1
నాకు సాయంత్రమూ
నీకు ఉదయమూ అయిన సమయంలో,
ముఖమూ కాని,
పుస్తకమూ లేని
ఒకా నొక చీకటి స్థలంలో ,
నువ్వు లేవన్న వార్త విని
దుఃఖమూ కాని వ్యథా లేని
లుంగలు చుట్టిన బాధతో
లిప్త పాటు నిశ్శబ్దమయ్యాను.
2
తీరని బాధా కాదు ఎడతెగని శోకమూ లేదు
యేదో సన్నగా కోస్తున్న నెత్తుటి పొడి రాల్తున్న చప్పుడు.
యెడతెగని కంఠధారల పాటల వర్షమై,
నిర్నిద్ర కవిత్వపు కెరటాల సముద్రమై,
యెప్పుడూ శబ్దమైన నువ్వు ఇట్లా హఠాత్తుగా నిశ్సబ్దమయితే
భరించడం కష్టంగా ఉంది – చెవులు చిల్లులు పడుతున్నయి.
3
అయినా నువ్వెప్పుడో కదా వెళ్ళిపోయావు
మా భద్రలోక జీవితాల్లోంచి, మడి కట్టుకున్న మా విలువల్లోంచి,
బహురూపుల బతుకును దాచుకుంటూ
మోసకారిగా బతికే మా ముసుగుల్లోంచి
యెప్పుడో కాదూ వెళ్ళిపోయావు విస విసా …..
వ్యవస్థీకృత వ్యూహాల్లో అంటరానివాడివై
ఆధిపత్యాన్ని ఆత్మహననంతో ధిక్కరిస్తూ
యెప్పుడో కాదూ వెళ్ళిపోయావు రుస రుసా….
కాలి బూడిదవుతున్న కాంక్షాగ్రహాల్తో
పాతుకుపోయిన ‘బ్రాహ్మనీకపు’ వెయ్యిపడగల్ని యెడంకాలితో తన్నేసి
కమిలిపోతున్న నిజాయితీ తో ‘చిన్నదేవుళ్ళ’ ని నిలబెడుతూ
యెక్కడికో వచ్చేసావు కదూ వడి వడిగా ….
4
యెందుకో నువ్వున్నప్పుడు,
పలకరించాలంటే బుగులేసేది
యేదో అడ్డమొచ్చేది గొంతుకు -
యేదో గుచ్చుకునేది భద్రత ముళ్ళ కంచెలు అలవాటైన కనుపాపలకు …
యెక్కడో అనుమానం భరించలేనేమోనని
భగ్గుమనే సాయంత్రాల తొట్లలోని అనాచ్చాదిత మల్లెపూలని …..
5
యిప్పుడింక
యెవరు పిలుస్తారు లోనికి
లోలోపల సుళ్ళు తిరిగే నువ్వు లేనితనాన్ని
యెవరు ఊడ్చేస్తారు బయటికి
నువ్వున్నా పలకరించని మా మర్యాదల్ని
యెవరు ఖననం చేస్తారు నగరం నడిబొడ్డులో
వూరి బయట కరెన్సీ నోట్లమంటల్లో సారాయి కాచుకునే కలల బైరాగి శిథిల శరీరాన్ని
యెవరు చెప్తారు వూరంతా గుండెలవిసేటట్టు
నువ్విక్కడే యెక్కడో
యేవో విగ్రహాలని పగలగొడ్తనే ఉన్నవని
యెవరు ఊదుతారు ఊపిరితిత్తులు పగిలేటట్టు
నువ్వొదిలి పోయిన అపురూపమైన ఈ వెదురు బొంగుల్ని
ఇంత బాగా రాసే నారాయణస్వామి వెంకటయోగి అనే ఒక కవి ఉన్నాడని ఇప్పటి దాకా నాకు తెలియకపోవటం నా దురదృష్టమే.
This poem deserves accolades. Congrats.
swamy garu— baagundhi sir
యేదో గుచ్చుకునేది భద్రత ముళ్ళ కంచెలు అలవాటైన కనుపాపలకు …
యెవరు ఊదుతారు ఊపిరితిత్తులు పగిలేటట్టు
నువ్వొదిలి పోయిన అపురూపమైన ఈ వెదురు బొంగుల్ని….
