కవిత్వానికీ వయసు వేడికీ ఎంతో కొంత చుట్టరికం వుండే వుంటుంది. చాలా మంది కవిత్వం అనగానే కాలేజీరోజుల కుర్రకారులోకి వెళ్లిపోతారు. కానీ, వొక కవి లేటు వయసులో ఘాటుగా కవిత్వ ప్రేమలో పడితే…! కవిత్వ సహజమైన ఆవేశ తీవ్రతా, నెమ్మదిగా నిదానిస్తున్న వ్యక్తిత్వ సమతౌల్యమూ వొక చిత్రమయిన రేఖ దగ్గిర కలిసిన ఉదాత్తమయిన సన్నివేశం ఏదో కనిపిస్తుంది. అంటే, ఆవేశతీవ్రత తగ్గిపోతుందని కాదు…చెప్పాల్సిన విషయంలో చెప్పే విధానంలో వొక ఆనుభవికమైన సొగసేదో కనిపిస్తుంది. ముకుంద రామారావు గారి కవిత్వంలో వాక్యాలు మళ్ళీ మళ్ళీ చదివినప్పుడల్లా అలా అనిపిస్తుంది.
స్నేహితుల హృదయాల్లోకి ‘వలస’ వెళ్ళే మందహాసం. ప్రతిక్షణమొకమజిలీగా మలుచుకునే శాంత కెరటం…ముకుందరామారావు.
తక్కువ రాస్తూ తక్కువ మాట్లాడుతూ జీవితాన్నీ, కవిత్వాన్నీ పొదుపుగా అనుభవిస్తూ ఆ రెండు తీరాల మధ్య సుతిమెత్తగా నడుస్తూ వెళ్తున్న నిత్యపథికుడు ముకుంద రామారావు గారితో కాసిని కబుర్లు….
———————————————–
ముకుంద రామారావు గారూ, మీరు కవిత్వం రాయడం కొంచెం లేటు వయసులో మొదలుపెట్టారు కదా? అంటే, వ్యక్తిత్వ పరమయిన ఆవేశాలూ, ఉద్వేగాలూ వొక కొలిక్కి వచ్చాక మొదలు పెట్టారు. ఈ మానసిక స్థితిలో కవిత్వం మీ వ్యక్తీకరణ సాధనం ఎలా అయింది?
కవిత్వం రాయడం లేటు వయసులో మొదలుపెట్టినా, కవిత్వం పట్ల ఆసక్తి నేను కాలేజీ చదువుతున్న రోజుల్నుండీ ఉంది. బెంగాలీ కవిత్వం వినడం, తెలుగులో అన్ని రకాల కవిత్వాల్ని చదవడం అప్పట్నుండీ మొదలయింది. అయితే నాకు నేనుగా రాయగలనని కాని, రాస్తాననిగాని ఎప్పుడూ అనుకోలేదు. అప్పట్లో చిన్న చిన్న కథలు రాసేవాడిని. చిత్రగుప్త లాంటి పత్రికల్లో ముఖచిత్ర కథానిక కూడా వచ్చింది. సాగర్ లో M.Sc చదువుతున్నప్పుడు అక్కడికి సృజన పత్రిక లాంటివి తెప్పించుకుని చదివేవాడిని. ఉద్యోగ అన్వేషణ, ఉద్యోగం, బాధ్యతలు పెరిగాక దాదాపు 20 ఏళ్లవరకూ, ఎప్పుడో చదవటం తప్ప రాసేపని మానుకున్నాననే చెప్పాలి. ఉద్యోగం మూలాన హైదరాబాద్ వచ్చాక, దగ్గరలో పరిచయమైన సాహిత్య మిత్రుల మూలాన, మళ్లీ కొంత కదలిక నాలో వచ్చింది. మా పెద్దమ్మాయిని పెళ్లి తరువాత అత్తరింటికి పంపుతున్నప్పుడు తండ్రిగా నాలో కలిగిన బాధ, భావ సంచలనం ఒక కాగితం మీద రాసిపెట్టుకున్నాను. ఆ తరువాత పరిచయమైన పెద్దలు చేరాగారికి అది చూపించినపుడు, అందులో ఉన్న పదాలతో దానికి ‘వలసపోయిన మందహాసం’ అని పేరుపెట్టి, ఇది మంచి కవిత అయింది, తప్పకుండా ఆంద్రప్రభకు పంపమని సలహా ఇచ్చారు. వారి సూచనమేరకు ఆంధ్రప్రభకు పంపడం, అది అచ్చయాక అందరికీ నచ్చడంతో బహుశా కవితలు ఇలా రాయొచ్చేమో అనుకున్నాను. రాయగలనన్న నమ్మకం సైతం నాకు కలిగింది. అంచాత accidental గా కవిత్వంలో వచ్చాననే నేను అనుకుంటాను. బహుశా అప్పటివరకూ నాలో నిక్షిప్తమైయున్న అనేక అనుభవాలు, అనుభూతులు అలా బయటపడ్డాయేమో!
