పి. సత్యవతి గారి కథలైనా, వ్యాసాలైనా, ఒకసారి చదివి, కన్వీనియెంట్ గానో, యధాలాపంగానో మర్చిపోయేవి కాదు. నెమ్మదిగా రాజుకునే ఆలోచనలు మహా ప్రవాహమై వెంటాడేలా చేసే రచనలు ఒక్కొక్కటీ! మనల్ని మనకే పరిచయం చేస్తాయి అవి . మనల్ని గురించి మనమే కాసేపు కూచుని ఆలోచించు కోవాలనే తపన రేకెత్తిస్తాయి . ఆత్మలు వాలిన చెట్టు, మెలకువ, అమ్మకేం తీసుకెళ్లాలి, నాన్న ఇలా ప్రతి కథా “ఈ పాయింట్ ని ఆలొచించడం నేనెలా మర్చిపోయాను?” అన్న ప్రశ్న చదివిన ప్రతి సారీ భుజం చరుచుకునేలా, నాలుక్కరుచుకునేలా చేస్తాయి . . పెద్ద పెద్ద అజెండా ప్రకటన లేకుండా, నీతి పాఠాలు లేకుండా, డైడాక్టిక్ గా ఉండక, చెప్పాలనుకున్న విషయాన్ని సన్నని సూదితో నొప్పి తెలీకుండా లాఘవం గా నర నరాల్లోకీ ఎక్కించే రచనలు !
అలాటి మంచి కథల్లో ఒక మరీ మంచి కథ “పెళ్ళి ప్రయాణం” !ఇండియా టుడే సాహిత్య వార్షిక సంచికలు వెలువరించే రోజుల్లో చాలా మంచి కథలు వచ్చాయి వాటిల్లో శ్రీరమణ గారి “ధనలక్ష్మి,” కుప్పిలి పద్మ “నిర్ణయం” ఇంకా అనేక మంచి కథలు నాకు వాటిల్లోనే దొరికాయి. అలా 1995 నాటి ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచిక లో “పెళ్ళి ప్రయాణం” కథ వచ్చింది. పెద్ద హడావుడి, వర్ణన లేని ఎత్తుగడతో మొదలయ్యే కథ “కొంచెం పెద్దగా” అనిపించి, చివర్లో చదవాలని పక్కన పడేశాను. చివర్లో చదవడం వల్ల కొద్ది కొద్దిగా ఆస్వాదిస్తూ, ప్రతి పేరాకి అమ్మమ్మనో, మేనత్తనో, పెద్దమ్మ నో , స్నేహితురాళ్ళ తల్లుల్నో గుర్తు చేసుకుంటూ “అవును, నిజమే, నిజమే” అని ఆశ్చర్య పోతూ చదివాను. ఇందులో పతివ్రత పిన్ని పాత్ర మా అత్తదే! ఈ పిన్ని పాత్ర ప్రతి ఇంట్లోనూ ముందు తరంలోనో, నడుస్తున్న తరంలోనూ తప్పక ఉండి తీరుతుంది. మిగతా పాత్రలకు కూడా ప్రతి రూపాలు ఎక్కడో ఒక చోట ఎదురు పడక మానవు.
ఆ తర్వాత ఆ పుస్తకాన్ని వీలైనంత మందికి ఇచ్చి ఆ కథను స్నేహితులతో పంచుకుని ఆ పైన భద్రంగా దాచుకున్నాను.
పల్లె లో జరుగుతున్నా కజిన్ శ్రీలక్ష్మి పెళ్ళికి జయ తన తల్లితో పాటు వస్తుంది . ఆ పెళ్లి కి ఇంకా ఆమె పెద్దమ్మ, పిన్ని , ఇతర బంధువులు అందరూ వస్తారు . ఆ పెళ్లి లో కలిసిన మూడు తరాల స్త్రీలు, వారి జీవితాలను ఏదో ఒక రకంగా ప్రభావితం చేయడమో లేక నిర్దేశించడమో చేసిన పురుషులు , నోరు పెట్టుకుని కొందరు, సేవలు చేస్తూ కొందరు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే గృహిణులు … పల్లెలో ఉంటూ అభివృద్ధి పథంలో ఆలోచించే యువకులు, పట్నం చేరి స్వార్థం తో ప్రవర్తించే మరి కొందరు, ఎన్నేళ్ళు వచ్చినా తమకేం కావాలో తెలుసుకోలేక తల్లి దండ్రులు చూసే పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూసే డాక్టరేట్ యువతులు .. ఇలా అనేక పాత్రలు కనిపిస్తాయి, వివిధ దృక్పథాలకు, ఆలోచనలకు పత్రీకలు గా !
ఈ కథలో జరిగే పెళ్లికి పెద్ద ప్రాముఖ్యం ఏమీ ఉండదు . పాత్రలన్నీ తమ జీవితాల్ని తాము తరచి చూసుకుంటూ తమను తాము వేసుకున్న ప్రశ్నలే అనేక విషయాలను, మారి పోతున్న మానవ సంబంధాలను చర్చకు పెడతాయి . ఉన్న ఆస్తులను అమ్మి, గ్రామాలను వదిలి నగరాలకు పోతున్న వలస జీవులు పొందు తున్నదేమిటి, భూమిని నమ్మి గ్రామాల్లోనే ఉన్న రైతులు పొందనిది ఏమిటి అనే ప్రశ్న రాజు అందరిలోనూ రేకెత్తిస్తాడు . సినిమా హాళ్ళు ,బ్యుటి షియన్ల తో సహా ప్రతిదీ అందుబాటులో ఉండే సంపన్న గ్రామాలు నగరాలకు ఏ మాత్రమూ తీసి పోక పోయినా, ప్రశాంతమైన జీవితం అందుబాటులో ఉన్నా ఉరకలు పరుగుల నగర జీవితానికి పరుగులు పెట్టె వారిని ఈ కథ ప్రశ్నిస్తుంది .
ఇక ఈ కథలోని స్త్రీల విషయానికొస్తే తనకేమి కావాలో నిర్ణయించుకునే అధికారాన్ని తనే తీసుకుని జీవితాన్ని మలచుకున్న స్త్రీ జయ తల్లి అయితే, కొద్దో గొప్పో నోరు పెట్టుకుని భర్తని అదుపులో పెట్టిందన్న పేరుతొ బతికేస్తుంది జయ పెద్దమ్మ ! వీళ్ళిద్దరి కంటే భిన్నమైనది పతివ్రత పిన్ని పాత్ర . నిరంతరం భర్త వెన్నంటి ఉండి నానా రకాల సేవలు చేస్తూ, ఆ తను లేక పొతే భర్త బతక లేడేమో అన్న భ్రమలో తనను తానూ మభ్య పెట్టుకుంటూ , చూపరులను మభ్య పెడుతూ , ఆ భ్రమ తన భర్తకు కూడా ఉందని తనను తానూ నమ్మించుకుంటూ ఆత్మవంచన చేసుకుంటూ బతికే పతివ్రత పిన్ని పాత్ర మీద చాలా జాలి వేస్తుంది . సత్యవతి గారి కథల్లో ఇలా ఆత్మ వంచన చేసుకునే స్త్రీ పాత్రలు తరచూ కనిపిస్తూ ఆలోచనలని రెకెత్తిస్తాయి. సూపర్ మామ్ సిండ్రోమ్ ,ఒక రాజ్యం కథ ఇంకా మరి కొన్ని కథల్లో ఇలాటి పాత్రలని చూడవచ్చు .
