కవిత్వం

లేదు

02-మే-2013

ఊరిని చూస్తే ఊరిని చూసినట్టు లేదు
ఇంకాసేపట్లో ఖాళీ చేసి వెళ్లిపోనున్న బిడారును చూసినట్టుంది

అడివిని చూస్తే అడివిని చూసినట్టు లేదు
చట్టవిరుద్ధంగా పత్రహరితం దాచుకున్న దొంగను చూసినట్టుంది

మనిషిని చూస్తే మనిషిని చూసినట్టు లేదు
ఆకారం పొందిన ఖాళీతనాన్ని, అంగీకృత ఓటమిని చూసినట్టుంది

తోటలో
సీతాకోక చిలుకలుగా మారలేని తిండిపోతు గొంగళి పురుగులు
కావిలించుకోవాల్సిన దేహాల మీద సందేహాల తుమ్మ పొదలు
నాల్కల మీద పదును దేరిన ముళ్లు లేదా వలల తాళ్లు

గాలిలో ప్రయాణం
అడుగు తీసి అడుగేయడానికి కాస్త నేల వుంటే బాగుండు
ఆసరా లేదెలాగూ
అసూయ పడ్డానికైనా కొందరు మనుషులుంటే బాగుండు