ఒక మనిషి ఒక పుస్తకం చేతిలోకి తీసుకున్నాడనుకోండి. మొదటి వాక్యం అర్థమైతేనే రెండో వాక్యంలోకి వెళ్తాడు. మొదటి పేరా అర్థమైతేనే రెండో పేరాలోకి వెళ్తాడు. మంచినీళ్లు తాగుతూ ఉంటే అవి కడుపులోకి ఎలా దిగిపోతాయో, పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లోని విషయాలు అలా మెదడులోకి వెళ్లిపోతూ ఉండాలి” –కదా ! అయితే ఇదే ఈ కథ సారాంశం!
కుట్ర కథ గురించి : రంగనాయకమ్మ గారు భాష విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే !! ఏది రాసినా సులభమైన రీతిలో, క్లిష్టమైన విషయాలు సైతం పాఠకుడికి త్వరగా అర్థమయ్యేలా సులభ రీతిలో విడదీసి వివరిస్తారు. సరళమైన వాడుక భాష వాడతారు. “వాడుక భాషే రాస్తున్నామా” అనే పుస్తకం కూడా రాసిన సంగతి మనలో చాలా మందికి తెలుసు. ఆమె రాసిన కథల్లో నాకు బాగా నచ్చే కథ, చదివి “అబ్బ, నిజమే “అనుకున్న కథా ఒకటి ఉంది. దాని పేరు “కుట్ర”
కథకు నేపథ్యం : కథ అంతా కమ్యూనిస్టు సాహిత్యం గురించి సాగుతుంది. కానీ ఈ కథలోని అంశాలు కమ్యూనిస్టు పుస్తకాలకే కాక, మామూలు సాహిత్యానికి, రచయీతలు రాసే భాషకీ కూడా వర్తిస్తాయి.
మా నాన్నగారు కమ్యూనిస్టు పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు కాదు కానీ, స్నేహితుల ప్రోద్బలం వల్ల కమ్యూనిస్టు పత్రికలకు చందాలు కడుతూ ఉండేవారు. కమ్యూనిస్టు సాహిత్యం అంటే ఇంట్లో వాళ్ళకి విరక్తి కలగడానికి, కమ్యూనిస్టు సిద్ధాంతం, ఆలోచనలు “అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం” గా మా మెదళ్ళలో రూపు దిద్దుకోడానికి ఆ తెలుగు పుస్తకాలే కారణం.
వాటిలో సోవియట్ భూమి లో ఫొటోలు మాత్రం మాకు బాగా నచ్చి క్లాసు పుస్తకాలకు అట్టలు వేసుకోడానికి వాడేవాళ్లం!
మేము చిన్న పిల్లలుగా ఉన్నపుడు విద్యార్థి సంఘాల వాళ్ళు గోడల మీద, గోడ పొడుగునా జేగురు రంగులో రాసే విప్లవ నినాదాలు ఆసక్తి తో చదివే వాళ్లం తప్ప, ఒక్క ముక్కా అర్థమైన పాపాన పోలా!
కొంత ఎదిగి, కాలేజీ రోజులకు వచ్చాక, ఆ పుస్తకాలను తెలుగులో కంటే ఇంగ్లీష్ లో చదివి కొంత అవగాహన ఏర్పరచుకోవచ్చనే విషయం అర్థమైంది.అంత చక్కగా ఉంటుంది ఆ తెలుగు.
“కుట్ర” కథ కూడా నేను అప్పుడే చదివాను. దాంతో ఆ కథ మరింత నచ్చింది
సంగ్రహంగా కథ : కథ లో వాతావారణం 70లు, 80 ల్లోది !కొంతమంది విప్లవ కారులు ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్ర పన్నారని కేసు నమోదవుతుంది. కోర్టులో వాద ప్రతివాదనలు పూర్తయ్యాక ఆ రోజు జడ్జి తీర్పు ఇవ్వాల్సి ఉంది. జడ్జి చాలా మంచి వాడు. చట్టం కంటే న్యాయం మీద నమ్మకం ఉన్నవాడు. ఉద్యోగం పోతే పోయిందిలే అని న్యాయ ప్రకారమే తీర్పులిచ్చే వాడూనూ!
ఆయన తీర్పు ప్రకటించే ముందు ప్రసంగిస్తాడు. విప్లవకారుల ఆలోచనలన్నీ చక్కగా ఉన్నాయని మెచ్చుకుంటాడు. దేశం లో ప్రజలు ఆకలితో, నిరుద్యోగంతో బాధ పడుతూ ఉంటే మరో పక్క లంచగొండితనం, అధిక ధరలు, అరాచకత్వం పెచ్చు మీరినపుడు అలాంటి ప్రభుత్వాన్ని కూల దోయకుండా ఎవరుండగలరు? దేశ ద్రోహులు తప్ప?” అని రక రకాలుగా విప్లవ కారుల్ని అభినందిస్తాడు.
“విప్ల కారుల్ని దేశ భక్తులుగా భావించి వదిలిపెడుతున్నాను….” అని జడ్జి ప్రకటించగానే కోర్టు హాల్ నిండా గుమి కూడిన విప్లవకారుల మద్దతు దారులు హర్ష ధ్వానాలు చేయబోతారు పాపం !!
జడ్జి ఆ వెంటనే” కానీ, మీరు కుట్రే పన్నారు. విప్లవం రాకుండా చెయ్యడానికి..“అంటాడు. జనానికి ఏమీ అర్థం కాదు.
ఇక జడ్జి, విప్లకారులు రాసిన , ప్రచారం చేస్తున్న విప్లవ సాహిత్యం లో వాడిన భాషని మొత్తం చీల్చి చెండాడటం మొదలు పెడతాడు. ఇలాగేనా రాసేది? అని వాళ్ల మీద విరుచుకు పడతాడు.