ఈ కథలో ఆమె ఆ ఇంటి ఆడపిల్లల జీవితాలు ఆ కుటుంబ పెద్ద ఆధిపత్యానికి, కుటుంబ రాజకీయాలకు ఎలా ప్రభావితమై పోయాయో స్పష్టంగా చూపిస్తారు . భర్తను కోల్పోయి, దిక్కు లేక ఉన్న కాస్త ఆస్తిని అన్న చేతిలోనో తమ్ముడి చేతిలోనో పెట్టి, వాళ్ళింట్లోనే పని మనిషులుగా బతికే పాత తరం స్త్రీల నుంచి, భర్తలు చేసే పనులను నిలదీసి అడగలేక ఆ స్ట్రెస్ ని భరించ లేక హిస్టీరియా పేషంట్లు గా మారిన స్త్రీల వరకు, డాక్టరేట్ చేసినా అమ్మ చెప్పగానే అలంకరించుకుని “నలుగురి కంటా ” పడాలని అలంకరించుకుని వడ్డనకు బయలు దేరే 30 ఏళ్ళ సుధ నుంచి కోరుకున్న మనిషి అందుబాటులోనే ఉన్నా తల్లి దండ్రులను కాదనలేక తల వచ్చి వాళ్ళు చుసిన అబ్బాయితోనే తాళి కట్టించుకునే పెళ్లి కూతుఋ శ్రీ లక్ష్మి వరకు వరకు అనేక జీవితాలు .
నలుగురైదుగురు ఆడపిల్లలున్న ఆ నాటి కుటుంబాల్లో ఏదో ఒక విధంగా ఆడ పిల్లలకు పెళ్లి చేసి వదిలించుకోవడం తప్ప , వారికి కూడా పిత్రార్జితంలో భాగం ఇవ్వాలని తోచని తండ్రులను ఈ కథ నిలదీస్తుంది
ఈ కథ నేపధ్యాన్ని సత్యవతి గారు ఇటీవల విడుదల అయిన ‘కథ-నేపథ్యం” లో వివరించారు . ఈ కథలోని పాత్రలన్నీ ఆమె దాదాపుగా స్వయంగా చూసినవే . “తమాషా ఏమిటంటే ఆ రోజుల్లొ నాకు ఆడవాళ్ళలో రెండే రకాల వాళ్ళు కనిపించే వాళ్ళు . చాలా మంచి వాళ్ళు, గయ్యాళి వాళ్ళు . బ్రతుకంతా పతి సేవ కే అన్నట్లు అడుగులకు మడుగులోట్టే స్త్రీలు, బాగా అలంకరించుకుని ఖరీదైన దుస్తులలో ఉండి , అందరి మీదా అధికారం చలాయిస్తూ తమ మాటకి ఎవరైనా ఎదురు చెప్తే అరిచి పోట్లాడి అఘాయిత్యం చేసే స్త్రీలు, మాట మాట కి కళ్ళు తుడుచుకునే స్త్రీలు, దెప్పుతూ సాధిస్తూ ఉండే వాళ్ళు, గట్ట్టిగా నవ్వని వాళ్ళు, సూటిగా ఎదుటి వాళ్ళ మొహం లోకి చూసి మాట్లాడని వాళ్ళు ఇలా ఎంతోమంది నా తోటి స్త్రీలు నా దృష్టి లోకి వచ్చారు . వీళ్ళంతా నా వాళ్ళే ! వాళ్ళు అందరినీ ఒక అభద్రతా భావం అస్తమానం వెంటాడుతూ ఉంటుందని, తమ ఉనికిని కాపాడుకోడానికి చేసే ప్రయత్నమే ఈ పాతివ్రత్యం, గయ్యాళి తనం రెండూ నని అర్థమైంది . ఈ కపటం లో తమని తము మరచి పోయిన పరాయి తనంలో వాళ్ళు జీవితంలో రాజీపడి పోతున్న విధం నన్ను చాలా కష్ట పెట్టింది ” అని విశ్లేషిస్తారు సత్యవతి.
ఇంతకంటే స్త్రీల ప్రవృత్తులను ఎవరైనా అర్థం చేసుకోగలరని,. వివరించగలరని అనుకోను . ఈ విశ్లేషణ లోంచి పుట్టిందే ఈ కథ . అలాగే పట్నాలకు పోతున్న వలసలు, ఆడ పిల్లలకు ఆస్తి లో వాటా లేక పోవడం వంటి విషయాలు తను బాధ పెట్టాయని ఆమె అంటారు . ఈ కథలో ఈ విషయం మీద అర్థ వంతమైన చర్చ జరుగుతుంది .
