సమీక్ష

తంగేడుచెక్క తనువు తైదల కవిత్వం

10-మే-2013

తంగేడు చక్కలోని సారాన్ని ఒడుపుగా జుర్రుకుంటున్న కవి తైదల అంజయ్య అంటే తెలుగు సాహితీసమాజాన తెల్వని బిడ్డుండడు. మనిషి చాలా నెమ్మదస్తుడు. చూస్తే తనపేర వస్తూన్న నిప్పుల్లాంటి కవిత్వపాదాలు ఆయనవేనా అని పలుసార్లు కవులనబడే అకవులు గుసగుసలుసైతం గుంబనంగాజేసిరి.కాయితాన్ని మలిచి ఆయుదంగా విసరగలనేర్పును జూసి జతగాళ్ళు బహు సంబరం పడ్తిరి.ఇంతకీ ఈ యన కవిత్వంల ఏముందీ? మాంసముంది,రక్తముంది,చెమటుంది,మట్టివుంది, వలసోని అహంకారాన్ని అలంకారంతో నిలవేసుడుంది,మనసున్న మనిషున్నడు .ఇంకా ఏంకావాలే చదవనీకి,చదివి గుండెలకు అత్తుకోనీకి.

సాహిత్యం వాస్తవికతకు కళాత్మక రూపం. కళాత్మకం కాని సాహిత్యం ఉండదు.సమాజపు క్లిష్టతను,ఆకాంక్ష్లను ప్రతిబింబిస్తూ జాతిచైతన్యానికి ప్రేరకశక్తి అయితుందని తైదల అంజయ్య కవిత్వం చదువుతుంటె గమనంలోకి వస్తుంది.భాషలో మట్టితనం వెటకరింపు,కళాతంకంగా విప్పడం భాగాతెల్సిన విద్యగా తైదల కవిత్వంలో కంపిస్తుంది.సంవత్సరకాలంగా తైదల ఎర్రమట్టి బండీకవితల సంపుటిని ధుఖం వచ్చినప్పుడో కసిగా పానాలమీదికి వచ్చిన ఉమ్మడి కార్యంలో ఒంటరినైనప్పుడో పలుసార్లు నాకుతెల్వకుండానే ఆయన కవిత్వానికి దగ్గరయ్యను.”ఈనేల నేలంతా ఒక నిరసనాలంకారం” అనిప్రకటించిన అంజయ్య కవిత్వమే ఒక నిరసన గా అంపిస్తుంది. ఎర్రమట్టి బడి లేవనెత్తిన సామాజిక ప్రశ్నలు పాఠకున్ని ఉక్కిరిబిక్కిరిచేస్తాయి.

“శిల్పి ఆ రాయి పిచ్చివాళ్ళచేత
విసరబడ్కుంటే చాలనుకుటాడు
మరొకరాయికోసం
కొండలనూ,కోనలనూ నిరంతరంగా గాలిస్తాడు.”…..అనడంవెనుక అంజయ్య అంతరాత్మ కంపిస్తుంది.తనకుతెల్సిన తత్వాన్ని కవిత్వంలో కి చొప్పిస్తూ పోతాడు,తను ఎవరికోసమూ ఆగని ఎడతెగని పయనంలో ఉండటం అంటే తనకాలప్రిమితిలో సంభవిస్తున్న,సంభవిచబోయే సంఘటనలవెంట పరుగులాంటి నడక,తన చుట్టూ వున్న సమాజాన్ని కదిలించే అక్షరాల్ని పోగేయడంలో నిమగ్నంవుతూ….

నక్షత్ర యుద్దాలవసరం లేదు
సైన్యపు మోహరింపు అవసరంలేదు
కాచుకో!అనంత అణ్వాయుదాలొకవైపు
అడుగులకు మడుగులొత్తే పాదరక్షలొకవైపు
అసలైన శత్రువు మీద
ఒక్క ఎడమకాలు చెప్పుదెబ్బ చాలు!” అంటూ నేటియుద్దానికి ఎం అవసరమో తన తరానికి మార్గనిర్దేశంచేస్తాడు.మానవ అనుభూతుల్ని అక్షరీకరించడంలో తైదలది ఓ ప్రత్యేకత ఎంతంటే

సముద్రాన్ని పుక్కిట పడుతం ఆకాశాన్ని పిడికిట బంధిస్తాం
జ్వలిస్తాం!ధ్వనిస్తాం!ఫలిస్తాం!నిలుస్తాం!గెలుస్తాం!!
వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ ప్రపంచం మీద
ఒకకవితను రాసి మరణీస్తాం!” అనేంతగ
వాడబతుకుల జాడ్ల్ని మోసుకొచ్చిన “ఎర్రామట్టి బండి” తెలంగాణ తండ్లాటలో తన జాతిజనుల త్యాగాలను నమోదుచేస్తున్నాడు.

ఇక్కడ నీ బిడ్డలెపుడూ
నేలవిడువని సాముజేస్తరు
నేలకోసమే పానమిస్తరు“అని తెలంగానతల్లి బతుకమ్మ సాచ్చికంగా తెలంగాణ గడ్డమీద జరిగే ప్రతిపోరాట అడుగుకూ అక్షరమై జలిస్తున్నా తైదల తన కవిత్వం నిండా రంగు,రుచి, నెత్తురు పూతల్ని,మట్టివాసనల్ని కలగల్సిన ఒ కొత్త చరిత్రకు నాంది వాచకమవుతున్నాడు.

అవసరమైనప్పుడు చరిత్రనుంచిపురాణాలనుచి,పిట్టకథలనుంచి,పాత్రల్ని,సంఘటనల్ని,ప్రతీకలుగా వాదుకోవడంలో అత్యంతనేర్పరిగా కంపిస్తాడు.

నేనిప్పుడు నీ తగలబడుతున్న చర్మంగా చూస్తాను
ఉడుకుతున్న ఈ సముద్రాన్ని
నీ రక్త సంచలనంగా ఆవహించుకుంటానంటు….పిడికిలి ఎత్తిపడుతూ అసమసమాజపు మౌనం బ్రద్దలైయ్యేటట్లుగా ఘీంకరిస్తాడు,రెండో సూర్యుడై తన జాతిజనుల ఆకాంక్షల దివిటీగా మొలుస్తాడు.అంతేనా నిరసనాలంకారాన్నీ ప్రయోగిస్తాడు అత్యంత నేర్పరితనంతో ……వ్యక్తిగా తైదల బుద్దున్ని పోలిన శాంతజీవి కవిగా నిప్పురవ్వ నిరంకుశత్వాన్ని మన్నించలేని వజ్రాయుదధారి,ఆదిపత్యాన్ని సహించలేని అశాంతిని నింపుకోని సర్రున చీల్చుకొచ్చే మెరుపు గీఅ తైదల కవిత్వం..స్థిరీకరించబడ్డ అండవిశ్వాసాల్ని కొత్తచూపుతో చూడటమే కవిగా తైదల అంజయ్యను ఇతర కవులకు భిన్నంగా నిలబెట్టింది.సామూహిక అశాంతికి ప్రతినిదిగా తైదల తన కవిత్వాన్ని ఈ సమాజం ముందు నిలబెట్టాడు.అదీ ఆత్మగౌరవంతో,

ఎర్రమట్టి దిబ్బలపైని నల్లదొబ్బల రుచిని చూపిన ఎర్రమట్టి బండికి సలాం.

ఎర్రమట్టి బండి
వెల: రూ. 70
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు