కొత్త పుస్తకం కబుర్లు

సహప్రయాణీకుడు సాయి కిరణ్ తో ‘అంతర్యానం’!

ఏప్రిల్ 2013

కొండముది సాయి కిరణ్ కుమార్ కవిత్వం ‘అంతర్యానం’ విడుదల సందర్భంగా

 

రైలు ప్రయాణంలో చంద్రుణ్ణి తోటి ప్రయాణికుడిగా ఊహిస్తూ “సహప్రయాణీకుడు” అని ఇస్మాయిల్ గారొక కవిత రాసారు. ఏ ప్రయాణానికైనా తోడు అవసరం. ఇక స్నేహితులు అందరితో కలిసి చేసే ప్రయాణం, మరింత ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అలా కిరణ్ గారితో తొమ్మిదేళ్ళ మా సాహితీయానం నెమరు వేసుకోవడం నాకు ఎంతో ఆనందం.

ఇంటర్నెట్లో కవిత్వం మొదలైన తొలిరోజులు అవి. కిరణ్ గారు, రఘు గారు, బన్నీ గారు, వినీల్, ప్రసూన, తులసి, నిషిగంధ, సీత ఇలా అంతా ఉత్సాహంగా కవిత్వం రాసేవారు. దాదాపు అంతా ఒకేసారి కవిత్వం రాయడం మొదలుపెట్టాం. పడుతూ లేస్తూ కవిత్వం నేర్చుకున్నాం. ఒకరికొకరు సలహాలు, విమర్శలు, ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందడం. బోల్డంత అమాయకత్వం. అందులోనే ఏదో అందం. ఫోన్లో గంటలు గంటలు చర్చలు. కవిత్వంలో మునిగి తేలుతూ అదే జీవితంగా బతికిన రోజులవి. కవిత్వం వికసించడానికి అంతకంటే మంచి వాతావరణం ఏముంటుంది? అలా పదునుదేరిన కిరణ్ గారి కవిత్వం ఇన్నాళ్ళకి ఒక పుస్తకంగా రావడం ఎంతో ఆనందంగా ఉంది.

 

కిరణ్ గారి జీవితాన్నీ, కవిత్వాన్నీ సరిగ్గా పట్టిచ్చే కొన్ని పంక్తులు ఆయన మాటల్లోనే…

“ఏళ్ళుమారినా

  ఊళ్ళు మారినా

  మట్టిలో కలిసే

  మబ్బు వాసన

  మారలేదు”

మట్టి వాసనలాగే, కవిత్వంలాగే, కిరణ్ గారి స్నేహ పరిమళం కూడా!

“అందమైన ఆకాశానికి

ఎందుకిన్ని అడ్డుతెరలు

హాయిగా ఏడ్చేసా”

దుఃఖం మనలోని అడ్డుతెరల్ని తొలగిస్తుంది. మనల్ని మూసుకుపోకుండా చూస్తుంది. తెరలు తొలగిపోయాక అందమైన ఆకాశం మనకి సాక్షాత్కరిస్తుంది. “కిటికీలు మూయడానికి కాదు తెరవడానికి” అన్నారు ఇస్మాయిల్ గారొక కవితలో. తెరుచుకుని ఉండడమే కవిత్వ లక్ష్యం , జీవిత లక్ష్యం కూడా. సహజంగా మనుషులు ముప్ఫై యేళ్ళు దాటిన దగ్గరనుంచీ కొత్త విషయాలు నేర్చుకోడానికి మూసుకుపోతారు. కవులు అలా కాకూడదు. కిరణ్ గారిలో గొప్ప విషయం అదే. నేర్చుకోవాలనే తపన. ఆ తపనే ఆయన్ని మంచి కవిని చేసింది.

