కవిత్వం

మధ్యాన్నాలలోకి వంగిపోతూ

10-మే-2013

మధ్యాన్నాలలోకి వంగిపోతూ
కడలి లాంటి నీ కన్నుల కేసి
నా కలతల వలలను విసరుతాను
అక్కడ ఆ తీవ్ర జ్వాలలలో
నా ఏకాంతం వ్యాకోచించి జ్వలిస్తుంటుంది
నీట మునుగుతున్న వాని చేతుల్లా అది విచలిస్తుంటుంది I
సంద్ర సౌరభాలనో లైట్ హౌస్ సముద్ర తటాలనో తలపించే
నీ లుప్త నయనాల గుండా
ప్రమాద సూచికా కాంతి పుంజాలను పంపిస్తూంటాను
ఓ దూర వాసీ, ఈ చీకట్లను నీవే ఉంచుకో
అవి ఆ తీర భయదాలను గుర్తు చేస్తుంటాయి
మధ్యాన్నాలలోకి వంగి పోతూ
నీ కడలి కన్నులు తరిమిన జలధి లోకి
నా కలతల వలలను విసిరేస్తుంటాను
రాత్రి పక్షులు తొలి నక్షత్రాలను పెరుకుతుంటాయి
నిన్ను ప్రేమిస్తున్న వేలలలోని నా ఆత్మ కాంతిలా
అవి మెరుస్తుంటాయి
నీడలా వాజిని మీద నిశీథిని దౌడు తీస్తూ
నేల మీద నీలి కుచ్చులను వేలాడ దీస్తుంటుంది

మూలం: పాబ్లో నెరుడా (లీనింగ్ ఇంటూ ఆఫ్టర్ నూన్స్ )
తెలుగు సేత: నాగరాజు రామస్వామి