ముఖాముఖం

నన్ను నేను ఎక్కడా కోల్పోలేదు: సుద్దాల

26-ఏప్రిల్-2013

పాటని కవిత్వంగా మారుస్తాడో, కవిత్వాన్ని పాటగా మారుస్తాడో తెలియదు కానీ, సుద్దాల ముద్ర పడిందంటే ప్రతిపదం లయ వెతుక్కుంటూ వెళ్లిపోతుంది. పాట అతని రక్తంలోంచి పొంగింది. పాటలోకి అతని అనుభవాల స్వేదం ఎగజిమ్ముతుంది. పొలం మధ్యలో గొంతెత్తే ఆకుపచ్చ చందమామ. అమ్మ నుదుట కుంకుమలో కరిగిపోయే సూరీడు. తెలంగాణ కడుపులో కాసిన అక్షరాల పంట – సుద్దాల అశోక్ తేజ.

జాతీయ అవార్డు గ్రహీత, తెలుగు పాట పతాకాన్ని జాతీయ స్థాయిలో ఆవిష్కరించిన గీత రచయిత , సినిమా గీతాలతో ఆబాలగోపాలానికీ సుపరిచితులైనా తనకు తనే తెలియని కోణాలగురించి అడిగినప్పుడు, తడబాటు లేకుండా చెప్పిన విషయాలూ, విశేషాలు, ఆయన గురించి తెలియని కొన్ని కొత్త విశేషాలు శ్రీమతి స్వాతీ శ్రీపాద ‘వాకిలి’ కోసం ప్రత్యేకంగా అందించిన ఇంటర్వ్యూ.

 

మీ మీద ప్రభావాల సంగతి పక్కనపెట్టి మీ లోలోపలి ఏ సంఘర్షణ మిమ్మల్ని కవిని చేసింది?

ఊహ తెలిసినప్పటి నుండీ ఏ క్షణంలో ప్రారంభమైందో –ఒక తెలియని అన్వేషణ- నేను, నా స్నేహితులు , చుట్టూ ఉన్న వారికన్నా భిన్నమైన వాణ్ణి అనే భావన, ఒక విభిన్న వ్యక్తిత్వం నాకుందనే ప్రగాఢ విశ్వాసం , ఎదో వ్యక్తం చెయ్యాలనే తీవ్రమైన వాంఛ, ఇవన్నీ కలగలిసిన నా మానసిక స్థితి నన్ను ఒక తీవ్ర ఘర్షణకు లోను చేసింది. రోజు రోజూ కొత్త కొత్త ఆలోచనలు నన్ను వెన్నాడేవి . బహుశా దీంతో నా హృదయం ఒక “ఫైరింగ్ మెటల్” గా మారడం వల్ల, ఒక అవిరామ సంఘర్షణకు దారి తీసి నేను కవిగా మారడానికి దోహదపడి ఉండవచ్చు.

 

పాటనైనా కవితైనా నవలైనా రాయగలిగిన మీరు మీ ఇతర రచనల గురించి చెప్పండి.

ముందుగా, అంటే బాల్యంలో నా మిత్రులతో నాటకాలు వేయించాలానే నా తపన నన్ను నాటక రచయితను చేసింది. మా ఊరిపక్క “జీడికల్లు “ తిరణాలలో టూరింగ్ టాకీస్ లో నేను చూసిన జానపద చిత్రాల ఆధారంగా నాటికలు రాయడం మొదలెట్టి చాలానే నాటికలు రాశాను. అయితే ప్రచురించే కోరిక, డబ్బు ఏదీ లేని స్థితి. అయినా ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం వారు నిర్వహించిన పోటీల్లో అందరు స్త్రీ పాత్రలతో రాసిన నా నాటిక “మేఘమాల” రాష్ట్ర స్థాయిలో ప్రధమ బహుమతి పొందింది.
అలాగే 1985 లొ విశాలాంధ్ర సంస్థ నిర్వహించిన నవలల పోటీలో వెలుగు రేకలు అనే నా నవల రాష్ట్ర స్థాయి ద్వితీయ బహుమతి పొందింది. (ప్రధమ బహుమతి ఎవరికీ ఇవ్వలేదు). ప్రసిద్ధ నవలా రచయిత సింహ ప్రసాద్ గారికి మూడో బహుమతి రావడం నాకు ఆశ్చర్యమే. పాటలతోకూడిన గేయ నాటికలు చాలానే రాశాను. ప్రదర్సనలు జరిగాయి. అశోకుడు, లంబాడి తల్లి గేయకావ్యాలు రాశాను. అంగడి అయిలమ్మ నవలలు అముద్రితంగా ఉండిపోయాయి.
సినిమాలలోకి వచ్చాక మా తమ్ముడు సుధాకర్ తేజ తో కలిసి స్వర్ణక్క అనే సినిమాకు కథా మాటలు రాశాను. అది విజయవంతమై నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారికి ఆనందాన్నిచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ రోజాకు ఉత్తమ నటిగా, కారెక్టర్ ఆర్టిస్ట్ శకుంతల కు నంది అవార్డ్ లు రావడం రచయితగా నాకు ఆనందాన్నిచ్చింది.

