కవిత్వం

ఏక తానం …

07-జూన్-2013

ఏక స్వర స్వరపేటికేమో కోకిలది
పంచమం ఒక్కటే పాడుకుంటున్నది
పంచకళ్యానిదీ ఒకే రాగం –పరుగు రాగం
పక్ష ద్వయం మీది పక్షి గానం ఒక్కటే –పవన గానం
నాదేమో ఒంటరి కోయిల సోమరి కంటం !

వసంతం వదలివెళ్ళినా
కలకూజితాన్ని కల కంటూనే వున్నాను
జవనాశ్వం పారిపొయినా
కల్యాణి రాగం పాడుకుంటూనే వున్నాను
పక్షాలు విప్పి విశ్వ విహాయసంలో
ప్లవన సంగీతమయి తేలి పోతున్నాను

కాని…..కాని…నేను –
సహసమాజ సేవాస్వర సమ్మేళనంలో
ప్రజాపాట కాలేకపోతున్న శుద్ధ శాస్త్రీయాన్ని
ఋతువు మారినా మారని ఋజు రుతు గీతాన్ని
కళ్ళకు గంతలు కట్టుకున్న గాలిపాటను

మనవాడు మహా ఘటికుడు
చేతికి పదేసి వేల్లున్నాయని దశకాలు పాడుకుంటాడు
రెండేసి చేతులతో పంచపదులను మీటు తుంటాడు
నాకు రెండైనా లేవు వోకల్ కార్డ్స్
ఒక బైనరీ గీతమైనా రాసుకునేవాన్ని!
ఒక డిజిటల్ దృశ్యమైనా పాడుకునేవాన్ని!

అప్పటికీ ఇప్పటికీ నేను ఏకాకి స్వరాన్నే
మొనాటనీ మధురిమకు మొహం మొత్తి
నేనిపుడు
ఏక్ తారను వెదుక్కుంటున్న చరమ చరణాన్ని!
ఏక తారను మోస్తున్న ఆఖరు ఆకాశాన్ని!