పొట్టిదానా అన్నాను హేళనగా,
భావం పిడిబాకై పొడిచేసింది.
ఎప్పుడో చాలకాలం క్రిందట రాసుకున్న వాక్యాలివి. అంతగా దూసుకుపోయే కవితలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయ్. అలా నాకు కన్పించిన రెండు కవితలు ఒకే కవివి కావడం ఇంకో విశేషం గా చెప్పుకోవచ్చు. అవి పి.రామకృష్ణ గారి, భగవాన్ ఉవాచ, ఎప్పట్లాగే.
రెండవకవిత “ఎప్పట్లాగే ‘” చదవగానే ఇంత ఆలోచనత్మకంగా, ఇంత సులభంగా చిన్న ఘటనను కవితగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది. అరే, ఇలా మనం రాయలేకపోయామే అనిపిస్తుంది కూడా.
బడిపిల్లల పాఠ్యపుస్తకాలలో ఉంచదగిన కవిత ఇది నా దృష్టిలో. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పండి అన్న సామెత గుర్తుకొస్తుంది. ఒక చిన్న సంఘటనను, ఒక మంచి మార్గాన్ని సూచిస్తుందీ కవిత. ప్రకృతి పట్ల ప్రేమని, పర్యావరణం పట్ల బాధ్యతను చాలా సరళంగా స్పృశిస్తుంది. పిట్టగోడలు తప్ప పచ్చని చెట్లు కనిపించని నగరవాతావరణాన్ని ప్రశ్నిస్తుంది కూడా.
—————-
గుప్పెడు గింజల్నీ,
గిన్నెడు నీళ్ళనీ,
పిట్టగోడపై వుంచి
ఎదురుచూస్తున్నాను.
చెట్లను వెతుక్కుంటూ-
ఈ పక్షులన్నీ
ఎక్కడికి వెళ్ళాయో?
** ** **
ఎప్పట్లాగే
గుప్పెడు గింజల్ని చల్లి,
వాటిమీద-
గిన్నెడు నీళ్ళను పోసాను.
నాకు తెలుసు
పిట్టల కోసం వెతుక్కుంటూ
ఈ చెట్టు
ఎక్కడికీ వెళ్ళదు.
———-
కవిత్వాన్ని విభజించు అని నాకెవరైన అవకాశం ఇస్తే సజీవకవిత్వం, నిర్జీవకవిత్వం అని రెండు భాగాలుగా విడదీస్తానేమో! దేని ప్రాధాన్యత దానిదే అయినా కొన్ని సార్లు చటుక్కున జీవం ఆకట్టుకున్నంత సహజంగా ఇంకోటి ఆకట్టుకోదు.
పదాడంబరం చేతనో, లయచేతనో, కవి చేసే కనికట్టు వల్లనో కవిత్వం ఆకట్టుకోవచ్చు కాని మనుసు పొరల్లో తెరలు తెరలుగా అలలు, ఒక అలజడి రేకెత్తించలేకపోతే అది వస్తు కవిత్వమే.
కఠినమైన వాస్తవాన్ని, సత్యాన్ని, ఒక తాత్వికతను ఇంత సున్నితంగా చేయి తిరిగిన చిత్రకారుడిలా కేవలం రెండే రెండు దృశ్యాలతో హృదయపు కాన్వాస్ పై చిత్రించడం సామాన్యమైన విషమేమి కాదు.
మొదటి కవిత “భగవాన్ ఉవాచ” చదవగానే మొదటి దృశ్యం సర్వసాధారణంగా అనిపిస్తుంది. రెండో దృశ్యం జతకూడగానే ఎవరో చెంప చెళ్లుమనిపించినట్లు కళ్లలో నీరు సుడితిరగక మానదు. మనసు మూగగా రోదిస్తుంది భగవంతుడు ఎంత నిర్ధయుడో కదా అని.
ఎక్కడా అయోమయం ఉండదు, అస్పష్టతా ఉండదు. చెప్పదలుచుకున్నది అలవోకగా గుండెకు అతకబడుతుంది. అలజడి తగ్గి స్థిమితంగా ఆలోచించడం మొదలు పెడితే గీతాసారాంశం కళ్లకు కడుతుంది. జరిగేది జరగక మానదని హైదరాబాద్ బాంబు ప్రేలుడు సమయంలో ఓ అమ్మ తన బిడ్డ భవిష్యత్తు ఉజ్వలంగా వుండాలని దేవునికి మొరపెట్టుకుంటు వున్నట్లు, ఇంకొంచెం తిక్కగా ఆలోచిస్తే నాస్తికత్వాన్ని భుజాన మోస్తున్న కవిత గా చెప్పుకోవచ్చు. ( కవికి ఆ ఉద్దేశ్యమే లేక పోవచ్చు అది వేరే విషయం) రెండు ఒకటి అని ఇచ్చిన సృజనాత్మక నెంబరింగ్ కూడా ఆకట్టుకుంటుంది ఈ చిన్న కవితలో. ఎక్కడైనా ఆదివారం అని కనిపిస్తే చాలు కవిత మొత్తం కళ్లముందు నిలబడిపోతుంది. బహుశా ఏ ప్రయత్నం చేయకుండా నాకు పూర్తిగా కంఠస్తమైన కవితకూడా ఇదొక్కటేనేమో.