 

కవులకు సున్నితత్వం ఎక్కువ కదా ? యాంత్రికమైన సినిమా ప్రపంచంలో రాటుదేలిపోయారా? మీ సౌకుమార్యం అలాగే కాపాడుకున్నారా?

సున్నితత్వం , సౌందర్యారాధన, సౌకుమార్యం, అభివ్యక్తం, నిరంతర గవేషణ లేకుండా ఎవరికైనా సృజన అసాధ్యం. అది నియంతల మధ్య ఉన్నా , ప్రవాసంలో ఇనప గొలుసుల మధ్య బందీగా ఉన్నా కవిలో సౌకుమార్యత పోదు. అలాగే సినిమా ప్రపంచంలో విభిన్న, విచిత్ర వ్యక్తుల మధ్య ఉన్నా నన్ను నేను కోల్పోలేదు.
సినిమా గీత రచనలో కూడా ఆ సుకుమార స్పందనా హృదయమే నాకు జాతీయ అవార్డ్ ను , నంది బహుమతులతొ పాటు మరో 40 అవార్డ్ లను అందించింది.

 

విస్తృతంగా సాహిత్యాన్ని అధ్యయనం చేసారు కదా –దాని ఎలా వినియోగించుకుంటున్నారు?

నన్నయ నుండి నారాయణ రెడ్డి దాకా, కందుకూరి నుండి కాలువ మల్లయ్య దాకా, ముప్పాల రంగనాయకమ్మ నుండి ఆధునిక రచయిత్రులందరి సాహిత్యాన్ని అధ్యయనం చేసిన నేపధ్యం నాది. చలం, తెన్నేటి హేమలత , శరత్, శ్రీ శ్రీ , కృష్ణ శాస్త్రి, ఆత్రేయ,రావిశాస్త్రి , పతంజలి ప్రభావం నాపాటల పైన, నా ఉపన్యాసాల పైన, నా వ్యక్తిత్వం పైన విపరీతం గా వుంది.
సీనారే నా ప్రాతః స్మరణీయుడు.అలాగే మా నాన్న ప్రజాకవి సుద్దాల హనుమంతు పాటల వెలుగులు నా పాటల సృజనకు ప్రేరకాలు. వీరి రచనల మధ్య జనితమైన మీగడ నా పాటలపైన ప్రగాఢంగా ఉంది. అయితే అది మక్కీకి మక్కీగా ఉండదు. అలాగని ఉండకుండనూ ఉండదు.
వీరందరి రచనలూ ఒక కథావస్తువును ఎలా ఎంత పదునుగా, ఎంత ఆర్ధ్రతగా అనుభూతించాలో నాకు నేర్పుతుంటాయి.

 

సాహిత్యం మీ వ్యక్తిత్వాన్ని మలచిందా, లేక మీ వ్యక్తిత్వం సాహిత్యాన్ని మలచిందా?

నా వ్యక్తిత్వాన్ని నా తల్లిదండ్రులు, నా కుటుంబం , నా బాల్య స్నేహితులు, నా ఆచార్యులు , చదివిన సాహిత్యం తీర్చిదిద్దాయి.
అలాగే నా సాహిత్యం మీద నా వ్యక్తిత్వం ముద్ర ఉంది. దీనికి ఉదాహరణ- స్త్రీల పట్ల నా దృక్పధం నా పాటల లొ స్పష్టంగా కనబడుతుంది. నాకు ఒక 40 అవార్డ్ లొస్తే అందులో సింహభాగం స్త్రీల ఔన్నత్యం పై రాసిన పాటలకే వచ్చాయి.
సాహిత్యం వ్యక్తిత్వం పరస్పర ఆధారాలు అని నా వ్యక్తిగత అభిప్రాయం.

 

ఇతర దేశాలలో లాగా మనదేశంలో రచన ఎందుకు వృత్తి కావడం లేదు?

విదేశాలలో లాగా మనదేశంలొ రచన వృత్తి కాకపోవడానికి కారణం విదేశాలలోలాగా మన దేశంలో ప్రజలకు పఠనం ప్రవృత్తి కాకపోవడం. నేను చూసిన అమెరికాలో అనేక మంది విమాన రైలు ప్రయాణాలలో ప్రయాణీకులు శ్రద్ధగా ప్రేమగా పుస్తకాలు చదవడం చూసాను. అదే మన దేశంలో అంత ఆసక్తి , గాఢత కనబడలేదు.

