రౌండ్ టేబుల్

ఇప్పటి కవిత్వం – కొన్ని ప్రశ్నలు…?!

26-ఏప్రిల్-2013

పారిశ్రామిక విప్లవం తెచ్చిన ఆర్థిక ప్రగతి, పారిస్‌ కమ్యూన్‌ ఎత్తిపట్టిన స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వాల భావజాలం, సృష్టి ఆవిర్భావానికి హేతుబద్ధత కల్పించిన జీవపరిణామ సిద్ధాంతం, నిలదొక్కుకున్న సూర్యకేంద్రక సిద్ధాంతం లాంటి ఖగోళశాస్త్ర పురోగతి పాశ్చాత్యదేశాల్లో ఆధునికతకు బాటలు వేశాయి. తాత్విక భూమిక మీద మార్క్స్‌,ఎంగిల్స్‌ల గతితార్కిక చారిత్రిక భౌతికవాదం ఊగిసలాటల్ని, భావవాదాన్ని తుడిచిపెట్టి ప్రాపంచిక దృష్టికి కొత్త వెలుగులు చూపింది. వలసపాలకులతో పాటు ఈ భావజాలం తెలుగు సాహితీరంగంలో ప్రవేశించింది. సాంఘిక సమానత్వాన్ని ప్రభోదించిన ఈ ఆధునిక భావజాలం ఫ్యూడల్‌సంబంధాలను దెబ్బకొట్టింది.

‘Fine art is the art of genious” అంటాడు కాంట్‌. కాని హేతుబద్ధంగా ఆలోచిస్తే ఒక వ్యక్తిని కవినిగాని, కళాకారున్ని కాని చేసేది ఈ సమాజమే. బౌద్ధికశ్రమ చేయడానికి కావాల్సిన విరామకాలాన్నిగాని లేదా విశ్రాంతినిగాని, దానికి కావాల్సిన పరిజ్ఞానాన్నిగాని ఆ వ్యక్తి ఈ సమాజంనుంచే పొందుతాడు. కాబట్టి సాహిత్యం సామాజిక సమూహాల వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తూ, మెరుగైన పరిస్థితుల రూపకల్పనకు సమాజాన్ని ప్రేరేపించేదిగా వుండాలి. ”the poet knows this is so,intutively if not rationally and he is poet largely by virtue of the power he has,greater than the other man of perceiving hidden likelyness and by his words” అంటూ సాధారణవ్యక్తి కవిగా మారే క్రమాన్ని చెపుతాడు షేక్స్‌స్పియర్‌.

కళ కళకోసం కాదు, సామాజిక ప్రయోజనం కోసమేననేది ఆధునిక సాహిత్యం నిర్ద్వంద్వంగా నిరూపించింది. ఈ వెలుగుల్లో ఆధునిక వచన కవిత్వంలో ‘వస్తువు’ని పరిశీలిద్దాం.వస్తువు అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే ”బాహ్య వాస్తవికతకు సంబంధించిన భావనలను కవిత్వంలో వస్తువు”అంటారు.ఇంకొక విధంగా చెప్పాలంటే కవిత్వం బాహ్యవాస్తవికతను అర్థం చేసుకుంటుంది. ఈ బాహ్యవాస్తవికత చుట్టూ కవి ఒక ప్రాయోగిక భ్రమను అల్లుతాడు. ఈ భ్రమనే మనము కాల్పనికత అని కూడ అంటుంటాము. నిజానికి ఒక విషయం యొక్క బాహ్యవాస్తవికత సైన్సు రూపంలో వ్యక్తీకరించబడితే, అంతర్గతవాస్తవికత కవిత్వరూపంలో వ్యక్తీకరించబడుతుంది. బాహ్యవాస్తవికతకు ఉన్నతీకరించబడ్డ భావనలను చేర్చి కవి కవిత్వంలో ఒక నూతన బాహ్యవాస్తవికతను సృష్టిస్తాడు. అపుడు ఈ నూతన బాహ్యవాస్తవిత సమాజంలో ఆకారం పొందుతుంది. మళ్ళీ కవి ఈ నూతన బాహ్యవాస్తవికతకు మరో సరికొత్త భావనను జోడిస్తాడు. సరియైన సామాజిక దృక్పథంలేని కవి ఇతివృత్తాన్ని ఎన్నుకోవడంలో ఒక సందిగ్ధానికి లోనవుతాడు. ఇది ప్రజావ్యతిరేక కవిత్వసృష్టకి దారితీస్తుంది.

