కథ

దోషి

మే 2013

ఇంటికి తాళం పెట్టి ఉంది. వాకిట్లో ముగ్గు లేదు. ఏమయ్యిందో రమణకు. తమ ఊరెళ్ళి పోయి ఉంటుందా. ఆమె తల్లీదండ్రీ వచ్చి తీసుకెళ్ళిపోయుంటారా? అమ్మో తనమీదే ప్రాణాలు రమణకు అనుకుంటూ ఇంటి వెనక వేపువెళ్ళి వెతికాడు. అక్కడా లేదు.

దణ్ణెం మీద బట్టలారేస్తూ పక్కింటి పద్మ కనిపించింది.

“రమణ ఏది?”

“దొరగారింటికెల్లింది.”

“ఇంట్లో పని చెయ్యడానికెల్లుంటది.”

పద్మ బదులు చెప్పలేదు.

బరువుగా ఉన్న సంచీతోనే యజమాని ఇంటివేపు పరుగు లాంటి నడకతో వెళ్ళాడు.

గేటులోంచి చూస్తే ఇంటి బూజు దులుపుతున్న రమణ కనిపించింది.

గేటులో నారాయణ ను చూడగానే బూజు కర్ర ఒద్దికగా పక్కన పెట్టి చీర కుచ్చిళ్ళు సరి చేసుకుని దగ్గరకొచ్చింది.

దొర ఇంట్లో, పని చేస్తున్నట్టుగా లేదు. కట్టూ బొట్టూ చూస్తే ఇంటి పని చేసుకుంటున్నట్లు తోచింది.

అతనితో బాటే బయటకొచ్చింది.

ఊళ్ళమీద ఎండల్లో తిరగడం వల్ల రంగు తగ్గింది. వేళకు తిండిలేక, పోషణలేక చిక్కిపోయాడు. మట్టికొట్టుకుపోయిన బట్టలు.

“గభాల్న చూస్తే గుర్తు పట్టలేక పోయాను. ఏంటిట్టా అయ్యావు.” అంది

“ఎలా అయ్యాను?”

“ఏం లేదులే!”

“ఓహో చిక్కిపోయాననా? ఎక్కడ రమణా, తినేందుక్కూడా టైముండదు. రోజంతా పనే.”

నారాయణ ఇంటివేపు వెళ్ళబోతుంటే అటుకాకుండా గుడి వేపుకు దారితీసింది.

అదేంటే అంటే నీతో ఓ సంగతి చెప్పాలి అంటూ గుడి పక్కన చెరువు దగ్గర ఆగింది. చెరువు లోకి దిగడానికి వీలుగా మెట్లు, మెట్లకు రెండువేపులా సిమెంటు అరుగుల్లాంటివి కట్టారు. ఒక దానిపై కూర్చున్నాడు. రమణ కూర్చుంటుందని కొద్దిగా జరిగాడు కానీ అతనికెదురుగా కూర్చుంది.

అప్పుడప్పుడు చేపలు ఎగిరి మళ్ళీ నీళ్ళలో పడుతున్నాయి.

“ఏమయిందే, ఈడకు తెచ్చావెందుకూ?”

“కొన్ని సంగతులు చెప్తాను, మనసు కష్టపెట్టుకోవాక.”

ఆమెకు చేతనైనట్లు విషయం చెప్పింది.

ఆమె మాటలు వినేందుకు కష్టంగా తోచాయి, కానీ తేలికగా అర్ధమయ్యాయి.

ఆపైన మనసు మోయలేనంత బరువైంది.

నారాయణకు తామిద్దరూ మొదటిసారి మాట్లాడుకున్న రోజు గుర్తొచ్చింది.

కొన్ని నెలలక్రితం ఇక్కడికి రాకమునుపు ఇద్దరూ కృష్ణా జిల్లాలో ఒక పల్లెటూళ్ళో ఉండేవాళ్ళు. నారాయణది గుడిపక్కన చిన్న షాపు. పూజ సామాన్లు, పిల్లలకు ఆటబొమ్మలు, గాజులు అమ్మే వాడు. తల్లి చిన్నతనంలోనే పోయింది. రెండేళ్ళ క్రితం తండ్రికి జబ్బు చేసినపుడు చదువు మానేసి కొట్టు చూసుకోవాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చేర్చిన రెండు వారాల తర్వాత తండ్రి పోయాడు.
ఆడపిల్లలు అసూయపడేంత అందంగా సుకుమారంగా ఉండే వాడు. ఆడపిల్లలు నారాయణను చూసేందుకే వచ్చేవాళ్ళు. బేరం అయిపోయినా ఏదో వంకన మాట్లాడుతూ ఉండేవాళ్ళు.

రోజూ గుడికి తల్లితో కలిసి వెళ్ళేది. రమణ వెళ్తూ ఉంటే కుర్రోళ్ళంతా మాటలాపేసేవాళ్ళు. ఎవరివంకా చూసేదికాదు. నారాయణకు మాత్రమే తెలిసేట్టు క్షణం పాటు రెప్పలెత్తి చూసేది. ఎవరినీ అంటకుండా సీదాగా నారాయణ మీద బాణం లాగా చూపేసి వెళ్ళేది. ఆ ఒక్క చూపు వళ్ళంతా సంతోషం నింపేది. గుండెంతా గుబులయ్యేది. మళ్ళీ రేపు సాయంత్రం వరకూ అదే ధ్యాసతో కొట్టుకులాడేవాడు. దారిలో ఎక్కడేనా ఎదురుపడితే ఇద్దరూ వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసుకునే వాళ్ళు.