ఈ చర్చతర్వాత నిజంగా ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోతాం .
ఇలాటిస్త్రీలను, వారి స్థితి గతులనుచూసిన తర్వాత, చదువు తనను ప్రతి విషయాన్ని గురించి ప్రశ్నించడం నేర్పిందని చెప్తారు రచయిత్రి .ఎలా ఉండాలో ఒకవైపు నుంచి, అదే సమయంలో ఎలా ఉండకూడదో మరో వైపు నుంచి అర్థమైందని అంటారు .
రచయిత్రి చెప్పినట్లు “పెళ్లి ప్రయాణం” కథలో మూడు దశాబ్దాల జీవితం ఉంది
మూడు తరాల స్త్రీలున్నారు .
వారి వ్యధలు ఉన్నాయి.అవన్నీ కథగా రూపు దిద్దుకున్నాయి .
అసలు పెళ్లి ప్రయాణం కథ చదవడం తప్ప ఆ కథకు గొప్ప పరిచయం లేదు.
పెళ్ళి ప్రయాణం కథ, తానా ప్రచురించిన కథ-నేపథ్యంలో లభిస్తోంది. ఈ పుస్తకం కినిగె లో ఈ పుస్తకం కూడా దొరుకుతోంది.
సత్యవతి గారి ‘పెళ్ళి ప్రయాణం’ గురించి మంచి పరిచయం. ఇది చదివాకే కథ మీద ఆసక్తి కలిగి ఇక్కడ చదివాను- ఈ కథ వెలువడిన దాదాపు పాతికేళ్ల తర్వాత! బోర్ కొట్టలేదు కానీ, నిడివి మాత్రం ఎక్కువగానే ఉందనిపించింది.
పెళ్ళింటి వాతావరణాన్ని రచయిత్రి సహజంగా ప్రతిఫలించారు. పెళ్ళిళ్ళలో ప్రతిదీ ఒప్పందాలూ, బేరాలే కదా… ఇవన్నీ రానురానూ ఆమోదయోగ్యమై సహజమైపోయాయి. పతివ్రత పిన్ని అతి వెనకున్న అభద్రతాభావాన్ని ప్రతిభావంతంగా చిత్రించారు.
కథలో మామూలుగా కనిపిస్తూనే చమక్కుమనిపించే వాక్యాలున్నాయి-
‘ఆ పిల్లలేమో ఆస్తులు అమ్ముకు రమ్మని వేధిస్తారు. అమ్ముకొచ్చాక, ఇచ్చేదాకా వేపుకుతింటారు. ఇచ్చినాక ఇంకా బతికి ఉన్నందుకు విసుక్కుంటారు’
‘ఆయన పోయాడు. పోయాక ఈవిడ పిచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు హాయిగా ఉంది’
కథలో భాగంగానే అయినా సంజీవ్ దేవ్ గారి తుమ్మపూడిని తల్చుకోవటం బాగుంది!
వేణు గారు,మీరు ఉదహరించినటువంటి మెరుపు వాక్యాలు సత్యవతి గారి కథల్లో చాలా చోట్ల కనిపిస్తుంటాయి. నిజానికి పాత రోజుల్లో “దయ్యం పట్టింది”, “పిచ్చి ఎక్కింది” వంటి స్త్రీల దయనీయ పరిస్థితులకు సత్యవతి వారి కథలో చూపించినవే కారణాలు. మగవాళ్లకు దయ్యాలు ఎందుకు పట్టవో ఈ కథ చదివితే తెలుస్తుంది )
అన్ని పాత్రల్ని పరిచయం చేసిన కథ ఆ మాత్రం నిడివి ఉండాల్సిందే . ధన్యవాదాలు
మీకు సంజీవ దేవ్ గారు అంటే ప్రత్యేక అభిమానం అనుకుంటాను కదా !