శిల్పపరంగా ఎంత ఉన్నతంగా వున్నప్పటికీ ప్రజావ్యతిరేక కవిత్వం మంచి సాహిత్యం కాజాలదు.ఇతివృత్తానికి సంబంధించిన ఈ సందిగ్ధత ఒక్కోసారి అస్పష్టతకు,సంక్లిష్టతకు అవకాశం కల్పిస్తుంది. మనిషిపుట్టుక, చారిత్రిక పరిణామక్రమం, సామాజిక శక్తుల చలనశీలత గురించి తెలియకుండా, మతం యొక్క ప్రతీఘాత పాత్రని అర్థం చేసుకోకుండా వస్తువుకు సంబంధించిన ఇతివృత్తానిఎన్నుకోవడంలో కవి సఫలం కాలేడు. కాబట్టి బాహ్యవాస్తవికతకు సంబంధించిన సరియైన భావనల్ని ఏర్పరుచుకోవాలన్నా, వస్తువుకు సంబంధించిన సరియైన ఇతివృత్తాన్ని ఎన్నుకోవాలన్నా కవికి సరియైన సామాజిక దృక్పథం, వివిధ విషయాలపట్ల తగినంత పరిజ్ఞానం అవసరమని అర్థమవుతన్నది. కాబట్టి కవి అనే వాడికి మరికొన్ని లక్షణాలుండాలి. అవేమిటో చూద్దాం.

ప్రతిభ,వ్యుత్పత్తి,అభ్యాసాలను కావ్యహేతువులుగా అభివర్ణిస్తారు. భావవాదుల్లాగా ‘నా నృషి: కురుతే కావ్యమ్‌’ అనలేము. ఋషికానివాడు కవిత్వం రాయలేడని అనడం అంటే అది భావవాదదృక్పథమే. కాని కవికి వర్తమానాన్నేకాక,సమాజంలోని వ్యక్తులను, వస్తువులను, మానవ సంబంధాలను, కార్యకారణ సంబంధాలను, పురోగామి శక్తుల చారిత్రిక చలనశీలతను సూక్ష్మంగా పరిశీలించడం వలన, శాస్త్రసంబంధ విషయాలను పఠించడం వలన మనిషికి ఏర్పడే నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని వ్యుత్పత్తిగా చెప్తారు. దీన్నే పాండిత్యం అని కూడ అంటుంటాము. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఎంతటి ప్రతిభావంతుడైనా పాండిత్యం లేదా వ్యుత్పత్తి లేనిదే కవిత్వం రాయలేడు. కావ్యహేతువులోని మూడవ విషయము అభ్యాసము. కావ్యజ్ఞులైన పెద్దల దగ్గరగాని లేదా స్వయంగా ఇతరుల కావ్యాలను పఠించడం ద్వారా కాని నేర్చుకునే పద్దతిని అభ్యాసము అంటాము.’practice makes man perfect’ అన్నట్లుగానే నిరంతర అభ్యాసము కవిలోని ప్రతిభ,వ్యుత్పత్తులను మెరుగుపరుస్తుంది. ఆధునిక వచనకవిత్వం పదచిత్రాల్లో వ్యక్తీరించబడుతుంది. కవిలోని భావనాశక్తిని వ్యక్తీకరించి, ప్రతిభని సాక్షాత్కరింపజేసేవి, సాధారణ వాక్యాలను కవిత్వం చేసేవి ప్రతిభా ప్రదర్శకాలు. ఆధునిక కవిత్వంలో అలంకారాలు,ప్రతీకలు, పదచిత్రాలు, భావచిత్రాలు, రూపకాలు, శ్లేష, వ్యాజస్తుతి, కవిసమయాలు,నానుడులు కొన్ని ప్రతిభా ప్రదర్శకాలు.ఆధునిక వచనకవిత్వంలో ఇట్లా అనేక ప్రతిభా ప్రదర్శకాలని వాడడంద్వారా వాక్యాన్ని రమణీయం చేయడం సాధ్యమౌతుంది. క్లుప్తత,రమణీయత కవిత్వానికి అవశ్యకాలు.

-సాహిత్యానికి సామాజిక ప్రయోజనం వుంటదా? ఉండదా?

-ఎవరి అనుభవాలు వాళ్ళే రాసుకోవాలా? సహానుభూతితో రాయొచ్చా?

-అంత్యప్రాసలు, ఆరంభ క్రియలే కవిత్వమా? నూతన భావం తో కూడిన సరికొత్త పదబంధాలు, పోలికలు అవసరమా?

-కవిత్వం ఎట్లా వుండాలో ఎవరైనా నిర్దేశించవచ్చా?

-ఆధునిక రచయితకు ముందు తరాల కవిత్వం చదవవలసిన అవసరం వుందా?

-సాహిత్యం సమాజ మార్పుకు తోడ్పడుతుందా?