ఓ రోజు సాయంత్రం గుడి వెనక కలుసుకుంది. పెళ్ళాడటానికి మేనమామ కొడుకు వస్తున్నాడని కబురొచ్చిందంది. పెళ్ళిఖాయమైపోనట్టేనంట. మిలట్రీ లో పనిచేస్తాడనీ బాగా మోటుగా మనిషనీ చెప్పింది. ఆడికి సెలవలెక్కువగా ఉండవు కాబట్టి వచ్చీ రాంగనే పెళ్ళి చేసుకుని పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోతాడంట. నారాయణ లేకపోతే చచ్చిపోతానని ఏడ్చింది. ఆడితో పెళ్ళయి, ఆడు వంటి మీద చెయ్యేస్తే చెర్లో శవంగా తేల్తానంది. అప్పటికప్పుడు ఊరిడిచిపెట్టి వెళ్ళిపోదామని, కలిసి హాయిగా ఉందామంది. కష్టపడి పనిచేస్తే ఆ తర్వాత ఆలోసిచ్చుకోవచ్చని చెప్పింది. వీళ్ళకు దూరంగా ఎక్కడైనా కష్టం చేసుకుని బతుకుదామంది. అతనేం చెప్పబోయినా వినిపించుకోలేదు.

తర్వాతి రోజు తెల్లవారు జామునే , ఇద్దరూ కలిసి రైలెక్కి తమ వూరికి దూరంగా వేరే ఊరెళ్ళి పత్తి మిల్లులో చేరారు. రోజుకు చెరొక వంద రూపాయలు. పగలంతా పని. రాత్రి నిద్ర. తెల్లవారుజామునే లేచి పన్లోకెళ్ళాలి. పని అలవాటులేక రమణ లేచేది కాదు. రమణ సరిగా చెయ్యడం లేదని మిల్లు పన్లోకి వద్దన్నారు. రమణ యజమాని ఇంట్లో పనికి కుదిరింది. యజమాని ఇంటి దగ్గర్లోనే చిన్న పాకలో ఉండేవారు.

ముందు జాగ్రత్త గా మెడలో పసుపచ్చ తాడు, కాలి వేలికి మెట్టెలు తగిలించినా కూడా, బిక్కుబిక్కుమనే ఇద్దరి మొహాలు చూస్తే వీళ్ళసలు పెళ్ళి చేసుకున్నారా, భార్యాభర్తలేనా అని చూసిన వాళ్ళకు అనుమానమొచ్చేది.

నాలుగునెలలు గడిచాక నమ్మకంగా పని చేస్తున్నాడని, పరాయి సొమ్ము ముట్టుకోడని యజమానికి నారాయణమీద నమ్మకం కుదిరింది . వ్యాపారం లో డబ్బు లావా దేవీలు చూసేందుకు పై ఊళ్ళకు పంపేవాడు. కొన్ని సార్లు వారమో, రెండు వారాలో అక్కడే ఉండాల్సివచ్చేది. కొత్త ఊరు పాత బడింది.

ఓ రోజు మేనేజర్ రమణ వాళ్ళ పాక దగ్గరకొచ్చాడు. ఇంట్లోకి కావల్సిన సరుకులు రమణనడక్కుండానే ఇంట్లో పెట్టాడు.

ఏమిటి సంగతంటే నీకేవైనా కావాలేమోనని యజమాని కనుక్కురమ్మని పంపారన్నాడు. అలసట తీర్చుకోడానికి కూర్చున్నట్లు అరుగు మీద కూర్చుని కబుర్లు మొదలెట్టాడు.

మేనేజర్ ఎప్పటినుండో యజమాని దగ్గరే పనిచేస్తున్నాడట. భార్యపోయి రెండేళ్ళైనా యజమాని ఇంతవరకూ పెళ్ళి చేసుకోలేదట. ఎప్పుడూ బిజినెస్ వ్యవహారాలేగానీ చిల్లర వ్యవహారనేవి పట్టవట. మనసు నవనీతం, గుణం బంగారం అంటూ ఇంకా ఏవేవో చెప్పుకొచ్చాడు.

ఏ రోజుకారోజు కొత్త కబుర్లు చెప్పేవాడు మేనేజర్. యజమాని అంత తొందరగా ఎవరి వంకా చూడడట. అల్లాటప్పా ఆడవాళ్ళ మీద చూపు పడదంట. ఆయన చూపేశాడంటే ఇక ఆపిల్లను అప్సరసల అప్పచెల్లెలనుకోవాల్సిందేనట. ఒక్కసారి చేపట్టాడో ఇక స్వర్గాన్ని తీసుకొచ్చి పెరట్లో వాకిట్లోనో దింపేస్తాడట. అయ్యగారికి ఎదురుచెప్పడం, ఎదురుదెబ్బతింటం ఇవేవీ తెలివున్న పనులు కాదట. ఏది చెప్పినా సరే చెవిలో రహస్యం చెప్తున్నట్లు మెత్తగా చెప్పేవాడు.

ప్రతిరోజూ ఏదోవంకన జీపాగేది.

“మొన్న, బెల్లం మర్చేపోయానేవ్ నామతి మండా” అంటూ బెల్లం బుట్ట దింపి అటక మీద పెట్టడానికి లోపలకెళ్ళాడు మేనేజర్.

ఎందుకివన్నీ? ఏం చేసుకోను కోపంగా అడిగింది మేనేజర్.