విప్లవకారులు రాస్తున్న భాషే కొరుకుడు పడక, ప్రజలకు వారి భావాల్ని అందకుండా చేస్తోందని, అదొక బ్రహ్మ పదార్థం గా మారిందని చీవాట్లు పెడతాడు.
వాళ్ళ విప్లవ సాహిత్యంలోంచి కొన్ని లైన్లు ఉదహరించి, కోర్టు హాల్లో ఉన్న వాళ్ళని వివరించమని అడుగుతాడు . జడ్జి. ఎవరూ సరిగా వివరించలేకపోతారు. ప్రజల కోసమే రాస్తున్నామని మీరు చెప్తున్నది నిజమే అయితే, ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాయనివి ప్రజలకు చేరతాయని ఎలా భావిస్తారు మీరు? అని నిలదీస్తాడు
కథలో జడ్జి ఉదహరించిన కొన్ని వాక్యాలు, వాటి మీద ఆయన విసుర్లూ
“అడగబడింది, కోరబడింది,చెప్పబడింది..అని బడులు గుప్పిస్తారేమయ్యా? మీ తాతలూ తండ్రులూ ఇలాంటి బడుల భాష మాట్లాడగా విన్నారా ఎప్పుడైనా? “అన్నం పెట్టబడింది” అని మీ తల్లులు ఎప్పుడైనా అన్నారా?”
“హరి జనులు, గిరిజనులకు భూములు ఇవ్వాలి” –”హరిజనులు గిరిజనలు భూములు ఇవ్వాలా? ఎక్కడ దెచ్చీ? వాళ్ళకేడ్చినయ్యా ఇంకోళ్ళకివ్వడానికీ?”
“దేశంలో ఉప్పు, బట్టలకు కొరత ఏర్పడింది ” నూలు బట్టలూ, సిల్కు బట్టలూ ఉండటం ఎరుగుదుము కానీ ఉప్పుబట్టలూ, తీపి బట్టలూ ఉంటాయని ఎరగను సుమండీ..
“స్త్రీలు, హరిజనుల పైన అత్యాచారాలు చేశారు” –స్త్రీలు హరిజనుల మీద అత్యాచారాలు చేశారట. స్త్రీల మీద అత్తలూ, భర్తలూ వేసే అభాండాలు చాలక ఇదొకటా?”
ఇలా జడ్జి అనేక స్టేట్మెంట్లు, ప్రకటనలు , వాక్యాలు విప్లవ సాహిత్యం నుంచి పట్టుకొచ్చి, అవి మామూలు జనానికి ఎంత మాత్రమూ అర్థమయ్యే రీతిలో లేవని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. కోర్టు హాలులో ఉన్న విప్లవ కారుల సానుభూతి పరులు కూడా నసుగుతూనే అవి తమకు ఎంత మాత్రమూ అర్థం కావని ఒప్పుకుంటారు.
చివరికి జడ్జి విప్లవకారులకు పదేళ్ల జైలు శిక్ష వేస్తాడు. ఎందుకూ? ప్రభుత్వం మీద కుట్ర పన్నినందుకు కాక, విప్లవ సాహిత్యాన్ని ప్రజలకు చేరకుండా కఠొరమైన భాష వాడినందుకు. భాష మీద ఇంట కుట్ర చేసినందుకు!!
ఈ పదేళ్ళూ జైల్లో తోటి ఖైదీలతో మాట్లాడి వాడుక భాష నేర్చుకోమంటాడు. పాత తెలుగు రచయితల పుస్తకాలన్నీ చదివి సరళమైన భాష నేర్చుకుని అర్థమయ్యే తెలుగు రాయమని జైలుకు పంపుతాడు.
కథలో ప్రతి వాక్యమూ ఎంతో ఆసక్తి కరంగా నడుస్తుంది. రంగనాయకమ్మగారి సహజ హాస్య ధోరణి చాలా చోట్ల బాగా నవ్విస్తుంది.మొహమాటం లేకుండా విప్లవసాహిత్య కారులను పెట్టే చీవాట్లు,వ్యంగ్యాలు పాఠకుడికి ‘అవునవును” అనిపిస్తూ కథ మొత్తాన్ని ఆసక్తి కరంగా నడిపిస్తాయి.
కథను ఈ లింక్ లో చదవొచ్చు: http://www.scribd.com/doc/135952758/Kutra
రచయితలూ-భాష : ఈ కథ కేవలం విప్లవ కారుల అయోమయపు తెలుగు ని మాత్రమే చర్చిస్తుంది. కానీ ఇది రచయితలు అందరూ పట్టించుకోవలసిన సీరియస్ విషయం. చాలా మంది రచయితలు సులభంగా చెప్పవలసిన విషయాన్ని పేరాల కొద్దీ రాసి కాంప్లికేట్ చేసే ప్రతిభను సొంతం చేసుకుని ఉంటారు. అలాగే కొంతమంది భావుకత పేరుతో సులభ విషయాన్ని సంక్లిష్టం చేస్తారు.
కొందరు రచయితల సంక్లిష్టమైన భాష : వడ్డెర చండీ దాస్ గారి భాష స్కూలు రోజుల్లో ఉన్నపుడు అసలు అర్థమయ్యేది కాదు నాకు. ఆ భావ ధారను , తాత్వికతను అర్థం చేసుకునే పరిణతి కొంతయినా సాధిస్తే తప్ప అది వీలు పడదని మాత్రం అర్థమైంది. అయినప్పటికీ ఇప్పటికీ అనుక్షణికం చదువుతుంటే అక్కడక్కడ ఆగి పోయి, కాసేపు అబ్బుర పడటమూ, మరి కొన్ని చోట్ల ఇబ్బంది పడటమూ చేస్తుంటాను.