చక్కటి పరిచయం. నా ఉద్దేశంలో ఈ కథ ఆల్ టైం బెస్ట్ కథల్లో ఒకటి. A truly multi dimensional slice of contemporary life.
Yes, Narayana Swamy garu, this this an all time best story. Thought provoking too
సుజాత గారు, సత్యవతిగారి నెట్ రెండు రోజులుగా పని చేయటం లేదంట. ఫోన్ లో మీరు రాసింది చదివితే వింటూ ‘ఇందులో పతివ్రత పిన్ని పాత్ర మా అత్తదే’అన్న చోట సత్యవతిగారు భలే నవ్వారు.
మీ పరిచయం చాల బాగుంది. ఆ ప్రయాణంలోకి మరోసారి ప్రయాణం చేయించిన మీకు Thank you.
పద్మ గారూ,, నిజమా? నాకు కూడా వూరు మారే హడావుడి లో నెట్ రెగ్యులర్ గా లేదు. లాప్ టాప్ నుంచి టైప్ చేస్తున్నాను. తప్పులొస్తాయేమో అని బెంగ. సత్యవతి గారికి నేనే ఈ లింక్ పంపాలి అనుకున్నాను. మీరు చదివి మరీ వినిపించారా? అబ్బ, చాలా థాంక్స్క్ మీకు.
పతివ్రత పిన్ని పాత్ర ఒక్క మా అత్తదే కాదు, కాసేపు కూచుని ఆలోచిస్తే చుట్టాల్లో చాలా మంది దొరికేటట్టు ఉన్నారు
ఈ కథ నాకు చాలా నచ్చ్చిన కథ. ప్రతి వాక్యమూ ఎంతో అనుభవించి చదువుతాను ప్రతి సారీ.
పరిచయం మీకు నచ్చినందుకు థాంక్యూ
“పెద్ద పెద్ద అజెండా ప్రకటన లేకుండా, నీతి పాఠాలు లేకుండా….”
సత్యవతి గారి కధల్లో నాకు నచ్చేది కూడా ఇదే.. అనవసర వర్ణనలూ, పిండి ఆరేసే ఘట్టాలూ ఉండవు కానీ మనసుని బలంగా తాకుతాయి.. ఎప్పటికీ గుర్తుండిపోతాయి!
కధా పరిచయం చాలా బావుంది.. ఒక్కోసారి కధ బావుందా లేక దాని పరిచయం బావుందా అని తేల్చుకోలేకపోతాం.. అదే పరిస్థితి ఇప్పుడు!
నిషి, సత్యవతి గారి కథలన్నీ ఇంతే! ప్రతి పాత్రా ఎక్కడో అక్కడ ఆల్రెడీ మనకు పరిచయమయ్యే ఉంటుంది అప్పటికే! కానీ మనం గమైంచని ప్రత్యేక కోణాన్ని సత్య వతి గారు పట్టేసి వాళ్లను కథానాయకుల్ని చేసి.. లెక్క గబ గబా సాల్వ్ చేసి “ఆన్సర్ చూస్కో” అన్నట్లు చూస్తారు . మెలకువ కథా సంకలనం చదివా కినిగె లో. ప్రతి కథా … అంతే
థాంక్యూ
ఈ పాత్రలోని దాదాపు ప్రతి పాత్ర, ప్రతి సంఘటన జీవితంలో కనపడినవే! దాదాపు మూడు నాలుగు దశాబ్దాల జీవిత శకలాలను ఒక చోటకి చేర్చినది ఈ “పెళ్ళి ప్రయాణం”.