నన్నడుగుతావేమే? అయ్యగారున్నారుగా అడగరాదూ అని లోపలే ఏదో సర్దుతున్నాడు మేనేజర్.

రమణ మెల్లగా జీపుదగ్గరకెళ్ళి “ఒక్క దాన్ని, ఈ సరుకులన్నీ ఏం జేసుకోను?” నేల చూపులు చూస్తూ అడిగింది మెల్లగా. అడుగుతుంటే గుండె వేగంగా కొట్టుకోవడం ఆమెకు తెలుస్తూనే ఉంది.

రమణను పైనుంచి కిందివరకూ చూసి ” అవునుమరి ఒక్కదానికి కష్టమే. ఏం జేస్తావు?” అన్నాడు .

రమణ కు అప్పటికప్పుడు సిగ్గుముంచుకొచ్చి లోపలికి పరుగు తీసి అద్దం ముందు నుంచుంది.

‘నాలో ఏం నచ్చింది?” అనుకుంటూ.

తర్వాతి రోజు పాక ముందు జీపాగింది. మేనేజర్ కూరగాయలు, పళ్ళు తీసుకొచ్చి ఇంటో దింపి మళ్ళీ మొదలెట్టాడు. భార్య ఉన్నన్నన్నాళ్ళూ రోగమనీ, మందులనీ ఆస్పత్రులచుట్టూ తిరిగేదట . ఆయనకు శ్రమతప్ప సుఖం లేదట. ఇంతమందికి మేలు చేస్తున్న దేవుణ్ణి పట్టించుకునేవారే లేరట. కానీ పెదవి విప్పి తనబాధ ఎవరితోనూ చెప్పుడట. గరళం మింగిన శివుడేనట.

ఇవాళ అయగారు భోజనం చేయలేదట. అయ్యగారు భోజనం చెయ్యలేదని మేనేజర్ కు మనసెలాగో ఉందట. కనిపెట్టి చూసుకునే మనిషెవరూ లేకపోయారని వాపోయాడు.

భోజనం వండి ఉంచుతాను. తీసుకెళ్ళమంది.

“నేను తీసుకెళ్ళడవేమిటే, నీకు మాత్రం ఆయన యజమాని కాదూ? భోజనం పట్టుకెళ్ళడానికి ఏవిటే నీకు నామోషీ?” అంటూ కసిరాడు.

రమణ వాకిట్లోకొచ్చి నిలబడింది. జీపులో కూర్చున్న యజమాని ఆమెవంక చూడకుండా దారివంక చూస్తూ మీసం సవరించుకుంటున్నాడు. ఎందుకో యజమాని తనవంక చూడకపోవడం రమణకు నచ్చలేదు.

“ఎట్టా ఎల్లేది. ఇటుపక్కకే సూడడు” మేనేజర్ తో ఫిర్యాదుగా అంది.

‘వలలో పడిన చేపతో ఇంక కబుర్లేవిటీ?’ అనుకుని

“ఓసి నీ దుంప తెగా, అందరూ చూసేవేళ చూస్తారటే మహారాజులు. ఎవరూ లేని వేళ చూసుకుని నీవంక దొరగారు చూస్తారో, దొరవంక నువ్వు చూస్తావో నాకేమి ఎరుక ?” అంటూ, ముసిముసిగా నవ్వుతూ పంచె కొంగు ఎడమ చేత్తో ఎత్తిపట్టి వెళ్ళిపోయాడు.

పనికెళ్ళే రోజుల్లో పత్తిమిల్లులో అందరూ దొంగ చూపులు చేసేవారే. నారాయణతో ఉట్టుట్టి స్నేహం చేసేవారు. నారాయణ భుజాన చేతులేసి తలా తోకా లేకుండా మాట్టాడుతూ తనవంక దొంగతనంగా చూసేవారు. దొర ఇంటో ఉంటే వేరే మనుషులు కన్నెత్తి చూస్తే ఒట్టు. దొరకెంత మంచి ఇల్లు. ఎన్ని గదులో. ఊళ్ళో తమ ఇంటికన్నా బాగుంది. ఇంటిముందు ఎంత పెద్ద తోట. ఎన్ని పూలో. మల్లెపూలు కొనాల్సిన అవసరమే లేదు. వంట తప్ప పనులేం చెయ్యక్కర్లేదు.

తర్వాతి నుండీ ఆమెకు నారాయణ లో లోపాలన్నీ ఒకటొకటే గుర్తొస్తున్నాయి. కొంచం వంగి నడుస్తాడు. దొర ఐతే దొరలాగే ధైర్యంగా నడుస్తాడు . నారాయణ మరీ తెల్లగా ఆడపిల్లలా ఉంటాడు. దొరది మంచి రంగు. మగవాడి రంగు. కోరమీసం. నారాయణకు సిగ్గు, మొహమాటం. ప్రతి దానికీ భయపడతాడు. తామిద్దరూ ఇక్కడికొచ్చిన మొదట్లో భయంగా ఉందని ఊరికూరికే ఏడిచేవాడు. అస్సలు ధైర్యం లేదు. దొరకెంత ధైర్యం. మగవాడంటే ఎలా ఉండాలి. ఇద్దర్నీ పోలుస్తూ, తూకం వేస్తూ గడిపింది. బరువు పెరిగిన వేపుకే మనసు త్రాసు ఒరిగింది.

