కవిత్వం

ఉష్ణోగ్రత

02-ఆగస్ట్-2013

నిఖార్సైన అత్యల్ప ఉష్ణోగ్రత (అబ్సల్యూట్ జీరో) అది..!!
ధృవాలనే ఆశ్చర్యపరిచే టండ్రాతి టండ్రాల స్థితి…!!
అత్యంత లోపరహిత అసాధారణ స్థితి…!!

గది నుండి విడివడి
నిదానంగా అక్కడకు పోతే…
చేయి మొదలు కాలి వేళ్ళ వరకు
శరీరం నిలువెల్లా
కొంకర్లు పోతూ పోతూ
ఒక్కసారిగా
రాతి పుల్లగా మారిపోయే ఘన-ఘనీభవనం….

అక్కడ
పదార్ధాలన్నీ
లోపాల్నివదులుకుంటూ పోయి
సర్వసంగ పరిత్యాగులౌతాయట!
పరమాణువుకీ పరమాణువుకీ
మధ్య ఎడం పూర్తిగా పోయి,
తల్లినంటి పెట్టుకుని పడుక్కున కుక్కపిల్లలౌతాయట!

***

పరమాణు-కంపనాలు కూడా ఉడిగిపోయి
చుట్టూ పరిభ్రమించే ఋణావేశ కణాలు మాత్రమే
ఒక దాని నుండి మరొకదానికి
ఆవేశ ప్రవాహాలను
అందించుకుంటాయట!

గది ఉష్ణోగ్రత లో
చిక్కడానికే మొరాయించే
తుంటరి వాయు-ఉదజని,
అక్కడికంటూ పోయాక
పదహారణాల విద్యుత్ వాహక
ఘనాతి ఘన పదార్ధమౌతుందట!
రాగి ని మించిన
ఋణావేశ ప్రవాహాలతో
జివ్వుమనిపించగలనంటుందట!

***

గంగలో మునకేసి
పాపాలు కడిగేసుకోవాలనుకునే
అత్యాశను సైతం ఆశ్చర్యపరచి

ఒకే ఒక్క సారి
ఆ స్థితిలోకి పోయి…
వెనక్కి తిరిగి వచ్చేద్దాం…

చరిత్ర చూసిన…
జాతి వైషమ్యాల నుండీ,
ఆ రెండు అణు బాంబుల అహంకారాల నుండీ,
హిట్లర్ దురాగతాల నుండీ,
భూపాల్ విషవాయువుల నుండీ,
అనేకానేక నిర్మూలనల నుండీ,
నిరంకుశత్వాల నుండీ,
దారుణాల నుండీ,
మారణ కాండల నుండీ,
ఆకలి చావుల నుండీ,
ఆధిపత్యాల నుండీ….

విముక్తులమై
వెనక్కి తిరిగి వచ్చేద్దాం…
స్వచ్ఛంగా
ఒక నవ్య నాగరికతను మొదలెడదాం…
ఆయుధాలన్నీ గిరాటేసి
శాంతి పావురాల బావుటానెగరేద్దాం…

(-273.15°సి ఉష్ణోగ్రత ని లోపరహిత ప్రామాణికంగా భావించి చేసే పరిశోధనలు, గణాంకాలు స్పురణ లో కొచ్చిన సందర్భంలో)