నీరెండ మెరుపు

కావేరి కోసం బెంగటిల్లిన కొన్ని వాక్యాలు…

14-జూన్-2013

నీటికీ మనిషికీ ఏదో అనుబంధం ఉందని అనుకుంటాను… బహుశా తొమ్మిదినెలలపాటు ఉమ్మనీటిలో తేలుతూ ఉండబట్టేమో… సముద్రాన్ని చూసినా, అనంతమైన నీటిప్రవాహాల్ని చూసినా, వేసవిలో చిక్కి సగమైన నదుల్ని చూసినా కవులుకానివాళ్లకి కూడ ఏదో చెప్పాలన్న మాట గుండెలో కొట్టాడుతుంది. ఇక కవులైనవాళ్ళ సంగతి చెప్పక్కరలేదు కదా!

వాళ్ళు నీటిప్రవాహాన్ని ఎన్నిరకాలప్రతీకగా వాడొచ్చో అన్నిరకాలుగా బాహిరంతరప్రతీకగా వాడి కవితకి కొత్త అందాలు కూరుస్తారు. అదిగో సరిగ్గా అలాంటికవితే అఫ్సర్ రాసిన “కావేరి వొడ్డున”.

మీరెప్పుడైనా అనుభూతిచెందేరో లేదో తెలీదుగాని, నాకు సముద్రపుటొడ్డున కూర్చున్నా, నదీతీరంలో కూర్చున్నా, భూమిఉపరితలం అంచున కూర్చున్న అనుభూతి కలుగుతుంది (అది ప్రతిక్షణమూ నిజమే అయినా మిగతా సందర్భాల్లో ఆ తలపు ఉండదు). ఒక్కోసారి కవిత శీర్షికకూడా కవిత చదవకముందే కొన్ని Expectations రేకెత్తించి మానసికంగా సిద్ధంచేస్తుంది (దానివల్ల కొన్ని మంచికవితలుకూడా మొదటిసారి సరిగ్గా ఆశ్వాదించలేకపోయిన సందర్భాలున్నై నా వరకు). దీనికితోడు అఫ్సర్ ఆ కవిత రాసిన సందర్భంకూడ కొంతతెలిసి ఉండడం ఆ మూడ్ క్రియేట్ అవడానికి సహకరించింది. ఆఫ్సర్ కి Reader Response Theory ఇష్టమైన విషయం కాబట్టి ఆ క్రమంలో పాఠకుడిగా ఆ కవిత చదివినప్పుడు (ఇప్పటికీ) నాలోకలిగే స్పందనని తెలియజెయ్యడానికి ప్రయత్నిస్తాను.

నది ఒక ప్రవాహం… జీవితం… స్త్రీ… ఒక గొప్ప సంస్కృతి… ఒకటేమిటి చైతన్యవంతమై, ప్రవాహసదృశమై, కాలగతికి మార్పుకాగలిగిన ఏ వస్తువుకైనా దీన్ని ప్రతీకగా వాడుకోగలడు, తన ప్రతిభద్వారా కవి దాన్ని సమర్థించుకోగలడు గూడా. అఫ్సర్ వెతుక్కుంటూ వెళ్ళినది సూఫీ మూలాల్ని… హిందూమతవ్యాప్తికి సాధువులూ, సంత్ లూ ఎంత కృషిచేసారో, హిందూసమాజంలో పాలూనీళ్ళలా ఇస్లాం కలిసిపోడానికీ, ఈ సూఫీ సెయింట్ లు కూడా అంత కృషిచేశారు. నిజానికి నా చిన్నతనంలో మతం వేరన్న భావనతప్ప, ఒకరి పండగలు ఒకరుచేసుకోవడమే కాదు, మా ఊర్లో పీర్లపండగలో చాలామంది హిందువులు (అందులో బ్రాహ్మలుకూడా ఉన్నారు) గుండంతొక్కడం నాకు అనుభవంలోని విషయమే. స్వాతంత్ర్యంవచ్చే వేళ రాజకీయ ఎత్తుగడలకీ, కొందరి స్వార్థప్రయోజనాలకీ గురికాకుంటే, ఇప్పుడు మనదేశ పరిస్థితి మరోలా ఉండేది.

ఈ రెండూ రెండు గొప్పస్రవంతులు. విశాల కాలమైదానం మీద వందలఏళ్ళు ప్రవహించిన జీవధారలు. కనుక కావేరిని చూసినప్పుడు లౌకికంగా ఆ ప్రవాహపు ఉచ్ఛదశలో (కడుపుతో పొంగిపొర్లుతున్నప్పుడు) కాగితప్పడవనై మునిగిపోలేదే అనే ఒక తపనలాంటి భావన ఆఫ్సర్ కి రావడంలో ఆశ్చర్యంలేదు. మనం మనల్ని బిందువులుగా ఊహించుకుంటే (మనం ఏదో ఒకప్పుడు నీటి బిందువులమై ఉండి ఉండకపోము; భవిష్యత్తులో అవకపోము కూడా) ఆ నడుమువంపులో అరనీటిబిందువై ఆడుకోలేదే అనిపించడమూ సహజమే. (అరనవ్వు అని తిక్కనసోమయాజి ఒక సందర్భంలో అద్భుతమైన ప్రయోగం చేస్తాడు మహాభారతంలో). చాలారోజుల విరహం తర్వాత మీరు ఎదురైనప్పుడు మీ ప్రేమికురాలి కళ్ళలో పెల్లుబికిన తొలిబాష్పకణంలో ప్రతిఫలించిన ఆకాశాన్నెపుడైనా గమనించేరా? లేకపోతే మాయాబజారు సినిమాలో సావిత్రికళ్ళలో ఒక్కసారి చూడండి. ఆ ఆనందం, అనుభూతి అనిర్వచనీయమైనవి. అదే అనుభూతి, కంటి తడీ మనమూలాలు మనం చూసుకున్నప్పుడూ, వాటిగురించి తమకంతో ఆలోచించినప్పుడూ వస్తాయి.