దొర ఎంత ఇష్టంగా తిన్నాడు తను చేసిన పులుసు. అడిగి మరీ వడ్డించుకున్నాడు. తన వంట రుచి చూశాడుగా, ఇక వదలడు.

ఇల్లంతా శుభ్రం చేసింది. పసుపు రాసి బొట్లు పెట్టింది. దొరకు పెళ్ళాం పోయి రెండేళ్ళవుతోందట. మళ్ళీ పెళ్ళిచేసుకోడా? నాకన్నా బాగా చూసుకునేవారెవరు దొరుకుతారు?

*******

ఇద్దరూ ఆలోచనల్లోంచి బయటకొచ్చారు.

విన్న విషయం కన్నా, రమణ మొహం లో భావాలే అతనికి కష్టంగా అనిపిస్తున్నాయి. అతను చేసిన నేరానికి ఆమె ఫలితం అనుభవిస్తున్నట్లుంది ఆమె వాలకం. అతనెందుకొచ్చాడా, ఎప్పుడెళ్తాడా అన్నట్లు ఎటో చూస్తూ కూర్చుంది. . అతనికేం మాట్లాడలన్నా కూడా బెరుకుగా అనిపించింది.

ఒక చేప ఒడ్డున పడింది. నారాయణ లేచి దాన్ని నీళ్ళలోకి విసిరేశాడు.

“ఎందుకొప్పుకున్నావు రమణా?”

“ఒప్పుకునేదేముంది. రోజంతా ఇంటిసుట్టూ తిరిగేవోడు. నాకెవరున్నారు అండ. నువ్వు చూడబోతే ఏడకుబోయావో తెలియకపోయె. ఏరే దారి లేకపోయింది. ఆడదాన్ని. .”

“అయితే నా తప్పేనా? జరిగినదానికి కనీసం రమణ ఏడిస్తే బాగుణ్ణు అనిపిస్తోంది కానీ కఠినంగా ఉన్న ఆమె ముఖం చూసి అతనికి నీరసమైంది.

అంత విచారంగా అంతకుమునుపెపుడూ లేదు. కానీ ఇదివరకులా ఏడవలేకపోయాడు.

“ఏం చేద్దాం రమణా?”

“జరిగిందేదో జరిగింది.నువ్వూరికెళ్ళిపో.” తీర్పు చెప్పగల అధికారం ఆమెకున్నట్లు అంది

నారాయణ ఏమీ మాట్టాడలేదు.

“సరేలే, నువ్విట్టా నా దగ్గిరగా కూసుండగా దొర జూస్తే పెమాదం. అసలే కోపమెక్కువ. నిన్ను చంపినా చంపుతాడు.”

ఇతనెటూ పిరికివాడే . ఆమె వరించిన వాడు వీరుడు.

“సరే రమణా, ఈ డబ్బిచ్చి వెళ్తాను.”

“నేనిస్తాలే. నువ్వెళ్ళు”

“కాదు రమణా, లెక్క చెప్పొద్దా? ” ఇద్దరూ నడిచి దొర ఇంటికొచ్చారు.

అప్పటికి దొర ఇంటి బయట కూర్చున్నాడు.

అయ్యగారూ అంటూ నారాయణ డబ్బు సంచీ తీసి ఇచ్చాడు. దొర మొహం చూడలేక, తనే తప్పు చేసినట్లు తలదించుకున్నాడు.

ఆ ఊరి వ్యాపారం లో అంత సొమ్ము కళ్ళ జూడడం అదే మొదటి సారి. దొర కళ్ళు వెలిగాయి. సిగరెట్ ముట్టించి పొగ వదిలాడు. ఆలోచనలు కూడా కమ్ముకుంటున్నాయి.

“ఇహ నుండీ నువ్వాడనే ఉండి యాపారం జూసుకో.” నారాయణ తో చెప్పాడు

దొర ఉద్దేశ్యం రమణకు ఇంకోలా అర్ధమైంది. కళ్ళు దించుకుని నేల చూపులు చూస్తూ, సిగ్గు కప్పిపుచ్చుకునేందుకు చీరకొంగు ముడిపెడుతూ విడదీస్తూ నిల్చుంది.

రమణ వంక చూశాడు దొర.

‘మెల్లగా ఇంట్లో తిష్ట వేసేట్టు ఉంది. వదిలించుకోవాలి’ లోపలే అనుకుని

” దీన్నికూడా తీసుకెళ్ళు. తెల్లారుజాము బండికి పోండి. అప్పుడప్పుడొచ్చి నేను చూసుకుంటుంటా………….యాపారం.” నారాయణతో చెప్పాడు.

ఇదేంటి అన్నట్టు రమణ దొరవంక చూసింది. అతనదేం పట్టనట్టు సిగిరెట్ చివర మంటని జాగ్రత్తగా చూస్తున్నాడు.

ఇద్దరూ అలానే నిల్చోవడం అతనికి విసుగనిపించింది.

అక్కడ ధాన్యపు రాశి దగ్గర పనిచేస్తున్న పని వాళ్ళను కేకేశాడు. “ఒరేయ్ ఈళ్ళక్కూడా ధాన్యం కొలవండి” అంటూ లేచి లోపలికెళ్ళాడు యజమాని.

కొలవద్దని పని వాళ్ళతో చెప్పాడు కానీ కొలువొద్దని చెప్దామంటే దొర అక్కడ లేడు.

ఇంటిలోపలికెళ్ళే ధైర్యం ఇప్పుడు ఇద్దరికీ లేదు.

