కవిత్వం

అమ్మకానికి ఆత్మ ..!

14-జూన్-2013

అవును నేనే ..
ఒక రక్త మాంసాల సమూహమై నడచి నడచి
బీడు బారిన నేలను
చిగురింప చేయాలని సంకల్పించి
రిక్త సమాధుల నేలను
రత్న మయం చేయాలని ఆశించి
కన్నీటి కలల్ని పోగేసుకున్న భగీరదుణ్నీ …

నేనే
అర్ధవంతమైన బతుకు చిలక్కి చిక్కి
ఆత్మని నాగలిగా మలిచి
ఆశయం భుజాని కెత్తుకున్న స్వాప్నికుణ్నీ
ప్రసవ వేదన అనుభవిస్తున్న తల్లిలా ..వున్న
ఈ నేలను తూట్లు పొడిచి నాట్లు వేసి
లోపలి ఆకుపచ్చ చాయను బయటికి లాగిన
మాంత్రిక మట్టి బిడ్డను నేనే ..

నేనే
మొలకెత్త లేని గింజ గిజగిజ లాడినప్పుడు
శ్రమతో పరిస్రమించి స్వేద రక్తం తో
గిన్జని తడి పిందీ, మేల్కొల్పిందీ నేనే
నేల తడవని వర్షం కోసం
నింగి కేసి చూస్తున్నప్పుడు
జన్మ హద్దుల్ని చెరిపేసుకున్న సాహసినీ నేనే
బ్రతుకుని సమాంతర దీపానికి వేలాడ గట్టి
ఓటమి కూడా గేలుపే ననుకుంటున్న వెర్రి రైతునీ నేనే ..

ఇంత జరిగాక
ఇప్పుడు నా వద్ద ఏమీ లేదు
కుటుంబాన్నీ
శరీరంలో అవయవాలన్నీ పోగొట్టుకున్నాక
మిగిలింది ఆత్మ ఒక్కటే …
అమ్మాలంటే ఆత్మ తప్ప ఏమీ లేదు
కొనేవాడికి అవయవాలు తప్ప ఆత్మపనికి రాదు… !