‘వలసపోయిన మందహాసం’ కంటే ముందు మీ కవిత్వ వ్యాసంగం గురించి కాస్త వివరిస్తారా?
‘వలసపోయిన మందహాసం’ కంటే ముందు కవిత్వం చదవడం వరకే పరిమితమయాను. రాయాలన్న ఆలోచనైనా ఎప్పుడూ రాలేదు. అది నా శక్తి సామర్ధ్యాలకు మించినదనే భావన నాలో ఉండటం ఒక కారణం కావచ్చు.
‘వలసపోయిన మందహాసం’ కవిత్వ సంపుటికి లభించిన స్పందన మీకెలా అనిపించింది?
అది ప్రచురించబడటమే నావరకూ ఎంతో గొప్ప విషయం అనుకుంటే, ఆ కవితకు వచ్చిన స్పందన నాకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలగజేసాయి. చేరాగారు ఆ కవిత విశ్లేషణ, చేరాతల్లో కూడా చేయటం నాకు మరింత ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలగజేసింది.
కవులతో మీ స్నేహాలూ, పరిచయాలూ మీ కవిత్వ వ్యక్తిత్వం మీద ఎలాంటి ప్రభావం కలిగించాయి?
C.V. కృష్ణారావుగారి నెలనెలా వెన్నెల సమావేశాలు ఎందరో కవులతో పరిచయాల్ని కలగజేసింది. ఆ సమావేశాల్లో చదివే కవితలు, చదివే పద్దతి, వాటి విశ్లేషణలు, కవిత్వాన్ని అర్ధం చేసుకోటానికి, ఎదుగుదలకి తప్పకుండా ఉపయోగపడ్డాయి.
మీ దృష్టిలో కవిత్వ వాతావరణం అంటూ వొకటి వుండాలని మీరు అనుకుంటున్నారా?
నా దృష్టిలో కవి నిత్య విద్యార్ధి. కవిత్వానికి చదువు, వయస్సు కొంత వరకు ఉపయోగపడతాయేమో గానీ, అవే ముఖ్యం కాదని నమ్ముతాను. నేర్చుకోవాల్సింది అందరిలోనూ ఉంటుంది, అన్నింటా ఉంటుంది. నేర్చుకోవాలన్న తపన ఎక్కడో ఎప్పుడో ఆగిపోవాల్సింది కాదనుకుంటాను. కవిత్వ వాతావరణం ఆ ఆసక్తికి మరింత దోహదపడుతుంది, ఉపయోగపడుతుందనుకుంటాను.
విమర్శ విషయానికి వస్తే మిమ్మల్ని బాగా సంతోషపెట్టిన సందర్భాలు ఏమిటి?
నిర్మానాత్మకంగా ఉండి నేర్చుకుందుకు దోహదపడ్డ విమర్శలన్నీ నన్ను సంతోష పెట్టాయి.
విమర్శ విషయంలో మిమ్మల్ని అసంతృప్తికి గురి చేసిన సందర్భాలు వున్నాయా?
ఇష్టాఇష్టాలబట్టి కాకుండా, లేదా వ్యక్తిగతమైంది కాకుండా, అప్పటివరకూ తెలియని ఏ కొత్త విషయాన్ని అది తెలియజేసినా నాకు అది ఉపయోగపడింది.. అసంతృప్తికి గురిచేసిన సందర్భాల్లో, ఆ అసంతృప్తి నేను ఆశించినది లేకపోవడం మూలానా లేక నా అవగాహనలో తేడా మూలంగానా అని ఆలోచిస్తాను. నచ్చకపోయినా అది వారి అభిప్రాయంగా గౌరవిస్తాను.
‘మరో మజిలీకి ముందు’ కి లభించిన స్పందన ఎలా అనిపించింది?
బహుశా ఇటీవల వాకిలిలో మోహగారి స్పందన విషయం మీరు అడుగుతున్నారనుకుంటాను. ‘వలసపోయిన మందహాసం’ తరువాత 2000 సంవత్సరంలో వచ్చిన కవిత్వ సంపుటి ‘మరో మజిలీకి ముందు’. అందులో అదే పేరుతో ఉన్న కవిత ఇన్నాళ్లకు కూడా గుర్తుందన్న భావనే ఏ కవికైనా అమితానందాన్ని కలగజేస్తుంది. అది కూడా ఆ స్పందించిన వారు ఎవరో ఏమీటో తెలియకుండా ఉన్నప్పుడు, ఆ కవితని అంత చక్కగా అర్ధం చేసుకున్నందుకు, అంత బాగా దానిని వ్యక్తీకరించినందుకు ముందు నేను ఆశ్చర్యపోయాను. వారికి నా ధన్యవాదాల్ని, ఆనందాన్ని తెలియజేయవలసిందికా సంపాదకుల్ని అందుకే కోరాను.
