కథ

అమ్మ-నాన్న-అమెరికా

ఆగస్ట్ 2013

“సాయంత్రం ఫోన్ చేద్దామనుకున్నాను కానీ, కుదర్లేదు. ఎందుకంటే ఏం చెప్పను. మనింట్లో లాగా ఉండాలంటే కుదురుతుందా చెప్పండి. అతనేదో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆలస్యం అయిపోయింది. ఈ లోపు పసి పిల్లాడు, వంట.. ఎన్నని చెప్పను? నాకు మాత్రం మీతో మాట్లాడాలని ఉండదా” గద్గదమైన గొంతుతో చెట్టు దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నావిడ వంక ఒద్దనుకుంటూనే చూశాను. మొబైల్ ఫోన్ల వల్ల వ్యక్తిగతాలన్నీ వీధిలోనే ఇప్పుడు !!

ఆవిడ గమనించినట్లు అనిపించడంతో దూరంగా నడిచాను. కాసేపయ్యాక ఆవిడే అటుగా వచ్చి నన్ను పలకరించింది. “తెలుగు వాళ్ళేనాండీ”

“అవును” అన్నాను ఇబ్బంది గా “మీ ఫోన్ నేను వినలేదు లెండి” అనలేక .

ఆ ఫోన్ ఆవిడ మాట్లాడిన టోన్ నన్ను మౌనంగా ఉంచింది కాసేపు. ఆ తర్వాత ఆమే మాట్లాడింది. “ఎన్నేళ్ళయిందమ్మా, ఇక్కడికొచ్చి? పిల్లలు ఇక్కడే పుట్టారా ఇద్దరూనూ”
ఆవిడ ప్రశ్నకు కొద్దిగా ఆశ్చర్యం, మరి కొంత నవ్వూ వచ్చాయి. నా పిల్లలిద్దరూ అమెరికన్ సిటిజన్లు కాదని తెలిస్తే కొద్దిగా గౌరవం తగ్గుతుందేమో నా మీద అని అనుమానం వచ్చింది కూడా .

“లేదండీ, ఇద్దరూ ఇండియాలోనే పుట్టారు.పెద్దాడికి నాలుగేళ్ళు, దీనికి ఏడాదిన్నర వయసులో ఇక్కడికొచ్చాము” అన్నాను.
ఆవిడ నిట్టూర్చింది. “పోనీలేమ్మా, మీ అమ్మ నెత్తిన పాలు పోశావు”
“అదేమిటి, అలా అనేశారు” అన్నాను

“అమెరికన్ పౌరుల్ని కనడానికి ఇక్కడికొచ్చాక పిల్లల్ని ప్లాన్ చేసి ఉంటే, పాపం మీ అమ్మగారో అత్తగారో రావలసి వచ్చేది పురుళ్లు పోయడానికి. మీరేవన్నా అక్కడికొచ్చి కంటారా? మా చావులెవరికి కావాలి? మీ ఇష్టాలే మీకు.”
ఆవిడ అంటోంది నన్ను కాదని తెలుసు కానీ ఆ కోపం, ఉక్రోషం చూస్తుంటే విషయం సీరియస్సే అనిపించింది.

“దాంట్లో తప్పేముంది చెప్పండి? ఇక్కడ సౌకర్యాలు బాగుంటాయి. వైద్యం బాగుంటుంది. ఇన్సూరెన్స్ ఉంటుంది. అదీ కాక అమెరికన్ పౌరసత్వం తో పిల్లలు పుట్టాలని కోరుకోవడం అంత కాని పని అంటారా?” అన్నాను పిల్లది ఎటు పోయిందో అని పరికిస్తూ!
“సౌకర్యాలు, ఇన్సూరెన్స్ ఇవన్నీ చెప్పకమ్మా నాకు! ఎక్కడ లేవంటావు అవన్నీ! రెయిన్ బోకో, ఫెర్నాండెజ్ కో వెళ్లి చూడు. సిటిజెన్ షిప్ అంటావా..నేను దాని మీద మాట్లాడకూడదు” అంది కొద్దిగా కఠినంగా .
నాకేం మాట్లాడాలో తోచదు. పెద్ద వాళ్లతో వాదన పెట్టుకోవడం కంటే వాళ్ల చెప్పుల్లోనో , షూల్లోనో కాళ్లు పెట్టి కాసేపు వినడం మంచిదని అనిపిస్తుంది ఎక్కువసార్లు నాకు!
మాటల్లో తెల్సింది. ఆవిడ పేరు శారద. బాంక్ లో పని చేసి రిటైర్ అయ్యారట. భర్త కూడా బాంకరే కానీ ఈ ట్రిప్ లో అమెరికా రాలేదు. ఆవిడొక్కరే వచ్చారు కూతురికి పురుడు పోయడానికి.

మా కమ్యూనిటీ లో భారతీయులకేమీ తక్కువ లేదు కాబట్టి వేసవి సాయంత్రాలు పిల్లల పార్కు మహా హడావుడిగా ఉంటుంది మనవలు…తాతలు బామ్మలు, వీళ్ళ కేకలు అల్లరితో సందడిగా కనిపిస్తుంది. ఒక పట్టాన తొందరగా చీకటి పడదు కాబట్టి తొమ్మిదిన్నర వరకూ సాగే ఆ సందడి క్రమంగా సద్దు మణుగుతుంది .