అలాంటి గాఢత ఈ మధ్య కాశీభట్ల వేణుగోపాల్ గారి నవలల్లో చూస్తున్నాను . కానీ కాశీభట్ల గారు చాలా చోట్ల అనేక పదాలను వాక్యాల్ని కలిపేసి రాస్తుండటం మాత్రం నాకసలు కొరుకుడు పడనే పడదు. ఒకటికి నాలుగు సార్లు ఆ వాక్యాన్ని చదవాల్సి వస్తుంది. అసలు అలా కలిపేసి రాయడం కష్టం కూడానే అనిపిస్తుంది.
సరే…. రాయడం ఆయనకు కష్టం అయినా కాక పోయినా పాఠకుడికి ఆ వాక్యాన్ని చదువుతూ ఉండగానే అర్థం చేసుకోడం మాత్రం కష్టమే!
ఈ విషయాన్ని ఒకసారి నేను ఒకచోట ప్రస్తావిస్తే, కొంతమంది మిత్రులు “అవునవును “అని ఒప్పుకున్నారు. మరి ఎవరూ చెప్పరేం ఈ విషయాన్ని? అని అడిగితే “మనం అలా చెప్తే బాగుంటుందా? ఎవరూ చెప్పడం లేదుగా” అన్నారు ఒకరు. ఎవరూ చెప్పకపోతే ఎప్పటికీ అదే సరైన ధోరణిగా చెలామణి అయిపోతుందిగా!
రచయిత స్థాయి ఏదైనా reader friendly గా రాయాల్సిన అవసరం ఉందని మాత్రం నేను నమ్ముతాను.
నికషం నుంచి కొన్ని వాక్యాలు “వచ్చిన వాడికి ఆడవాళ్ళు కుంపట్లన్జుపుతోన్నారు”
“సంథింగీజ్రాంగ్ ” (మూడు సార్లు చదివితే తప్ప ఇది some thing is wrong అని తట్టలేదు . మొదటి సారే అర్థమైన పాఠకులకు అభినందనలు )
డొన్మెక్మిక్రై (dont make me cry )
నికషం లోనే కాక ఇతర రచనల్లో సైతం ఈ ధోరణి కనిపిస్తుంది . నేనైతే ఆసక్తి చదువుతూ చదువుతూ ఇలాంటి వాక్యాల దగ్గర ఆగి పోతూ, ఒక్కోసారి వదిలేస్తూ పోయాను కూడా! చదవడాన్ని కుంటు పరిచే రాత పాఠకుడి ఆసక్తిని కూడా కుంటు పడేస్తుంది
కథలో చక్కని భాష, ఎలాంటి అయోమయానికీ చోటివ్వని సరళమైన భాష కథతో పాటుగా పాఠకుడికి ఆసక్తి కల్గిస్తుంది.
అసలు చలం ఒక గొప్ప మాట అన్నాడు ” తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు తన చాతగాని తనాన్ని, అర్థ అస్పష్టతనీ ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి -ముఖ్యం, సహజ సౌందర్యం తక్కువైనప్పుడు!
సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి నివ్వరాదా అని చెలం కోరిక’ –,చలం, ఇది నీ కోరికే కాదు …. సర్వ పాఠకుల కోరికా ఇదే! కాకపోతే రచయితలెప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటారు కాబట్టి వాళ్ళు రాసింది మనం చదవాలే కానీ, ఇలా ఉందేంటి? అలా రాశారేంటి? అని అడక్కూడదు. అర్థం కాలేదని అసలే బయట పడకూడదు. వీలైనంత గాంభీర్యం వహించి తల పంకించాలి.
భాషా విమర్శకులేమన్నారు ?
కథల్లో నవలల్లో వాడే భాష పట్ల రచయితలు ఒక్కోసారి ఎంత నిర్లక్ష్యంగానో లేక ఏమరుపాటుగానో ఉంటారో రాచమల్లు రామ చంద్రా రెడ్డి గారు “అనువాద సమస్యలు” పుస్తకం లో ఆసక్తి కరంగా ఉదాహరణలతో సహా వివరిస్తారు. ఒక్కొక్కటీ చూడండి…ఈ ఉదాహరణలు అన్నీ ఆ పుస్తకం నుంచి తీసుకున్నవే!
1.కీర్తిశేషుడు బుచ్చిబాబు ప్రసిద్ధ రచయిత. అనేక కథలూ, నాటికలూ, ‘చివరికి మిగిలేది’ అనే సుప్రసిద్ధ నవలా రాసినవాడు.
‘కాలచక్రం నిలచింది’ అనేది ఆయన కథల్లో ఒకటి. దానిలో ఒక పాత్ర ‘విల్లు’ వ్రాసిగాని ‘విమానం ఎక్కడం మూర్ఖత్వం’ అంటాడు. ఈ వాక్యంలో వున్నది అన్వయదోషం కాదుగానీ, చెప్పదలచుకున్న భావాన్ని వ్యక్తం చేయడంలో అసమర్థత కనిపిస్తున్నది. అనగా, భావానికి తగిన వాక్య నిర్మాణం చేతగాకపోవడం. ‘విల్లు రాయకుండా విమానం యెక్కడం మూర్ఖత్వం’ అని ఆ వాక్యం రాసి వుండవచ్చు.
రచయిత చెప్పదలచుకున్న భావం అది ‘విల్లు రాసి గాని విమానం యెక్కకూడదు ; యెక్కడం మూర్ఖత్వం’ అని రాసినా ఆ భావం స్పష్టంగా వ్యక్తమౌతుంది.
రచయిత ఉద్దేశం అస్పష్టంగానైనా మనకు తెలుస్తున్నది కనుక యీ వాక్యంలోని దోషం అసమర్థ వాక్యనిర్మాణం అని చెప్పగలుగుతున్నాం. రచయిత ఉద్దేశం చూచాయగా కూడా మనకు బోధపడకపోతే దాన్ని అయోమయం అంటారు.
