కవిత్వం

నేను తెలంగాణను-3

02-మే-2013

నిజాం ఖిల్లేదారు
ఖాన్‌ కలగన్న నగరాన్ని
ఉత్తర తెలంగాణ ఊపిరిని
నేను కరీంనగర్‌ను.

ఎనలేని ఘనకీర్తి హార ధారిణిని
ఎలగందుల ఖిల్లాను
కాకతీయ, బహమనీ
మొగల్‌,కుతుబ్‌షాహీ,అసఫ్‌జాహీల
అసమాన రాచనగరును
శతాబ్దాలుగా తరగని
శత్రుదుర్భేద్యపు ముద్రను.

పెదవాగు,బండవాగు,నక్కవాగులు నడిచొచ్చిన దారుల్లో
మ్రోయతుమ్మెద,వేములవాడ
ఇరుకుళ్ళ,హుస్సేన్‌మియాలు కలగూడిన గోదావరిమీద
ఎలగందుల పాదాలు కడుగుతూ
ఎడతెగని నేల దూప తీర్చే మానేరును.

నల్ల బంగారాన్ని
తీగల మీద పారించే శక్తి స్వరూపిణిని
లోకం మీద కప్పిన చీకటి దుప్పటిని చీల్చే
వెలుగుల విద్యుత్తును
మాంచెష్టర్‌ ఆఫ్‌ ఇండియా
రామగుండాన్ని.
నది ఒడ్డన వెలిసిన
ఖనిజ సంపదల కాణాచిని
గోదావరి ఖనిని
బొగ్గు బావుల అగ్గిరవ్వను

బౌద్ధ జౌన వైదిక మతాలకు
ఎర్ర తివాచీ పరిచి
అద్వైతమై అలరారిన
గోదావరి నదీతీరాన్ని
గౌతమేశ్వరాలయ ధారిణిని
మహా మంచి
మంథినిని.

కుష్టు కుక్క రోగం కుదిర్చిన
శివలింగపు మట్టిని
రాజరాజ నరేంద్రుడు చెక్కిన
దక్షిణ కాశిని
ఎముడాల రాజన్నకు కోడె కట్టిన
వేములవాడను
తీరొక్క దేవుళ్ళు మొలిచిన చోట
వెల్లివిరిసిన హిందూముస్లింల సఖ్యత దర్గాను.

నవనారసింహ క్షేత్రాల భాగస్వామిని
ధర్మవర్మ రాజు బిడ్డను
ధర్మపురిని.

ఆంజనీ పుత్రుని అరచేతినుంచి జారిపడ్డ
సంజీవనీ పర్వతం ముక్కను
కొండగట్టును
కోర్కెలు తీర్చే గుట్టును.

గోదావరి, అంతర్వేది,ప్రాణహితల
సంగమ స్థావరాన్ని
కాలుడీశ్వరుడు
కలగలిసి వెలిసిన
కాళేశ్వరాన్ని.
కాశీలో చావును
నా దర్శన భాగ్యాన్ని సమం చేసిన
మహిమాన్విత త్రిలింగ క్షేత్రాన్ని.

శాతవాహన రాజ్య ముఖద్వారాన్ని
కోటిలింగాలు పొదుముకున్న
గోదావరి ఒడ్డును
ప్రముఖ ఓడరేవును
కోటిలింగాలను.

బహుభాషా కోవిదున్ని
భారత ప్రధానిని
అపర చాణుక్యుణ్ణి
అసమాన యోధున్ని
నేను ‘లోపలి మనిషిని’.

తెలుగు కవన రవళిని
జ్ఞానపీఠ గ్రహీతను
తెలుగు గజళ్ళ జావళిని
నాగార్జున సాగరాన్ని కలం పాళీలో పారించి
విశ్వంభరను ముద్దాడిన
వి’చిత్ర సీమ’కవిని
నేను సినారె ను.

రంగుల రహస్యం విప్పిన మాంత్రికుడిని
ప్రపంచం మెచ్చిన ప్రతిభను
పిటి రెడ్డిని

అగ్గిపెట్టెలో
పట్టుచీర దాచిన పరంధాములును
చేనేత సిగన పూసిన పువ్వును.

నక్సల్బరీ వసంత మేఘ గర్జనను
సిక్కోలు పోరు నిప్పు రవ్వల్ని
పొదిమి పట్టుకున్న నేలను
జ్ఞానాన్ని ఎక్కించి
గ్రామాలకు తరలించి
నాగేటి సాళ్ళల్ల ప్రజాపోరు విత్తనాలు చల్లి
దండకారణ్యాన్ని దట్టించిన ఫిరంగి చేసిన నేలను.
సిరిసిల్లా, జగిత్యాల,చిన మెట్‌పల్లిలు
హుజూరాబాద్‌,హుస్నాబాద్‌,జమ్మికుంటలు
జమిలిగా నిర్వహించిన జగిత్యాల జైత్రయాత్రను
గడీల గోడలు దూకి
భూస్వామ్య పునాదులు పెకిలించిన
ప్రతిఘటనా పోరాటాన్ని.

దళపతులు గణపతులు దిశానిర్దేశకులు
మిణుగురు పురుగులు అమరులు
నిలువెత్తు త్యాగాల హుస్నాబాద్‌ స్థూపాలు
ఓడుతున్న రక్తాన్ని ఎర్ర జెండాగా ఎత్తి పట్టి
భారతదేశ విప్లవ ఎజెండా రాస్తున్న కలాన్ని
జల్‌ జంగిల జమీన్‌్‌ కోసం
జనతన సర్కార్‌ నడుపుతున్న నేలను
ఆరిపోని జనం ఆకాంక్షల దివ్వెను
కరీంనగర్‌ను
నేను తెలంగాణను.

(29-04-2013 నాడు ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తతి మహోత్సవాల సందర్భంగా జరిగిన కవిసమ్మేళనం లో చదివిన కవిత)