—————-
పి.రామకృష్ణ // భగవాన్ ఉవాచ
2. ఆ ఆదివారపు మధ్యాహ్నం
ఓ చిన్నారి కోడిపిల్ల
అమ్మకోసం వెతుకుతూ, వెతుకుతూ..
దార్లో-
కారు టైరు క్రిందపడి,
చనిపోయింది.
1. అదే ఆదివారపు ఉదయం
తల్లికోడి-
కసాయి కత్తిక్రింద కంఠాన్ని వుంచి,
కళ్లు మూసుకుని, ఇలా ప్రార్థించింది.
“భగవంతుడా ఇలాంటి చావు-
నా బిడ్డకు రాకుండా చూడు” అని.
———–
మొదటగా చెప్పుకోవలసిన రెండు మాటలు చివరలో చెప్తున్నాను.
కవిత్వం నచ్చడమనేది వ్యక్తిగతం.
కవిత్వమనేది ఓ కనెక్టివిటి. కవిత ఫ్రీక్వెన్సీ పాఠకుడి ఫ్రీక్వెన్సీ కలవగలిగితేనే అది హత్తుకుంటుందనుకుంటాను నేను. ప్రతి పాఠకుడి ఫ్రీక్వెన్సీకి అడ్జస్ట్ అయ్యే కవితలు గొప్ప కవితలవుతాయ్. ప్రతి కవిత ఫ్రీక్వెన్సీకి అడ్జస్ట్ అయ్యే పాఠకుడు గొప్ప పాఠకుడౌతాడేమో?!
రెండో విషయం కనెక్టవిటి. కవి కుక్క గురించి ఫీలై కవిత రాస్తే చదివిన పాఠకుడు ఏనుగనుకుని కవిని నెత్తిన పెట్టుకొని పొగిడేస్తే ఆ కవిత ఫెయిలైనట్లే. కవి కూడా…
కవి ఏమనుకున్నాడో కవిత దాన్నే ప్రతిఫలించాలి. అదే పాఠకుడికి కనెక్ట్ అవ్వాలి. ఆ విషయంలో పై రెండు కవితలు పూర్తిగా విజయం సాధించాయనుకుంటాను. బహూశా కొంత మందికి నచ్చకపోవచ్చు. కవిత్వం నచ్చడం వ్యక్తిగతం కావడంవల్ల.
వాకిలి సంపాదకులకు ధన్యవాదాలు,.. ఇది నా మొదటి విశ్లేషణ ప్రయత్నం కావడం వల్ల ఎక్కడైన లోపాలు దొర్లివుంటే పాఠకులు క్షమిస్తారని ఆశిస్తూ,..
‘ ఎప్పట్లాగే ‘ కవిత మీరు చెపినట్టుగానే ఏ ప్రయత్నమూ చెయ్యకుండానే గుండె పొరల్లోకి చొచ్చుకుపోయింది. ‘కఠినమైన వాస్తవాన్ని, సత్యాన్ని, ఒక తాత్వికతను ఇంత సున్నితంగా చేయి తిరిగిన చిత్రకారుడిలా కేవలం రెండే రెండు దృశ్యాలతో హృదయపు కాన్వాస్ పై చిత్రించడం సామాన్యమైన విషమేమి కాదు.’ నిజం.
ప్రసూన గారు, చదివి మీ అభి్ప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు,.
రామకృష్ణ గారి ఈ రెండు కవితలు నాకు ఇష్టం. ‘ప్రతి పాఠకుడి ఫ్రీక్వెన్సీకి అడ్జస్ట్ అయ్యే కవితలు గొప్ప కవితలవుతాయ్. ప్రతి కవిత ఫ్రీక్వెన్సీకి అడ్జస్ట్ అయ్యే పాఠకుడు గొప్ప పాఠకుడౌతాడేమో?!’ నిజంగా.
రమా సుందరి గారు,మీకు ఇష్టమైన కవితల గురించి రాయడం నాకు ఆనందంగా వుంది,.చదివి మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు,.