యెప్పుడూ శబ్దమైన నువ్వు ఇట్లా హఠాత్తుగా నిశ్సబ్దమయితే
ఎంత బాగున్నాయో…
wonderful wonderful .. poem sir .. which is really a diction for aspirants like us to learn from it .. the is feel you carried in this poem from the begining is really touched my heart and yess .. this will remain in my mind for years
Highly poetic streak and tinge to raasina kavitha. swamy gaari brand unna kavitha. chaannaallaku swamy kalam nundi jaaluvaarina kavitha… baavundi. kavigaari photo koodaa veste baavundedemo…!
స్వామి, నీ పాట పదును దేరింది. కంగ్రాట్స్.
ఎన్నాలలో వేచి వుంది హృదయం మీ కలం నుంచి మరో కవిత కోసం …. మనసు సేద దీరింది. అద్భుత గీతం.అభినందనలు డియర్ నారాయణ స్వామి వెంకట యోగి జి. …శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.
స్వామి గారూ,
మీ కవితలో, “సన్నగా కోస్తున్న నెత్తురుపొడిరాలుతున్న చప్పుడు” అన్నప్రయోగం చాలా నచ్చింది. మంచికవితావేశం ఉన్న కవిత. బహుశా ఇప్పుడు ఇలాంటి Iconoclastల అవసరం ఉందేమో.
అభివాదములతో
ఆప్త వాక్యాలతో ప్రోత్సహించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు!
Great.
సమకాలీన తెలుగు సాహిత్యంలో వి.వి. నారాయణస్వామి తెలువదనడం కొంచం ఇబ్బంది పెట్టె విషయం.80 దశకంలో కవిత్వలోకి అడుగుపెట్టి కల్లోల కళల మేఘం,సందుక సంకలనాలు వేసిన బలమైన నిర్దిష్ట దృక్పథం వున్నా కవి. తెలుగు నేలను విడిచి కొంత దూరంయ్యిండు . ఇగో,ఇంట్లంటి స్పష్టమైన సామాజిక ఆలోచనలతో అద్బుత మన కవిత్వం అల్లుతాడు ఈ సిద్ధిపేట ముద్దుబిడ్డ
అసలైన కవిత్వం రుచి చూపారు. చాలా బావుంది . ఠాంక్యూ !!
సిద్ధిపేటకు చెందిన నారాయణ స్వామి అనే ఒక కవి గురించి విన్నాను కానీ అతడే ఇతడనుకోలేదు.పైగా వెంకటయోగి అతని యింటిపేరని తెలియదు.ప్రింట్ మీడియా పత్రికలను నేను బాగానే ఫాలో అవుతాను.అట్లాంటి పత్రికల్లో ఆయన కవితలు అంతగా వచ్చినట్టు లేవు.పోతే అంతర్జాల పత్రికలను చూడటం ఈ మధ్యనే మొదలు పెట్టాను. అతని పుస్తకాలను చదవలేకపోవటానికి కారణం 1980 నుండి 1986 డిసెంబర్ వరకు నేను abroad లో పని చేయటమే కాక,తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు ఉద్యోగపు విధినిర్వహణలో పూర్తిగా తలమునకలై, సాహిత్యానికి దూరంగా వుండటమే. లింగారెడ్డి గారూ! కవిత్వాన్నీ, కవులనూ నాకంటె యెక్కువగా ఫాలో అవుతున్నందుకు మీరు తప్పక అభినందనీయులే.