 

ప్రస్తుత సమాజ నేపధ్యంలో సాహిత్యం పాత్ర ఎలా ఉండాలని మీ అభిప్రాయం?

సాహిత్యం పాత్ర ఇపుడు అరకొరగా ఉన్నా ఉన్నంత మేరకు అద్భుతంగానే ఉంది.
మరుగు పడుతూ, యాంత్రికమవుతున్న మానవ సంబంధాలను అతికించడానికి , బతికించడానికి, మహోన్నత స్థాయికి చేర్చడానికి ,సాహిత్యం అనితర సాధన బాధ్యతను స్వీకరించడంలేదని నా పరిశీలన.
నా పాటల్లో నా శక్తి మేర ప్రయత్నిస్తున్నాను.

 

కవిత్వం లొ మీ అధ్యయనం ఎంత దాని ప్రభావం మీ మీద ఎంత?

కవితలు, కవిత్వం సమయం పరిమితి చేసేంతవరకు చదువుతూనే ఉన్నాను. హృదయాన్ని కదిలించే ప్రతి వాక్యం హృదయాలను కదిలించేలా నేను రాసే పాటలకు పురుడు పోస్తూనే ఉంది.

 

కవిగా, రచయితగా సమాజం వైపు ఎప్పుడు దృష్టి సారిస్తారు?

సినీ గీత రచయితగా కలం సమాజం వైపు ఎక్కుపెట్టడంలో నా సహచర సినీ కవి సోదరులకన్నా ముందున్నాననే నా వినయ పూర్వక విన్నపం, ఒక సామాజిక గీత రచనలో కూడా నేను బాధ్యత గానే ప్రవర్తిస్తున్నాను అనేది ముందు ముందు మీకు తెలుస్తుంది. సినిమాకు చెందని నా గేయ రూప కవిత్వం “నేలమ్మా నేలమ్మా“ నాలుగో ముద్రణ కావడం, అలాగే “నేలమ్మ“ ఇంగ్లీష్ లో “SUDDALA ASHOK TEJA LYRICS “ గా త్వరలో రాబోతోంది, అలాగే హిందీ అనువాదం కూడా.

 

వాకిలి పాఠకులకు మీ సలహా!

వాకిలి కి నా కృతజ్ఞతలు.
వాకిలి పాఠకులు సాహిత్యాన్ని, సమాజాన్ని అధ్యయనం చేసి తదనుగుణంగా స్పందించాలని ఆశిస్తూ…

నమస్సులతో
మీ
సుద్దాల అశోక్ తేజ6 Responses to నన్ను నేను ఎక్కడా కోల్పోలేదు: సుద్దాల

 1. April 26, 2013 at 7:00 am

  సినిమా పాటలు రాసే సామాజిక స్పృహ వున్న రచయితలు చివరిదాకా వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాల్ని నిలబెట్టుకోవడానికి నిరంతరంగా స్రమించ్చాల్సి వుంటుంది .సుద్దాల హనుమంతు బిడ్డగా అశోక్ గారు శ్రీశ్రీ,దాశరధి ల వారసత్వాన్ని నిలబెడుతడు.అది ఆయన మాటల్లో వ్యక్తమైంది. ధన్యవాదాలు అశోక్ గారు

 2. Rammohan rao Thummuri
  April 26, 2013 at 9:27 am

  స్వాతి గారు సంధించిన ప్రశ్నలు
  అశోక్ తేజ అందించిన సమాధానాలు
  రెండు బాగున్నాయి

 3. April 26, 2013 at 9:11 pm

  సామాజికస్ప్రుహను, సాహిత్యాన్ని సినిమాపాటల్లో నిలుపుతున్న కొద్దిమంది సినీకవుల్లో అశోకన్న ఒకరు.వారసత్వం ఒక సత్వం తన కలంలో.బతుకుపోరాటాలే సందర్భాలు తన పాటల్లో.

 4. April 28, 2013 at 11:12 am

  Mr Ashok Teja spoke out his heart spontaniously and elucidated his feelings in a lucid way.Mrs Swathee Sripada put sensible and intelligent Questions in apolished way.Kudos to Mr Ashok and Mrs Swathee.

 5. vanga rajendra prasad
  August 5, 2013 at 10:45 pm

  మనిషి గా మారిన కన్నీరు- సుద్దాల అశోక్ తేజ. he comes out of his body in happy moments and in sorrow moments.

 6. August 6, 2013 at 12:58 pm

  Oka Manchi Maneeshi antharanga aavishkarana
  MOUNASRI MALLIK
  CINE LYRICIST
  mounasrimallik74@gmail.com

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)