కవిత్వం

మనమింతే

19-జూలై-2013

సమూహం మీది జెండా
ఒక శవంలా-
ఎప్పుడూ ముడుక్కోదు.

తూటా అంచుని మెరిపించే-
నెత్తుటి గాయాల్ని చూస్తేగానీ,
చెల్లాచెదురైన గుంపుకి
ఆహారం సహించదు.

భావోద్వేగం తన కుంచెను
ఖాళీగా వుంచుకోని ఫికాసో.
మనిషో, బస్సో,
రాళ్ళో, విగ్రహాలో-
ఎదురుపడ్డ ప్రతిదాన్లోనూ
శత్రువు చిత్రాన్ని పోల్చుకుంటుంది.

ఇప్పుడు ఉద్వేగం -
పెట్రోల్ ప్రమిధలో వత్తిలా కాలుతున్న
సజీవ మానవ కళాఖండం.

కౌగిలించుకున్న ప్రతిసారి,
పెదాలమీద రక్త దాహం తీరాలి.
లేదంటే రాత్రి-
రతివైరాగ్యంలో మునిగిపోతుంది.

ఇదేంటని ఎదురు ప్రశ్నిస్తుందా?
లాగిపెట్టి మరోసారి కొట్టాలి.
అదంతే! కన్నీళ్ళొస్తేగానీ
చల్లారని అసంతృప్తి నిలువునా
దహించేస్తుంది.

ఎముక విరిగిన మెడ చప్పుడు,
సగం భాదని చెప్పుకోలేని చివరి కేక,
ఉరి తీసే తలారికిపుడు
తక్షణ కాలక్షేపం.

కల్వర్టర్ క్రిందో, రద్దీగా వున్న జనసమూహంలోనో-
డినేటర్లా కొందరు ముక్కలైపోయారని,
బ్రేకింగ్ న్యూస్, రోజంతా స్క్రోలింగ్-
అవుతూనే వుండాలి.
కాదంటే కళాపోసనకు ఇరవైనాలుగ్గెంటలు
ఏమి సరిపోతుంది.

దౌర్జన్యంగా లాక్కున్నది
నీది నీకే అంటూ ఇచ్చేస్తుంటే-
పిల్లాడి ఏడుపే
మనశ్సాంతికి వూరడింపు.

కనపడ్డ ప్రతివాడ్ణీ కావలించుకుని వూపెయ్యాలి.
ఒళ్ళంతా రంగులద్దుకుని హోళీలాడాలి.
ఊరుఊరంతా మిఠాయిలా తీపెక్కి, సంబరాలు జరగాలి.

ఇదీ అంతే!
కొందరి అకాల మరణాలు
ఇంకొందరి తత్కాల తిరుణాళ్ళు.

తారసపడ్ద తగాదా ఏదైనా
ఫాక్షన్ సినిమా క్లైమాక్స్ లా
తలలు తెగి పడాలి.

నెత్తురంటిన చేతుల్తో-
శుభంకార్డు చూపించాలి.