. అని ఆయన సాహితీ విమర్శలోని లేని అంశాల్ని నేను వివరిస్తూ ఉదయం లో రాసిన వ్యాసానికి ఆయన ప్రతిస్పందించారు. ఒకటి రెండువారాలు మా ఇద్దరి మధ్యా ఉదయంలో లేఖాగ్వివాదం జరిగింది.

1983 నుంచి 1992లో నేను ఢిల్లీ వచ్చేవరకూ ఎన్ని వ్యాసాలు, కవితలు రాశానో, ఏ పేరుతో, ఏ పత్రికలో రాశానో నాకే గుర్తు లేదు. ఈ 9 సంవత్సరాల్లో సాహిత్య, సామాజిక వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రపంచంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కుప్పకూలాయి. సోవియట్ యూనియన్ ఛిన్నాభిన్నమైంది. జర్మనీ విలీనమైంది. చైనా, పోలెండ్, లాటిన్ అమెరికా, పాకిస్తాన్ తదితర దేశాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. భారత దేశంలో సంస్కరణలు ప్రారంభం కావడానిక ముందు భూమిక ఇది. ఈ భూమికలో భాగంగాఉద్యమాల అణిచివేత, సంక్షోభం, స్తబ్ధత తీవ్రతరమైంది. ఎన్నోతీవ్ర సంఘటనలు జరిగాయి. గుడిహాళం రఘునాథం, ఏసుపాదం తదితరులు అప్పటి తీరును ప్రశ్నిస్తూ విపశ్యన అనే కవితా సంకలనం రాశారు. మార్పుపై ఇంకా ఆశ కోల్పోని నేను, రామ్మోహనరాజు కలిసి దీనికి జవాబుగా సిస్టోలీ డయాస్టోలీ అనే కవితాసంకలనాన్ని వెలువరించాం. కానిపేర్లు పెట్టుకోలేదు.

కాని జరుగుతున్న పరిణామాలను అంగీకరించకుండా మనం నిలుచున్నచోట నిలుచుని, మన కలలే వాస్తవాలని అనుకుంటే ఎక్కువకాలం సాగదు. ముఖ్యంగా నాలాంటి ప్రవాహ శీలుర విషయంలో అది జరగదు. నా కాళ్ల క్రింద ప్రవహించిన నెత్తుటి చల్లదనాన్ని నేనుగుర్తించాను. ఒకసారి డిప్యూటేషన్‌పై విజయవాడ వెళ్లినప్పుడు నేను, నా యువమిత్రులంతా నేను బస చేసిన అధికార్ హోటల్లో చేరాం. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై మా ఆవేదనను చిత్రించి స్తబ్ధతను బ్రద్దలుచేయాలనుకున్నాం. నేను, అఫ్సర్, త్రిపురనేని శ్రీనివాస్, ప్రసేన్, నీలిమాగోపీచంద్,నరసింహాచారి కలిసి క్రితం తర్వాత అనే గొలుసు కవిత రాశాం. త్రిపురనేనిప్రారంభించిన కవిత్వంప్రచురణలులో ఇది తొలిపుస్తకం. విరసం సిద్దాంతానికి వ్యతిరేకంగా ఈ కవితాసంకలనంఉన్నదని భావించిన ఆ సంస్థ పెద్దలు నన్ను సంజాయిషీ అడిగారు. అందులో ఉన్నవి నాఅభిప్రాయాలేనని, వాటితో ఏకీభవించకపోతే నన్ను విరసం సభ్యుడుగా భావించకూడదని తిరిగి లేఖ రాశాను. అంతటితో విరసంతో నా భౌతిక అనుబంధం తెగిపోయింది. సికిందరాబాద్ కుట్రకేసులో రచయితలతో కలిసి అసెంబ్లీకి ఊరేగింపుగా వెళ్లి అరెస్టై విడుదల కావడం, తోటి జర్నలిస్టు గులాంరసూల్ హత్యకు నిరసనగా జర్నలిస్టులతో కలిసి ధర్నా నిర్వహించడం లాంటివి తప్ప అజ్ఞాత ఉద్యమ కార్యక్రమాలేవీ చేయలేదు. ఒక చేతిలో పెన్ను, మరో చేతుల్లో గన్ను నినాదంపై నాకు ఏకాభిప్రాయం లేదు. పెన్ను పెన్నే, గన్ను గన్నే..అనేది నా అభిప్రాయం. బహుశా ఈ విషయంలో కొన్ని పరిణామాలు జీర్ణించుకోలేనందువల్లే అప్రయత్నంగా విరసం నుంచి బయటకు వచ్చానేమో. అయిన్పటికీ శ్రీకాకుళం, గుంటూరు,హైదరాబాద్ మొదలైన అనేక ప్రాంతాల్లో జరిగిన విరసం మహాసభల్లో నాకు అపూర్వ అనుభవాలున్నాయి. నా చైతన్యాన్ని రగిల్చిన సందర్భాలున్నాయి. కాని అవన్నీ విరసంకూ చరిత్ర.. నాకూ చరిత్ర. వివరించి చెప్పడం అసందర్భం. బహుశా నా నేపథ్యం,మనస్తత్వం, ఇతర పరిణామాలు విరసంతో నా అధ్యాయాన్ని ముగించాయేమో.. ఆ తర్వాత కొద్ది రోజులకు నా వివాహం, తర్వాత ఢిల్లీరావడం జరిగాయి.

ఢిల్లీ వచ్చాక నా ఆలోచనా ధోరణి మారిపోయింది. ప్రాపంచిక దృక్పథం మరింత విస్త­ృతమైంది. బాబ్రీమసీదు విధ్వంసం, గుజరాత్ అల్లర్లు చూశాను. సంస్కరణల యుగం కళ్లముందే మారిపోయింది. ఒకప్పటి వాదనలకు, మనుషులకు కాలం చెల్లడం గమనించాను. గ్లోబలైజేషన్ పేరిట జరుగుతున్న దుర్మార్గాల్ని గమనించాను. విదేశాంగ నీతి అటుంచి, అంతర్గత విషయాల్లో కూడా మన ప్రభుత్వాల పాత్ర తగ్గిపోవడం గమనించాను. సంస్థల స్వేచ్చ అటుంచి ముందు వ్యక్తి ఆలోచించడానికి స్వేచ్చ లభించడమే మహా ప్రసాదం అనుకున్నాను. అందువల్లే పూర్తిగా వృత్తి జీవిని కానీ, కుటుంబ జీవి కానీ కాలేకపోయాను. ఒక సామాజిక జీవిగా మారే క్రమంలో చరిత్రను రికార్డు చేస్తూ చరిత్రలో భాగస్వామి కాక తప్పదని గ్రహించాను. రచనల సంఖ్య తగ్గినప్పటికీ ఆలోచనల తీవ్రత పెరిగింది. యాంత్రికంగా రాయలేను కనుక గుండె కొట్టుకున్నప్పుడల్లా రచించకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాను. ప్రవాహంపై సూర్యకాంతి పడుతున్నప్పుడు వెలుగే ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. నా రచనలు ఈ వెలుగులా ప్రవాహాన్ని మెరిపిస్తుంటాయి. కాని ప్రవాహంలో వెలుగు శాశ్వతం కాదని నాకు తెలుసు.