1
అనేకానేక గుప్త నిశ్శబ్దాలతరువాత
మాటలు అస్తి పంజరాలయ్యాక
ఓ మేఘంకింద తడవడానికి
మట్టై నా గుండె పరిగెడుతున్నప్పుడు
నేనూ వెనకాల దొర్లుకుంటూ వెళతాను
2
కొమ్మలు చెట్టుమొదలుతాకి నమస్కరించినట్టు
పూలు చెట్టుపాదాలపైవాలి పూజించినట్టు
ఎదురు చూపుల వత్తులేసుకుని
రాత్రులై తపిస్తున్న
కళ్ల పాదాల ముందు నాచూపుల్నిజల్లుతాను
3
దూరాన్ని ఏ ప్రమాణంతో కొలుస్తాం
చూపుకి దగ్గరలేనందుకో
మనసుకి దూరంలేనందుకో
వలస సెగ్గడ్డలా సలుపుతుంది
ఏదో ఒక శూన్యం అస్పష్టచిత్రాలని
ఆప్టిక్ నాడిలా మోసుకొస్తూనే ఉంటుంది
4
నేను సన్నివేశంలో లేకుండానే
నేను సందర్భంలో లేకుండానే
నాలుకకి ముల్లుగుచ్చినట్టు వణికిపొతుంటాను
గుడ్డితనం ఆవహించి కళ్లు తెరచి చూడ్దం సంతృప్తో కాదో
ధ్యానం పగిలిపొయి కళ్లుమూసుకొని చూడ్డం సంతృప్తో కాదో
ఇప్పుడు పీడిస్తున్నది దూరమ్మాత్రమేనా??
5
ఇంట్లోకి వెళ్లి పుప్పొడిని పులుముకుని
పద్మపీఠంపై రెమ్మల రెప్పల్నికప్పుకుని
నిద్రననుభవిస్తానా
మళ్లీ శూన్యమే ఓ సుడిగాలిలా
నన్ను ముక్కలుచేస్తూ.. ..
6
ఒకరోజు వెలుగు చేజారిపొయి చీకటి కొత్త ఉదయం మళ్లా.. ..
నన్ను హృదయాన్నించి చీల్చి
దూరం చేస్తున్న హైనా పళ్లసందుల్లోంచి
నేను నెత్తినోరుమొత్తుకుంటాను.
Very nice ones…..2nd one is too good!
నారాయణ శర్మ గారూ!
మీరు ఓ మంచి కవి కూడా అని తెలియజేసే కవిత యిది. బాగుంది.
thaank uమోహన తులసి గారు,ఎలనాగ గారు…నిజమే ఎక్కువగా కవిత్వం రాయలేదు..ఈ మధ్యే కొన్ని రాసాను
very good poems!!
Wonderful Narayana Sharma garu.kavitha chaalaa bagunnadi.Nagaraju Ramaswamy.