కాలం సమవర్తి. మహా నిర్లిప్తమైనది. సముద్రాల్ని ఎడారులుగా, ఎడారుల్ని సముద్రాలుగా మారుస్తుంది. జీవనదులైనా పిల్లకాలువలస్థాయికి కృశించుకుపోవలసిందే… కారణం ఏదైతేనేం. అవి నడిచొచ్చిన జాడలే ఇప్పుడు మిగుల్తాయి. శ్మాశానంలో కాటికాపరిగా హరిశ్చంద్రుణ్ణి చూసినపుడు ఎటువంటి జాలి కలుగుతుందో, ఆ మహానదీప్రవాహాలు ఈ దశకి చేరుకున్నాయికదా అన్న జాలితో ఒక్కసారి శరీరం గగుర్పొడుస్తుంది. తెరచాపలెత్తవలసిన వోడలవంటి మనం ఇసుకలో కూరుకుపోతాం. ఇక మనకి మిగిలింది పసిపిల్లల్లా మిగిలిన ఆ కొద్దిపాటి పచ్చని జ్ఞాపకాల్లోకి వెళ్లి ఆడుకోవడమే.

ఉంటుంది. సంతృప్తి ఉంటుంది. విడిచివచ్చిన ఊరులో పాడుపడ్ద ఇంటినీ చూసినపుడూ, బోసిపోయిన దేవాలయాన్నీ, చేలతో కళకళలాడవలసిన పల్లెటూర్లు సమాధుల్లా నిలుచున్న ఇళ్లస్థలాల రాళ్లతోనిండడం చూసినపుడూ; గుడులూ, మసీదులూ, చర్చిలూ సమాధిరాళ్లలా మిగిలిపోయి జనజీవితం ప్రవహించవలసినచోట, నిశ్చైతన్యం ఘనీభవించినపుడూ… ఒకపక్క బాధ దహిస్తున్నా, కనీసం మనలో ఆ ఊరు… ఆ జ్ఞాపకం… ఆ సంస్కృతి… సజీవంగా ఉందికదా అన్న Vicarious Pleasure ఏ మూలనో ఉండకపోదు.
కాని ఆ ఊరువచ్చిన లక్ష్యం వేరు… తనివితీరా కాగలించుకుందికీ, చిన్ననాటి బాల్యంలో మునకలెయ్యడానికీని. కాని, మనకి చివరకి మిగిలేది… ఏవి తల్లీ నిరుడుకురిసిన హిమ సమూహములు? అని నిట్టూర్చడమే. అది సంస్కృతి అయినా, నది అయినా, జ్ఞాపకమైనా… ఒక్కటే.

నాకు ఈ కవిత చదివినపుడల్లా అదే బాధ కలుగుతుంది. పడుగూ పేకల్లా కలిసిపోయిన సంస్కృతీ, సంప్రదాయం, సంగీతాలని, కాలం ఎంత నిర్దాక్షిణ్యంగా పలచనచేసిందే అని అనిపిస్తుంది. అందుకే నాకు నచ్చిన మంచికవితల్లో ఇదొకటి.

—————————————————

కావేరి వొడ్డున

1
బెంగ
నువ్వు కడుపుతో పొంగి పొర్లుతున్నప్పుడు
నీలోపల కాయితప్పడవనై మునిగిపోలేదే అని!
నీ తొలి యవ్వనపు నడుం మెలిక మీద
అరనీటి బిందువై ఆడుకోలేదే అని!
నీ తడిచూపులో నిలిచి
వొక ఆకాశమయినా నీతో కలిసి పంచుకోలేదే అని.
2
కావేరీ,
నువ్విప్పుడు చిక్కి సగమయిన పద్యానివి.
నీ వొడ్డు మీద నేనొక అలసిపోయిన పడవని.
నీ వొంటిని ఆరేస్తున్న ఆ పసుపు చీరల
మడతల్లోకి పారిపోయిన పసితనాన్ని.
3
తృప్తికేం, వుంది!
ఈ కళ్ల చివర ఏదో వొక మూల
నువ్వున్నావన్న తృప్తి లేకపోలేదు.
4
కానీ
కంటి నిండా సముద్రాన్ని
దాచుకోవాలని కదా, నేనొచ్చా.
నీ పక్కటెముక చుట్టూ అలల చేతుల ప్రవాహమవ్వాలని కదా, వచ్చా.
5
కాదా మరి కావేరీ!

-అప్సర్
(శ్రీరంగంలో కావేరీ వొడ్డున వొక పొద్దున)
29-07-2012

 ఇంగ్లీషు అనువాదం: http://vaakili.com/patrika/?p=2790