యెందుకో నువ్వున్నప్పుడు,
పలకరించాలంటే బుగులేసేది
యేదో అడ్డమొచ్చేది గొంతుకు – nijame kadaa
కవిత చాలాబాగుంది హృదాయాన్ని కదిలించింది – కవి కి ధన్యవాదములు
నిజమే! అందరికీ తెలిసేంత, popular అయేంత prolific గా నేను రాయలేదు! అడపా దడపా అచ్చులో వచ్చినయి – అయితే నారాయణస్వామి పేరుతో! చాలా మంది అడిగారు కూడా ఈ వెంకటయోగి ఎవరని ! ఎలనాగ గారూ – నేను రాయడం మొదలుపెట్టింది 1984-85 కాలంలో – అప్పుడే విరసం సభ్యున్నయ్యా! అప్పట్నుంచీ 1997 దాకా – అమెరికా వచ్చేంతవరకూ – విరసం లోనే ఉన్నా! 1992 లో కల్లోల కలల మేఘం , 2006 లో సందుక వచ్చినయి. నిజమే! రాయాల్సినంతగా రాయక పోవడం నా పొరపాటే!
*యెవరు పిలుస్తారు లోనికి
లోలోపల సుళ్ళు తిరిగే నువ్వు లేనితనాన్ని..*
వ్యధార్త హృదయాన్ని మాటలుగా అనువదిస్తే..
ఇంతేనేమో..
Thank you its marvelous.
యిప్పుడింక
యెవరు పిలుస్తారు లోనికి
లోలోపల సుళ్ళు తిరిగే నువ్వు లేనితనాన్ని
యెవరు ఊడ్చేస్తారు బయటికి
నువ్వున్నా పలకరించని మా మర్యాదల్ని
యెవరు ఖననం చేస్తారు నగరం నడిబొడ్డులో
వూరి బయట కరెన్సీ నోట్లమంటల్లో సారాయి కాచుకునే కలల బైరాగి శిథిల శరీరాన్ని
యెవరు చెప్తారు వూరంతా గుండెలవిసేటట్టు
నువ్విక్కడే యెక్కడో
యేవో విగ్రహాలని పగలగొడ్తనే ఉన్నవని
యెవరు ఊదుతారు ఊపిరితిత్తులు పగిలేటట్టు
నువ్వొదిలి పోయిన అపురూపమైన ఈ వెదురు బొంగుల్ని
నారాయణస్వామి గానే మీ పరిచయం చాలావరకు …మీ కలల కల్లోల మేఘం, సందుక ప్రతులు నా వద్ద ఉన్నయి. చాల సార్లు వాటిని చదివిన. నేను సిద్దిపెట వాడినే.సృతి కవిత అయినా పోరాట శీలత, ఆర్ధ్రగుణం, సంఘటణాత్మక చిత్రణ వెరసి శీర్షిక నూతనత్వం, ఒక ఫోర్స్, ఒక మూవ్ మెంట్ హృదయంపై పనిచేస్తున్నయి కవిత చదివినప్పుడు. థాంక్యూ సర్ .
రామారావు గారూ – చాలా సంతోషం మీకు పద్యం నచ్చినందుకు – ఎక్కడుంటున్నారు మీరిప్పుడు?
కవిత చాలా బాగున్నది స్వామి సర్, నిజానికి మీరు 90 లలో మంచి ఉద్యమ కవిత్వం రాసిండ్రు. ప్రగతిశీల ఉద్యమాలకు మధ్యతరగతి ఉన్నత విద్యావంతులకు చాల గ్యాప్ ఉండడం వల్ల వారు స్వామి కవిత్వాన్ని చదివి ఉండక పోవచ్చు. అది తప్పు కూడా కాదు. మంచి కవిత రాసిన మా స్వామి సర్ కి థాంక్స్
స్వామీ, నెత్తుటి పుప్పొడి రాల్చావు
చాలా బాగుందండి…ఒక మంచి కవిత చదివాను పొద్దున్నే!
స్వామిగారూ!చాలా బావుంది. శీర్షిక చూడంగనే ఉలిక్కిపడ్డా! భావ కవిత్వం అని తెలిశాక హాయిగుంది. రొచ్చురాజకీయాల పెచ్చులూడదీసే ఆలోచన మీకుంటే, దానికిక్కడ చోటుంటే, ‘అడ్డదిడ్డంగా విగ్రహాలు పెట్టేవాళ్ళ’ గురించి కూడా రాయొచ్చు. మంచి కవితనందించిన మీకు అభినందనలు.
రాజా.