చలికాలం అంతా , మంచుతో నిండి, నిశ్శబ్దంగా మూగబోయి ఉండే పార్కు వేసవి లో కళ కళ లాడుతుంది. ఎక్కువగా సౌత్ ఇండియన్ భాషలు వినిపిస్తూ ఉంటాయి.
శారద గారితో కొంత పరిచయం పెరిగింది రోజూ ఆవిడని పార్కులో లో సాయంత్రాలు, మార్నింగ్ వాక్ లో ఉదయం చూస్తుంటాను.ఆవిడతో పాటు మరో ముగ్గురు నడి వయసు స్త్రీలు నడుస్తూ కనిపిస్తారు ఉదయాలు. శారద గారు కన్స్ట్రక్టివ్ గా, దాపరికం లేకుండా మాట్లాడ్డం వల్ల కాబోలు ఆమె మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిచేట్లుగా ఉంటుంది. ఒక రకమైన వ్యంగ్యం, నిష్టూరం ఇవన్నీ ఒక్కోసారి హాస్యాన్ని కూడా ధ్వనింపజేస్తుంటాయి.
ఆ ముగ్గురిలో సుశీల గారనే ఆవిడ సైడ్ వాక్ పక్కన నిండుగా పూచిన గులాబీ పొదల్ని చూసి “పూజకు కోసుకుంటే ఏమంటారో” అని రోజూ గొణుగుతుండే వారు. నవ్వొచ్చేది నాకు.
ఈ నలుగురూ నాకు మంచి స్నేహితులయ్యారు. వీలు కుదిరినపుడు మా ఇంటికి వస్తుండే వాళ్ళు. లేదా వాలీబాల్ కోర్టు దగ్గర కూచుని మేమూ కాసేపు సరదాగా ఆట చూసే వాళ్ళం. ఎక్కువగా ప్రేక్షకులు నాన్నగార్లూ, మావగార్లూనూ!
మొన్న సాయంత్రం మగవాళ్లంతా పెద్ద గొంతులతో ఉత్సాహంగా ఆంధ్రా రాజకీయాలు మాట్లాడుతుంటే శారద గారు” వీళ్లకు ఎక్కడికెళ్ళినా చింత లేదు. రిటైర్మెంట్ లైఫ్ అంటే వీళ్లది. ఇండియాలో ఉంటేనేం, ఇక్కడుంటేనేం, హాయిగా తిని కబుర్లు చెప్పుకోడమే! నా బతుకు చూడు. ఇన్ని అంట్లు నా జీవితంలో తోమి ఎరగనమ్మా” దిగాలుగా ..
ఆ డిష్ వాషర్ మన గిన్నలకేం పనికొస్తుందీ? అన్నీ చేత్తోనే పర పరా తోమితే కానీ ఒదలని గిన్నెలాయె మనవి. అడుగంటినవీ, మాడినవి ఎలా వొదుల్తాయి మరి? పైగా, వాషింగ్ ఏరియాలోనో, పెరట్లోనో కూచుని తీరిగ్గా తోమడం కూడా కాదాయె! ఎంత సేపూ నిలబడే! కాళ్ళు విరిగి పోతున్నాయి. ఈ మోకాళ్ల నొప్పులు ఇంకా ముదిరి పోయాయి” అందావిడ మోకాలు రుద్దుకుంటూ!
ఆమె అభినయానికి రాబోయిన నవ్వు, ఆమె మోకాలు రుద్దుకోడంతో ఆగి పోయింది నా మొహం మీద
“ఇంట్లో ఎవరూ సహాయం చేయరాండీ” అన్నాను “మీ అల్లుడు తోమడా గిన్నెలు” అనే ప్రశ్నకు కాస్త రంగేసి.
ఆవిడ నా వైపు వింతగా చూసింది “ఏంటమ్మా నువ్వు? నా కూతురికి అసలే సుకుమారం. ఏడోనెల్లో నేను రాగానే బెడ్ రెస్ట్ అని మంచమెక్కి కూచుంది. డెలివరీ అయి రెండు నెల్లైనా ఇంకా దిగనే లేదు. అల్లుడిని తోమమని ఏ మొహం పెట్టుకుని అడగనూ?” అంది కోపంగా

కాసేపు ఆగి మళ్ళీ తనే అంది “కాదు విరజా, ఉన్న ఇద్దరు పిల్లలూ ఇక్కడే సెటిలై పోయారు. మేమా రిటైర్ అయ్యాము. ఏదో ఒక ఫైవ్ స్టార్ ఓల్డేజ్ హోము లో చేరితే గడిచిపోతుంది కానీ, నాకు అదేదో హోటల్లో ఉన్నట్లే ఉంటుంది తప్ప ఇంట్లో ఉన్నట్టు కాదు. మా అన్నయ్య వదిన ఉంటున్నారు గా. వెళ్ళినపుడు చూశాను. గంట కొడితే భోజనాలు, ఇష్టం లేక పోయినా భజనలు అవీ అటేండ్ కావాలి. స్వేచ్ఛ ఉండదు. వాళ్ళ పిల్లలు ముగ్గురూ ఇక్కడ మూడు రాష్ట్రాలు ఏలుతున్నారు . ఉద్యోగాలు చేసి, ఇంట్లో చాకిరీ చేరి, పిల్లల చదువులు అయ్యేదాకా కళ్లలో వొత్తులేసుకుని, డబ్బు దాచి, ఎంతో చేసి అలసి పోయాం మేమిద్దరమూనూ! పిల్లలకు కాక పోతే ఎవరికి చేస్తారని అడుగు నువ్వు. కాదన్ను!