2. యద్దనపూడి సులోచనారాణి గారు తెలుగు నవలా రచయితలలో ప్రసిద్ధులు.
… ఆమె నవలలు యేవీ చదవలేదు గానీ, ఆమె రాసిన ‘కీర్తి కిరీటాలు’ యిటీవల యాదృచ్ఛికంగా నా కండ్లబడితే , చూద్దామని మొదలుపెట్టి, మొదటి ప్రకరణంలో మొదటి వాక్యం చదివినాను.
రెండవ వాక్యం చదవబోతే యిలా ఉంది : ‘విజయవాడ 25 కిలోమీటర్లు అని చూపిస్తున్న మైలురాయి దగ్గర …’ యిక చాలు అనిపించింది. పుస్తకం మూసేసినాను. మైలు రాయి మీద కిలోమీటర్లు యెందుకుంటాయి! అవి కిలోమీటర్లైతే దాన్నిమైలురాయి అని యెలా అంటారు!
మైలుకూ, కిలోమీటరుకూ భేదం తెలియదా రచయితకు? తెలిసేవుంటుంది. కానీ, ఆలోచించకుండా నవలలు రాసిపారెయ్యడం అలవాటైంది మన నవలాకారులకు. ఒక యద్దనపూడినే యెందుకనాలి గానీ , తెలుగు నవలా సాహిత్య చరిత్రలో ‘మైలురాళ్ళు’ చాలా వున్నాయి.
3. ఆర్. సంధ్యాదేవి రాసిన ‘నీలిమహల్ ’ అనే నవల యీ మధ్య యెక్కడో కనిపించింది. కొత్త రచయితలాగుందే అనుకుంటూ అట్ట తిప్పినాను. లోపలి అట్ట మీద ఆమె రాసిన యిరవై నవలల పట్టీ వుంది. యిరవై నవలలు రాసిన రచయిత పేరు అంతవరకు నాకు తెలియకపోవడం నా తప్పే అనుకుంటూ మొదటి ప్రకరణం చదవబోయినాను.
యిలా మొదలైంది : ‘ఎస్టేటంతా కోలాహలంగా సంతోషంగా సందడిగా వుంది. ప్రతి వక్కరి కళ్ళల్లో వెలుగు వెన్నెలలు వెదజల్లనారంభించాయి.’ రెండవ వాక్యం చదివేటప్పటికి నా తల తిరిగిపోయింది. ఆ వాక్యంలో క్రియ యేదో తెలుస్తున్నది గానీ, కర్త యేదో, కర్మ యేదో తెలియడం లేదు. వాక్యం మళ్ళీ మళ్ళీ చదివినా నాకు తెలియలేదు. ఆ వాక్యంలో ‘వెలుగు వెన్నెలలు’ అనేది కర్త అంటారా, కర్మ అంటారా? భగవంతునికే తెలియాలి.
నా కనిపించే దేమిటంటే, మొత్తం ఆ వాక్యమే తెలుగు పాఠకుల కర్మ; దానికి కర్త సంధ్యాదేవి గారు; క్రియ భగవంతుడు!
అసలు రహస్యం యేమిటంటే- కొంతసేపు తర్వాత నాకు అర్థమైంది- ‘వెదజల్లు’ అనే మాటకు అర్థమేమిటో రచయితకు తెలియదు. అర్థమే తెలియనప్పుడు, ఆ క్రియ అకర్మకమో, సకర్మకమో యెలా తెలుస్తుంది! అందువల్లనే ఆ వాక్యం మన కర్మ అయింది.
4.‘అయిష్టత’అనే మాట అటు వ్యాకరణ బద్ధమూ కాదు, యిటు వ్యావహారికమూ కాదు.
ఆశ్చర్యకరమైనదేమిటంటే, కుటుంబరావు గారి ‘నీకేం కావాలి’ అనే పెద్ద కథ (కుటుంబరావు సాహిత్యం- ఐదవ సంపుటం)లో యీ వాక్యం వుంది : ‘కస్తూరి తన అయిష్టతలు అందరికీ చెబుతుంది గాని తన ఇష్టాలింకోరికి చెప్పదు.’ యిష్టం, యిష్టాలు అనే మాటల్లో తకారం లేదు గదా. అయిష్టం, అయిష్టాలు అనే మాటల్లో తకారం యెందుకు రావాలి!
5. (భాషలోని దోషాల గురించి కుట్ర కథ రాసిన రంగనాయకమ్మ గారు కూడా రా.రా కి ఒక తప్పు విషయంలో చిక్కారు.)
రంగనాయకమ్మ గారి ‘అమ్మ’ అనే కథల సంపుటిలో మొదటి కథ పేరు అదే.
ఆ కథలో ఒక వాక్యం యిది : ‘అందరిలాగే ఆయన ఓ ఘడియ విస్తుపోయినట్లు చూసి మళ్ళా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు’. గడియ అంటే రచయితకు అర్థం తెలిసినట్టు లేదు. క్షణమో, కొద్ది క్షణాలో అనుకున్నట్లుంది. గడియ అంటే 24 నిమిషాలు. ఒకరోజుకు 60 గడియలు.
6. అల్లం శేషగిరిరావు గారు తెలుగులో వేటకథల నిపుణుడుగా ప్రసిద్ధుడు. ‘మంచి ముత్యాలు’ అనే ఆయన కథల సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.
