పాటతో అడవికి
పోరాట రహస్యం నేర్పాలనుకున్నాను!
చెట్ల కొమ్మల్లోని ఆకుల కళ్ళల్లోంచి
ఎర్రటి చింతనిప్పులు చిగురించడం మొదలుపెట్టాయి!
సమూహంలోని గొంతులకు
శృతి కలిపాయని భ్రమపడ్డాను!
నిశితంగా పరిశీలించి చూసినపుడు
మనిషిలోని దగ్గరితనం
వినికిడితనాన్ని కోల్పోయిందని అర్థమయింది!
మనసులతో మమేకంకాలేని
కొన్ని ఆశయాల చేతకానితనాలకి
ఈ వనాల అలజడి
ఒక ప్రతిబింబ సూచికయ్యింది!
కాలం గొంతు నొక్కిపట్టి అదిమితే
చిన్నప్పటి జ్ఞాపకాలతో పాటు
కొన్ని బతుకు నిజాలైనా బయటపడతాయని చూశాను..
గుంపులోంచి తొంగి చూసే జడివానలు
ఒంటరితనంలోని డొల్లతనాన్ని ప్రశ్నించడం
సృష్టి నిజమని బోధపడింది!
ఉనికిని కోల్పోయే అస్తిత్వం తలెత్తినపుడు
నా ప్రశ్నకు సమాధానం
ఇప్పుడు నేను మనిషినినేనా అని..
ఒక మీమాంస సందర్భ తరుణాన్ని
నిలదీసిన క్షణం ఇది!
ఇంకిపోతున్న ప్రాణస్పందనల్ని కొలవడానికి
ఆరిపోతున్న బతుకు దీపాలను వెలిగించడానికి
సమస్యలు మూలాలాను చిట్టి వస్తుంటే
నిజమైన నా దేహాత్మని
నాకు నేనే
పదే పదే ప్రతిఘటించాల్సి వస్తోంది!
ఎప్పటికైనా ఈ ప్రకృతిలోని
సత్యం బద్ధలవ్వక పోతుందా?
ఈ సృష్టిలోని అనంత బ్రహ్మాండ జీవ పదార్థం
కరిగి వరదలై ప్రవహించకపోతుందా?!
రేపు పశ్చిమదిశన
చంద్రుడు అస్తమించినా పర్లేదు
తూరుపు దిక్కున సూర్యుడు వేకువ కిరణాలతో ఉదయిస్తే చాలు
ఈ అడవి బతుకులు
పాటలతో ఎప్పటికీ మార్మోగుతూ
జీవితాంతం తెల్లారిపోతూనే ఉంటాయి!!
(చీకట్లో తెల్లారిపోతున్న అడవిబతుకుల్ని చూసి..)
ఆదివాసీ బతుకు చిత్రాన్ని కవిత్వీకరిస్తూ వారి పట్ల సహానుభూతిని తెలియజేసిన కవి మిత్రుడు రాజాకు అభినందనలతో..