కానీ ఇహ జీవితాంతం పిల్లలకేనా మా జీవితాలు? మంచి సెక్యూరిటీ ఉన్న కాలనీలో ఇల్లు కట్టుకుని, ఇంట్లో ఒక రోజంతా ఉండే మనిషిని ఒకరిని ఊరు నుంచి తెచ్చి పెట్టుకున్నాం. వయసు మీద పడిందిగా మరి? , డ్రైవర్ని,డాక్టర్ని అందుబాటులో పెట్టుకుని ఎలాగో సుఖంగానే బతుకుతున్నాం. ఇష్టమైతే ఒండుకుంటాం లేదంటే బయటికి పోయి తింటాం. తోటపని, పుస్తకాలు, సంగీతం..వీటితో ఇన్నాళ్లకు విశ్రాంతిగా బతుకుతున్నాం అనుకుంటే.. ఈ చాకిరీ ఏమిటి నాకు?

నా గురించి నువ్వు ఏమైనా అనుకో విరజా, నాకు ఇక్కడికి వచ్చి ఇలా పని చేయడం కష్టంగానే ఉంది. నాకు శక్తి లేదు.కానీ చేయాలి.
నాకు విశ్రాంతి కావాలి. నాదంటూ నాకు లైఫ్ కావాలి. నిజం చెప్పు, ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ దేశంలో ఎవరికి వాళ్లు పురుడు పొసుకోలేరా? కాసిన్ని డబ్బులు పెడితే హౌస్ కీపర్లు దొరకరా? మీ బిల్డింగ్ లో ఎవరో గుజరాతీ ఆవిడ ఉంటుందటగా! ఆవిడ ఇలాటి వాటికి వారానికింత అని తీసుకుని సహాయంగా వొస్తుందట.అలాటి వాళ్లను తెచ్చుకోవచ్చుగా
రెండేళ్ల క్రితం మా కోడలికి పురుడు పోయడానికి నేనే రావాల్సి వచ్చింది. కోడలు తల్లి , తన కోడలి పురుడికి సింగపూర్ వెళ్ళింది. చూడు ఎలా ఉందో ఈ ఖర్మ. అప్పుడు మీ అంకుల్ కూడా వొచ్చారు. ఇప్పుడు నేనొక్కదాన్నే!

అక్కడ ఇంట్లో ఒక్కరూ ఎలా ఉన్నారో, డయాబెటిక్ మనిషి అని మనసు మనసులో ఉండదు నాకు. ఆయనేమో ఒక్క పూట ఫోన్ ఆలస్యం అయితే “నీకేం, హాయిగా అక్కడ కూచున్నావు.ఇక్కడ నాకు ఎంత ఇబ్బందిగా ఉందో” అంటారు.నేనేదో రాజ భోగాలు అనుభవిస్తున్నట్లు” ఆమె గొంతు లో సన్నని వొణుకు, కళ్ళలో నీటి పొర. అక్కడి పరిస్థితిని ఊహించుకుంటున్నట్లు చూపులు ఎక్కడో ఉన్నాయి.

“ఇంతకు ముందు వచ్చినపుడు శీతాకాలంలో వచ్చాము. మా అబ్బాయి న్యూ జెర్సీలో ఉన్నాడు. బయటికి వెళ్లలేం..ఆ మంచులో చలిలో! ఈయనకేమో రోజూ కాలనీలో వాకింగ్, పార్కులో లో స్నేహితులూ, సాయంకాలాలు ఇంట్లో ఫ్రెండ్స్ తో బాతాఖానీ ఇవన్నీ అలవాటు. ఇక్కడేమో అవన్నీ కుదరవు. వెళితే వీకెండ్స్ బయటికి వెళ్లాలి. అది కూడా ఇంట్లో బాలింతను పెట్టుకుని “పదరా బయటికి వెళ్దాం” అనలేం గా ఎంత కొడుకైనా!