ఆ సంపుటిలోని ‘వఱడు’ అనే రెండవ కథ చివరిభాగంలో ఈ వాక్యాలు వున్నాయి : ‘చిన్నయ్య కేంపు విడిచి రోడ్డెక్కిపోయాడు. వెనక్కి తిరిగి చూడకుండా నడుస్తున్నాడు. వీపు మీద హరికేన్ లాంతరూ, వాటరు బాటిలూ ఒకదాన్నొకటి కొట్టుకుంటూ టకటకలాడటం కర్ణాకర్ణిగా వినిపిస్తోంది. వెన్నెల పొడిచి పిండారబోసినట్టుంది’.
ఇక్కడ రచయిత ‘కర్ణాకర్ణిగా’ అనే మాటను తప్పుగా వాడినట్టు అనిపిస్తుంది. ఆ మాటకు ‘అస్పష్టంగా’ అనే అర్థం వుందని ఆయన అనుకున్నట్లుంది. అదొకటే కాదు. ‘వెన్నెల పొడిచి’ అనడం కూడా. నెల పొడుస్తుంది గానీ, వెన్నెల పొడవదు. వెన్నెల కాస్తుంది.
ఈ ఉదాహరణల్లో రా.రా ఎత్తి చూపిన దోషాలు మామూలు పాఠకుడికి, అచ్చ తెలుగు నుడికారం తెల్సిన సగటు పాఠకుడికి సులభంగా దొరికిపోయేవే! చదువుతూ ఉండగానే “ఇక్కడ ఏదో తేడాగా ఉందే” అని పసిగట్టేవే! అయితే మామూలు పాఠకులు “ఇవన్నీ సహజమే” అని వదిలి వేయడమూ ..రా రా వంటి విమర్శనాగ్రేసరులు వాటిని చీల్చి చెండాడ్డమూ జరుగుతుందన్న మాట
అమ్మకు ఆదివారం లేదా అనే 50 కథల సంపుటి లో ఈ “కుట్ర కథ కూడా ఉంది . ఇది అన్ని పుస్తకాల దుకాణాలతో పాటు కినిగే లో ఈ బుక్ గా కూడా లభిస్తుంది. http://kinige.com/kbook.php?id=923&name=Ammaki+Adivaram+Leda
కాస్త జాగ్రత్తగా శ్రద్ధగా చదివితే వాక్య నిర్మాణ దోషాలు,అన్వయ దోషాలు ఇవాళ వస్తున్న తెలుగు కథలు, నవలల్లో చాలా దొరుకుతాయి కానీ సగటు పాఠకుడికి వాటిని ఎత్తి చూపడం కంటే ముఖ్యమైన పనులుంటాయి కదా ! ఏమంటారు ??
త్రంగనాయకమ్మ గారు భాష గురించి “కుట్ర” లో చెప్పిన విషయాలు నాకు కంఠోపాఠమే. “వ్రాసారు” కంటే “రాసారు” ఎంత సులభంగా నాటుకొంటుంది కదా. ఆర్.సంధ్యాదేవి గురించి మీరు వినక పోవటం ఆశ్చర్యమే. హైదరాబాద్ లో సముద్రం ఉన్నట్లు రాసిన ఘనురాలు ఆమె. మేము విశాఖ లో చదివేటపుడు ఆమె మీద బాగా జోక్స్ వేసుకొనే వాళ్ళం. మీ ఆర్టికల్ ఇంట్రెస్టింగ్ గాను, ఉపయోగకరంగాను ఉంది.
క్షమించాలి. రామచంద్రారెడి గారికి తెలియక పోవటం.
బాగుంది సుజాత గారు. ‘విజయవాడ 25 కిలోమీటర్లు అని చూపిస్తున్న మైలురాయి దగ్గర ‘ ఇది వివాదాస్పదం కానీ రచయిత అజ్ఞానం కాని కాదు .ఎందుకంటే మైలురాయి అనేది దూరాన్ని సూచించడానికి వాడుకలో వున్న పదం. కాని దాని మీద కిలోమీటర్లు మాత్రమే రాసి వుంటాయి,మైళ్ళు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ లో వున్నవాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు. అట్లా రాయడమే సహజత్వం.అట్లా కాకుండా కిలోమీటర్ల రాయి దగ్గర అని రాస్తే ఎబ్బెట్టుగా వుంటది కదా.
సుజాత గారూ!
మీరు రాసింది బాగుంది. భాష గురించిన వ్యాసాలు ఇట్లాంటివి మరిన్ని రావాల్సిన అవసరముంది. అయితే ఈ రోజుల్లో దూరాన్ని మైళ్లలో కాక కిలోమీటర్లలో కొలుస్తున్నప్పటికీ మైలురాయి అనే పదం అలానే వుంది.మారలేదు. ఆ రాయిని కిలోమీటర్ రాయి అని ఎవరూ అనరు.అనకూడదేమో కూడా. అలాగే గడియ అనే పదానికి నిఘంటువుల్లో మీరు చెప్పిన అర్థమే వున్నా ‘తక్కువ వ్యవధిలో తరచుగా’ అని ఒక అర్థం స్థిరపడిపోయింది. నిద్రలో గడియగడియకు ఉలికిపడుతున్నాడు – అంటే ప్రతి 24 నిమిషాలకొక సారి ఉలికిపడుతున్నాడని కాదు కదా దాని అర్థం. ఇక వడ్డెర చండీ దాస్, కాశీభట్ల వేణు గోపాల్ మొదలైన వారు శిల్పపరమైన ఒక వైచిత్రి కోసం, ప్రభావం(effect) కోసం అట్లాంటి పదాలను ఉద్దేశపూర్వకంగా వాడుతారు. అయితే మన లాంటి కొందరికి అవి నచ్చకపోవచ్చు. ఇవన్నీ తెలియక రాసిన తప్పులు కావు. మీరు సూచించిన కొన్ని ఇతర భాషాదోషాలు మాత్రం భాష తెలియకనో లేక తెలిసినా అజాగ్రత్త వల్లనో జరుగుతుంటాయి.