మీ విశ్లేషణ బాగుంది భాస్కర్ గారూ.. రామక్రిష్ణ గారి కవిత్వము నాకూ చాలా ఇష్టం. తక్కువ పదాలతో, నిడివితో నిండైన భావాన్ని చెప్తారు.
వర్మగారు, మీకు విశ్లేషణ నచ్చడం సంతోషాన్నిస్తుంది,..ధన్యవాదాలు.
భాస్కర్ రెడ్డి గారు: మొత్తానికి మీరు “రాసే భాస్కరులు” అనిపించుకున్నారు. వ్యాసం లోతయిన ఆలోచనలతో/ సమహృదయ స్పందనతో బాగుంది.
అఫ్సర్ గారు మొత్తం మీద మీ ప్రోత్సాహంతో రాయగలిగాను కానీ,,.వచనం రాయడంలోని కష్టం అర్ధమయింది,.మీ అభినందన రాసే స్ఫూర్తినిస్తుంది,.ధన్యవాదాలు సార్,
భాస్కర్ గారూ.. మీ వాక్యాలు సూటిగా, హత్తుకొనేలాగా ఉన్నాయి. బాగా రాసారు. రామకృష్ణ గారి కవిత్వం మీకు నచ్చడంలో ఆశ్చర్యం లేదు. మీరు ఎన్నుకొన్న కవితల్లో ఆయనే కాదు, మీరూ కనిపిస్తున్నారు. మీరన్నట్లు కవిత్వం నచ్చడం ఇంతగా వ్యక్తిగతం అన్నమాట. రెండు కవితలూ బావున్నాయి. రెండో కవిత ఇంతకూ ముందూ చదివాను. ఇప్పుడు మళ్ళీ చదివి మళ్ళీ కలతపడ్డాను.
మీరు చదివి అభిప్రాయాన్ని తెలియచేయడం చాలా ఆనందాన్నిచ్చింది ప్రసాద్ గారు,.:) అప్పుడప్పుడు అనిపిస్తుంది,.కవిత్వం నచ్చడం కూడా ప్రేమించడంలాంటిదేమోనని,..ధన్యవాదాలు సార్,.
Bhaskar gaaru, sorry…mee peru mallee porapaatu palikaanu. chivarisaarigaa kshamincheyandi.
నా అసౌకర్యాన్ని గమనించినందుకు ధన్యవాదాలు,.అఫ్సర్ సార్,.
నిజానికి నాది కవిత్వం అనుకునే ప్రయత్నం మాత్రమే. ఆ సంగతి అలా వుంచితే, భాస్కర్ గారి ఈ వ్యాసం ద్వారా నేను నేర్చుకున్నదే ఎక్కువ.
ప్రీక్వెన్సీ గురించీ, కనెక్టివిటీ గురించి, సాహిత్యాన్ని ప్రేమించడానికి అడ్జెస్ట్ అవడంగురించీ.
face book కవిసంగమం లాంటి చోట్ల గానీ, అతని స్వంత బ్లాగ్ లో గానీ భాస్కర్ గారి సాహిత్యం చదివితే తెలుస్తుంది., సాటి రచయతల రచనల్ని కూడా ప్రేమించడానికి పాఠకుడిగా తను ఎంతగా అడ్జస్ట్ అయ్యాడో.
భాస్కర్ గారూ., మీ వచనం సూటిగా, సరళంగా వుంది. మన మితృల రచనల పరిచయాన్ని ఇలానే కొనసాగించండి.
మనస్పూర్తిగా ధన్యవాదాలు.
ధన్యవాదాలు రామకృష్ణ గారు, విశ్లేషించేంతగా స్థాయి లేకపోయినప్పటికి, అఫ్సర్ గారి ప్రోత్సాహంతో ఒక ప్రయత్నం చేయగలిగాను,.మరన్నీ మంచి కవితలు మీ నుంచి ఆశిస్తూ,..
రామకృష్ణ కవిత్వం క్లుప్తంగా ఉండి ఎంతో లోతుగా ఉంటుంది..అతను రాసిన ప్రతి కవితకీ నేను మొదటి అభిమానిని. నా స్నేహితుడి కవిత్వం ఇంతమంది ప్రశంసలనందుకోవడం గర్వంగా ఉంది
రెండు మంచి కవితలని, కవిత్వంని అర్ధం చేసుకునే తీరుపై భాస్కర్ గారి కవి హృదయాన్ని .. ఇక్కడ చూడటం చాలా సంతోషం. రామకృష్ణ గారి కవిత్వం తప్పకుండా చదివి తీరాలి.
భాస్కర్ గారు మీకు అభినందనలు, ధన్యవాదములు .
జ్యోతిర్మయి మళ్ళ గారికి,.Vanaja Tatineni గారికి ధన్యవాదాలు,..