పాపం, వాడికీ ఆఫీసు పన్లవీ ఉంటాయి మరి ! ఏదో అలా వాల్ మార్ట్ కీ, టార్గెట్ కీ, హోల్ ఫుడ్స్ కీ వీళ్ళతో వెళ్ళిరావాడమే! అదీ, గ్రహాంతర యానానికి వెళ్తున్నట్లు పది జతల బట్టలూ జాకెట్లూ తగిలించుకుని ! ఈయనకసలు తోచుబాటు అయ్యేది కాదు. ఎంత సేపని టీవీ చూస్తారూ…”

“ఏం? తోచుబాటుకి…మీకు కొంచెం ఇంటిపనిలో సహాయం చెయ్యొచ్చుగా” అన్నాను తిడుతుందేమో అని భయపడుతూనే!
ఆవిడ సడన్ గా మాటలాపి నా వైపు చూసింది . గతుక్కుమన్నాను. నోర్మూసుకుని వింటే బాగుండేది అనుకుంటూ.
“హయ్యో నా బతుకు! అలాటి అలవాట్లు చేసానా నేను? ఈనాటికీ కాఫీ కప్పు దగ్గర్నించీ అందించాల్సిందే! బనీన్లు, టవల్స్ తో సహా రెడీగా పెట్టాలి. సర్దుకోడం తెలీదు కానీ, అదక్కడ పెట్టలేదు, ఇది ఇక్కడ పెట్టలేదు” అని వంకలకు మాత్రం కొదవలేదు. నా మొహంలే, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఇది ప్రతింట్లో ఉండే భాగోతమే” అంది
“పోయిన సారి ఇక్కడి నుంచి వెళ్లాక నా ఆరోగ్యం పూర్తిగా పాడయింది . మోకాళ్లు బాగా అరిగి పోయి ఇక్కడ రోజంతా నిలబడే ఉండాల్సి రావడంతో అసలు రెండు నెలలు నడవనే కూడదన్నారు డాక్టర్లు.

“అసలు ప్రపంచంలో ఇన్ని అంట్ల గిన్నెలు ఉంటాయాని అని సందేహం వొస్తోంది నాకు” ఆవిడ సీరియస్ గానే అన్నా , నాకు మాత్రం నవ్వాగలేదు.

ఆవిడ కూడా కొద్దిగా నవ్వింది .”నిజం విరజా, ఒక్కోసారి విసుగేసి సాయంత్రం కడుగుదాం లే అని వదిలేస్తామా? ఆ గుట్ట అలా సింక్ లో పెరిగి పోతునే ఉంటుంది. పోనీ ఎప్పటి గిన్నెలు అప్పుడు కడిగేద్దాం లే అనుకుంటామనుకో, రోజంతా కడుగుతూనే ఉండాల్సి వస్తుంది. అమ్మో, ఇంత చాకిరీ నా వల్లకావడం లేదు! ఎవరి పన్లు వాళ్ళు చేసుకోడం మంచి సంస్కృతే కావొచ్చు కానీ నాకు అలా అలవాటు కాలేదు మరి ! వర్కింగ్ వుమన్ గా పని మనుషుల సహాయంతో నెట్టుకొచ్చాను . మీ అంకుల్ అటు పుల్ల తీసి ఇటు పెట్టరు ! జీవితం అంతా చాకిరి చేసి చేసి ఉన్నాను. నాకు ఇక పూర్తిగా విశ్రాంతి కావాలి . రోజంతా నిలబడి పని చేయడం, పసి పిల్లాడిని చూసుకోడం, పన్లో పని పెద్ద దాన్ని స్కూల్ బస్ ఎక్కించడం నుంచీ నేనే చూడాలంటే, ఇక్కడికి వచ్చినందుకు ఇదేదో పనిష్మెంట్ లా ఉంది కానీ మరోలా లేదు ”
“నిజమే అనుకోండి.కానీ పాపం మీ పిల్లలు మాత్రం అనుకోరూ, అమ్మ కష్టపడి పోతోందని” అన్నాను ఏదో ఊరడిద్దాం అని.
“ఊరుకో నువ్వు! చూస్తుంటాగా ఫేస్బుక్ లో ..రాతలూ “అమ్మ గొప్పది, అమ్మ రుణం తీర్చలేనిది అదీ ఇదీ అని పిచ్చి ఫొటోలు పెట్టి..”
“ఏంటి మీరు ఫేస్బుక్ లో ఉన్నారా?”అన్నాను కొద్దిగా ఆశ్చర్యంగా
“ఏం, ఉండకూడదా ”
“అయ్యో కాదు, ఉన్నారని తెలీదు అంతే. మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తా ఉండండి”

ఆవిడ నా మాటలు వినిపించుకోలేదు “మా అమ్మ ఎంతో కష్టపడి పెంచింది. తను మానుకుని మాకు పెట్టింది. మా చదువుకు నాన్న ఎంతో చేసారు, అప్పులు తెచ్చారు. మా జీవితాల్లో అమ్మ దీపమైంది,కప్పుకుంటే దుప్పటైంది ” అని మీరంతా సెటిలయ్యాక మెచ్చుకోడం కన్నీళ్లు పెట్టేసుకోడం కాదు. ఆ కష్టాలు పడేటపుడే తల్లి దండ్రులకు కాస్త ఆసరా గా ఉండాలనే జ్ఞానం పిల్లలకు ఉంటే ఎంత బాగుండు? అది లేక పోగా తల్లి కాకపోతే ఎవరు చేస్తారనే బహానా ఒకటా? ”
శారదగారి మాటలు భలే నచ్చాయి నాకు.
“మా కొంగుతో ముక్కు తుడుచుకున్నంత చప్పునా
పద్యాల్ని చేతి రుమాళ్ళుగా వాడకండి”

కొండేపూడి నిర్మల కవిత గుర్తొచ్చింది
“మీరు ఇలా ఖచ్చితంగా ఆలోచించడం బాగానే ఉంది కానీ, ఇవి మీ అమ్మాయికో కోడలికో తెగేసి చెప్పలేరు కదండీ,” అన్నాను
“ఇహ నా వల్ల కాదు. ఇంకోసారి పురుళ్ళు, పిల్లలూ అని పిలిస్తే మాత్రం నేను రానని చెప్పేసి మరీ పోతానమ్మోయ్,” అందావిడ.