గుమ్మం లోపల అడుగుపెట్టే ధైర్యం ఇద్దరికీ లేదు. పదినిముషాల ముందే ఆమె పసుపు రాసిన గుమ్మాలు.

ఇద్దరూ తమపాకవేపు అడుగులేశారు.

దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు.

పదినిముషాలముందే తామేం మాట్లాడుకున్నారో గుర్తొచ్చింది ఇద్దరికీ.

ఇంటికెళ్ళాక ఇద్దరికీ తిండి తిందామన్న ధ్యాస లేదు.

ఇంటి తాళం తీసి లోపలొకెళ్ళింది. అంతా బూజుపట్టింది. ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి. శుభ్రం చేయకుండా గుంజకానుకుని కూర్చుంది. నారాయణ బయట అరుగుమీద కూర్చున్నాడు. ఒకరితో ఒకరికి మాటల్లేవు. సాయంత్రం రాత్రైంది. పదింటి వేళ లోపలికెళ్ళి తను వస్తూ వస్తూ కొన్న మంచినీళ్ళ సీసా ఇచ్చాడు. తినడానికి కొన్నవి ఇచ్చి తినమన్నాడు. ఆకలికి సిగ్గులేదు కనక సరిపోయింది. లేకపోతే ఎంతమంది బతికుంటారు లోకంలో.

“ఇద్దరం వచ్చాము. నన్నొక్కణ్ణే పొమ్మన్నావు. ఆయనేమీ ఇద్దర్నీ పొమ్మన్నాడు. నువ్వే చెప్పు ఏంచేద్దామో?”

రమణ ఏం మాట్టాడలేదు.

“పద రమణా ఊరు తీసుకెళ్తాను.”

“అమ్మా నాన్నా చంపేస్తారు.”

“నేను వదిలిపెడతానులే.. భయపడకు.”

****

రైలు దిగి ఇంటికెళ్ళేసరికి ఇంకా చీకటిగానే ఉంది.

పొద్దున్నే తెల్లవారు జామున పార్వతమ్మ ఇంటిముందు ముగ్గు పెడుతోంది.

కూతుర్నీ, ఆమె పక్కన నారాయణనూ చూసి క్షణం నోట మాట రాలేదు. ఓలమ్మో అని కేకెయ్యబోయి నోరునొక్కేసుకుంది. వెంటనే తెలివి తెచ్చుకుని గబగబా గొడ్ల సావిట్లోకి లాక్కెళ్ళింది.

“ఏడకు పోయారే? నికోసం మీ అయ్య తిరగని ఊరులేదు.”

మేనమామ కొడుకుని పెళ్ళిచేసుకోవడం ఇష్టం లేక ఇతన్ని తోడు తీసుకుని ఎటో వెళ్ళాననీ, భయమేసి ఇంటికొచ్చేశాననీ ఎక్కిళ్ళ మధ్య పొంతన లేని కథ చెప్పింది రమణ. పార్వతమ్మ రెట్టించ దలుచుకోలేదు.

” పట్నంలో ఉన్న పెద్దకూతురుకి ఒళ్ళు బాగాలేదనీ, సాయానికి పట్నమెళ్ళిందని ఇప్పటిదాకా అందరికీ చెప్పుకొస్తన్నాం అయ్యా. ఇయ్యాల నువ్వు దాంతో కలిసి వచ్చావని తెలిస్తే పరువుపోద్ది. ఈళ్ళ నాయన నిన్ను చూస్తే సంపేస్తాడు. నాయనా, ఊరిడిసి ఎల్లిపో నీ మంచికే సెప్తున్నా. ” అంటూ నారాయణను బతిమలాడింది.

“నా కొట్టూ , అదీ ఈడనే కదా! ఏడికని పొయ్యేది ? ”

రమణ తండ్రి సావిట్లోకొచ్చాడు. ముగ్గుర్నీ చూశాడు. ఎవరూ నోరిప్పకపోయినా విషయం అర్ధమైంది.

కోపం పొంగుకొచ్చి “ఏరా! పిల్లకు ఏం మాయమాటలు చెప్పి తీసుకెళ్ళావురా?” అంటూ చేతికందిన కర్రతో నారాయణ మీదకెళ్ళాడు. ఎక్కడకొడుతున్నాడో చూసుకోకుండా కోపమంతా కొట్టడంలో చూపిస్తున్నాడు.

రమణతల్లి వచ్చి, “అయ్యా పిల్లబతుకు అల్లరైపోతది.” అని మొగుడి కాళ్ళమీద బడి ” జరిగిందేదో జరిగింది. ఊళ్ళో జనాలకు తెలిస్తే బతకనియ్యరు మనల్ని. ఆ పిల్లోణ్ణి పంపించేయ్” అంది.

ఆవేశం తగ్గి, ఆయాసం తీరాక రమణ తండ్రికి తెలివొచ్చింది. భార్య మాటలు అర్ధమై చేతిలో కర్ర నేలకు విసిరికొట్టాడు రమణ వంక చూసి ఛీ అని లోపలికెళ్ళాడు.

“అయ్యా తెల్లారకముందే ఎల్లిపోయ్యా. నీకు దణ్ణమెడతా.” అంది పార్వతమ్మ

లేచి బట్టలు దులుపుకుని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూశాడు.