“చినుకుపోట్లకి

ఛిద్రమైన సెలయేరులా

నా వలయంలో

నేను తిరుగుతునే ఉంటాను

చీకటి తెలియని

రాత్రి కోసం …”

ఆయన జీవితం, కవిత్వం అంతా ఒక నిరంతర అన్వేషణ. ప్రతి మనిషిలోనూ కొద్దో గొప్పో ఈ అన్వేషణ ఉంటుంది. అందుకే ఇలాంటి కవితలు చదివినప్పుడు కవిత్వం మీద ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళు సైతం అనుభూతి చెందగలుగుతారు.

“భయం లేదు

బాధ లేదు

నిస్సహాయ క్షణాల మీద

కోపం లేదు

అపరిచితమైన ఆనందం

అసలే లేదు

నాలోకి నేను నడవడమే

నాకాశ్చర్యం”

“నాలోకి నేను నడవడమే ” ఈ ఒక్క లైను ఆయన కవిత్వ సారాన్ని పట్టిస్తుందనిపిస్తుంది. సంకలనానికి “అంతర్యానం” శీర్షిక కూడా సరిగ్గా కుదిరింది. కవిత్వం మనల్ని లోపలికి నడిపిస్తుంది. కవిత్వం ప్రయోజనమేంటి అని ఆలోచిస్తే కవిత్వం వల్ల భూగోళం బ్రద్దలైపోదు. విప్లవాలు రావు. కానీ కవిత్వం మామూలు లౌకిక వ్యాపారాల్లో మునిగి పోయేవాళ్ళని జీవితంలోని నిజమైన అర్ధం వైపు నడిపిస్తుంది. నిజమైన సాధకుడు , కవి మాత్రమే లోపలికి చూసుకోగలరు.  ఈ సంకలనంలో చాలా చోట్ల  కిరణ్ గారిలో ఆ ధైర్యం మనం చూడొచ్చు.

“పరవళ్ళు తొక్కుతున్న

నిశ్శబ్ద నదిపై

చీకటి వంతెనలా

నన్నిలాగే ఉండనీ”

అన్నారు గానీ కవిత్వ పరంగా ఆయన సాధించింది తక్కువేమీ కాదు. క్లుప్తత, భావ తీవ్రత, చదివేకొద్దీ కొత్త లోతులు తెలియడం ఆయన కవిత్వంలో మంచి లక్షణాలు. ఐతే కవిత్వం గమనమే తప్ప గమ్యం ఎప్పటికీ కాదు అని ఆయన గ్రహించారు.  బహుశా అందుకేనేమో

“ఆకాశం అంచున ఆఖరి చినుకు

నా గుండెలో శబ్దమై

జ్ఞాపకాల కదలికతో

నాలో నేను నిశ్శబ్దమై”

అంటూ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు. ఆయన అన్వేషణ ఫలించాలని ఆ నిశ్శబ్దంలో ఆయనకి ఆయన మరింత స్పష్టంగా కనిపించాలని కోరుకుందాం.

అయితే..

 

“ఆగిపోతుందనే

అనుమానం వద్దు

దారినపోయే మబ్బు

దాటివెళ్ళిన శబ్దం

తట్టిలేపుతుంది

 

ఎదుగుతున్న మొక్కలో

ఒదిగిఉన్న పూవుతో

కవిత్వం పలికిస్తూ..”

 

యోగనిద్రలో ఉన్న ఆయన్ని ఎప్పటికైనా ఏ మబ్బైనా తట్టి లేపకపోతుందా అని నా ఆశ.

 

పుస్తకం వివరాలు:

అంతర్యానం (కవిత్వం) కొండముది సాయికిరణ్ కుమార్

తొలి ముద్రణ: మార్చి 2013

ప్రచురణ: పాలపిట్ట బుక్స్

ప్రతులకు:

1. కొండముది సాయికిరణ్ కుమార్, email: kskk@rediffmail.com,  phone: +91 9702911151

2. పాలపిట్ట బుక్స్, email: palapittabooks@gmail.com,  phone: 040-2767 8430