లక్ష్మి గారు నవ్వింది .”ఊరుకోండి శారద గారూ! ఎలాగూ వచ్చారు, ఇంత చాకిరీ చేశారు. ఇప్పుడు మీరు పుసుక్కున ఈ మాట అన్నారంటే మీరు చేసిందంతా కొట్టుకు పోయి మీరన్న మాటే మిగులుతుంది. మిగలడమే కాదు, చుట్టాలూ , పక్కాలూ ఇండియా అమెరికా ల్లో మొత్తం పాకి పోతుంది కూడాను. తల బొప్పి కట్టి ఉన్నాం ఇక్కడ. ఎందుకొచ్చిన గోల, నాల్గు రోజులైతే ఎలాగూ వెళ్ళి పోతారు గా” అంది అనునయంగా

ఆవిడ మాటలు నిజమే అనిపిస్తున్నా, శారద గారు అలా ఖరా ఖండీగా చెప్పెయ్యడమే మంచిదేమో అనిపించింది నాకు ఓ క్షణం. ఎలాగూ అది శారద గారి చేతిలో పనే అనుకోండి .
శారద గారు మళ్లీ అందుకున్నారు

“పెద్దయ్యాక మీరు పంపే డాలర్లు, బంగారు బిస్కెట్లూ మాకొద్దు తల్లీ! ఎలాగూ దేశాలు పట్టి పోయారు. దాని మీద మాకేం కంప్లెయింట్లు లేవు. ఎవరి బతుకు దెరువు వాళ్లది. ఎవరి కుటుంబాలు వాళ్లకి వచ్చాక ఇంకా మీరంతా మా చేతుల్లో ఉండాలని మేము కోరుకోము. కానీ ఈ ముసలి వయసులో కాస్తంత ప్రశాంతంగా బతకనీండి తల్లుల్లారా”

ఆవిడ మాటలు వింటుంటే ఆలోచనల్లోకి పోవాలనిపిస్తోంది. అబ్బ, నేనొక్క దాన్ని కాదు, చాలా మంది ఆలోచించాలి. పిల్లలంతా ఆలోచించాలి .

ఆవిడ పక్కనే గడ్డి పూలు పీకుతూ కూచున్న సుశీల గారు నవ్వింది.

“తప్పవండీ ఇవన్నీ! మా కోడలికి మొదటి పురుడు సమయంలో అమెరికా పోవడం అంటే ఎంతో సంబర పడి వొచ్చాను. పురుడు అయ్యాక చంటి వాడిని ఇండియా తీసుకు వెళ్ళమన్నారు అబ్బాయి కోడలూను! అసలు అది ఊహించలేదు నేను. వెంటనే నిర్ణయించుకోలేక సతమతమయ్యాను. పిల్లలిద్దరూ ఇక్కడే ఉన్నారు, అక్కడ కృష్ణా రామా అనుకుంటూ పడి ఉన్నాము. సడన్ గా ఇన్నేళ్ల తర్వాత మళ్ళి పసి వాడి పెంపకం పూర్తిగా చేతిలోకి తీసుకోవాలంటే భయం వేసింది. కానీ తప్పలేదు. తీసుకెళ్ళాను.

మూడేళ్ళు వచ్చేవరకు నా దగ్గరే ఉన్నాడు. మేమిద్దరం మళ్ళీ అన్నీ కొత్తగా నేర్చుకుని ఎన్నో ఇబ్బందులు పడి పెంచాము. తెలీకుండానే మా ఒంటరి జీవితంతో వాడు పెనవేసుకు పోయాడు. వాడి ముద్దు మాటలకు ప్రాణాలిచ్చేస్తుండే వాళ్లం. వాడు మాకు ప్రాణమై పోయాడు. వాడికి నేను నాన్నమ్మని కాదు, తల్లిననే అన్న ఫీలింగ్ ! పొత్తిళ్ల లో బిడ్డను పెంచానేమో ! మూడేళ్ళు వచ్చాయి కాబట్టి ఇక స్కూల్లో వేయాలి, వచ్చి తీసుకు వెళ్తాం ” అని అబ్బాయి ఫోన్ చేసిన రోజూ వాడిని మధ్యలో పెట్టుకుని నిద్దర్లు పోకుండా కూచున్నాం ఇద్దరం. వాళ్ళు వచ్చే రోజు దగ్గర పడుతుంటే గుండెల్లో మంటగా ఉండేది. వాడు మాకు దూరం అయిపోతాడనే భావన భరించలేక పోయే వాళ్లం. ముఖ్యంగా ఈయన భలే దిగులు పడి పోయారు. వాడిని ఎత్తుకుని దింపే వారు కాదు .

