కవిత్వం

వస్తూపోయే జీవన జీవితచక్రం

31-మే-2013

సముద్రతీరంలో అలలు వచ్చినట్టు
ఎవరో ఒకరు
వస్తూవుంటారు, పోతూవుంటారు

తీరంపై వ్యవహాళికి నడినట్టు
పాదముద్రలను వదిలిపోతారు
రెప్పపాటులో
ఏ ఒక్కటీ కన్పడదు

కొన్ని జంటలు
కలలుతెచ్చి పరచిపోతారు

నిత్యం అలల్ని
ఆటుపోటుల్ని చూసే తీరవాసులు
ఏమీ పట్టనట్టే తిరుగుతుంటారు

పిల్ల కాల్వల్ని
పంట కాల్వల్ని
ఎన్నడూ చూడని కన్ను
ఆశ్చర్యాన్ని నోరు తెరచి ప్రకటిస్తుంది

అలలు వస్తూవుంటాయి పోతూవుంటాయి

చీకటివేళ గూడువెతుక్కునే పక్షులు
వెన్నెలను ఆశ్వాదించమని
సమయాన్ని ఒంటరిగా వదిలిపోతాయి

కొన్ని రంగుల్ని, కొన్ని చలనక్షణాలను
కెమేరాలో బంధించానని తృప్తిపడతారు

అనంత సాగరంలో
మోకాళ్ళ లోతుకు దిగి
సముద్రాన్ని ఒడిసిపట్టుకున్నట్టు
కేరింతలు కొడతారు

నలుగు చేరినచోట
ఏమీ తెలియనట్టే
ఎవరి వ్యాపారాన్ని వారు తెరుస్తారు
బృతికోసం దేహాల్ని కూడా పరుస్తారు

అలల్ని ప్రతీకల్ని చేసి
ఎరుపుల మెరుపులను పలికిస్తూ
ఇటుగా వచ్చినవాడే ఎటో వెళ్ళిపోయాడు!

నీరెండ కాంతిలోంచి ఒంపినదేదీ
ఎక్కడా దాచిపెట్టలేదు

గాయాలను ఇక్కడ వదిలేయాలని వచ్చి
పొంగే దుఃఖాన్ని ఆపుకోలేక
మరిన్ని గాయాలను మోసుకెళతారు

మైదానాలను
ఇక్కడణ్ణుంచే దారులు వేయాలని
విఫలయత్నాలు జరుగుతుంటాయి

***

వెళ్ళటం తప్పనిసరి అయ్యాక
మోసుకెళ్ళగల్గినవాళ్ళు
తడిసిన వస్త్రాన్ని జ్ఞాపకంచేసి
కొన్ని అనుభవాల్ని జేబుల్లో వేసుకొని
ఏరుకున్నదాన్నో, కొనుక్కున్నదాన్నో
అంటుకున్న ఇసుకనో
వెంటతీసుకెళ్తారు

సముద్రతీరంలో అలలు వచ్చినట్టు
ఎవరో ఒకరు
వస్తూవుంటారు, పోతూవుంటారు

జీవన జీవిత చక్రం తిరుగుతూనేవుంటుంది
అలలపై జీవనసంగీతం తేలియాడుతూ వుంటుంది