కవిత్వం

107 బస్టాప్

19-ఏప్రిల్-2013

‘సిటీ బస్సెక్కితే నరకం
చిన్న సీటు దొరికితే స్వర్గం’అని
కవిత్వాలాడుకుంది ఇక్కడే

‘రెండైతే మాట్నీ
ఆరైతే ఫష్షో’
రోజుల్ని సినిమాలుగా
కత్తిరించుకుంది ఇక్కడే

‘ఇక్కడ స్టాపు
ఐనా బస్సు ఎక్కడో ఆపూ
తిక్కరాగాలందుకుంది ఇక్కడే

దిగేవాళ్ళు దిగక ముందే
సీట్ల సిం హాసనాలకు
ఎక్కేవాళ్ళు సూదంటురాళ్ళయ్యేదీ ఇక్కడే

లంచు బాక్సును మోసే హాండు బాగులు
చంకలో లోలకాలైనప్పుడు
అనేకానేక దినచర్యల్లోని
ఆరంభ బిందువూ ఇక్కడే

తొలి వేకువ ప్రయాణంలో చల్లదనమూ
అయాసాల సాయంత్రాల ఆఖరి గమ్యమూ
ఇక్కడే గిరిగీసుకున్నట్లుండేది

బస్టాపుల సిగమీద
ఫుట్టోవర్ కిరీటం లేవకముందు
డివైడర్ ఉగ్రహనుమంతుడై
చౌరస్తను ఉత్తర దక్షణం
ముక్కలుగా కత్తిరించనపుదు
సరిహద్దు గీతల్లేని స్టాపుల నడుమ
స్వేచ్చకే నిలువెత్తు కేతనాలుగా
బడిపిల్లల బుడి బుడి పరుగులు
కాలేజీ టైమింగ్ నడకలు
పెద్దరికపు మరియాదాగమనాలు

ఫుట్ పాత్ మీద
పేదల ఇడ్లీ
గొడుగు నీడకింద
జేబు దువ్వెన్లు
రోడ్డును అలంకరించే
బెల్టుల బండి
ఐదు రూపాయలకే
గరం చాయ్
ఫ్యాషన్ చాటున ఆకలి
పానీ పూరీ
మండుటెండలో
రంగులీనే వాటర్ మిలన్
బట్టల షాపుల సిగలో తురిమిన
బొండుమల్లెలా కోన్ ఐస్క్రీం
ఆకాశం కప్పుకింద
సలసలమంటూ
మిర్చీ బజ్జీ
తోపుడు బండ్లమీద
హర్ ఎక్ మాల్
107 ప్రయాణీకుల్లాగే
గలగలలాడేవి

కళ్ళల్లో నిరంతరంగా వెలిగే
బస్టాపుల కాంతి రేఖలతో
దిల్ సుఖ్ నగర్
ఒక మెరుపుల అంగడి
పయనించే జీవన సందడి
వేగంగా తిరిగే రంగుల రాట్నం
తెగని ఉత్సాహాల
నిత్య న్రుత్యాల నడుమ
భూమ్మీద పరుచుకున్న ఇంద్ర ధనుస్సు

కారణం తెలియని కక్ష
చిమ్మిన విషవాయువు
ఇక్కడి ప్రేమ సమీరంలో
ఎప్పుడు కలిసిందో తెలియదు
కాలం కలవర పడ్డది
తేనె భాండంలో
నీటిబొట్టు జారినట్లు
అంగట్లో ఎద్దు బెదిరినట్లు
దిల్ సుఖ్ నగర్ నందనవనంలో
బాంబుల పిడుగు పడింది
రంగుల రాట్నం
ఉనంట్లుండి కుప్పకూలింది
ఎవరు ఎవరికి శత్రువో అర్ధంకాని
చిక్కు ప్రశ్న సంధించింది
దానికి జవాబు చెప్పాల్సింది మాత్రం
మనమే
మిగిలిన మానవత్వపు ఆనవాళ్ళమే