కిటికీలో ఆకాశం

కోల్పోతూ బతికిన పద్యం… దేవిప్రియ

12-జూలై-2013

60 యేళ్ళ వయసు మనిషిలో ఎటువంటి ఆలోచనల ప్రకంపనలని సృష్టిస్తుంది ?

మరీ ముఖ్యంగా, ఆ మనిషి ప్రపంచ రాజకీయాలనీ, మానవ జీవిత చరిత్రనీ బాగా చదువుకున్న, విశ్లేశించుకున్న మేధావి అయితే, ’60 ఏళ్ళ వయసు’ అనే ఒక మలుపు దగ్గర నిలబడి వెనక్కి తిరిగి, వొచ్చిన దారిని తడిమి చూసుకున్నపుడు అతడిని ఎక్కువగా వెంటాడేది ఏమిటి?

2009 వ సంవత్సరం ఆగష్టు 15 వ తేదీన, దేవిప్రియ గారి ఇంటికి, ఆయన షష్టి పూర్తి సందర్భంగా వెళ్ళినపుడు, నన్ను ఒకింత వెంటాడిన ప్రశ్నలు ఇవి ….

ఆ రోజు, దేవిప్రియ గారి కొత్త పుస్తకం ‘గంధకుటి’ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. దేవిప్రియ గారి కవితా సంపుటుల పేర్లు, వైవిధ్యమైన ఆయన అభిరుచుల లాగా, చాలా భిన్నంగా అనిపిస్తాయి నాకు. ‘అమ్మ చెట్టు’, ‘నీటి పుట్ట’, ‘తుఫాను తుమ్మెద’, ‘పిట్ట కూడా ఎగిరిపోవలసిందే’, ‘గరీబు గీతాలు’, ‘చేప చిలుక’, ‘గంధ కుటి’…

దేవిప్రియ గారంటే నాకు ఒక ప్రత్యేక గౌరవం కూడా! కారణం, ఆయన కేవలం సాహిత్యాన్నే కాకుండా, ప్రపంచ రాజకీయాలనీ, మానవ జీవిత చరిత్రలనీ విస్తృతంగా చదివిన వాడు ….కవిత్వం లోను, పాత్రికేయ రంగం లోను తనదైన ముద్ర వేయడమే కాక, సినిమా రంగం లోను ప్రవేశం వున్న అరుదైన, ఆలోచనా పరుడైన కవి (‘రంగుల కల’ సినిమా లోని ‘పట్నం కొడుకో… నా కొడుకో కొమురన్న’; ‘జల్ – జంబల్ బరీ ‘ లాంటి ప్రఖ్యాత గీతాలు రాసింది దేవిప్రియ గారే!)

దేవిప్రియ, హెచ్చార్కె లాంటి కొందరు కవులను చదివినపుడు, తెలుగు కవిత్వం అలాంటి భిన్న స్వరాలకు సముచిత స్థానం ఇవ్వలేదేమో అని !

దేవిప్రియ గారి షష్టి పూర్తి సభకు వెళుతున్నపుడు నాలో మొదలైన ప్రశ్నలకు గంధకుటి లో మెరిసిన ‘ఇదొక కళ ‘ పద్యం లో కొన్ని జవాబులు దొరికాయనిపించింది. పద్యం చివరలో ‘ఎలిజబెత్ బిషప్’ కి కృతజ్ఞతలతో’ అని రాసారు గానీ, మౌలిక మైన మానవ సంబంధాలకు సంబంధించిన ఆలోచనలు 60 దాటిన మనుషులలో దేశాలకు అతీతంగా ఒకే మాదిరిగా ఉంటాయేమో అనిపిస్తుంది.

ఒక సారి ఈ పద్యం చదవండి!

“కోల్పోవడం నిజానికి
నేను సాధన చేస్తున్న ఒక కళ
కలలు పోగొట్టుకున్నాను
కన్నీళ్లు పోగొట్టుకున్నాను
అమ్మనీ, నాన్ననీ
అపుడపుడూ ఆమెనీ
ఇపుడిపుడు పిల్లలనీ
పోగొట్టుకుంటూ
ఈ కళ లో ఎన్ని ఆకులు చదివేనో యేమో …
వూరి చెరువునీ /రెంట చింతల నాపరాతి రోడ్లనీ
గుంటూరు రైలు పట్టాలనీ
తెంచి జేబులో కుక్కుకున్న
తలుకులీనే చుక్కలనీ…

ప్రియమైన వాటిని
పోగొట్టుకోవడం క్లిష్టమైన కళ ….
ప్రాణప్రదమైన ఆశయాలనీ
ఆశయ ప్రతిబింబ సాధనాలనీ
బతికించి ఉంచుతున్న
జీవన అమృత ఆకాంక్షలనీ
కోల్పోతూ బతకడం గొప్ప కళ ….

నన్ను నేను కొంత కొంతగా కోల్పోతూ
జీవించగలగడం నిజంగానే గొప్ప కళ!”

పొందడం కోసమే పరుగెత్తే జీవితం, 60వ వడి లో పడినాక, పొందిన వాటిని చూసి పొంగిపోవడం కన్నా పోగొట్టుకున్న వాటిని తలచుకుని దుఖిస్తుందా?
అమ్మనీ, నాన్ననీ , బాల్యపు రోజులనీ, తెంచి జేబులో కుక్కుకున్న తలుకులీనే చుక్కలనీ తలచుకుని కుమిలిపోతుందా ?

నిజమే! బతికించి ఉంచే జీవన అమృత ఆకాంక్షలను అన్నింటినీ కోల్పోతున్నపుడు, అలా కోల్పోతూ కూడా జీవించడం అనే గొప్ప కళను సాధన చేయడం తప్ప మనిషికి మరొక దారి ఏముంది ?

చెప్పా పెట్టకుండా ముంచుకొచ్చిన వరదలు కాళ్ళ కింది నేల సహా సర్వస్వాన్నీ అలా తుడిచి పెట్టుకు పొతున్నపుడు, ప్రాణాలు అరచేత పట్టుకుని, గుడి గాలిగోపురం అంచున నిలబడి వుండే కళని అభ్యసించడం వినా మరొక మార్గం ఏముంటుంది ?