పార్వతమ్మకు ఉసూరుమనిపించి ఆమె కూడా వెనక్కి తిరిగి చూసింది. కానీ రమణక్కడ లేదు. అప్పటికే లొపలికెళ్ళిపోయింది.48 Responses to దోషి

 1. May 1, 2013 at 8:35 am

  వరుసగా స్త్రీ ని నెగటివ్ గా చూపించే కథలు వస్తున్నాయి వాకిలి లో. ఇది అంత మంచి ట్రెండ్ కాదేమో

  • May 18, 2013 at 4:59 pm

   లింగారెడ్డి గారూ,
   మంచి చెడు మానవ సహజ స్వభావాలు! వాటికి ఆడ మగ తేడా లేదు. ఒక స్త్రీ పాత్ర నెగటివ్ గా ప్రవర్తిస్తే దాన్ని యధా తధంగా చిత్రించడంలో స్త్రీలను కించ పరచడం ఏముంది? ఈ లెక్కన పురుషుల నెగటివ్ స్వభావాన్ని చిత్రిస్తే వారిని మాత్రం కించ పరిచినట్లు కాదా?

   పల్లెటూర్లను గమనిస్తే ఇలా “తిరిగి వచ్చిన” ప్రేమలు, ప్రేమ కథలు అత్యంత సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. వాస్తవ దృశ్యాన్ని చిత్రించిన కథ ఇది. అందుకే ఇంతమంది మెప్పుని పొందింది

 2. లలిత
  May 2, 2013 at 10:40 am

  శైలజ గారు మాకలవాటయిన మీ స్టైల్లో లేకపోయినా కథ చాలా బావుంది . నావరకూ నాకు …..
  పరిస్తితులకి లొంగిపోయేవి, పరిస్తితులను తమకు అనుకూంలంగా మార్చుకునేవి అయిన స్త్రీ పురుష పాత్రలే కథలో కనిపించాయి తప్ప గొప్పవీ దుర్మార్గమయినవీ అని గీతగీసి విభజించేంతగా పాత్రల స్వభావం వుందని కాననిపించలేదు .

  • చందు శైలజ
   May 3, 2013 at 5:46 pm

   లలిత గారూ కథ చదివినందుకు, మీ అభిప్రాయానికీ ధన్యవాదాలండీ

 3. శ్రీనివాస్ పప్పు
  May 2, 2013 at 11:24 am

  “ఆకలికి సిగ్గులేదు కనక సరిపోయింది. లేకపోతే ఎంతమంది బతికుంటారు లోకంలో.”

  అక్షరలక్షలండీ డాట్రమ్మా

  • చందు శైలజ
   May 3, 2013 at 5:47 pm

   శ్రీనివాసరావుగారూ, ధన్యవాదాలు సార్

 4. May 2, 2013 at 11:46 am

  ఎన్ని రోజులైందో రొటీన్ నీతిబోధలు లేకుండా కథనం చక్కగా కుదిరిన అచ్చమైన కథ చదివి. చాలా చాలా బాగా రాశారు శైలజ గారు.

  • చందు శైలజ
   May 3, 2013 at 5:48 pm

   నాగార్జున గారూ, నచ్చినందుకు చాలా సంతోషం

 5. May 2, 2013 at 1:22 pm

  కథనం బాగుంది కానీ కథ బాగులేదు అని అరచి చెప్పాలనిఉంది కానీ నేనెరిగిన వాస్తవాలు గొంతుకడ్డంపడుతున్నాయండీ.
  చాలా బాగా రాశారు One of your best works.

  • చందు శైలజ
   May 3, 2013 at 5:49 pm

   వేణూ శ్రీకాంత్ గారూ, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు

 6. May 2, 2013 at 4:30 pm

  చాలా బాగుంది శైలజమ్మగారు! మీ రచనల మీద కామెంట్ చేసే స్థాయి నాకు లేదు కానీ మీ రచనలకు ఒక సమర్థులైన ఎడిటర్ అవసరం కనిపిస్తోంది. మెరుగులు దిద్దడం కూడా చాలా ముఖ్యం కదా! :)

  • చందు శైలజ
   May 3, 2013 at 5:58 pm

   చాణక్య గారూ, మీరు చెప్పింది నిజమే . చదువుతుంటే నేను చాలా చోట్ల నాలుకకరుచుకున్నాను. పాఠకులకు, వాకిలి టీం కు క్షమాపణలు. బ్లాగైతే ఎడిటింగ్ చేసేదాన్ని. ఇకనుండీ తప్పని సరిగా ఎడిటింగ్ విషయం లో జాగ్రత్త పడతాను. సలహాకు మనస్ఫూర్తి గా ధన్యవాదాలు

 7. May 2, 2013 at 4:53 pm

  చాలా బాగా రాశారు. నాకు నచ్చింది. కళ్లముందు జరుగుతున్నట్టు గా అనిపించింది..

  • చందు శైలజ
   May 3, 2013 at 5:59 pm

   కృష్ణ ప్రియగారూ, ధన్యవాదాలండీ

 8. May 2, 2013 at 5:04 pm

  మీ శైలి చాల బాగుంటుంది శైలజ చందు గారు. కృష్ణ ప్రియగారన్నట్టు మన కళ్ళ ముందే ఇదంతా జరుగుతున్నట్టు వుంటుంది.

  • చందు శైలజ
   May 3, 2013 at 6:00 pm

   ప్రవీణ గారూ , ధన్యవాదాలండీ

 9. May 2, 2013 at 5:51 pm

  Wonderful!

