కృతకమైనా విద్యుద్దీపాలు
విడదీయలేని జిలుగు దారాలై
జీవితాలతో పెనవేసుకుంటాయి
ఒక్క క్షణం అవి వెలగకపోతే
ఎంతటి సౌధాలయినా నిస్సహాయపు చీకటిలో
చిక్కగా చిక్కుకుంటాయి
అద్భుత రాగాల్ని వినిపిస్తూ వినిపిస్తూ
ఒక్కసారిగా ఆగిపోయిన గ్రామఫోన్ లా
జీవనం హఠాత్తుగా స్తంభించిపోతుంది.
కానీ
చీకటి ని వెలిగించే నక్షత్రదీపాలు
రాత్రిని మెరిపించే వెన్నెల మైదానాలు
ముంగురులతో ఆడుకునే చల్లగాలి తెమ్మెరలు
ఒక్కసారైనా అనుభవంలోకి రావాలంటే మాత్రం
కనీసం కాసేపైనా కరెంట్ పోవాలి
చిన్నప్పడు నాయనమ్మ తో కలిసి
సెలవుల్లో తిరిగిన పల్లెటూళ్ళ జ్ఞాపకాలు
వెచ్చటి గ్లాసు లాంతర్ల చుట్టూ ముచ్చట్ల తో
తాపీగా సాగిన వలయాకారపు నేల భోజనాలు
ఆరుబయట నవారు మంచం పక్కల్ని ఆప్యాయంగా
పలకరించే యూకలిప్టస్ ఆకుల వగరు వాసనలు
ఇన్నేళ్ళ తర్వాత యాంకీ కాండిల్ వెలుగుల్లో
మళ్ళీ తళతళ లాడాలంటే అప్పుడప్పుడైనా కరెంట్ పోవాలి
బయట వెలుగునిచ్చేవి విద్యుత్ దీపాలు.లోపల వెలుగు నిచ్చేది (మనసుని వెలిగించెది) వెన్నెల.వెన్నెలను అనుభూతి చెందాలంటే విద్యుత్ లేని రోజులు తెలిసుండాలి.
వైదేహిశశిధర్ గారూ మీ కవిత బాగుంది అభినందనలు.
బాగుంది వైదేహి గారు
తెలుగునాట ఇప్పుడు విద్యుత్తు పోవడం అద్భుతం కాదు
విద్యుత్తు రావటమే అద్భుంగా మారిన సందర్భం!
**
నేలభోజనాలు కావవి – పంక్తి భోజనం
అయినా ఇప్పుడు సహజ వ్యాయంలేని శరీరంతో డైనింగు టేబుల్‌కు అలవాటుపడ్డాంకానీ
అవి మహత్తర సమయాలు కదూ!
**
జ్ఞాపకాలను మంచి ఫీల్ తో చెప్పారు, బావుందండి,.
కానీ
చీకటి ని వెలిగించే నక్షత్రదీపాలు
రాత్రిని మెరిపించే వెన్నెల మైదానాలు
ముంగురులతో ఆడుకునే చల్లగాలి తెమ్మెరలు
ఒక్కసారైనా అనుభవంలోకి రావాలంటే మాత్రం
కనీసం కాసేపైనా కరెంట్ పోవాలి
good lines good poetry
ఎలాంటి వస్తువు చుట్టూ అయినా ఒక చక్కని అందమైన కవిత సృష్టించేస్తావు, వైదేహీ!
చాలా సంతోషంగా ఉంది, చాన్నాళ్ళ (నాకు) తర్వాత నీ కవిత చూడటం
గత మధుర స్మృతుల్ని విద్యుదీకరించిన మీ కవిత బాగున్నది
నా కవిత పై అభిప్రాయాలు తెలిపిన సాహితీ మిత్రులు రామకృష్ణ,డా.లింగారెడ్డి,జాన్ హైడ్,భాస్కర్,రవిప్రకాష్ ,రామ్మోహన్ గార్లకు ధన్యవాదాలు .
నిషీ,బహుకాలదర్శనం!! థాంక్యూ.
వైదేహి శశిధర్