Entertaining, informative and very well written. I’m tempted to say, this is your best on Vaakili so far! Please note that I’m writing this in English. మరి అంతలా భయపెట్టారు! Seriously, I loved this one! Agree with Dr. Kasula about your “మైలురాయి” observation. అది పంటి కింద రాయిలా తగిలినా, మిగిలినదంతా ఆదరగోట్టేశారు. ఆ స్టోరీ ఇంకా చదవలేదు, కానీ భలే నచ్చేసింది
యద్దనపూడి సులోచనారాణి తన నవల్లో ‘విజయవాడ 25 కిలోమీటర్లు అని చూపిస్తున్న మైలురాయి దగ్గర …’ అని రాయటం గురించి రా.రా. అభ్యంతరం నాకు సమంజసంగానే ఉంది. అలా రాయటంలోని అసంబద్ధత… రాసి ఓసారి చూసుకోగానే ఎవరికైనా అర్థమయ్యేదే.
‘మైలురాయి’ అనేమాటే వాడుకలో ఉంది. ‘కిలోమీటరు రాయి’ అని ఎవరూ అనరు, నిజమే. కానీ ‘కిలోమీటర్లు అని చూపిస్తున్న మైలురాయి’ అనే ప్రయోగం అసహజంగా, ఎబ్బెట్టుగా లేదా? ఇలాంటి ప్రయోగం మరే ఇతర రచనల్లోనూ కనపడకపోవటమే దీన్ని రుజువు చేస్తోంది.
‘విజయవాడ 25 కిలోమీటర్లు అని చూపిస్తున్న రాయి దగ్గర …’ అని రాస్తే సరిపోదా?
నిన్నటి నా వ్యాఖ్యకు మరింత వివరణ అవసరమనిపించి ఇప్పుడిది రాస్తున్నాను. ‘గడియ’కు 24 నిమిషాలు అనేది రూఢ్యర్థమైతే క్షణం లేక నిమిషం అన్నది implied meaning. ఈ ఆంగ్లపదానికి పూర్తిగా సరిపడే తెలుగు పదం నా మేధకు తట్టడం లేదు కనుక ప్రస్తుతానికి ‘భావింపబడే అర్థం’ అనే దాన్ని సూచిస్తున్నాను. కచ్చితమైన, మరింత సంతృప్తికరమైన పదాన్ని ఎవరైనా సూచిస్తే వారికి కృతజ్ఞుడిగా వుంటాను. గడియగడియకు = తక్కువ వ్యవధిలో తరచుగా. గడియగడియకు నీళ్లు తాగుతున్నాడు, గడియలో తిరిగొచ్చేస్తా -ఈ వాక్యాలు నేను ఊహించి రాస్తున్నవి కావు. ప్రజాబాహుళ్యపు నాలుకల మీద దొర్లేవే. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆ విధంగా ప్రయోగించరేమో. ఏదైనా కవిత లోని lineను ఈ రోజుల్లో మనం వాక్యం అంటున్నాం. కాని వ్యాకరణం ప్రకారం, భాషాశాస్త్రం ప్రకారం అది తప్పు. పంక్తి అనేదే సరైన పదం. అయినా ‘వాక్యం’ను అందరమూ ఆ అర్థంలో ఆమోదిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటివి తప్పులు కానటువంటి ‘తప్పులే’ తప్ప ఇవి తప్పకుండా తప్పులే అని చెప్పలేం.
మీరు రాసిందాంట్లో శబ్దార్థాన్ని ‘రూఢ్యర్థం’గా తడబడినట్టుంది. ఘడియ/ గడియకు శబ్దార్థం 24 నిమిషాలు; రూఢ్యర్థం (జనం వాడుక) స్వల్ప వ్యవధి!
విజయవాడ 25 కిలో మీటర్లు అని చూపిస్తున్న రాయి దగ్గర – అని రాస్తే సరిపోతుందా? రాయి అంటే అది ఏ రాయైనా కావచ్చు. కాని మనం ఒక ప్రత్యేకమైన రాయిని సూచించాలి కనుక మైలు రాయి అనాల్సి వుంటుంది కదా.
implied అనేది అన్వయించగల అనొచ్చా
‘…కిలోమీటర్లు అని చూపిస్తున్న’ అనే విశేషణం ఆ రాయి ఏమిటో- ఆ ప్రత్యేకతను చక్కగానే వివరిస్తోంది కదా?
వాటేనేమిజింగ్రైటప్..
నేను మొదట్లో ఇలాటివి కంపోజర్స్ చేస్తున్న తప్పులేమో అనుకున్నానండీ.
సుజాత గారు అందుబాటులో లేనందు వాళ్ళ వ్యాక్యలకు వెంటనే స్పందించలేరు.
“మైలురాయి దగ్గర” అనేది నాకు కూడా తప్పుగా అనిపించడంలేదు. నిజానికి మైలురాయి అనేది దూరాన్ని చెప్పేదే అయినా దానిని దూరానికే కాక ఒక్కోసారి సమయానికీ వాడుతూంటారు (ప్రధాన ఘట్టాలని చెప్పడానికి… ఒక ముఖ్యమైన మజిలీ అన్న అర్ధంలో). అంటే మైలు రాయికీ మైలురాయికీ మధ్య దూరాన్ని నెలలుగా, సంవత్సరాలుగా కూడా చెప్తూంటారు. అలాంటపుడు దూరంలోనే మరొక యూనిట్ ని (మైలు బదులు కిలోమీటర్ని) వాడడం తప్పు కాదు. అది వ్యవహారంలో ఉన్నదే.
నాకిది చదివితే సరదాగా యిలా వ్రాయాలనిపించింది.