ఇటీవల మీరు అనువాదాల మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టారు కదా? అనువాదాల మీద ఆసక్తి ఎలా కలిగింది?
నేను న్యూయార్క్ లో ఉండగా వారాంతంలో న్యూయార్క్ లైబ్రరీలో గడిపేవాడిని. అప్పడు చదువుకున్న కవితలు, వాటిల్లో నచ్చినవి అనువాదం చేసుకునేవాడిని. వాటిని మిత్రులకు చూపించినపుడు వారి ఆనందం నా ఆనందమవడం మొదలయాక, నెమ్మది నెమ్మదిగా అనువాదాల వైపు కూడా శ్రద్ధ పెరిగింది. అవన్నీ కలిపి ‘అదే ఆకాశం (అనేక దేశాల అనువాద కవిత్వం)’ పేరుమీద పుస్తకరూపంలో వచ్చిన స్పందన, ప్రోత్సాహంతో ఆసక్తి మరింత పెరిగింది.
వేరే భాషల నించి అనువాదాలు చేస్తున్నప్పుడు మన కవిత్వం ఇలా లేదే అని ఫీల్ అయిన సందర్భాలున్నాయా?
అటువంటి సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. మన కవిత్వం ఎవరి కవిత్వ స్థాయికీ తీసిపోనిదిగానే నాకు అనిపించి ఆనందించిన సందర్భాలే ఎక్కువ.
అనువాద అనుభవాల నేపధ్యంలో ఈ తరం కవులకి మీరు చెప్పాలనుకుంటున్న అంశాలు ఏమన్నా వున్నాయా?
ఎవరి కవిత్వాల్ని వారే చదువుకుని, లేదా తమవారనుకున్న వారి కవిత్వాలే కవిత్వాలనుకుని, నూతిలో కప్పల్లా ఉన్నంతకాలం మన ప్రపంచం పెరగదు. బయటకొచ్చి ఏ భేదభావాలూ లేకుండా కవిత్వం ఎక్కడున్నా ఆస్వాదించి ఆనందించే గుణం అలవర్చుకోడం మూలాన మనకు తెలియకుండానే మనలో మార్పు మనం గమనించొచ్చు. సహృదయంతో విస్తృతంగా చదవడం మూలంగా మన విస్తృతీ పెరుగుతుంది. అది అనువాదాలైనా కావచ్చు లేదా స్వతంత్ర రచనలైనా కావచ్చు. రాత్రికి రాత్రే ఏదో అయిపోవాలన్న తపన ఎంతవరకు పనికొస్తుందో ఎవరికివారే బేరీజు వేసుకోవాలి.
మీరు ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా కవిత్వ సంస్కృతిని చూశారు కదా! అక్కడికి మనకి ఈ సంస్కృతిలో ఎలాంటి తేడాలు కనిపిస్తున్నాయి?
ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగాల్, ఒరిస్సా, కర్ణాటక, కేరళలో సాహిత్య వాతావరణం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సాహిత్యంలో స్థిరపడ్డవారు తమ ఎదుగుదలతోబాటు అక్కడ సాహిత్యాన్ని, ఇతర సాహిత్యకారుల్ని ప్రోత్సహిస్తున్న విధానం చూస్తుంటే ముచ్చటేస్తుంది. మన రాష్ట్రంలో ఎవరికివారు పైకి వచ్చినవారే. అందుకనే బహుశా ఎవరి ప్రయత్నాల్లో వారుండటం ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది.
ఇతర సంస్కృతుల నించి కవిత్వపరంగా మనం నేర్చుకోవాల్సింది ఏమన్నా వుందా?
అహాలు, ఇగోలు, కీర్తి కాంక్షలు, స్వార్ధాలు వీటి హెచ్చుతగ్గులు ఏ సంస్కృతినైనా అద్దంలో చూపిస్తాయి. సత్సంబంధాలు, సాహిత్య సంబంధాలు వాటి పుణాదులమీదే ఎక్కడన్నా కనిపిస్తాయి.
కవిగా ఇప్పటి దాకా మీ మజిలీలని వొక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? వొక తృప్తి కనిపిస్తోందా?