చివరికి వాళ్లు రానూ వచ్చారు. తీసుకెళ్ళనూ వెళ్ళారు. వాడు వెళ్లనని ఒకటే ఏడుపు. మేమూ ఏడుస్తూనే అప్పజెప్పాము.. తర్వాత చాలా రోజులు కోలుకోలేదు ఇద్దరం.

మరో రెండేళ్ళకి రెండో సారి పురుడు పోయడానికి వచ్చేసరికి వాడు మమ్మల్ని మర్చి పోయాడనుకోండి. పాపనూ అలాగే తీసుకు వెళ్ళమంటే మాత్రం నా వల్ల కాదన్నాను. మళ్ళీ రెండో సారి ఆ బాధను నేను మోయలేకపోయాను. మా కోడలికి కోపం వచ్చింది కూడానూ!
“మీ కొడుకు పిల్లను పెంచడం కష్టమా మీకు? మనవరాలేగా “అని అన్నా బాధ పడి ఉండక పోను. కానీ “బేబీ సిట్టింగ్ కి ఎంత ఖర్చు పెట్టాలో తెల్సా ఇక్కడ! పైగా ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి మనుషులు కావాలంటే ఎంత కష్టమో ఆలోచించొచ్చుగా మీరు?” అంది!

సుశీల గారు గొంతులో ఏదో అడ్డం పడినట్లు మౌనంగా ఉండిపోయారు. మేమూ ఆవిడను అనుసరించాము.
కస్తూరి గారు నెమ్మదిగా నోరు విప్పారు. అసలు ఆవిడ మాట్లాడరు ఎక్కువగా ! అందరూ మాట్లాడుతుంటే నవ్వుతూ చూస్తుంటారు తప్ప.
“ఏమోనమ్మా, నేను సర్వీసు లో ఉండగానే ఈ మోకాళ్ల నొప్పులవీ పడక, డయాబెటిస్ వచ్చి వాలంటరీ తీసుకున్నాను. రా రా అని గోల పెడుతుంటే ఎలాగో ధైర్యం చేసి ఫ్లైట్ ఎక్కాను. పదహారు గంటలు అలా కూచునే సరికి కాళ్ళు రాళ్ళయిపోయాయంటే నమ్మండి. రాగానే డాక్టర్ దగ్గరికి పరిగెట్టాల్సి వచ్చింది. ఎంత డెలికేట్ గా అనిపించిందో బాబూ నిజంగా !

పాపం వీళ్ళ ఉత్సాహం వీళ్లది. అక్కడికెళ్దాం ఇక్కడికెళ్దాం అని లాంగ్ వీకెండ్స్ ప్లాన్ చేసే వాళ్ళు. గంటల తరబడి లాంగ్ డ్రైవుల్లో కూచోలేక నానా ఇబ్బందులూ పడేదాన్ని! చెప్తే వీళ్ళు బాధ పడతారని మొదట్లో దాచే దాన్ని కానీ, చెప్పక పోతే మరింత కష్టం అని చెప్పేదాన్ని! “మా అత్తగారు వాళ్ళు వచ్చినపుడు అన్నీ బాగా తిప్పి చూపించాం అమ్మా! నువ్వు చూడక పోతే ఎలా? బాబాయి వాళ్ళు ఏమనుకుంటారు? “అమ్మ జాగ్రత్తరా, అన్నీ చూపించు అక్కడ”అని బాబాయి మరీ మరీ చెప్పాడు ” అని మా అబ్బాయి అంటుంటే ఏమనాలో తెలిసేది కాదు.

ఇండియా తిరిగి వెళ్ళి నా ఇంట్లో నేను పడ్డాక నిజంగా ఎంత హాయిగా అనిపించిందో! చచ్చినా రాకూడదు ఇంకోసారి అనుకున్నాను కానీ, ఇదిగో మా కోడలికి ఆరోగ్యం బాగాలేక మళ్ళీ వొచ్చాను. వయసు బాగా మీద పడక ముందో, లేదా ఆరోగ్యాలవీ సరిగా ఉండి, శక్తి ఉన్నప్పుడో రావాలండీ ఇలాటి “మనవి కాని” చోట్లకి. లేదంటే కష్టమే ! మా కోడలు వచ్చేటపుడే చెప్పింది “చీరలవీ రోజూ ఉతుక్కోడం ఇబ్బంది, నైటీలు తెచ్చుకోండి అని! తెల్లబోయాను. అలవాటు లేని పని కదా! పర్లేదు,ఎలాగో మానేజ్ చేసుకుంటాన్లే అని చీరలే తెచ్చుకున్నాను ! ఎన్నడూ లేనిది ఇప్పుడు నైటీలు వేసుకుని బోర్లా పడనా ఏవిటి?”

అప్రయత్నంగా నిట్టూర్చాను.
ఏవిటో…. ఇవన్నీ బయటికి కనిపించే పరిస్థితులు కావు. ఫలానా వాళ్లబ్బాయి అమెరికాలో ఉన్నాడు వాళ్ళకేవండీ,పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. రెండు కోట్లు (రూపాయల్లో)పెట్టి అక్కడ ఇల్లు కొన్నాడు వాళ్ళబ్బాయి ! , అమ్మనీ నాన్ననీ తీసుకెళ్ళాడు. నయాగరా చూశారు, బ్రూక్లిన్ బ్రిడ్జ్ చూశారని ఆ ఫొటోలూ వీడియోలు.. వచ్చేటపుడు మోసుకొచ్చిన చాక్లెట్లూ, బహుమతులూ! ఇవే నలుగురికీ కనిపిస్తాయి.