“మైలు రాయి మీద కిలోమీటర్లు యెందుకుంటాయి! అవి కిలోమీటర్లైతే దాన్నిమైలురాయి అని యెలా అంటారు! “- అని రా.రా ఎలా అడుగుతారు? జనం అలాగే అంటారని తెలియదా ఆయనకు? తెలిసేవుంటుంది. కానీ, ఆలోచించకుండా విమర్శలు రాసిపారెయ్యడం అలవాటైంది మన విమర్శకులకు.
సరదా పక్కన పెడితే ఆ వెంటనే ఆయన రాసిన వాక్యం…”ఒక యద్దనపూడినే యెందుకనాలి గానీ , తెలుగు నవలా సాహిత్య చరిత్రలో ‘మైలురాళ్ళు’ చాలా వున్నాయి. ” ఈ వాక్యలో ఆయన వాడిన మైలురాయి అన్న పదంలో శ్లేష వుంది కదా! ఒక అర్ధం మైలుని చూపించే మైలు రాయి. మరో అర్ధం తెలుగు నవలా సాహిత్య చరిత్రని మలుపు తిప్పిన రచయిత్రులు.
మీరు చెపుతున్నది నిజమే నండీ! మైలు రాయి అనేది తెలుగు వాడుక. కిలో మీటర్ అన్న మాట బ్రిటీషు వాళ్లు తెచ్చింది. ఇక్కడ మైలు రాయి అనేది ఒక సూచి మాత్రమే (దిక్సూచి లాగ) అది కిలోమీటర్లను సూచిస్తుందా లేక మైళ్లను సూచిస్తుందా అన్నది సమస్య కాదు. ఇంకో అర్దంలో మార్పును, లేక ఒక మలుపును సూచించటం. తప్పుగా అనిపించటం లేదు.
భాష అనేది నిలువ నీరు కాదు. ముందుకు సాగే ప్రవాహం. అది పాశ్చాత్యులె అంగీకరించారు. ఎప్పుడో nice అనే మాటకు అర్ధం foolish అని ఇప్పుడలాగే వాడుతున్నారా? అలాగే minister అంటే సర్వెంట్ అనే అర్హ్డం.
ఏది సరైన భాష అనేది ఎవరు నిర్ధారించాలి? భాషా వేత్తలా ప్రస్తుత జన సమూహమా? నలుగురికీ సమంజసం అయినప్పుడు కోడి గుద్దుకు ఈకలు పీకడం ఎందుకు?
“ఆలోచించకుండా విమర్శలు రాసిపారెయ్యడం అలవాటైంది మన విమర్శకులకు.” అనే వ్యాఖ్య రా.రా. గారి విషయంలో దారుణమైన వ్యాఖ్య.
‘విజయవాడ 25 కిలోమీటర్లు అని చూపిస్తున్న మైలురాయి దగ్గర …’ అని రాయటం గురించి రా.రా. అభ్యంతరం నాకు సమంజసంగానే ఉంది. అలా రాయటంలోని అసంబద్ధత… రాసి ఓసారి చూసుకోగానే ఎవరికైనా అర్థమయ్యేదే. ” -వేణు గారి వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తున్నాను.
థాంక్స్ స్వాతీ శ్రీపాద గారూ. మీరు సూచించిన పదం కొంత వరకు సరిపోతుంది. అయితే Oxford Advanced Learner’s Dictionaryలో impliedకు వున్న రెండర్థాల్లోని to make it seem likely that something is true or existsను mean చేసాను నేను. Implied,indirect- ఈ రెండు పదాల అర్థం దాదాపు ఒకటే కనుక implied meaningను పరోక్షమైన అర్థం అనవచ్చునేమో.
టాపిక బాగుంది సుజాత గారూ!
“రచయిత స్థాయి ఏదైనా reader friendly గా రాయాల్సిన అవసరం ఉందని మాత్రం నేను నమ్ముతాను.” బాగా చెప్పారు.
వేణుగోపాల్ గారు “సంయుక్తాక్షరాలు” విరివిగా వాడినా, చదవటానికి కష్టంగా అనిపించినా, బావుంటాయండి. తెలుగు సంయుక్తాక్షరాలు బాగున్నా, ఇంగ్లీష్ అక్షరాలతో చేసే ప్రయోగం మాత్రం మీరన్నట్లు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది.
ఇక యద్దనపూడి నవలలు నేనో పదిహేనో ఇరవయ్యో చదివి ఉంటా. అన్నింటిలో నాకు బాగా నచ్చిన నవల “కీర్తికిరీటాలు”. తీసిపారేయాల్సింది మాత్రం కాదు. మరోసారి ఎప్పుడైనా కనబడితే ఓసారి చదవండి.ఎంత ప్రేమ ఉన్న మనుషులనైనా “అహంకారం” ఎలా విడదీయగలదు, గొడవలు వచ్చినప్పుడు మూడో వ్యక్తిని దూరనిస్తే జీవితం ఎంత తలకిందులైపోగలదో (తేజ తల్లిదండ్రుల కథ ద్వారా) బాగా చెప్తుందీ నవల. ఇందులో “తేజ” క్యారెక్టర్ ఒకటి నాకు బాగా నచ్చుతుంది.
“ఆలోచించకుండా విమర్శలు రాసిపారెయ్యడం అలవాటైంది మన విమర్శకులకు.” అనే వ్యాఖ్య రా.రా. గారి విషయంలో దారుణమైన వ్యాఖ్య.
అది వ్యాఖ్య కాదండీ. సరదాగా ఆయన్ని అనుకరిస్తూ చెప్పిన వాక్యం. ఆమాట అక్కడే చెప్పాను నేను.