  • చందు శైలజ
   May 3, 2013 at 6:00 pm

   Thank you very much

 10. slalita
  May 2, 2013 at 8:19 pm

  నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుందని చాలా బాగా చెప్పారు…

  • చందు శైలజ
   May 3, 2013 at 6:01 pm

   లలిత గారూ , ధన్యవాదాలండీ

 11. May 2, 2013 at 9:57 pm

  ఎందుకో శ్యామ్ బెనెగల్ “అంకుర్” గుర్తొచ్చింది. కథ బాగుంది.

  • చందు శైలజ
   May 3, 2013 at 6:01 pm

   మహేష్ కుమార్ గారూ, ధన్యవాదాలండీ

 12. May 2, 2013 at 10:51 pm

  A slice of life.

  • చందు శైలజ
   May 3, 2013 at 6:02 pm

   Sir, Thanks for your opinion

 13. May 3, 2013 at 5:58 am

  కధ బాగుంది. “రమణ” స్త్రీ జాతి మొత్తానికీ ప్రతినిధి కారు. మంచైనా, చెడైనా, తనదీ ఒక కధే. అది ఆసక్తికరమైన శైలిలో, చక్కటి కధనంతో చెప్పగలిగారు. అభినందనలు!

  • చందు శైలజ
   May 3, 2013 at 6:13 pm

   యాజి గారూ, కథ చదివినందుకు, మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు

 14. Kumar N
  May 3, 2013 at 10:08 am

  Good one Sailaja garu. Way better than previous superficial ones.
  Thanks for the story!
  Kumar N

  • చందు శైలజ
   May 3, 2013 at 6:03 pm

   Kumar N gaaru,Thank you very much for your opinion

 15. May 3, 2013 at 11:53 am

  చాలా చాలా బాగా వ్రాసారు. రచయిత ఇన్వాల్మెంట్ లేకుండా చక్కగా చెప్పారు. మీరు వ్రాసిన వాటిలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్.

  • చందు శైలజ
   May 3, 2013 at 6:04 pm

   బులుసు సుబ్రహ్మణ్యం గారూ, కథ చదివినందుకు, మీకు నచ్చినందుకు ధన్యవాదాలు

 16. సాయి పద్మ
  May 3, 2013 at 5:03 pm

  బాగుంది కధ. స్పీడ్ గా సినిమా లా అనిపించింది. నారాయణ పాత్ర కూడా ఇంకా చెప్పగలిగితే బాగుండేది అనిపించింది. రమణ పాత్ర సహజంగా వచ్చింది. భలే రాసేరు .

  • చందు శైలజ
   May 3, 2013 at 6:12 pm

   సాయిపద్మ గారూ , ధన్యవాదాలండీ .

   నిజమే. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.

 17. May 3, 2013 at 6:32 pm

  “ఆమె మాటలు వినేందుకు కష్టంగా తోచాయి, కానీ తేలికగా అర్ధమయ్యాయి.
  ఆపైన మనసు మోయలేనంత బరువైంది. ”

  కొంతమంది పెద్ద పెద్ద పేరాల్లో రాసే విషయాన్ని ఎంత క్లుప్తంగానూ, అంతే సున్నితంగా చెప్తారో, శైలజ గారు మీరు!! మీ శైలికి మాత్రం జోహార్లు..
  కధ ఎప్పట్లానే చివరికంటా ఆపకుండా చదివించింది… చివర్లో ఆ రమణని బయటకి పిలిచి ఒక్కటి లాగి పెట్టి కొట్టాలనిపించేంతగా లీనమయ్యాను.
  చాలా నచ్చిందండీ! కళ్ళు చూసిన, మనసు ఒప్పుకున్న వాస్తవికత ఉన్నందువల్లనేమో మిగతా కధలకంటే నచ్చింది!

  • చందు శైలజ
   May 9, 2013 at 11:13 pm

   నిషిగంధ గారూ, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

 18. May 3, 2013 at 9:43 pm

  చాలా బావుందండి

  • చందు శైలజ
   May 9, 2013 at 11:14 pm

   బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారూ , ధన్యవాదాలండీ .

 19. May 5, 2013 at 12:42 pm

  ఎంత బాగా వ్రాసారు .

  కధలో చివరికి రమణ కుటుంబం నారాయణని దోషి అన్నారు, ఊరు వదిలి వెళ్లిపోవాలి లేదంటే అతనికి సమస్యే. అది నిజమా కాదా అన్నది, రచయితకు కాని చదువరులకి కాని ముఖ్యం కాదనుకొంటాను. వెళ్ళకుండా ఊరులోనే ఉండే ధైర్యం నారాయణ కి లేదు. ఇది సామాజిక పరిస్థితి . వాళ్ళిద్దరూ నో , ఇద్దరిలో ఒకరో తప్పు చేసారని చెప్పలేము.

  చివరగా ఎవరు నష్టపోతే వారే దోషి ఈ సమాజం లో అని కధ స్పష్టం చేస్తుందా …

  • చందు శైలజ
   May 9, 2013 at 11:27 pm

   లేదు లేదు, పైకి చెప్పక పోయినా, నేను రమణను దోషి అన్నాను.

   కథ చదవిన తర్వాత పాఠకుల మనసులో నారాయణ ఎలా బతుకుతాడు అన్న ప్రశ్నే మెదులుతుంది. రచయితకు అది ముఖ్యం కాదని ఎందుకనుకుంటున్నారు?

   మీరు ఇలాంటి తీర్పు కు ఎలా వచ్చారా అని ఆలోచించాను. బహుశా నేను రాసిన విధానమే తప్పయి ఉంటుంది. ఒక సారి మళ్ళీ సరిచూసుకుంటాను.