పిల్లలు దూరాన ఉండి తమకు ఎప్పుడేమవుతుందో అని వీళ్ళు పడే క్షోభ, ఇండియా నుంచి ఏ అర్థ రాత్రో ఫోన్ వస్తే ఇక్కడ అదిరి పడే గుండెలూ ఎవరికి అర్థం అవుతాయి? కానీ జీవితాలు ఇంత ప్రాక్టికల్ అయిపోయాయేం?
చూస్తుండగానే హడావుడిగా సినిమాల్లో రీళ్ళు తిరిగినట్లు హడావుడిగా మన ప్రమేయం లేకుండానే జారి పోతున్నాయి.

ఇక్కడ ఎవరిని అనడానికీ ఏమీ లేదు. సొంత మనుషులంటూ దగ్గర ఉండాలనో, నిజానికి ఖర్చు భరించ లేకో తల్లి దండ్రులను పిలిపించుకోవడం కాని పనేం కాదు. కానీ పాపం శారద గారి కూతుర్లా మొత్తం వాళ్ల మీదే వదిలేసి దర్జాగా కూచుంటే ఈ వయసులో వాళ్ల గతేం కాను?

నన్నడిగితే పెళ్ళిళ్ళు అయ్యాక పిల్లలు ఆడైనా మగైనా సరే ఎవరి కుటుంబాల పన్లు వాళ్ళే చూసుకోవాలి. అవి కానుపులైనా మరోటైనా! వీలైతే తల్లి దండ్రులకు కాస్త ఆసరాగా ఉండాలి తప్ప వాళ్ల శ్రమను ఇంకా ఇంకా ఆశించ కూడదు.
ఇంటి చాకిరీ నిజంగా ఎంత బండ చాకిరీ? గుర్తింపు లేని చాకిరీ..!!

చీకటి మూగగా అలముకుంటోంది. ఫోన్లో భర్త సరిగా మాట్లాడలేదనే గుబులు తో శారద గారు లేచి “వెళ్తాను విరజా ఇక! చపాతీలు చేయాలి. నా కూతురు రాత్రిళ్ళు అన్నం తినదు”అంటూ లేచారు.
జాలి వేసినా, ఏమీ చేయలేక నేనూ లేచి బట్టలకు అంటిన గడ్డి దులుపుకున్నాను.

***

“ఎంత సేపు తలుపు బాదినా తీయవేం?” తలుపు తెరుచుకుంటూ ఉండగానే చేతిలోని వేడి గిన్నె ను టేబుల్ మీద పెట్టి టాప్ తిప్పి చల్లని నీళ్ళ కింద చేతులుంచింది శ్వేత మెడ పక్కకు పెట్టి మరో వైపు ఫోన్లో మాట్లాడుతూనే!
కంప్యూటర్ లో ఈనాడు పేపర్ చూస్తున్న శారద గారు తల తిప్పి ఎవరన్నట్లు చూశారు. “మా ఎదురింటమ్మాయి శ్వేత” అన్నాను గిన్నెలో శ్వేత తెచ్చిన సాంబార్ ని ఆఘ్రాణిస్తూ!

“అబ్బ, ఊరుకోమ్మా నువ్వు, నాకు అలాటి పట్టింపులేం లేవు. నువ్వు పిచ్చి ప్రయత్నాలు ఏమీ చేయకు. హాయిగా నాన్న నువ్వు, ఏదో టూరు కి వెళ్తాం అన్నారుగా. వెళ్ళేసి రండి! ఇక్కడ వదిన డెలివరీకి వచ్చినపుడు నువ్వెన్ని ఇబ్బందులు పడ్డావో నాకు తెలీదా? ఊరికే గొప్పలు చెప్తావు గానీ! నేను, మా ఆయన మానేజ్ చేసుకుంటాం లే! అవసరం అయితే సహాయానికి ఫ్రెండ్స్ ఉన్నారు. వీసా లేదు, గీసా లేదు. ఇది పెద్ద అకేషన్ అని నువ్వు కాదు, నేను ఫీలవ్వాలి. అందరూ కన్నట్లే నేనూ కంటానులే! రోజుకు కోట్లలో పుడుతున్నారు పిల్లలు. ఊరికే నన్ను హడల గొట్టకు. నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది.

నేనెలాగూ ఉజ్జోగం మానేస్తున్నాలే ఇంకో రెండు నెలల్లో! ఇంట్లో ఉండి పిల్లను చూసుకోడం ఈజీయే! నువ్వొస్తే రోజతా ఇంట్లోనే ఉండాలమ్మా! నీకసలే పొద్దుగూకులూ కబుర్లు, ఫ్రెండ్స్ కావాలి. ఇబ్బంది పడతావు. నాకేం సమస్య లేదు కానీ! పిల్ల కొంచెం పెరిగాక రండి నువ్వూ నాన్నా! కాస్త అన్నీ తిరిగి చూడ్డానికి ఉంటుంది. ఊరికే పని చేయడానికి ఉత్సాహ పడి రావొద్దు! సర్లే, తర్వాత ఫోన్ చేస్తాను. మా ఫ్రెండొచ్చింది” అని ఫోన్ పెట్టేసింది.