అది దారుణంగా కనిపించడంలో అర్ధం వుంది. ఒప్పుకుంటాను. ఎందుకంటే సులోచనారాణి గారికి సంబంధించినంతవరకూ ఆయన చేసిన వ్యాఖ్య కూడా కొంత అలాగే వుంది. పదాల అర్ధం తెలుసుకోకుండా యిష్టం వచ్చినట్లు వాడడం నాకూ నచ్చదు. ఆయన ఎత్తి చూపిన మిగతా తప్పులని నేనూ ఒప్పుకుంటాను. కానీ ఈ పదం విషయంలో మాత్రం … అంత చిరాకు పడి పుస్తకమే పక్కన పెట్టాల్సినంత పెద్ద తప్పుగా వర్ణించడం సరికాదని నాకు అనిపిస్తోంది.
“భాష అనేది నిలువ నీరు కాదు. ముందుకు సాగే ప్రవాహం. అది పాశ్చాత్యులె అంగీకరించారు. ఎప్పుడో nice అనే మాటకు అర్ధం foolish అని ఇప్పుడలాగే వాడుతున్నారా? అలాగే minister అంటే సర్వెంట్ అనే అర్హ్డం.
ఏది సరైన భాష అనేది ఎవరు నిర్ధారించాలి? భాషా వేత్తలా ప్రస్తుత జన సమూహమా? నలుగురికీ సమంజసం అయినప్పుడు కోడి గుద్దుకు ఈకలు పీకడం ఎందుకు? ”
I second Swathi Sripada gaaru.
Very well expressed Swathi gaaru !
> డొన్మెక్మిక్రై (dont make me cry )
అసలే కాశీభట్ల.
ఆపైన అచ్చుతప్పులైతే ఎట్లా.
ఇదేమైనా నేనచ్చేయించిన తపన ఫస్టెడిషనా?
ప్రజల నోళ్ళలో నానే భాషే రచనా భాష అయితే మంచిది. అప్పుడు ఆ రచన అందరికీ సులభంగా అర్ధమవుతుంది. ఈ దిశ రచయితలంతా ముందుకు వెళితే బాగుంటుంది.
రాయడానికి ప్రయత్నించే వారిని సరైన భాష అని భయపెడుతూ రాయనీకుండా చేయడం,మరంత పెద్ద కుట్ర,.
జనానికి అర్థమయ్యేలా రాయమని చెప్పటం కుట్ర అవుతుందా? అర్థం కాకుండా, అర్థం పర్థం లేకుండా రాయటం గురించి విమర్శలు చేయటం- ఆ లోపాలు సవరించుకోమని సూచించటానికే. అంతమాత్రానికే ఏ రచయితా బెంబేలెత్తాల్సిన అవసరం లేదు!
పొరపాట్లని కుట్ర అనడాన్ని ఏమంటారు,.పల్లెల్లో ప్రజల భాష మనకర్థంకాలేదని,.వాళ్లు కుట్ర చేస్తున్నామంటామా,..సరైన వ్యాకరంణంతో కూడిన వాక్యాలతోనే నవలలు,కధలు రాయలనడం సమంజసమేనా,…కీర్తిశేషుడు బుచ్చిబాబు ప్రసిద్ధ రచయిత,.ఇక్కడ కీర్తిశేషులు అంటారా,కీర్తిశేషుడు అంటారా,.తప్పులు గుర్తించడం,సరిచేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు,.కుట్ర అనే పదానికి అర్థం తెలియకుండా,దానినే టైటిల్ గా పెట్టడానిని ఏమంటారో,.
@విజయవాడ 25 కిలోమీటర్లు అని చూపిస్తున్న మైలురాయి దగ్గర …’ యిక చాలు అనిపించింది. పుస్తకం మూసేసినాను. మైలు రాయి మీద కిలోమీటర్లు యెందుకుంటాయి! అవి కిలోమీటర్లైతే దాన్నిమైలురాయి అని యెలా అంటారు!
మైలురాయి అన్నపదం milestone అనే ఇంగ్లీషు పదం నుండి వచ్చ్చినది అని అనుకొంటున్నాను . ఆ విధం గా చూస్తె రచయిత వాడుకలో తప్పేమీ లేదు . విమర్శకుల అవగానలోనే లోపం ఉంది . మైలురాయి అనే పదం కేవలం ‘మైళ్ళు’ కొలతలోనే వాడబడడం లేదు. ఇది ఫలితానికి , కాలానికి కూడా పోల్చబడుతుంది .
తప్పులెన్నువారు తండోపతండంబులు.., ఆ తప్పులెన్నువారిలో కూడా తప్పులుండచ్చు. ఆవిడ ఆవేదనలోని సాంద్రతని తెలియజేసే పదం కుట్ర. ఆవిడ తప్పులు పట్టారని ఆవేశపడి ఆవిడనే తప్పులు పట్టడంకంటే ఆవిడ రాసిన విషయంలోని సాధ్యాసాధ్యాల గురించి చర్చించడం మంచిది. లేకపోతే తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అనే గుంపులోకి మనమూ చేరిపోతాము. అందుకే అంటారు, “ప్రమాదో ధీమతామపి” అని. మనం చెయ్యవలసింది తప్పులుపట్టడం కాదు. తప్పుల్ని సరిదిద్దుకోవడానికి నడుం కట్టడం.
పేజీల లెక్కన పబ్లిషర్ లకి అమ్ముకోవటానికి మాత్రమే రాసిన వాళ్ళ లో ఈ దోషాలు ఎక్కువ !!
సరి చూసుకోవటం మొదలెడితే సగం పేజీలు ఆవిరయి పోతాయి.
నాకొక అనుమానం వచ్చింది.
గడియ, ఘడియ వేరు మాటలా లేక ఒకటేనా?
తలుపు గడియ వేయండి అనే వారు.
ఘడియలో వేస్తాను, అదెంత పని అనీ అనే వారు.
ఇక చెవులు గడియలు పడుతున్నాయని మరొక మాట ఉండేది.
వీటి మర్మం ఎవరన్నా చెప్పగలిగితే బాగుండు!
Well done!