కవిత్వం

అంతర్గీతం

21-జూన్-2013

విచిత్రానువిచిత్రంగా
ఒక అపనమ్మక స్థితి నుంచి తేరుకొని
నడుస్తున్న ప్రపంచం నడవడి అర్థమై
వాస్తవం తనలోకి పాక్కుంటూ వస్తుంది
మనిషి.. మనుగడ మరో ప్రపంచంలో
ఉన్నప్పటి జ్ఞాపకాలు అన్ని ముసురుకొని
స్వప్నావస్థ నుంచి బయటపడ్డాక
పిడుగు మీదపడ్డ అవశేషంలాగా
కళ్లముందు ఉంటుంది కదలాడుతూ వాస్తవం

కొమ్మలపై, రెమ్మలపై
పువ్వులపై ఆకులపై
విహరించి.. పిచ్చుకల గూడులో
వెచ్చగా ఒదిగి.. కోయిలల జతలో
కమ్మగా గానంచేసి..
తోడుగా ఎగిరిన రంగురంగుల
సీతాకోక చిలుకలు వెళ్లిపోయాక
కలిసి ప్రవహించిన నదీనదాలు వేరయ్యాక
వనంలో విరబూసిన గడ్డిపువ్వును ముద్దాడి
కొండ గుహలకు అల్లుకున్న తీగల నుంచి విడిపడి
అన్యమనస్కంగా అలికిడి చేయకుండా
మెల్లగా కదిలిపోతున్న కాలంలోకి
గప్ చుప్ గా ప్రవేశిస్తాను

కాలం అలా నడుస్తూ ఉంటుంది
నెమ్మదిని అడుగుల్లో..
వేగాన్ని ఆలోచనల్లో పెట్టుకొని
అనేక రూపాలు.. ఒకదాని వెంట ఒకటి
తొడుక్కుంటూ వుంటుంది
సహజ అలజడి లక్షణం రక్షణ కవచంగా..
ఏ నిర్వచనం నిలుపుకోదు
ఏ మార్పు.. పరివర్తన తెచ్చినట్టు అనిపించదు

మనిషి సహజ ఉద్వేగాలు
మహా కెరటాలై ఉప్పొంగుతాయ్
పశుపక్ష్యాదుల స్పందన ప్రకృతికి నిబద్ధమే
అనేక సంఘర్షణలు..
మనిషి తన దేహాన్ని
సమస్యల గూడుగా నిర్మించి..
అందులోకి శాంతి కపోతాలను ఆహ్వానిస్తూ ఉంటాడు
అనేక సంక్లిష్టతలు
మనిషి తన హృదయాన్ని పంజరంగా మార్చి..
స్వేచ్ఛను అతిథిగా ఉండిపోమ్మంటాడు
విచిత్రమేమీ కాకపోతే
హృదయాలు బండరాళ్లు కాలేదంటాడు
బలిమికి అయినా ఒక నవ్వు పులుముకోవాలి

వాస్తవం ఒకింత
రంగురంగుల అద్దాల మాటు
షోకేసు బొమ్మలా జీవం లేకుండా కనిపిస్తుంటుంది
తన శృంగార, సౌందర్యారాధనంతా
ధారపోసి చెక్కిన శిల్పం..
జీవం పొందలేని కళాఖండమే
అని తెలిసినప్పుడు
కళావిహీనమైన శిల్పి మొఖంలా అనిపిస్తుంది

అద్దాల ప్రపంచాలెన్ని బద్దలుకొట్టినా
కాళ్లకు గుచ్చుకునే గాజు పెంకులే ఎదురొస్తాయి
దయలేని నాగరికత వికటట్టాహాసం
చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది
వాస్తవం దృశ్యమానం అయ్యాక
మరణశయ్యపై ఉన్న మానవత్వాన్ని
అతికష్టంమీద మేల్కొలిపి..
ఆకాశాన్ని అర్థిస్తున్న అరచేతిలో
అర్ధ రూపాయి పెట్టి..
బలవంతంగా నిష్క్రమిస్తాను
ప్రపంచం పట్టని కాలం కప్ప గంతులతోపాటు..4 Responses to అంతర్గీతం

 1. స్వాతీ శ్రీపాద
  June 24, 2013 at 7:49 am

  నడుస్తున్న ప్రపంచం నడవడి అర్థమై
  వాస్తవం తనలోకి పాక్కుంటూ వస్తుంది

  అన్యమనస్కంగా అలికిడి చేయకుండా
  మెల్లగా కదిలిపోతున్న కాలంలోకి
  గప్ చుప్ గా ప్రవేశిస్తాను

  వాస్తవం ఒకింత
  రంగురంగుల అద్దాల మాటు
  షోకేసు బొమ్మలా జీవం లేకుండా కనిపిస్తుంటుంది
  తన శృంగార, సౌందర్యారాధనంతా
  ధారపోసి చెక్కిన శిల్పం..
  జీవం పొందలేని కళాఖండమే
  అని తెలిసినప్పుడు
  కళావిహీనమైన శిల్పి మొఖంలా అనిపిస్తుంది

  ఆకాశాన్ని అర్థిస్తున్న అరచేతిలో
  అర్ధ రూపాయి పెట్టి..
  బలవంతంగా నిష్క్రమిస్తాను
  ప్రపంచం పట్టని కాలం కప్ప గంతులతోపాటు..

  కవితా భావాలు బాగున్నాయి

  • srikanth k
   July 4, 2018 at 12:00 am

   స్వాతి శ్రీపాద మేడం గారూ ధన్యవాదాలు..

 2. Jaya reddy
  June 26, 2013 at 1:01 am

  మరణ శయ్యపై నున్న మానవత్వాన్ని అతి కష్టంమీద మేల్కొలిపి.. చాలా బాగుoది

 3. vijay kumar svk
  July 3, 2013 at 7:40 pm

  super annayaa…

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)