“మా అమ్మ! నా డెలివరీకి వస్తుందట. ఎందుకంటే వినదు. అసలు చిన్నప్పటి నుంచీ అంతే! అన్ని పన్లూ నెత్తిన వేసుకుని విరగబడి పని చేయాలని, దాన్ని అందరూ గుర్తించాలని తపన.పోయిన సారి మా వదిన డెలివరీకి వచ్చి పాపం ఇంటెడు చాకిరీ చేయలేక సతమతం అయి పోయింది. పైగా “కొడుకు ఇంటికి మొదట అమెరికా మేమే వెళ్ళాలి. కోడలి పేరెంట్స్ కాదు” అనే పట్టుదలతో తనే వచ్చింది. ఆ పట్టుదలకు ఏమైనా అర్థముందా? మా వదిన మంచిది కాబట్టి సరి పోయింది కానీ.

ఇప్పుడేమో” అదేంటే, ఒక్కగానొక్క కూతురివి నీకు పురుడు తల్లే కదూ పోయాలి, నేనొస్తాలే” అంటుంది. ఇటూ అటూ కూడా తనే ముందు రావాలి. ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. అక్కడ హైద్రాబాద్ లో మంచి ఇరుగూ పొరుగూ ఉన్నారండీ వాళ్ళ ఫ్లాట్స్ లో. హాయిగా రోజంతా కబుర్లతో టైము గడుస్తుంది ఇద్దరికీ! చుట్టాలు కూడా ఉన్నారు కాబట్టి మాకు టెన్షన్ లేదు అసలు! ఇక్కడికి వస్తే బయటికి వెళ్లడానికి ఉండదు. పలకరించేవాళ్ళు ఉండరు. కనీసం ఫోన్ చేయకుండా ఎవరింటికీ వెళ్ళలేం. ఎంతసేపని టీవీ చూస్తూ గడుపుతారు? పైగా ఇలా డెలివరీలకని వస్తే ఎంత చాకిరీ ఉంటుంది? అందుకే రావొద్దన్నాను. ఆవిడ కంగారు ఏమిటంటే,. తనని వొద్దని మా అత్తగారిని పిలిపిస్తే చుట్టాల్లో పరువు పోతుందట” పెద్దగా నవ్వింది

“పెద్దాళ్ళు అలాగే ఉంటారు శ్వేతా! మనమే అర్థం చేసు
కోవాలనుకుంటా” అన్నాను.

“సర్లే, అలా అర్థం చేసుకుంటూ పోతుంటే వీళ్ళ మూర్ఖత్వానికి హద్దు లేకుండా పోతుంది! కంప్లెయింట్ అనుకోకండి కానీ మా అమ్మకి కొంచెం గొప్పలెక్కువే! అమాయకత్వమేమో అనిపిస్తుంది ఒక్కోసారి! అందరూ తన చుట్టూనే తిరగాలని కోరిక. ఆ పెద్ద పెద్ద సూట్ కేసులేసుకుని తిరుగుతూ “అమెరికా వెళ్ళొచ్చాం అబ్బాయి దగ్గరికి” అని అందరితో చెప్పుకోడం ఒక సరదా! పోనీ ఇక్కడేమైనా సుఖంగా ఉంటుందా అంటే ఉండలేదు. “ఏమోనే బాబు, మన హైద్రాబాద్ లో అయితే ఏ క్షణమైనా ఆటో పిల్చో, డ్రైవర్ ని పిలిచో ఎక్కడికి కావాలంటే అక్కడికి పోవచ్చు. వీధి వాకిట్లోకి వస్తే చాలు సమయం గడిచిపోతుంది. ఇక్కడ ఈ ఘోషా ఏమిటో..”అని బాధ పడేది .

అందుకే ప్రాక్టికల్ గా ఉండాల్సిందే! ఊరికే ఉబలాటపడి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడటం ఎందుకు చెప్పండి. “అమెరికా వెళ్లొచ్చాం” అని గొప్పలు చెప్పుకోడానికి, తిరిగిన నాలుగు టూర్లూ తప్పించి ఇక్కడ పాపం ఇళ్ళలో గడిపే లైఫ్ చాలా బోరింగ్ అండీ వాళ్లకి. నాకే ఒక్కోసారి ఇంట్లో పనీ, ఆఫీసు పని మానేజ్ చేసుకోలేక పారి పోవాలి అనిపిస్తుంది. ఇలా తల్లో నాలుక లా పిల్లల కోడిలా అందర్నీ వెంటేసుకుని తిరిగే మా అమ్మ లాంటి వాళ్లకు మరీ బోరు. చెప్తే వినదు….” ఇంకా ఏదేదో మాట్లాడుతూ షెల్ఫు లో పుస్తకాలు తీసుకుంటోంది శ్వేత.
శ్వేతను అభిమానంగా, ఆశ్చర్యంగా చూస్తున్న శారద గారి వైపు చూసి నవ్వాను. “ఇదిగో, మీకు జవాబు” అంటూ !