కవిత్వం

కొండవాలు వాన తీగ

02-ఆగస్ట్-2013

కొండ వాలుపై నిల్చుని
ఆకాశంకేసి చూస్తున్న
నిరాధార జీవితమ్మీద
ఒక వానపూల తీగొచ్చిపడ్డట్లు
ఎక్కడి నుంచో
గొప్ప పరిమళభరిత
కవిత్వమొకటి
నిలువెల్లా కురుస్తూ-
నిర్వికార
నిరాకార
బాంధవ్యమొకటి
కళ్లే చేతులై చుట్టేస్తూ
హృదయం
బయటెవరో అవిశ్రాంతంగా
తడుతున్న చప్పుడు
హృదయం లోపల
ఎవరో అకస్మాత్తుగా
దుమికిన చప్పుడు
ఎక్కడున్నాయిన్నాళ్లూ!
పదాల్లో
కళ్లముందుండీ స్పృశించలేని
తుమ్మెద రెక్కల విన్యాసం
పాదాల్లో
అడవి లతలు పెనవేసుకుని
ఎదిగిన అల్లిబిల్లి అలుపులేనితనం
ఎక్కడినించొచ్చాయివన్నీ
జీవన కిరణాలు
కళ్లు మిరుమిట్లు గొల్పుతూన్నా
రెప్పపాటు విశ్రమించలేని
అవిశ్రాంత హృదయానికి
అనుభూతి వరాన్ని
ప్రసాదించడానికి
ఒక కవిత్వం-
కొన్ని పదాలు- కొన్ని పాదాలు-
పర్వత సానువుల కొసల్లో
నిరాధార ఆకాశమ్మీంచి
అకస్మాత్తుగా రాలిపడ్డ
ఒక వెన్నెల పుష్పం
రెండు చేతులూ సాచి
ప్రార్థించే పెదవుల్ని
తెల్లవార్లూ మంత్రమై
కలిపేటందుకు
అయినా
కళ్లని విస్మరించినందుకు
మూతవెయ్యనివ్వని
వీడ్కోలు చూపు
మనసు చివర మాటలు నిర్దయగా బద్దలు చేసిన నిశ్శబ్దపు చూపు
వెంబడించే
పదాల వెనుక
పాదాల వెనుక
ఈ క్షణాన దు:ఖమై కుదుపుతున్న
కవిత్వం వెనుక