సుజాత గారికీ వేణు,నాశీ,నిషిగంధ అనిల్ అట్లూరి అందరికీ కృతజ్ఞతలు ఎక్కువగా సుజాతగారికి మళ్ళీ ఈ కథని వెలుతురులోకి తెచ్చినందుకు
సత్యవతి గారూ, ఈ కథ నాకెంత ఇష్టమంటే, ఇందులోని పాత్రలన్నీ , ఒక్క పది నిమిషాలు కూచుని ఆలోచిస్తే మా ఇంట్లోనే దొరుకుతాయి. 3డీ ఫొటోలాగా, ఈ ఫీలింగ్ చదివిన ప్రతి ఒక్కరికీ కలుగుతుందేమో
ఈ కథ ని నేను వెలుగులోకి తేనక్కర్లేదు. ఇది ఎప్పుడూ వెలుగులోనే ఉంది. ఎన్నో ఆలోచనల్ని వెలిగిస్తూ..
థాంక్యూ
అనిల్ గారూ,నిజమే మీరన్నది
నాలుగు తరాల వాళ్లు ఒకే చోట కూచుని అలా జీవితాలను ఎవరి కోణంలో వాళ్ళు కలబోసుకోవడం ఈ కథలోని గొప్పదనం నిజంగా ! థాంక్యూ
ఎన్ని పాత్రలు బాబోయ్..ఒక్కో పాత్ర యెక్క స్వభావాన్ని ఎంత చక్కగా విశ్లేషించారు..! ఏ పాత్ర కూడ ఇతిమిద్దంగా ఒక మంచి కి కాని లేక చెడుకు గాని రిలేటివ్గా వుండదు…ప్రతి పాత్రలోను..అన్ని రకాల తత్వాలను అవష్కరించారు రచయత్రి. అప్పటి సమాజపు పరిస్థితులను..మద్య తరగతి మనస్థత్వాలను పట్టి చూపారు, చివర్లోనే గ్రామీణ స్త్రీల యెక్క వెతలను సంఘటనల రూపంలో కాకుండా కేవలం “డైలాగ్” రూపంలో చెప్పడం వలన కాస్త ల్యాగ్ అనిపించింది కాని, అప్పటికే కథ నిడివి పెద్దదవడం మూలానేమో రచయత్రి ఆ సమస్యలను “మాటలలో”నే ముగించారు. ఇంతవరకు ఈ రచయత్రి యెక్క కథలు ఏవి చదవలేదు, ఇప్పుడూ మీ పరిచయం చేసిన మూలంగా ఈ కథ చదివాక మిగతా రచనలు ఖచ్చితంగా చదవాలనిపిస్తున్నది, చాలా థ్యాంక్సండి ఓ మంచి కథను పరిచయం చేసినందుకు.
కమలాకర్ గారూ,
ఏ పాత్ర కూడ ఇతిమిద్దంగా ఒక మంచి కి కాని లేక చెడుకు గాని రిలేటివ్గా వుండదు…ప్రతి పాత్రలోను..అన్ని రకాల తత్వాలను అవష్కరించారు రచయత్రి. ________________— అవును, ఇదే సత్యవతి గారి కథల్లో ప్రస్ఫుటం గా కనిపిస్తుంది. సమస్యను అన్ని కోణాల నుంచి పరిశీలించి, దాన్ని పాఠకులకు సైతం ఆకళింపు చేయడం.
సత్యవతి గారి కథలు కినిగె లో అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య నేను అక్కడి నుంచే కొన్నాను. నా దగ్గరున ప్రింట్ కాపీలు ఇండియాలో ఉండి పోవడం వల్ల.
తప్పక చదవండి. థాంక్యూ
మంచి రచన – మదిలో ముద్రవేసుకోవాలే గానీ, పాఠకులెప్పుడూ దాన్ని మర్చిపోరని ఈ చక్కని పరిచయం ద్వారా రుజువు చేశారు. అభినందనలు! దీనిపై సత్యవతి గారి స్పందన తెలియటం కూడా సంతోషంగా ఉంది.
అన్నట్టు- నేను రాసిన మొదటి వ్యాఖ్యలో ‘ఈ కథ వెలువడిన దాదాపు పాతికేళ్ల తర్వాత’ చదివానని పొరపాటున రాశాను. సత్యవతి గారు ఈ కథ 19 సంవత్సరాల క్రితమే కదా రాసింది!