కవిత్వం

పరిహారాత్మక తారక మంత్రం

09-ఆగస్ట్-2013

సంగీతాత్మకం కాని శబ్దాల పరంపరతో అవస్థ పడటం అనుదిన కార్యక్రమమైంది నాకు. బండరాళ్ల మీద దొర్లే బండిచక్రాల చప్పుడుకు భయకంపితుణ్నవుతాను. కాయితం చిరిగిన సవ్వడి నా కర్ణభేరికీ హృదయానికీ కలిగించే బాధ వర్ణనాతీతం. ఇనుప అలమరాల తలుపులు తెరిచిన చప్పుడు ఇనుమడింపజేస్తుంది నా చెవులనుభవించే చిత్రవధను. వంటింటి గిన్నెల శబ్దం నన్ను వణికించిన సందర్భాలెన్నో! మనుషుల అరుపులతో కినిసి మానని గాయాలతో పొగిలి మధన పడిపోతుంది మనసు. ఆటోరిక్షాల స్పీకర్ల కఠోర శబ్దాలు అశనిపాతాలై తగులుతుంటే సున్నితమైన శ్రవణేంద్రియాల మీద ఎన్నో గునపాలు దాడి చేసినట్టై సన్నగా మూల్గుతుంది హృదయం. వాహనాల రొదతో ఆహవ వాతావరణం ఆవహించినట్టై ఊహల ఉన్మీలనం ధ్వంసమౌతుంది. రకరకాల యంత్రాల చప్పుళ్లు ఒక రకం నరకాన్ని రుచి చూపిస్తాయి. అపస్వరాల కంకర రాళ్లు తగిలి అపస్మారం లోకి వెళ్లే ప్రమాదాన్ని అవరోధించటం గగనమౌతుంది. అయినా సమాంతరంగా కురిసే సాంత్వన వుండబట్టే సాఫీగా సాగిపోతుంది అనుదిన జీవన చర్యల బతుకు రథం. మధ్యమధ్య సుమధుర స్వరాల పవన వీచికలు శ్రవణేంద్రియ కుహరాల్లో చొరబడి కర్ణభేరులను కితకితలు పెడ్తుంటే అపస్వరాల తాలూకు భంగపాటు అంతరిచిపోతుంది. ప్రతి బాధకూ ఉంటుందొక ఉపశమన మార్గం. అపస్వరాల తాలూకు అవస్థకు పరమానందకర రాగాల విందు భాగ్యమే పరిహారతుల్యమైన తారక మంత్రం.