   • May 12, 2013 at 2:21 am

    @ బహుశా నేను రాసిన విధానమే@

    లేదండీ మీ కధలో ఎక్కడా లోపం లేదు . స్పందనలు కారణం కావచ్చు . కాస్త జాగ్రత్తగా మీ అభిమానులనుండి ప్రొటెక్ట్ చేసుకుంటూ వ్రాసాననుకుంటాను :)

    నిజానికి మీరు చాలా బాగా వ్రాసారు అని చెప్పి వదిలేస్తాను . పైకి చెప్పకపోయినా మీరు రమణ ను దోషి అని ఉండొచ్చు.అది రచయిత వ్యక్తిగత అభిప్రాయమే కావచ్చు కదా . అయినా కొందరికి మీరు జడ్జ్ చెయ్యకుండా వ్రాసినట్లు అనిపించింది . అప్పుడు మళ్ళీ చూస్తె ఇంకాస్త నావ్యాఖ్య ను పొడిగించడం జరిగింది .

    పాఠకురాలిగా నాకు నారాయణ చివరికి దోషిగా అందరి ముందు తలదించుకోవాల్సి రావడం కనిపించింది. ఎక్కడయినా చూడండి చివరికి సమస్యలో ఇరుక్కున్నవారే దోషి !!! కనీసం నా అనుభవం లో . అలా వ్యాఖ్య పెట్టాక కూడా నారాయణ నిజంగా దోషి కాడా అని ఆలోచించాను , అవును అనడానికి కారణాలు కనిపించాయి. అసలు రమణ ది తప్పా కాదా అన్న ఒక్క కారణం తో నారాయణ ది అంతా ఒప్పయి పోదు .ఆ వైపు నుండి చూస్తె రమణ ది చాలా చిన్న తప్పు అవుతుంది. అతనికి కలిగిన నష్టానికి అతనిది బాధ్యత లేకుండా పోదు. అక్కడే రమణ ఎందుకలా అయ్యింది అన్న ప్రశ్నకి కారణాలు కూడా దొరకొచ్చు.

    కాకపొతే వారిద్దరి వ్యక్తిత్వాలనీ స్పష్టం గా చెప్పగలిగారు. అవి మారవు !! మీ సమాధానం కు చాలా థాంక్సండీ

  • చందు శైలజ
   May 9, 2013 at 11:31 pm

   Mouli gaaru, Thanks for your opinion

 20. May 5, 2013 at 7:07 pm

  బాగుంది శైలజగారు. సహజంగా ఉంది కధ.ఎటూ మొగ్గలేదు:))

  • చందు శైలజ
   May 9, 2013 at 11:28 pm

   సునీత గారూ, ధన్యవాదాలు.

 21. May 7, 2013 at 7:11 am

  శైలజ గారూ

  చాలా బావుందండీ కధ. ఎప్పటిలానే మీ కధనం ఆపకుండా చదివించింది. కొన్ని వాక్యాలయితే బాగా నచ్చాయి. కధ చదువుతున్నంత సేపూ, చాలా సహజంగా జరుగుతున్నది చూస్తున్నట్టూ అనిపించింది. నిజంగానే రమణని బయటికి లాగి నాలుగు ఎడాపెడా వాయించాలని అనిపించింది నాక్కూడా.

  • చందు శైలజ
   May 9, 2013 at 11:30 pm

   పద్మవల్లి గారూ, థాంక్సండీ

 22. May 10, 2013 at 2:49 am

  కథలాలేేదు.కళ్ళముందున్నంత నిజంలావుంది.నారాయణ మీద సానుభూతి రమణ మీద జాలి దొరమీద భయమూ రమణతల్లి తల్లిప్రేమ మీద ప్రెమా కలిగాయి. పెద్ద నిట్టూర్పు మిగిల్చిన కథ ఇచ్చిన శైలఙ గారికి కృతఙ్ఞతలు
  కథని కథనమో‍ కథనాన్ని కథో అధిగమించని సమతూకం చక్కగా కుదిరాయని నా పరిమిత జ్ఞానానికనిపించింది

 23. May 18, 2013 at 4:48 pm

  లింగారెడ్డి గారూ,
  మంచి చెడు మానవ సహజ స్వభావాలు! వాటికి ఆడ మగ తేడా లేదు. ఒక స్త్రీ పాత్ర నెగటివ్ గా ప్రవర్తిస్తే దాన్ని యధా తధంగా చిత్రించడంలో స్త్రీలను కించ పరచడం ఏముంది? ఈ లెక్కన పురుషుల నెగటివ్ స్వభావాన్ని చిత్రిస్తే వారిని మాత్రం కించ పరిచినట్లు కాదా?

  పల్లెటూర్లను గమనిస్తే ఇలా “తిరిగి వచ్చిన” ప్రేమలు, ప్రేమ కథలు అత్యంత సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. వాస్తవ దృశ్యాన్ని చిత్రించిన కథ ఇది. అందుకే ఇంతమంది మెప్పుని పొందింది

 24. June 4, 2013 at 2:15 pm

  కథనం, కథ రెండూ బాగున్నాయి శైలజగారు!

 25. shiva
  June 17, 2013 at 12:34 am

  ఆకలికి సిగ్గులేదు కనక సరిపోయింది. లేకపోతే ఎంతమంది బతికుంటారు లోకంలో?బావుంది! కథ నచ్చింది!

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)