గల్పిక

రాజకీయం

19-జూలై-2013

మంత్రి గారి కేంప్ కార్యాలయం.జనం తొ రద్దీ గా ఉంది.అంతకు ముందు ఎవరినీ కలవడానికి యిష్ట పడని మంత్రి గారు ఈమధ్యన కనిపించిన ప్రతివారిని పలుకరిస్తున్నారు.భుజాన చెయి వేసి మాట్లాడుతున్నారు.

“మా మంత్రిగారు ప్రజల మనిషి. ప్రజానాయకుడుగా చరిత్రలో నిలిచిపోతారు”. అని అతని అనుచరులు ప్రచారం చేస్తుంటే

“అంతలేదు.. ఎలక్షన్లు దగ్గరకొస్తున్నాయి కదా!..అదీ సంగతి” అని ప్రత్యర్ధులు పెదవి విరుస్తున్నారు.

ఎవరు ఎలా అనుకున్నా మంత్రిగారు మాత్రం ఏ భేషజము లేకుండా అందరి తోనూ మంచిగా మాట్లాడుతున్నారన్నది మాత్రం నిజం.

***

“నమస్కారం సార్..నాపేరు బంగారం.అంబారం గ్రామ సర్పంచిని”.

“ఆ..ఆ..రావయ్య..రా..రా నువ్వు తెలియక పోవడమేమిటి!?చెప్పు..చెప్పు..ఏం పనిమీదొచ్చావ్”?

” సార్ ఈకుర్రాడు బాగా చదువు కున్నాడు.కుటుంబపరమైన యిబ్బందుల్లో ఉన్నాడు.మరీ ముఖ్యంగా మన పార్టీ కార్యకర్త.ఈమధ్య కలక్టరాఫీసులో ఉద్యోగానికై దరఖాస్తు చేసుకున్నాడు.తమరు నాయందు దయుంచి ఆ ఉద్యోగం ఇతనికే వచ్చేటట్టు చూడాలి.ఇతనికి అన్ని అర్హతలు ఉన్నాయి”.రెండు చేతులు తన ఫేంటు జేబులపై వేసి నొక్కి మరీ చెప్పాడు.
“దాందేముంది… అలాగే చూద్దాం”

***

“అయ్యా.. నమస్కారం ,నాపేరు సింగారం.అంబారం గ్రామ ఎం పి టి సి ని”.

“రావయ్యా..రా.రా.. నువ్వు తెలియక పోవడమేమిటి, చెప్పు..చెప్పు ఏం పనిమీదొచ్చావు!?”

” అయ్యా ఈకుర్రాడు బాగా చదువు కున్నాడు.కుటుంబపరమైన యిబ్బందుల్లో ఉన్నాడు.మరీ ముఖ్యంగా మనవాడు. ఈమధ్య కలక్టరాఫీసులో ఉద్యో గానికై దరఖాస్తు చేసుకున్నాడు.తమరు నాయందు దయుంచి ఆ ఉద్యోగం ఇతనికే వచ్చేటట్టు చూడాలి.ఇతనికి అన్ని అర్హతలు ఉన్నాయి”.చేతిలో ఉన్న హేండ్ బేగు ఊపి మరీ చెప్పాడు.

“దాందేముంది… అలాగే చూద్దాం”

***

“సార్ మీరిలా చేస్తారనుకోలేదు”
“ఏం చేసాను బంగారం..!?”
యింకేం చేయాలిసార్, మనపార్టీ కార్యకర్తను కాదని,అవతలి పక్షంకుర్రాడికి ఉద్యోగం యిప్పించారు..”
ఓ అదా ..నిజమే యిప్పించాను.వాడు మన కార్యకర్తకాడు తెలుసును,కాని మనకులపోడయ్యా!..యివాళ కాకపోతే రేపు పార్టీ మారుతాడు.
మరి నువ్వు తీసుకొచ్చిన కుర్రాడో..మనపార్టీవాడే కాదన్ను,కాని కులమో..పార్టీ మారిపోయినట్టు కులం మారిపోగలడా చెప్పు…?
మరి అదేనయ్యా రాజకీయం,
వేమన్నఏమన్నాడు

కులములోన ఒకడు పవరులోనున్నచో
కులము వెలయు వాడి పవరుచేత

***

“ఏమయ్యా బంగారం…నువ్విలా చేస్తావనుకోలేదయ్యా”
“నేనేంచేసాను సార్ ”
“యింకేం చెయ్యాలయ్య నిళువునా నాకొంప ముంచేసావ్ గదయ్యా!,నువ్వుచెప్పిన కుర్రాడికి ఉద్యోగమిప్పించలేదని పార్టి ఫిరాయించేస్తావా!!.”
“ఓ అదా.. నిజమే సార్, కానీ మా ప్రజలు కార్యకర్తలు అన్నారు’మీకులపోలే పార్టీలు మార్చగలరా!? అని.’
మరి నాకు తప్పలేదుసార్.అయినా మీస్వార్దం మీరు చూసుకున్నారు,నాస్వార్ధం నేనూ చూసులోవాలి గదాసార్.
స్వార్ధానికి కులమేమిటిసార్.అంతా రాజకీయమే.