ఎక్కడో కవిత్వ ద్వారానికి దూరంగా నిలబడి, ఆనందంగా చూస్తున్నవాడిని, ఆ ద్వారంలోకి ప్రవేశిస్తానని గాని, ఈమాత్రం దూరమైనా రాగలుగుతానని గానీ నేను ఊహించనిది. అది సంతృప్తికి కారణమే కదా. అయితే అందుకు దోహద పడ్డ అనేకమంది, గురువులు, స్నేహితులు నాకు లబించడం నా అదృష్టం. వారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. అయినా నేను రాయాల్సింది నేను ఇంకా రాయనేలేదు అన్న అసంతృప్తితోబాటు, ఎప్పటికప్పుడు రాసిన ప్రతీకవితా, బహుశా ఇదే ఆఖరి కవితేమో అని అనుకుంటూనే వస్తున్నాను, ఎందుకో ఏమో!
ముకుంద రామారావు గారు బెంగళూరులో ఉంటున్నప్పుడు సుబ్బు, నేను కలిసేవాళ్ళం. సరళమైన మాటల్లో కవిత్వంపై వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు మమ్మల్ని చాలా ప్రభావితం చేసాయి. కొత్తగా వ్రాసిన స్వీయ కవితను లేక అనువాద కవితను చదివి వినిపించేవారు. భేషజాలు, అరమరికలులేని వారి భావసౌకుమార్యం మమ్మల్ని ముగ్ధుల్ని చేసేది. పోయిన సంవత్సరం నాతో ఓ అనువాద కవితను ఆంధ్రభూమి కోసం వ్రాయించారు.
మనసులోకి ఇంకి తడియారని కొన్ని కవితా పంక్తులు:
//రెండు తీరాల మధ్య
ప్రయాణం
ఏకాంతం నుండి
ఏకాంతానికేనా?
ఒంటరిగా ఒడ్డునున్న నావను అడగాలి//
//బహుశా
వెలితి
జ్ఞాపకాల గుప్తనిధికి
తాళంచెవి//
//ఏమీ తెలియనితనం నుంచి
ఏదో తెలుస్తున్నతనం లోకి
ప్రవహిస్తున్న పరిణామం
నా పద్యంలాంటి పసితనం//
ముకుంద రామారావు గారి వ్యక్తిత్వానికి ఈ ముఖాముఖి అద్దం పడుతోంది. నేను కవిత్వం రాయడం మొదలుపెట్టిన కొత్తలో ఆయనతో కవిత్వం మీద జరిపిన చర్చలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి.
కొత్తగా కవిత్వం రాస్తున్న వారికి ఈ ముఖాముఖి ఉపయోగంగా ఉంది.ధన్యవాదాలు.
the interview is awesome
రాయాల్సింది ఇంకా రాయనే లేదు,ఆ అసంతృప్తే కవికి జీవం లాంటిది,..చక్కని మాట చెప్పారు సార్
సర్ నమస్తే…మీ కవిత్వం వలె మీ ముఖాముఖి కూడా రస భరితంగా సాగింది.
కవి నిత్యవిద్యార్ధి.అన్న ముకుంద రామారావు గారి అభిప్రాయం నాకెంతో నచ్చింది.ముప్ఫై నలభై ఏళ్ళ క్రితం వైద్య శాస్త్రం చదువుకున్న వ్యక్తి ఈరోజు వైద్యం చేస్తె ఎలావుంటుందో మొదట్లో మేం బాగా చదువుకున్నామనుకుని వర్తమానంలో కవిత్వం రాసినా అలానే ఉంటుంది,ఒక్క ఈరంగము ఆరంగమని కాదు ఏరంగంలో పనిచేసే వ్యక్తి అయినా నిరంతర విద్యార్ధి కావలసిందే.కవైన వాడు మరీను..
mukundaramarao gaaru soumyulu,sukumaara hrudayulu.mukunda kavanamlo aardrata kottaga cheppalane nirantara anukshana tapana,bhaavaavesham,pyre poetry kanipistaayi.anavasara charchalaku vaadavivaadaalaku dooradooramga untaaru.keertikandoothi leneledu.tana panemo tanemo!Mukhamukhi sahajasundaramga rasanishyandamga aasaktiga saagindi!Kudos!!
నేను కవిత్వం సున్నితంగ రాయడం మీ నుండి నేర్చుకున్న…. లవ్యూ సర్…..
సూఫి కవుల గురించి ,నోబుల్ బహుమతి పొందిన కవుల గురించి రాసిన మొదటి కవి ముకుంద గారు,
అత్యంత సుకుమార స్వభావులు ,చేరా మాస్టారికి ఇస్మాయిల్ గారికి ఇష్టులు,
తాత్విక చింతన గల కవిత్వం ,బంధాల్లోని అందాన్ని
అవిష్కరించిన వారు
sallam mukunda garu
కవిత్వ ఆరాధనతో మొదలై కవిగా తన ప్రస్థానాన్ని విపులంగా నిశ్చలంగా తెలియజేస్తూ స్ఫూర్తినిచ్చిన ముకుంద రామారావు గారికి నమస్సుమాంజలులు..